Saturday, 19 October 2013

అష్ఫాఖుల్లా ఖాన్‌
(1900-1927)

మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్‌ వలస పాలకులపై విప్లవించి అమరులైన యోధాగ్రేసులలో ఒకరు అష్ఫాఖుల్లాఖాన్‌ .
1900 అక్టోబర్‌ 22న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని సంపన్న జవిూందారి కుటుంబంలో అష్ఫాఖ్‌ జన్మించారు. తండ్రి షఫీఖుల్లాఖాన్‌. తల్లి మజహరున్నీసా బేగం. చిన్ననాటి నుండే స్వతంత్ర భావాలను సంతరించుకున్న ఆయన ప్రజల జీవన పరిస్థితుల విూద దృష్టి సారించటంతో చదువు విూద పెద్దగా శ్రద్ధచూపలేదు. తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్
న ఆయన మంచి ఉర్దూ కవిగా రూపొందారు.
అష్ఫాఖుల్లా Abbie Rich Mission High School 8వ తరగతి విద్యార్థిగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ కవితలు రాస్తూ పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను చిన్నతనంలోనే వ్యక్తంచేశారు. ఆ క్రమంలో 'హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీ' నాయకులు రాం ప్రసాద్‌ బిస్మిల్‌తో ఏర్పడిన పరిచయం ద్వారా విప్లవోద్యమంలో భాగస్వామి అయ్యారు. మతం కారణంగా ఆర్యసమాజానికి చెందిన బిస్మిల్‌ హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీలో అష్ఫాక్‌కు సభ్యత్వం ఇవ్వడానికి సంశయించినా చివరకు అంగీకరించక తప్పలేదు. ఆర్మీ సభ్యునిగా బిస్మిల్‌ నేతృత్వంలో జరిగిన పలు యాక్షన్‌లలో చురుగ్గా అష్ఫాఖ్‌ పాల్గొన్నారు. బలమైన శత్రువును మాతృభూమి నుండి తరిమి కొట్టేందుకు ఆయుధాల సమీకరణకు ధనం అవసరం కాగా విప్లవకారుల కన్ను ప్రభుత్వపు ఖజానా విూద పడింది. ప్రభుత్వ ఖజానాను తెస్తున్న రైలు నుండి ధనాన్ని కొల్లగొట్టేందుకు పథకం తయారయ్యింది. ఈ పథకం పట్ల తొలుత అష్ఫాఖ్‌ అయిష్టత వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ఖజనాను అపహరిస్తే ప్రభుత్వం విప్లవోద్యమం విూద విరుచుకపడగలదని, ఆ కారణంగా బాల్యావస్థలో నున్న విప్లవోద్యమం కోలుకోలేనంత దెబ్బ తింటుందని హెచ్చరించారు. అయినా ప్రజాస్వామిక సిద్ధాంతం పట్ల గౌరవంగల ఆయన సహచరుల మెజారిటీ నిర్ణయానికి సమ్మతి తెలిపారు.
ఆ పథకం ప్రకారంగా 1925 ఆగష్టు 9న కాకోరి గ్రామం విూదుగా వెళ్ళే మెయిల్‌లో తరలిస్తున్న ప్రభుత్వ ఖజానాను పది మంది సభ్యుల గల విప్లవకారుల దళం సాహసోపేతంగా కైవసం చేసుకుంది. ఈ పథకాన్ని అమలుపర్చటంలో క్రమశిక్షణ గల విప్లవకారునిగా అష్ఫాఖ్‌ తనదైన పాత్రను నిర్వహించారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న బ్రిటీష్‌ ప్రభుత్వం అష్ఫాఖ్‌ ఊహించినట్టే విప్లవకారుల విూద విరుచుకపడటంతో అష్ఫాఖుల్లాతో పాటుగా ఆర్మీ సభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
అష్ఫాఖుల్లా మాత్రం ఏడాదిపాటు అజ్ఞాత జీవితం గడిపిన పిదప స్వగ్రామానికి చెందిన ఒక మిత్రద్రోహి కారణంగా ఢిల్లీలో అరెస్టయ్యారు. ఆయనకు పలు ఆశలు చూపి, మత మనోభావాలను కూడా రెచ్చగొట్టి లొంగదీసుకోటానికి ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేసింది. చివరకు కాకోరి రైలు సంఘటన విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆర్మీ నాయకుడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ను శిక్ష నుండి తప్పించేందుకు కాకోరి రైలు సంఘటనకు తాను మాత్రమే పూర్తి బాధ్యుడనంటూ తన న్యాయవాది సలహాకు భిన్నంగా ఉన్నత న్యాయస్థానానికి అష్ఫాఖ్‌ రాతపూర్వకంగా తెలుపుకున్నారు. చివరకు ఆయనతోపాటు సహచర మిత్రులకు కూడా కోర్టు ఉరిశిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది.
మాతృభూమి కోసం ప్రాణాలర్పించటం మహాద్భాగ్యమని ప్రకటించిన అష్ఫాఖ్‌ను 1927 డిసెంబరు 19న ఫైజాబాదు జైలులో ఉరితీశారు. ఈ సందర్భంగా 'నా మాతృభూమి సర్వదా భోగభాగ్యాలతో విలసిల్లాలి. నా హిందూస్థాన్‌కు స్వేచ్ఛ లభిస్తుంది చూడండి. చాలా త్వరగా బానిసత్వపు సంకెళ్లు తెగిపోతాయి' అని ఎంతో ఆత్మవిశ్వాసంతో దేశ భవిష్యత్తును ప్రకటించిన అష్ఫాఖుల్లా ఖాన్‌ ఉరితాడును సంతోషంగా స్వీకరిస్తూ, తన వందేళ్ళ జీవితాన్ని 27 ఏళ్ళకే ముగించుకుని తరలి వెళ్ళిపోయారు. (Taken from Syed Naseer Ahamed book CHIRASMARANEEYULU)

Monday, 7 October 2013

దళిత జన హితైషి, పోలియో వ్యతిరేక పోరాటయోధురాలు
'పద్మశ్రీ' ఫాతిమా ఇస్మాయిల్‌
(1903-1987)

జాతీయోద్యమం భారతీయులలో మహత్తర సేవాతత్పరతకు  ప్రేరణయ్యింది.  ఆ స్ఫూర్తితో కుటుంబాలకు కుటుంబాలు ఉద్యమంలో పాలుపంచుకున్నాయి.  బ్రిటీష్‌ వలస పాలకుల కిరాతకాలను లెక్కచేయక పోరుబాటన నడిచాయి.  అటువంటి కుటుంబంలో సభ్యురాలిగా తల్లి-తండ్రి,అన్నా-తమ్ముళ్ళ బాటలోసాగి అటు జాతీయోద్యమంలో ఇటు సేవారంగంలో అద్వితీయమైన పాత్ర నిర్వహించిన మహిళ శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌.
నాటి గుజరాత్‌ రాష్ట్రం బొంబాయికి చెందిన ప్రసిద్ధ స్వాతంత్య్రోద్యమ నాయకులు హజీ ముహమ్మద్‌ యూసుఫ్‌ సోహాని కుమార్తె బేగం ఫాతిమా. ఆమె కుటుంబం సంపన్న మోమిన్‌ వంశానికి చెందినది. ఆమె అన్నయ్య ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని. చిన్నన్నయ్య ముహమ్మద్‌ ఉస్మాన్‌ సోహాని. ఉమర్‌ సోహాని బొంబాయిలో ప్రముఖ వ్యాపారవేత్త. ఆ ఇరువురు సోదరులు కూడా తండ్రి మార్గంలో విముక్తిపోరాట బాటలో ముందుకు సాగారు. జాతీయోద్యమ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమగు ఆర్థిక పుష్టిని అందించటంలో ఆ సోదరులు  ముందున్నారు. ఆనాడు భూరిగా విరాళాలు అందచేతలో ప్రధానంగా  ఉమర్‌ సోహాని ప్రఖ్యాతి గడించారు.
మహాత్మాగాంధీ తిలక్‌ ఫండ్‌ కోసం ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని  వద్దకు రాగా తన చెక్కుబుక్‌ను ఆయకిచ్చి ఇష్టమొచ్చినంత రాసుకోమన్నారు. గాంధీజీ లక్ష రూపాయలను రాయగా అందుకు ఆయన సంతోషంగా అంగీకరించారు. ఆ తరువాత ఖిలాఫత్‌ ఫండ్‌ కోసం ఖిలాఫత్‌ నేతలు ఉమర్‌ సోహానిని  కలువగా వారికి కూడా ఆయన లక్షరూపాయాల విరాళం ఇవ్వటమే కాకుండా ఖిలాఫత్‌ కార్యాలయం ఏర్పాటుకు తన స్వంత భవంతిని అప్పగించారు. ఆ తరువాతి కాలంలో ఆ భవంతి ఖిలాఫత్‌ హౌస్‌ గా పిలువబడింది.(Muslims In India, Volume -II, Naresh Kumar Jain, Manohar, New Delhi, 1979, Page : 162).
ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని చాలా ఉదార స్వభావులు. జాతీయోద్యమ కార్యక్రమాల నిర్వహణకు అవసరమగు నిధుల అందచేతలో తానెప్పుడూ ప్రథమ స్థానంలో ఉండాలన్నది ఆయన అభిమతం. ఆ కారణంగా ఉద్యమనాయకులు ఆయన సహాయం కోరివస్తే అందరి కంటె అధిక మొత్తాన్ని అందించి ఆనందించటం ఆయన అలవాటు. ఆ అలవాటుకు తగ్గట్టుగా వ్యాపారంలో ఆయన అపారంగా ఆర్జించారు. ఆ క్రమంలో ఓ మాసంలో ఆయన సంపద ద్విగుణీకృతమైంది. ఆ తరువాత దురదృష్టవశాత్తు మరుసటి నెలలో అనూహ్యంగా కోట్లాది రూపాయలను ఆయన నష్టపోయారు. ఆ నష్టంతో ఆయన బాగా క్రుంగిపోయారు. ప్రజోపకర కార్యకలాపాలకు, ప్రధానంగా జాతీయోద్యమానికి ఆర్థిక సహాయం అందించటంలో ముందు ఉండలేకపోయినందున ఆయన ప్రజా జీవితం నుండి దూరం కావాలనుకున్నారు. (ఖతిరీజిరిళీరీ |దీ |దీఖిరిబి, ఆబివీలి : 162).
ఆ విధంగా  ప్రజా జీవితం నుండి రాజకీయాల నుండి దూరమైన సోహానిని వ్యాపారంలో వచ్చిన అపారనష్టం కల్గించిన వేదన కంటే  ప్రజలకు,  ఉద్యమకారులకు, జాతీయోద్యమానికి తాను ఏవిధంగానూ ఉపయోగపడలేక పోయాన్న దిగులు ఆయనలో అధికమయ్యింది. ఆ బాధతో సతమతమౌతూ 36 సంవత్సరాల వయస్సులో 1926 జూలై 6న ఆయన కన్నుమూశారు. ఆ సందర్భంగా, His untimely and sudden death has removed a patriot from the country అని  వ్యాఖానిస్తూ మహాత్మాగాంధీ యంగ్‌ ఇండియాలో ఆయనకు నివాళులర్పించారు.
అటువంటి ఉదార హృదయులు, త్యాగశీలుర కుటుంబంలో  బేగం ఫాతిమా 1903 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు. ఆమె  తండ్రి యూసుఫ్‌ సోహాని, సోదరులు  ఉమర్‌ సోహాని, ఉస్మాన్‌ సోహానిలు కూడా జాతీయోద్యమకారులు. ఆ జాతీయోద్యమ నేతల గారాల పట్టిగా పెరిగిన కుమారి ఫాతిమా చిన్నతనం నుండే బ్రిటీష్‌ వ్యతిరేక భావాలను పుణికి పుచ్చుకున్నారు. అన్యాయాన్ని, అధర్మాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా ధైర్యంగా ఎదుర్కోవటం  గుణంగా ఆమె ఎదిగారు. స్వేచ్ఛా-స్వాతంత్య్రాల పట్ల మక్కువ ఎక్కువ. అహేతుక ఆచార, సంప్రదాయాలకు ఆమె వ్యతిరేకి. సకారాత్మకమైనా నకారాత్మకమైనా తన అభిప్రాయాన్ని నిర్భీతిగా ప్రకటించటం ఆమె అలవాటు. 
1919లో ఆమె సీనియర్‌ కేంబ్రిడ్జి పూర్తిచేసి 1920లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ఉర్దూ, ఆంగ్ల భాషలలో మంచి విద్వత్తును సాధించారు. 1921-1923లో వియన్నాలో వైద్యవిద్య చదవడానికి వెళ్ళిన ఆమె అనివార్య కారణాల వలన వైద్యవిద్యను అసంపూర్ణంగా వదిలేశారు.
ప్రభుత్వ ఉన్నతోద్యోగి హసన్‌ ఇస్మాయిల్‌ను ఆమె వివాహమాడారు. ఆయన కూడా స్వాతంత్య్రోద్యమాభిమాని. భర్త ప్రోత్సాహంతో స్వాతంత్య్రోద్యమంలో భాగంగా సాగిన స్వదేశీ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా ఫాతిమా ఇస్మాయిల్‌ జాతీయోద్యమ రంగప్రవేశం చేశారు. స్వదేశీ వస్తువులను విక్రయిం చేందుకు, వినూత్న ఏర్పాట్లు చేసి ప్రజల, ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. విదేశీ వస్తువులను బహిష్కరించమని కోరటం మాత్రమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలనుకున్నారు. ఆ ఆలోచన రావటమే తరువాయి రైలులోని ఓ ప్రత్యేక బోగిలో స్వదేశీ వస్తుసామగ్రిని నింపుకుని  ఆ సామగ్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తూ, స్వదేశీ ఉద్యమ సందేశాన్ని వ్యాప్తి చేశారు. స్వదేశీ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనటమే కాకుండా, స్వదేశీయులచే పలు కుటీర పరిశ్రమల స్థాపనకు ఆమె కృషి సల్పారు.
 1934లో సమాజోద్ధరణలో భాగంగా మహిళలను చైతన్యవంతుల్ని చేసి సంఘటిత పర్చేందుకు సంఘాలు, సంస్థలు స్థాపించారు. అంజుమన్‌ ఇస్లాహే నిశ్వా మహిళా సుధార్‌ సమితి అను సంస్థను స్వయంగా ఆరంభించారు. 1935లో ఆమె అఖిల భారత మహిళా సమావేశానికి కార్యదర్శిగా నియుక్తులయ్యారు. బొంబాయి ముస్లిం మహిళలలో వయోజన విద్యా వ్యాప్తికిఎంతో కృషిచేశారు. పలు సంఘాలను, సేవా సంస్థలను స్థాపించి, ఆయా సంస్థల అభివృద్ధికి శ్రమించారు. ఈ మేరకు మహిళలలో జాగృతికోసం  చేస్తున్న  కృషి ఫలితంగా 1937-1940ల మధ్యలో ఆమె అఖిల భారత మహిళా కాన్ఫెరెన్స్‌ హస్టల్‌ కార్యదర్శి బాధ్యతలు లభించాయి.
ఆ క్రమంలో 1940లో బొంబాయి ఉమెన్స్‌ కౌన్సిల్‌కు చెందిన లేబర్‌ సమితికి ఉపాధ్యకక్షురాలయ్యారు. ఆ పదవిలో ఆమె కార్మికుల కుటుంబాలలో మహిళల పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రయత్నించారు. ఆమె స్వయంగా కర్మాగారాలకు చుట్టుపక్కల ఉంటున్న కార్మికవాడలకు వెళ్ళి కార్మిక కుటుంబాల మహిళలతో వారి సమస్యల విూద చర్చించారు. ఆ మహిళల సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఆ సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక మార్గాలను సూచిస్తూ మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత గ్రావిూణోద్యోగ సంఘం ఏర్పాటుకు పునాదులు వేశారు. సమస్యలతో సతమతమవుతున్న మహిళలు తమ సమస్యలను తాము పరిష్కరించుకుంటూ, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కుటీర పరిశ్రమలను, చేతి వృత్తులను ప్రోత్సహించారు. ఆ కృషిలో భాగంగా పలు మహిళా సంక్షేమసంఘాలను ఏర్పాటు చేశారు.
  1942లో ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమంలో  ఫాతిమా ఇస్మాయిల్‌ క్రియాశీలపాత్ర వహించారు. ఈ ఉద్యమంలో పోలీసుల అరెస్టులను తప్పించుకుంటూ  ఆమె పనిచేశారు. ఒకథలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళారు. 1940లో రాంఘర్‌, 1943లో బొంబాయిలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు పాతిమా ఇస్మాయిల్‌ హజరయ్యారు. ఖద్దరు, స్వదేశీ ఉద్యమ ప్రచారం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం, హిందూ- ముస్లింల ఐక్యత ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకుని ఆమె ముందుకు సాగారు. ఈ లక్ష్యాల సాధన కోసం సాగించిన ప్రయత్నాలలో భాగంగా  ఆమె పలు ప్రాంతాలను సందర్శించారు. 
క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఫాతిమా ఇస్మాయిల్‌  చురుకైన భాగస్వామ్యం వహిస్తుండగా 1944 ప్రాంతంలో ఆమె కుమార్తె పోలియో బారిన పడింది. ఆ కారణంగా కుమర్తె అవిటితనానికి గురైంది. బిడ్డ అవిటిగా మారటంతో  ఫాతిమా ఇస్మాయిల్‌  తీవ్రంగా కలత చెందారు. పోలియో పరిణామాల నుండి ఆమెను కాపాడుకునే ప్రయత్నాలలో లక్షలాది పిల్లలు పోలియో రక్కసి బారిన పడి వికలాంగులుగా మారుతున్న దుస్థితిని గమనించారు.  సరైన చికిత్స లేని ఆ వ్యాధి నుండి పిల్లలను కాపాడుకునేందుకు వ్యాయామం ఒక్కటే కారణమని తెలుసుకున్న ఆమె ఆ దిశగా తన బిడ్డ విూద ప్రయోగాలు చేశారు. ఆమె ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయి. దానితో పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమని ఆమెకు విశ్వాసం కలిగింది. కష్టసాధ్యమైన ఆ మహాత్తర లక్ష్యసాధనకు పూర్తికాలపు సేవలు అవసరమని ఆమె భావించారు. ఆ క్షణం నుండి  ఆమె సాగిస్తున్న బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పి పోలియో నుండి బిడ్డలను కాపాడేందుకు పోలియో విూద ఆవిశ్రాంత పోరాటం సల్పేందుకు నడుంకట్టారు.
  ఆమె గతంలో  వైద్యశాస్త్ర విద్యార్థి కావటంతో పోలియో నివారణ, నియంత్రణ కార్యక్రమాల విూద ప్రత్యేకంగా శిక్షణ పొందారు. బొంబాయికి చెందిన డాక్టర్‌ బాలిగాతో కలిసి పోలియో రోగగ్రస్తులైన పసిబిడ్డలకు వ్యాయామం ద్వారా పోలియోను నయం చేసేందుకు  1947లో ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ కోసం పోలియో రోగగ్రస్త బిడ్డల ఆరోగ్యం కోసం ఫాతిమా ఇస్మాయిల్‌ పూర్తి కాలాన్ని వినియోగించటం ప్రారంభించారు. పండిత నెహ్రూ కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ కుటుంబం సహాయ సహకారాలతో పోలియో నివారణ సంస్థను, ఆ సంస్థ కార్యక్రమాలను మరింతగా విస్తరింపచేశారు. 
 ఈ క్రమంలో పేదరికం, అనారోగ్యం పట్టిపీడిస్తున్న కార్మికులను, అజ్ఞానం, ఆర్థిక బలహీనతలతో బానిసల కంటే దుర్భరంగా బ్రతుకులీడుస్తున్న మహిళలనూ, సాంఘిక అసమానతలు, సామాజిక దురాచారాలను, అంటరానితనంతో అత్యంత హీనంగా చూడబడుతున్న దళిత జనసముదాయాల స్థితిగతులనూ అతిసవిూపం నుండి గమనించారు. ఆ అవాంఛనీయ పరిస్థితులలో మౌలిక మార్పుకోసం పనిచేయటం ఆరంభించారు.  ఈ దిశగా ఆమె తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. శ్రమ జీవుల పక్షాన పోరాటాలు చేశారు. ఆరోగ్యం, పరిశుభ్రత విషయాలలో చైతన్యం కోసం కృషి సల్పారు.  కర్మాగారాల వాతావరణం, పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు.
జాతీయ అంతర్జాతీయ సంస్థల పిలుపు మేరకు,  పోలియో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను, పసిబిడ్డల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను వివరిస్తూ పలు విదేశీ పర్యటనలు జరిపారు, ఆమె స్వయంగా పలు చోట్ల  శిక్షణ పొందారు. స్వదేశంలో స్థాపించబడిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు చేయూతనిచ్చారు. పోలియో పీడితులకు మాత్రమే కాకుండా అంగవికలాంగుల ఉద్ధరణకు కూడా ఆమె కృషిచేశారు. వికలాంగులకు ప్రభుత్వం నుండి సదుపాయాలు కలుగజేసేందుకు ఆమె నిరంతరం శ్రమించారు. వికలాంగుల సేవా కేంద్రాల స్థాపనను ప్రోత్సహించారు.     
ఈ  మేరకు అటు  పోలియో విూద అవిశ్రాంత పోరాటం చేస్తూ, ఇటు సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా తిరుగులేని యుద్ధం ప్రకటించిన ఫాతిమా ఇస్మాయిల్‌  ఆచరణాత్మక సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ అవార్డుతో  గౌరవించింది. దళిత ప్రజల విూద కొనసాగుతున్న సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ దళిత జనావళి అభ్యున్నతి కోసం ఆమె సాగించిన కృషి గమనించిన దళిత ప్రజలు స్వయంగా 1972లో  దళితమిత్ర  అవార్డుతో ఆమెను సత్కరించుకున్నారు. ఈ విధంగా స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆమెకు  గౌరవసత్కారాలు లభించాయి. పలు అవార్డులు ఆమె సొంతమయ్యాయి. ఆ విధంగా లభించిన పురస్కారాలన్నిటిని ఆమె మార్గదర్శకత్వంలో సాగుతున్న సేవాసంస్థల ఆర్థిక పరిపుష్టికి వినియోగించారు.
 ప్రజాసేవారంగాలలో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొంది, స్వాతంత్య్ర సమరోద్యమకారిణిగా, పోలియో నియంత్రణకు అవిరళ కృషి సల్పిన యోధురాలిగా, భారతీయుల ప్రియతమ సంఘసేవకురాలిగా, ఖ్యాతిగాంచిన ఫాతిమా ఇస్మాయిల్‌ 1979 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ పదవిలో 1985 వరకు పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఆమె సంఘసేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించారు.
ఈ విధంగా జీవిత చరమాంకం వరకు ప్రజాసేవలో గడిపిన శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌ 1987 అక్టోబర్‌ 11న కన్నుమూశారు.

Thursday, 19 September 2013

తిరగబడ్డ చీరాల-పేరాల ప్రజలకు బాసటగా నిలచిన

ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌

(1885 -1976)


జాతీయోద్యమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో సాగిన 'చీరాల-పేరాల' పోరాటం చాలా ప్రఖ్యాతిగాంచింది. అద్భుత పోరాటపటిమతో సాగించిన ఈ శాంతియుత ఉద్యమం జాతీయోద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలిచిపోయింది. ఆ పోరాటంలో ప్రధాన భూమిక నిర్వహించిన యోధులలో మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ ఒకరు.
ప్రకాశం జిల్లా చీరాల మండలం గంటాయపాలెంలో 1885 సెప్టెంబరు 12న ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ జన్మించారు. తల్లితండ్రులు హాజీ మోహిద్దీన్‌ బేగ్‌, ఫాతిమా. గౌస్‌బేగ్‌ తాత ముహమ్మద్‌ దిలావర్‌ బేగ్‌ సంపన్న వ్యాపారవేత్త. చీరాలకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న వోడరేవులో ఈయన వోడలు ఉండేవి. పెద్ద ఎత్తున గోడవున్సుకు యజమాని. భారీ ఎత్తున వ్యాపారం చేసిన ఘనాపాటి...గౌస్‌ సాహెబ్‌ తండ్రి హయాములో వోడరేవు వ్యాపారం స్థంభించింది. కాని విస్తృతమైన ఆస్థి, సిరిసంపదలు సంక్రమించాయి. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌.సుందరదావు, 1989, పేజి.60).
ముహమ్మద్‌ గౌస్‌ 1907లో విద్యార్థిగానే వందేమాతరం ఉద్యమం రోజుల్లో జాతీయోద్యమంలో ప్రవేశించారు. బాపట్లకు చెందిన బేగ్‌కు 'చీరాల-పేరాల ఉద్యమం' నిర్మాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పరిచయం ఏర్పడింది. ఆయనతో కలసి 1920లో కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరు కావడంతో గౌస్‌ రాజకీయ జీవితం ఆరంభమైంది. ప్రకాశం జిల్లా చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘం ఏర్పాటు చేసి ప్రజానీకం మీద ప్రభుత్వం అత్యధిక పన్నుల భారం మోపింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య రంగ ప్రవేశం చేశారు. ఆయన అత్యంత సన్నిహిత సహచరుడిగా గౌస్‌ బేగ్‌ కూడా ప్రత్యక్షకార్యాచరణకు దిగారు.1921 ఏప్రిల్‌ 6న, విజయవాడ వచ్చిన మహాత్మా గాంధీని దుగ్గిరాల కలిసి ఉద్యమ కార్యాచరణకు అనుమతి పొందడంతో 'చీరాల-పేరాల' ఉద్యమంలో మహమ్మద్‌ గౌస్‌ పూర్తిగా నిమగ్నమయ్యారు. ఆ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకున్న భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులలో గౌస్‌ బేగ్‌ ఒకరు. ఈ ఉద్యమంలో ప్రజానీకం ఆర్థిక ఇక్కట్లు పడుతున్నందున పూర్వీకులు సంపాదించి పెట్టిన సంపదను ప్రజావసరాలకు వ్యయం చేశారు. ఆ విధంగా ఉద్యమానికి సర్వసంపదను, వెచ్చించి బలాన్ని చేకూర్చిన యోధుడు జనాబు గౌస్‌ బేగ్‌ గా ఆయన ఖ్యాతిగడించారు. (స్వాతంత్య్రోద్యమం దేశ నాయకులు, వి.యల్‌.సుందరరావు, 1989, పేజి.61)
1921 నాటి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో గౌస్‌ బేగ్‌ ప్రధాన పాత్ర నిర్వహించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. జాతీయోద్యమ కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొంటూ వచ్చిన గౌస్‌బేగ్‌ ఒంగోలు కారాగారంలో ఉన్న సందర్భంగా ఐపియస్‌ అధికారి హైదరీ దొర ఆయనను బంగళాకు తీసుకెళ్ళి బ్రాహ్మణ ప్రేరేపిత ఉద్యమంలో ఎందుకు పాల్గొంటున్నారు. మీ సాహెబులందరికి చెడ్డపేరు వస్తుంది. మీరు కోరుకుంటే 100 లేక 200 ఎకరముల భూమిని మంజూరు చేస్తా అని నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశాడు. అందుకు, ఈ రోజు పండగ రోజు (రంజాన్‌) నన్ను జైలుకు పోనివ్వండి. ఈ దేశభక్తి ఉన్మాదునికి కళంకం ఆపాదించకండి, అని గౌస్‌ సమాధానం చెప్పడంతో, ఆ ఆధికారి ఏడాది జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించాడు. ఆ శిక్షను 1922 మార్చి రెండున నుండి రాజమండ్రి, కడలూరు జైళ్ళలో గౌస్‌ బేగ్‌ అనుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక 'ఆంధ్రరత్న' గోపాలకృష్ణయ్య స్థాపించిన స్వచ్ఛందసేవకుల దళం 'రామదండు'కు ఆయన నాయకత్వం వహించి, జాతీయోద్యమ భావాలను ప్రజలలో ప్రచారం చేసేందుకు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించారు.
ఆనాటి నుండి గౌస్‌ సాహెబ్‌ జాతీయోద్యమ కార్యక్రమాలన్నిటిలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న క్రమంలో ఆస్తి అంతా కరిగిపోయింది. కుటుంబానికి భుక్తినిస్తున్న 23 ఎకరాల భూమిని విక్రయించి మరీ ఉద్యయం కోసం వ్యయం చేశారు. ప్రముఖ నేతలు భోగరాజు పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయమ్మ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి ప్రముఖులు, కార్యకర్తలు గౌస్‌ బేగ్‌ ఇంట ఆతిధ్యం స్వీకరించేవారు. ఆనాటి ఉద్యమకారులకు గౌస్‌ గృహం, తమ స్వంతిల్లు లాగుండేది. నగదు నట్రా, పొలం పుట్రా కరిగిపోతున్న, బేగ్‌ దంపతులు బేఖాతర్‌ అన్నారు. మాతృభూమి కోసం సర్వం త్యాగం చేయగలిగిన వారే అదృష్టవంతులని మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ దంపతులు అభిప్రాయపడ్డారు. ఆ ఆభిప్రాయలకు అనుగుణంగా జాతీయోద్యమం కోసం తమ సర్వసంపదలను, చివరకు గౌస్‌ ఖాతూన్‌ ఆభరణాలను కూడా వ్యయంచేశారు. గౌస్‌ బేగ్‌ జాతీయోద్యమంలో ప్రవేశించాక ఆయనకు పూర్వీకులనుండి సంక్రమించిన మణులు, మాన్యాలు, తోటలు, భవంతులు అన్నీ హారతి కర్పూరంలా కరిగి పోయాయి. ప్రభుత్వ చర్యల కారణంగా ఆయన వ్యాపారాలన్నీ స్థంభించి పోయాయి. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌.సుందరరావు)
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సలహా మీద గౌస్‌ వ్యాపారం ఆరంభించారు. ఆయన వ్యాపార సంస్థకు 'రాం రహీమ్‌' అని నామకరణం చేశారు. ఆర్థికంగా పూర్వవైభవాన్ని సంపాదించేందుకు పలు వ్యాపారాలు చేశారు. వ్యాపారం ద్వారా లాభాలు అర్జించటం కంటె ఆయన దృష్టి అంతా జాతీయోద్యమం మీద లగ్నం కావడంతో వ్యాపారాలు లాభాల మాట అటుంచి పూర్తిగా నష్టాల బాటన సాగాయి.
1930-32 ప్రాంతంలో ఉప్పుసత్యాగ్రహానికి ఆయన నాయకత్వం వహించారు. చీరాలలోని యువకుల ఆహ్వానం మేరకు వెళ్ళి స్వచ్ఛంద సేవకులను అడ్డుకుంటున్న పోలీసులను లెక్కచేయకుండా ఉప్పు గుండాలలోకి ప్రవేశించి ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఆయన చూపిన చొరవతో మిగిలిన నాయకులు, యువకులు గౌస్‌ను అనుసరించారు. (గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం, మాదల వీరభద్రరావు, పేజి.141). ఈ సందర్భంగా దేవరంపాడు శిబిరానికి గౌస్‌ నాయకత్వం వహించి నడిపారు. ఆ శిబిరాన్ని నడిపినందుకు ఆయనకు ఏడాది పాటు జైలు శిక్షను ప్రభుత్వం విధించింది. ఈ సందర్భంగా ఆయన పిడికిటిలోని ఉప్పు తీయటానికి పోలీసు లాఠీలు విఫలమైనాయి. ఆయనను ఎన్నోవిధాల హింసించినారు. ఈ సంఘటనను ఆంధ్రదేశమంతట ఎన్నో కథలుగా చెప్పుకున్నారు. ఈ విధంగా శాసనోల్లంఘన ఉద్యమంలో గుంటూరు జిల్లా ఉద్యమంలో క్రియాశీలక పాత్రను నిర్వహించినందుకు, ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం 1930 ఏప్రిల్‌ 24న ఏడాది జైలు శిక్షను విధించింది. ఆ సమయంలో ఉన్న కొద్దిపాటి చరాస్థిని వేలం వేసి, లభించిన నగదును జరిమానా క్రింద ప్రభుత్వం జమ చేసుకుంది.
శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లా, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో గౌస్‌ బేగ్‌ క్రియాశీలక పాత్రను నిర్వహించారు. ఆ ఉద్యమనేత పర్వతనేని వీరయ్య చౌదరి ప్రధాన సహచరుడిగా ఆయన వ్యవహరించారు. ఆ పన్ను నిరాకరణ ఉద్యమ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ సాగిన ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పాత్రను నిర్వహించినందున పోలీసుల దాష్టీకానికి పలుమార్లు గురయ్యారు. చివరకు 1932 మార్చి 10న ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, పాతిక రూపాయల జరిమానాను ప్రభుత్వం విధించి వెల్లూరు, రాజమండ్రి జైళ్ళలో నిర్బంధించింది. ఆ తరువాత 1933 జూలై 3న ముహమ్మద్‌ గౌస్‌బేగ్‌ విడుదలయ్యారు.
మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ మంచి వక్త. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలు, సమావేశాలకు ప్రముఖ వక్తగా హజరై ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల భారత జాతీయ కాంగ్రెస్‌ అగ్రనాయకులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన మితభాషి, నిశ్చల శాంత స్వభావుడు. ఎటువంటి హంగు-ఆర్భాటం, హడావుడి లేకుండా ఒకచోటన స్థిరంగా ఉంటూ కనుసైగలతో ఎంతటి కార్యాన్ని సన్నిహితులతో విజయవంతంగా పూర్తిచేయించగల కార్యదక్షత కలిగిన నాయకుడిగా పేర్గాంచారు. భారతదేశానికి స్వాతంత్య్ర లభించేంత వరకు భారత జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాలను ఆయన త్రికరణ శుద్ధిగా పాటించారు. ఆనాడు ఆంధ్రదేశంలో గౌస్‌ బేగ్‌ తెలియనివారు లేరు. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌. సుందరరావు) మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ మాత్రమే కాకుండా ఆయన సతీమణి గౌస్‌ ఖాతూన్‌ స్వాతంత్రోద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు. విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను త్యజించిన ఆ దంపతులు జీవితాంతం ఖద్దరు ధరించారు.
స్వాతంత్య్రం సిద్ధించాక కూడా కొంతకాలం గుంటూరు జిల్లా రాజకీయాలలో మహమ్మద్‌ గౌస్‌ పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌ కమిటీ అద్యకక్షునిగా బాధ్యతలను నిర్వహించారు. 1961లో తమ స్వగ్రామం నుండి చీరాలకు వచ్చి గౌస్‌ స్దిరనివాసం ఏర్పరచుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యునిగా ఉంటూ, చీరాల పురపాలక సంఘం సభ్యునిగా విజయం సాధించి పురపాలక సంఘం ఉపాద్యకక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.
చిన్ననాట నుండి మతసామరస్యం కోరుతూ వచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా, మత దురహంకారాన్ని నిరసిస్తూ, విభిన్న మతస్థుల మధ్యన సద్భావన, సదవగాహన కలిగించడం కోసం హిందూ-ముస్లింల మధ్య పటిష్టమైన స్నేహ సంబంధాల కోసం నిరంతరం కృషి సల్పారు. మనుషుల మధ్యన మత భేదభావాన్ని ససేమిరా అన్నారు. మతసామరస్యం కాపాడటం, వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్యన 'శాంతి-స్నేహం' పటిష్టపర్చేందుకు చివరిశ్వాస వరకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు.
జాతీయోద్యమంలో మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ ప్రదర్శించిన సాహసానికి త్యాగనిరతికి గౌరవ సూచకంగా 1972 ఆగస్టు 15న భారతప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. చివరి క్షణం వరకు ప్రజలలో దేశభక్తి, స్నేహభావాలను పరిమళింపచేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ 1976 సెప్టెంబరు 19న కన్నుమూశారు.
 ' ప్రమాదంలో ఇస్లాం '  నినాదం ప్రమాదాన్ని పసిగట్టి తిరస్కరించిన
 మౌలానా హబీబుర్రెహమాన్‌ లుధియాని
   

    భారత దేశ విభజన జరగటానికి దోహదం చేసిన పలు కారణాలలో '|ఐఉజుఖ |శ్రీ ఈజుశ్రీస్త్రజూష్ట్ర' అను నినాదం ఒకటి.   ద్విజాతి సిద్దాంతం  పేరిట దేశాన్ని ముక్కలు చేసి తమ పబ్బం గడుపుకోవాలని ఆశించిన స్వార్ధపరులు హిందూ-ముస్లింల మత మనోభావాలను రెచ్చగొట్టి విజయం సాధించారు. విభజన ద్వారా లబ్ది పొందాలనుకున్న రాజకీయ నాయకులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్‌ తదితర వ్యక్తులు, శక్తులు తమ లక్ష్యాన్ని సాధించుకోవటానికి వివిధ మార్గాలను అన్వేషించాయి. ఈ మేరకు సాగిన అన్వేషణలో 'ప్రమాదంలో ఇస్లాం' అను నినాదం బలమైన ఆయిధంగా చిక్కింది. ఆ నినాదం ఆసరాతో ముస్లిం జనావళిని ఉద్వేగాల తుఫానుకు గురిచేశారు. ఆ ప్రమాదాన్ని ఆనాడే పసిగట్టిన పలువురు ముస్లిం నాయకులు, ఆ నినాదం వెనుక గల దురుద్దేశాలను ప్రజలకు వివరించారు. ఆ స్వార్ధపర శక్తుల కుయుక్తులను ఎండగట్టారు. ఆ విధంగా 'ఇస్లాం ఇన్‌ డేంజర్‌'  నినాదాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటమేకాక, ఆవాంఛనీయ వాతావరణంలో కూడా ఎమాత్రం వెనుకంజవేయకుండా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవిశ్రాంత కృషి జరిపిన వారిలో మౌలానా హబీబుర్రెహమాన్‌ లుధియాని ప్రముఖులు.
    1929 జనవరి ఒకటిన మీరట్‌లో జరిగిన 'అహరర్‌' సంస్ధ ప్రాంతీయ సమావేశంలో మౌలానా మాట్లాడుతూ ఇస్లాం ప్రమాదంలో ఉందంటూ సాగుతున్న ప్రచారం వెనుక గల కుట్రను హేతుబద్దంగానూ, సాహసోపేతంగానూ వివరించారు.' ముస్లింలకు ప్రత్యేక దేశం' అను డిమాండ్‌ సరికాదన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, '...the cry for Islam in Danger is baseless and it could not be protected by Pakistan...Islam cannot be protected by any community but by our own strength and sacrifice...'' అన్నారు. పాకిస్ధాన్‌ ఏర్పడినంత మాత్రాన ఇస్లాం మతానికి ఒరిగేది ఏమీ ఉండదని ప్రకటించారు. అమాయక జనావళిని మభ్య పెట్టేందుకు ఇస్లాం ప్రమాదంలో ఉందని స్వార్దపర శక్తులు ప్రచారం చేస్తున్నాయంటూ, ఆయా శక్తుల ప్రభావానికి లోను కావద్దని ప్రజలు పిలుపునిచ్చారు.
    నమ్మిన విషయాలను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా, ఎటువంటి సదురుబెదురు లేకుండా ప్రకటించే మౌలానా హబీబుర్రెహమాన్‌ 1892 జూలై 3వ తేదీన పంజాబ్‌ రాష్ట్రం లూధియానాలో జన్మించారు. మౌలానా వంశీకులకు 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న చరిత్ర ఉంది.  తండ్రి పేరు మౌలానా మహమ్మద్‌ జక్రియా. లూధియానా, జలంధర్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న హబీబుర్రెహమాన్‌ చివరకు దేవ్‌బంద్‌ వెళ్ళి ఉన్నత విద్యను పూర్తి చేశారు.
    1903లో లూధియానాకు చెందిన ప్రముఖ ఇస్లామిక్‌ తత్వవేత్త మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ కుమార్తె బీబి షఫాతున్నీసాను వివాహమాడారు. ఆమె  భర్తతో పాటుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మౌలానా తన జీవితంలో మొత్తం మీద 10 సంవత్సరాలకు పైగా జైళ్ళల్లోనే గడిపారు. ఆయన ఆస్తిపాస్తులను అనేక సార్లు ప్రభుత్వం జప్తు చేసింది. పోలీసులు తనిఖీ పేరుతో మౌలానా గృహంపై పలు మార్లు దాడులు జరిపారు. ఆయన ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీల పట్ల కూడా అతి దారుణంగా వ్యవహరించారు. అయినా ఆ తల్లులు అన్నింటినీ సహించారు. చివరకు పసిపిల్లల చెవులలోని దుద్దులను కూడా అపహరించుకు పోయారు. ఎంత నష్టం జరిగినా శ్రీమతి షఫాతున్నీసా కష్టనష్టాలను కడుపులోనే దాచుకున్నారు. ఉత్తమ లక్ష్యం కోసం సాగుతున్న స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్న భర్త, బిడ్డలను ఆమె చివరివరకు ప్రోత్సహించారు. జప్తుల మూలంగా మౌలానా సర్వం కోల్పోయారు. చివరకు రోజుగడవటం కూడా లేని పరిస్ధితులలో శధిలావస్ధలో ఉన్న ఇంటిలోనే తలదాచుకుంటూ, మౌలానా దంపతులు తమ ఇరువురు కుమార్తెలతో పలు కడగండ్లను అనుభవించారు. ఎన్ని ఇక్కట్లు ఎదురైనా ఆ కుటుంబం పోరాట మార్గాన్ని, లక్ష్యాన్ని వీడలేదు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన యోధుల వంశానికి చెందిన మౌలానా రెహమాన్‌ తుదిశ్వాస వరకు ఆ ప్రతిష్టాత్మక వారసత్వాన్ని కొనసాగించారు. బ్రిటిషర్ల రాజకీయాలను, దేశ ప్రజలను దోచుకుంటున్న తీరుతెన్నులను అవగతం చేసుకుంటూ పాలకుల చర్యలను వ్యతిరేకించారు. చక్కని శరీరాకృతి, వేషభాషలలో నవాబు దర్జాను ప్రతిబింబించే మౌలానా ఉదార హృదయులు. ఆదాయం పెద్దగా లేకున్నా, ఆదుకోమని వచ్చిన వారెవ్వరినీ కూడా వట్టి చేతులతో పోనివ్వని పెద్దమనస్సు అయనది.
    1919నాటి ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొనటం, భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించిన మౌలానా రెహమాన్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఖిలాఫత్‌ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్‌ ప్రారంభించిన సహాయనిరాకరణ ఉద్యమంలో  పలు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగాలు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. 1921 డిసెంబరు 1న ఆయన చేసిన ప్రసంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడమని ప్రజలను ప్రేరేపించేదిగా ఉందంటూ బ్రిటిష్‌ పోలీసులు వారెంటు జారీ చేశారు.  ఆ వారెంటు ఫలితంగా 1922 డిసెంబరు 22న  తొలిసారిగా అరెస్టయ్యారు.  ఆరు మాసాల జైలు శిక్ష పడింది. ఈ విధంగా ప్రారంభమైన జైలు జీవితం మౌలానా జీవిత కాలాన్ని 15 శాతానికి పైగా హరించి వేసింది. పలు సార్లు శిక్షలు అనుభవించిన ఆయన మొత్తం మీద పది ఏండ్లకు పైగా దేశంలోని వివిధ జైళ్ళల్లో గడిపారు. ఆయన జైలు జీవితం గడపటమే కాక, విప్లవకర కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మీద ఆయనతనోపాటుగా ఆయన కుమారులను కూడా పలుమార్లు అరెస్టు చేసి బ్రిటిష్‌ ప్రభుత్వం కారాగారంలో నిర్భందించింది.
    ఆధ్మాత్మిక విషయాలలో ముస్లింలకు మార్గదర్శకత్వం వహించే లక్ష్యంతో ఏర్పడిన JAMIAT-UL-ULEMA-HIND సంస్ధలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఈ సంస్థ జాతీయభావాలను ప్రచారం చేస్తూ, వేర్పాటు భావనలను నిరశిస్తూ, భారత జాతీయ కాంగ్రెస్‌కు బాసటగా నిలిచింది. జాతీయ భావాల ప్రచారం కోసం తన మిత్రులను ప్రోత్సహించి ANEES   అను ఉర్దూ పత్రికను లూధియానాలో మౌలానా ప్రారంభింపజేశారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సలహా మీద ఆయన 1920 లో MAJLIS-E-AHARAR ( The Society of Freemen) అను సంస్ధను ప్రారంభించారు. సంపూర్ణ స్వరాజ్య సాధనకు కృషి చేయటం, దేశ విభజన డిమాండ్‌ను వ్యతిరేకించటం, ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ప్రధాన లక్ష్యాలుగా అహరర్‌ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ కార్యకర్తలు జాతీయోద్యమంలో అసమాన త్యాగాలను, పోరాట పటిమను ప్రదర్శించారు. శాసనోల్లంఘనోద్యమంలో అరహర్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలను చైతన్యపర్చటం, ఉద్యమంలో భాగస్వాములు చేయడం,  ముందుకు నడిపించటంలో మౌలానా ఎంతో నేర్పుతో వ్యవహరించేవారు. అహరర్‌కు బలమైన కేంద్రాలుగా నున్న కాశ్మీర్‌, కపుర్తలా, బదవాల్‌ పూర్‌, ఖదియాన్‌లలో శాసనోల్లంఘన ఉద్యమం ఉదృతంగా సాగించారు.
    ప్రముఖ విప్లవకారుడు భగత్‌ సింగ్‌ అసెంబ్లీలో బాంబులు విసిరాక,  ప్రభుత్వ దమనకాండకు భయపడి ఆయన కుటుంబీకులకు ఆశ్రయం కల్పించేందుకు పంజాబ్‌ ప్రజలు ఎవ్వరూ కూడా ముందుకు రాని భయానక వాతావరణంలో భగత్‌ సింగ్‌ కుటుంబీకులకు నెల రోజులపాటు మౌలానా తన ఇంట ఆశ్రయం కల్పించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్‌ జారీచేయగా, ఆ అరెస్టును తప్పించుకోడానికి అజ్ఞాతంలోకి వెళ్ళిన సుభాష్‌ చంద్రబోస్‌కు కూడా ఆనాడు మౌలానా తన ఇంట ఆశ్రయం కల్పించారు. పంజాబ్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వ దాష్టికాలకు అంతూపొంతూ లేకున్న వాతావరణంలో బోస్‌కు ఎక్కడా తలదాచుకోడానికి అవకాశం లభించలేదు. ఆజ్ఞాతంలో ఉన్న ఆయన పంజాబ్‌లోని లుధియానాకు వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న మౌలానా లుధియాని స్వయంగా సుభాష్‌ ను ఆహ్వానించి బ్రిటిష్‌ పోలీసుల కళ్ళుగప్పి ఆశ్రయమిచ్చారు. మౌలానా ఇంట వారం రోజులు గడిపిన బోస్‌ తిరిగి బెంగాల్‌ వెళ్పిపోయారు.(The Milli Gazette, Fortnightly Feb.16-28, 2013, Page No.23). ఈ విధంగా ఇతరులెవ్వరూ విప్లవకారులకు, జాతీయోద్యమకారులకు ఆశ్రయం, రక్షణ కల్పించడానికి ముందుకు రాని రోజుల్లో మౌలానా హబీబుర్రెహమాన్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఏమాత్రం భయపడకుండా సహచరులైన స్వాతంత్య్రసమరయోధులను ఆదుకున్నారు.
     1931లో మూడు వందల మంది ఆంగ్ల ప్రభుత్వ పోలీసు అధికారులు, పోలీసుల సమక్షంలో నిర్భయంగా లుధియానలోని ఐనీబినీరి అబిళీబి ఖబిరీశీరిఖి వద్ద భారత జాతీయ కాంగ్రెస్‌ పతాకావిష్కరణ గావించి మౌలానా ఆర్టెయ్యారు. భారత విభనన లక్ష్యంగా ప్రజలలో మతం పేరిట మానశిక విభనను తీసుకరావడం ప్రధాన బ్రిటిష్‌ ప్రభుత్వాధికారులు, విభజనకారులు లుధియానా రైల్వే స్టేషన్‌లో 'హిందూ వాటర్‌' 'ముస్లిం వాటర్‌' అంటూ రెండు వేర్వేరుగా మంచినీటి కుండలు ఏర్పాటుచేశారు. ఈ  ఏర్పాటు గురించి తెలుసుకున్న మౌలానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చర్యను తీవ్రగా నిరసిస్తూ జాతీయోద్యమకారులు, వేర్పాటువాదాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న తన సహచరులు, అనుచరులైన హిందూ-ముస్లిం-సిక్కు సోదరులను కలుపుకుని తాను స్వయంగా రైల్వేస్టేషన్‌ వెళ్ళి అక్కడ ప్రభుత్వాధికారులు ఏర్పాటు చేసిన ఆ వేర్వేరు మంచి నీటి కుండలను పగులగొట్టి ఆరెస్టుకు గురయ్యారు.
    భారత జాతీయ కాంగ్రెస్‌ బాటన నడిచినంత మాత్రాన కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలన్నింటినీ మౌలానా సమర్థించ లేదు.  ఆయా నిర్ణయాలను విశ్లేషించుకుని సమర్దించటం లేదా నిశితంగా విమర్శించటం అయన ప్రత్యేకత. విమర్శించటంలో ఆయన  ఎంతటివారైనా ఖాతరు చేసేవారు కారు. 1937లో జాతీయ కాంగ్రెస్‌ పంజాబ్‌లో అనుసరించిన విధానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహత్మా గాంధీని కూడా ఆయన ఎమాత్రం ఉపేక్షించలేదు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ తారాచంద్‌ ప్రస్తావిస్తూ ,  'Even loyalty to the Congress, unswerving faith in the leadership of Ganghiji and deep attachment to  Jawaharlal Nehru could not deter him from differing from them, speaking to them firmly and warning them of the evil consequences of what he consider to be wrong decisions.' అన్నారు. పంజాబ్‌లో సిక్కులను సంతృప్తి పర్చేందుకు  నెహ్రూ నివేదికను పరిగణలోనికి తీసుకోలేదని గాంధీజీని ఆయన చాలా నిశితంగా విమర్శించారు.  హిందూ-ముస్లిం ప్రజానీకం మధ్యన శాంతి-సామరస్యాలకు, ఐక్యతకు తగినంత వాతావరణం సృష్టించకుండానే, గాంధీజీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వెళ్ళారని మౌలానా విమర్శించారు.   
     సమాజంలోని ధనిక-పేద వర్గాల మధ్య నున్న అంతరాల గురించి మౌలానా ఆలోచించేవారు. బ్రిటిష్‌ ప్రభుత్వం సాగించిన జప్తుల వలన సర్వం కొల్పోయినా,  తనకున్న తానితో ఆశ్రితులను సంత్పప్తి పర్చుతూ, ప్రజలు ఈ దుస్థితి నుండి శాశ్వితంగా బయట పడాలని కోరుకున్నారు.  ఆర్దిక సమానత్వం సాధించటం ద్వారా మాత్రమే అన్ని రకాల అసమానతలను సమాప్తం చేయవచ్చన్నారు. సామ్యవాద వ్యవస్ద నిర్మించటం కోసం కృషి సల్పాలని కోరారు. ప్రస్తుత భారతీయ సమాజం ఎదుర్కోంటున్న రుగ్మతలకు సామ్యవాద సిద్ధాతం మాత్రమే ఔషధమని విశ్వసించారు. ఆసమానతలను అంతంచేసే సామ్యవాద వ్యవస్ధ నిర్మాణం కోసం రాజకీయ పార్టీలు పని చేయాలని ఆకాంక్షించారు. ధనికుల పెత్తనం సాగుతున్న ప్రస్తుత ఆంగ్ల ప్రభుత్వాన్ని నిర్మూలించాలన్నది తన ధ్యేయమని మౌలానా ప్రకటించారు. సామ్యవాద వ్యవస్ధ అభిమానించిన ఆయన కమ్యూనిస్టు పార్టీలో మాత్రం చేరలేదు.  ఇస్లాం మతం మూల సూత్రాలను ఎంతో శ్రద్ధతో పాటించే, మతాచారపరాయణుడైన మౌలానా సామాజిక సమస్యల పరిష్కారానికి మతాతీతంగా ఆలోచించారు.  1940లో జరిగిన ఆజాద్‌ ముస్లింల సమావేశంలో భారత విభజన, హిందూ-ముస్లింల ఐక్యతకు సంబంధించి తన అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించారు. భారత విభజనను వ్యతిరేకిస్తూ తయారైన ప్రతిపాదన తీర్మానంగా రూపుధరించేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు.
    జీవితపర్యంతం జాతీయవాదిగా కొనసాగిన మౌలానా నమ్మిన సిద్దాంతాల పట్ల నిబద్దతతో  నిలిచారు.  స్వజనుల నుండి, విమర్శలు వచ్చినా చలించలేదు. ఆయన నిర్మోహమాటి కావటంతో పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.  జయాపజయాలను లెక్కచేయకుండా ఓర్పు, సహనంతో సర్వం కొల్పోయినా ముందుకు సాగారు. భారత విభజన పరిణామాల ఫలితంగా, ఆ మహనీయుని కుటుంబం  శరణార్దుల శిబిరంలో శరణు పొందాల్సి వచ్చింది. పుట్టిపెరిగిన లూధియానాను పదలాల్సి వచ్చింది. చివరకు ఢిల్లీ వెళ్ళి అపరిచితుల గృహంలో తలదాచుకోవాల్పి వచ్చింది.ఈ దుష్పరిణామాలకు కలత చెందిన మౌలానా భార్య షఫాతున్నిసా ఎంతో కృంగిపోయారు.  '..ఇందుకోసమేనా? ..మనం అన్ని కష్టనష్టాలకోర్చింది? ఏమిటిదంతా?...మనం మన ఇంటికి ఎప్పుడు పొందాం? మన లూధియానకు ఎప్పుడు వెళ్ళిపోదాం...' అంటూ పదే పదే ప్రశ్నించే సతీమణిని ఓదార్చలేక ఆయన సతమతమై పోయారు. ఆనాటి చేదు జ్ఞాపకాలు మౌలానా హబీబుర్రెహమాన్‌ను చివరికంటా వెంటాడుతూనే ఉండిపోయాయి. చివరకు  ' His devotion to principle such as martyrs might envy.  He never deviated from his beliefs and stood by them firm as rock. He is a man of amazing courage and endurance.'  అంటూ శ్రీ తారాచంద్‌చే ప్రశంసలు పొందిన మౌలానా హబీబుర్రెహామాన్‌ 1956 సెప్టెంబర్‌ 2న కన్నుమూశారు.
===
From Syed Naseer Ahamed,

Friday, 30 August 2013

అష్ఫాఖుల్లా ఖాన్‌-రాంప్రసాద్‌ బిస్మిల్‌ స్నేహబంధం

అపూర్వం -ఆదర్శనీయం   అష్ఫాఖ్‌-బిస్మిల్‌ల  స్నేహబంధంభారత జాతీయోద్యమ చరిత్రలోని 'అగ్నియుగం' నాటి విప్లవ పోరాటయోధులు రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌ల మధ్య ఏర్పడిన స్నేహబంధం ఎంతో త్యాగపూరితమైంది. రాంప్రసాద్‌ బిస్మల్‌ 'హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌' నాయకుడు. అష్ఫాఖ్‌ ఖాన్‌ బిస్మిల్‌ ఆయన సహచరుడు. అష్ఫాఖ్‌ ఇస్లాం ధర్మానురక్తుడు. మతం మారిని వారిని శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్న వ్యక్తి రాంప్రసాద్‌ బిస్మిల్‌ అర్యసమాజీకుడు. మత ధర్మాలను బట్టి అష్ఫాక్‌-బిస్మిల్‌ల ధార్మిక బాటలు వేర్వేరుగా ఉన్నా బ్రిటీష్‌ పాలకుల కబంద హస్తాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న తిరుగులేని వారి సంకల్పం ఆ ఇరువురి బాటను ఏకం చేసింది. ఆ విధంగా ఏర్పడిన వారిరువురి స్నేహబంధం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అద్వితీయంగా వెలుగొంది ఆనాటికి - ఈనాటికి ఆదర్శనీయంగా నిలచింది.   ఈ స్నేహబంధం ఆనాడు ఎంత సంచలనం సృష్టించిందో, ఈ యోధుల గురించి బంధుమిత్రులు ఏమనుకున్నారో బిస్మిల్‌ స్వయంగా తన ఆత్మకథలో, 'ఒక పచ్చి ఆర్యసమాజికునికి, ఒక ముస్లిముకు మధ్య యిలా స్నేహం ఎలా కలిసింది? అని అంతా ముక్కుపై వేలేసుకునే వాళ్ళు. నేను ముహమ్మదీయులను శుద్ధి (హిందువులుగా మార్పిడి) చేస్తుండేవాడిని. ఆర్యసమాజ మందిరంలోనే నా నివాసం ఉండేది. కాని నీవీ విషయాలను వేటినీ కించిత్తయినా లేక్కచేయలేదు. నీవు ముహమ్మదీయుడివి కావడం చేత నా మిత్రులు కొందరు నిన్ను తిరస్కారభావంతో చూస్తుండేవారు. కానీ నీవు ధృఢ నిశ్చయంతో నిలిచావు. నన్ను కలుసుకోవడానికి నీవు ఆర్యసమాజ మందిరానికి వచ్చిపోతుండేవాడివి. హిందూ-ముస్లింల కలహాలు చెల రేగినప్పుడు విూ పేటలో అందరూ నిన్ను బాహటంగా దూషించేవారు. కానీ నీ వెప్పుడూ వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించలేదు', అని రాసుకున్నాడు. మాతృభూమి విముక్తికి సంబంధించిన అంశం ప్రధాన మైనప్పుడు హిందువైనా, ముస్లిమైనా ఒకే రకంగా స్పందిస్తారని, ఒకే రకంగా త్యాగాలకు సిద్ధపడతారని, ఈ సంసిద్ధత, త్యాగాలకు మతం ఏమాత్రం అడ్డంకి కానేరదని అష్ఫాఖ్‌ తన అపూర్వర నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో సాక్ష్యం పలికారు. 'చివరకు హిందువులు ముస్లిం లలో ఏదో తేడా ఉందనే ఆలోచనే నా హృదయం నుండి నిష్క్రమించ సాగింది. నీవు నా విూద ప్రగాఢ విశ్వాసం, అమిత ప్రీతి కలిగి ఉండే వాడివి', అని సనాతన సంప్రదాయానురక్తుడు, శుద్ధి సంఘం నేత రాంప్రసాద్‌ బిస్మిల్‌ స్వయంగా అష్ఫాఖుల్లా గురించి రాసుకున్నారు. ఈ స్నేఅపూర్వ హం రాంప్రసాద్‌ బిస్మిల్‌ కోసం ప్రాణత్యాగానికి కూడా అష్ఫాఖుల్లాను పురికొల్పింది. జాతీయోద్యమ చరిత్రలో ఉత్తేజ పూరితమైన 'కాకోరి రైలు సంఘటన' బిస్మిల్‌ నాయకత్వంలో జరిగింది. ఈ సంఘటనలో పాల్గొనడం అష్ఫాఖుల్లా ఖాన్‌కు ఇష్టం లేదు. బాల్య థలో ఉన్న విప్లవోద్యమానికి ఇది గొడ్డలిపెట్టు కాగలదని ఆయన తన సహచరులకు, నాయకుడు బిస్మిల్‌కు నచ్చచెప్పేందుకు విఫల ప్రయత్నం చేశాడు. అత్యధికుల అభిప్రాయాన్ని గౌరవించే ప్రజాస్వామిక వాది అఫ్ఫాఖుల్లా చివరకు ఉమ్మడి నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు. ఆ తరువాత జరిగిన కాకొరి రైలు సంఘటనలో ఆయన ప్రధాన పాత్రవహించాడు.ఈ సంఘటనలో పాల్గొన్న వారిలో అష్ఫాఖుల్లా తప్ప మిగిలిన వారంతా వెంటనే పోలీసులకు పట్టుబడగా, ఆఫ్ఫాఖ్‌ మాత్రం బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టి చాలా కాలం తరువాత అరెస్టు అయ్యాడు. అపాటికి ఈ కేసులో విప్లవకారుందరికి కఠిన శిక్షలను విధిస్తూ తీర్పులు వెలువడ్డాయి. ఆ తరువాత అందరి అప్పీళ్ళ తిరస్కరించబడి, పలు రకాల శిక్షలు ఖరారయ్యాయి. లండన్‌ లోని ప్రీవీకౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవడం మాత్రమే చివరకు మిగిలింది.   ఆ థలో అరెస్టయిన అష్ఫాఖుల్లా ఖాన్‌ తన ఆప్తమిత్రుడు, 'హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌' నాయకుడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ను ఉరిశిక్ష నుండి తప్పించ బూనుకున్నాడు. న్యాయవాదులతో సంప్రదించాడు. మిత్రుడితో మాట్లాడాడు. చివరకు నేరాన్ని మొత్తంగా తాను స్వీకరిస్తే బిస్మిల్‌ను కాపాడవచ్చని అభిప్రాయానికి వచ్చాడు. మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న విప్లవకారులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అప్పీలు చేసుకోవడం, క్షమాబిక్ష యాచించడం సరికాదన్నది అష్ఫాఖ్‌ అభిప్రాయం.ప్రీవీకౌన్సిల్‌కు అప్పీలు చేయడం అష్ఫాక్‌కు ఇష్టం లేకున్నా స్నేహితుడు  బిస్మిల్‌ కోరిక మేరకు సరేనన్నాడు. ఆ మేరకు కాకోరి రైలు సంఘటనకు తానే పూర్తిగా బాధ్యుడనని వివరిస్తూ, నేరాన్ని మొత్తాన్ని తన నెత్తిన వేసుకుంటూ ప్రీవికౌన్సిల్‌కు సమర్పించేందుకు అష్ఫాఖుల్లా ఖాన్‌ ప్రకటన పత్రం తయారు చేశాడు. ఆ అభ్యర్థన పత్రం చూసిన ఆయన న్యాయవాది కృపాశంకర్‌ హజేలా కంగారు పడిపోతూ ఆ విధంగా ప్రకటన చేసినట్టయితే ఆయనకు ఉరిశిక్ష ఖాయమని హెచ్చరించినా అష్ఫాఖ్‌ వినలేదు. మిత్రుడు, విప్లవోద్యమ నేత బిస్మిల్‌ కోసం బలికావడానికి సిద్ధపడిన ఆయన న్యాయవాది కృపాశంకర్‌ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఆ వినతి పత్రాన్ని నేరుగా ప్రీవీకౌన్సిల్‌కు పంపుతూ, చారిత్రాత్మక కాకోరి రైలు సంఘటన నేరభారాన్ని, ఆ నేర బాధ్యతను పూర్తిగా తాను స్వీకరిస్తూ ఒప్పుకోలు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తన న్యాయవాదికి మరింత వివరణ ఇస్తూ, 'ఈ మార్గం కంటక ప్రాయమైనప్పటికి, ఈనాడు దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఇక నేరం అంగీ కరించటం అంటారా? నా వరకు నేను నేరం అంగీకరించడానికి సిద్ధమే కాదు, అందరి నేరాలను నా నెత్తిన వేసుకోడానికి కూడా సిద్ధం,' అని కాకోరి రైలు సంఘటన నేరభారాన్నీ పూర్తిగా అష్ఫాఖుల్లా ఖాన్‌ తన నెత్తిన వేసుకున్నాడు. ఆ నేర ఒప్పుకోలు పత్రం  పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాది కృపాశంకర్‌ హజేలాతో అష్ఫాఖ్‌ మాట్లాడుతూ మిత్రుడి మంచిని  సర్వదా కోరుకునే స్నేహితుడిగా, నాయకుడి క్షేమాన్ని నిరంతరం ఆకాంక్షించే కార్యకర్తగా, విప్లవోద్యమం పట్ల నిజాయితి, నిబద్దత గల విప్లవకారుడిగా, వలస పాలకుల నుండి మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడిగా అఫ్ఫాఖ్‌ పలికిన పలుకులు ఈనాటికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.  అష్ఫాఖుల్లా ఖాన్‌ తన న్యాయవాదితో మాట్లాడుతూ, 'నేను ఎల్లప్పుడు సిపాయిని మాత్రమే. శ్రీ రాంప్రసాద్‌ బిస్మిల్‌ మా నాయకుడు.  ఆయన నిష్టగల దేశభక్తుడు. మంచి తెలివితేటలు గల వ్యక్తి. నా ప్రాణాలు ఆడ్డువేసి ఆయనను రక్షించుకోగలిగితే అది మా పార్టీకి, మా లక్ష్యాల సాధనకు ఎంతో మంచిదౌతుంది. నేను సిపాయిని మాత్రమే. ఆయన ఆలోచనలు తీరుతెన్నుల విషయంలో నేను ఆయనతో సరితూగలేను. ఆందువలన ఆయనను రక్షించుకోవాల్సి ఉంది ... భారత జాతీయ కాంగ్రెస్‌ ఎలాగైతే లక్ష్యసాధనకు తన మార్గాన్ని నిర్దేశించుకుందో అలాగే మేమూ దేశ స్వాతంత్య్రం కోసం మా మార్గాన్ని ఏర్పచు కున్నాం. అని అన్నాడు. అష్ఫాఖుల్లా ఖాన్‌ నిర్బంధంలో ఉన్నప్పుడు మతం ఆసరాతో అతడ్ని తమవైపు తిప్పుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఎన్నో విధాలుగా మభ్యపెట్టారు. 'రాంప్రసాద్‌ బిస్మిల్‌ ఒక హిందువు. ఆర్య సమాజీకుడు. దేశంలో హిందూ రాజ్యం నెలకొల్పడం వాళ్ళ ధ్యేయం. అది ముస్లింల ప్రయోజనాలకు పూర్తిగా విరుద్దమైనది. ఒక ముస్లింగా నీవు వారి మతతత్వాన్ని నిరసించి, ప్రభుత్వంతో సహకరించు, కాఫిర్లతో సహకరించడం మన మత సంప్రదాయాలకు పూర్తిగా విరుద్దం కాబట్టి ఒప్పుదల వాంగ్మూలం ఇచ్చి నీ ప్రాణాలను, అలాగే నీ మతం ప్రయోజనాలను కాపాడుకో', అంటూ ఆయనను తమ మార్గంలోకి తెచ్చుకునేందుకు చాలాసార్లు విఫలప్రయత్నాలు చేశారు.  అష్ఫాఖుల్లాను ఏలాగైనా లొంగదీసుకోవాలనుకున్న ఆ పోలీసు అధికారి మరింత తెలివిగా మాట్లాడుతూ, 'ఇదంతా హిందువుల కుట్ర. రాంప్రసాద్‌ బిస్మిల్‌ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడు. విూరు ముస్లిం అయిఉండి ఎలా మోసపోయారు?' అంటూ మతపరమైన ప్రశ్నలను సంధించాడు. ఆ ప్రశ్న, ఆ ప్రశ్నలోని విభజించి-పాలించు కుతంత్రం, అందులోని కుట్రను గ్రహించిన అష్ఫాఖ్‌  పోలీసు ఆధికారికి సూటిగా సమాధానమిస్తూ, 'రాంప్రసాద్‌ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడన్న విషయం అబద్దం. ఒకవేళ అది నిజమైతే, బ్రిటీష్‌ రాజ్యం కంటే హిందూ రాజ్యం మేలు కదా', అని అన్నాడు. అంతటితో ఆగకుండా ఈ కేసులో 'నేనొక్కడినే ముస్లిం కావడంతో నా బాధ్యత మరింత పెరిగింది. నేను ఏదైనా పొరపాటు చేశానా? ఆది ప్రధానంగా ముస్లింల విూద మా పఠాన్‌ జాతి జనుల విూద మాయని మచ్చగా మిగిలి పోతుంది. కనుక నన్ను గౌరవప్రదంగా మరణించనివ్వండి' అని స్పష్టం చేస్తూ అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేశాడు, చివరకు ఉరిశిక్షకు సిద్ధమయ్యాడు.   ఈ విధంగా అష్ఫాఖుల్లా ఖాన్‌ ఆదర్శప్రాయమైన స్నేహ బంధాన్ని, సమరయోధుని ధర్మాన్ని ప్రదర్శించాడు.  మహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు ఏర్పడిన మిత్రత్వం జాతి, మత, కుల ప్రాంతాలకు అతీతంగా ఉంటుందని ఆచరణాత్మకంగా రుజువు చేశాడు. ఈ ఇరువురిని వారి మిత్రులు, బంధువులు మతభ్రష్ఠులుగా నిందించారు. ఈ సందర్భంగా బిస్మిల్‌ను ఆయన స్నేహితులు హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలను బిస్మిల్‌  ప్రస్తావిస్తూ, 'మా బృందంలో తరచూ నీ గురించి చర్చ వచ్చేది. ఏమో నమ్ముతున్నావు ... మోసపోయేవు సుమా అని అనేవాళ్ళు ... కానీ నీవు నెగ్గావు', అని బిస్మిల్‌  అత్మకథలో అష్ఫాఖ్‌లోని నికార్సయిన నిజాయితీని స్వయంగా ప్రకటించాడు.  ఈ విషయాన్ని బిస్మిల్‌ మరింతతగా సుదృఢంచేస్తూ, 'నేను నీవు అనే తేడా లేకుండా పోయింది మన మధ్య, తరచూ నీవూ నేను ఒకే కంచంలో తిన్నాము', అన్నాడు. చివరివరకు మతాలకు అతీతంగా వ్యవహరించిన అష్ఫాక్‌-బిస్మిల్‌ మిత్రద్వయం మాతృభూమి విముక్తి పోరాటంలో కలసి మెలసి పాల్గొనటం మాత్రమే కాకుండా కంటక ప్రాయమైన ఆ మార్గంలో ఎదురైన అన్ని కష్ట నష్టాలతోపాటు చివరకు ఉరిశిక్షలను కూడా సంతోషంగా స్వీకరించి చిరస్మరణీయులయ్యారు. చివరి రోజుల్లో కూడా మత ప్రసక్తి లేకుండా భారతీయులంతా కలసిమెలసి ఉండాల్సిందిగా అష్ఫాఖుల్లా ఖాన్‌ ప్రజలను కోరారు. 1927 డిసెంబరు 19న ఆయనను ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాదు జైలులో ఉరి తీస్తారనగా, డిసెంబరు 16న  జైలు నుండి దేశవాసులను ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశాడు.  ఆ లేఖలో, 'భారతదేశ సోదరులారా మీరు ఏ మతానికి, సంప్రదాయానికి చెందిన వారైనా సరే, దేశసేవలో కృషిచేయండి. వృధాగా పరస్పరం కలహించకండి. అన్ని పనులూ ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు సాధనాలు. అలాంటప్పుడు ఈ వ్యర్థపు కోట్లాటలూ, కుమ్ములాటలు ఎందుకు? ఐకమత్యంతో దేశంలోని దొరతనాన్ని ఎదిరించండి. దేశాన్ని స్వతంత్రం చేయం ... చివరగా అందరికి నా సలాం. భారతదేశం స్వతంత్రమగుగాక. నా సోదరులు సుఖంగా ఉందురు గాక',  అంటూ  తన ఆకాంక్షను వ్యక్తంచేస్తూ ఆ అష్ఫాఖుల్లా ఖాన్‌ చారిత్రకమైన లేఖను ముగించాడు.

Monday, 11 March 2013

గాంధీజీ పిలుపుకు తొలుతగా స్పందించిన ఆంధ్రుడు
మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌
(1882-1973)

        సహాయనిరాకరణ-ఖిలాఫత్‌ ఉద్యమంలో భాగంగా  ఆంగ్ల ప్రభుత్వం ప్రసాదించిన పదవులను, ఉద్యోగాలను, బిరుదులను త్యజించాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు రాష్ట్రం నుండి తొలుతగా స్పందించిన యోధుడు మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌. కృష్ణా జిల్లా విజయవాడలోని సంపన్న జాగీద్దార్‌ కుటుంబంలో ఆయన 1882లో జన్మించారు. చిన్నతనం నుండి సేవాభావాన్ని అలవర్చుకున్న ఆయన అవసరార్ధుల మన్నన పొందారు. నిడారంబర జీవితాన్ని ఇష్టపడినఆయన జాగీద్దారిని కూడా పరిత్యజించారు. 
    గులాం మొహిద్దీన్‌ ఇటు భారత జాతీయ కాంగ్రెస్‌, అటు అఖిల భారత ముస్లింలీగ్‌లో సభ్యత్వం స్వీకరించారు. 1919లో ఆరంభమైన సహాయనిరాకరణ-ఖిలాఫత్‌ ఉద్యమంలో భాగంగా ఆంగ్ల ప్రభుత్వం అందచేసిన పదవులును వదులుకోవాల్సిందిగా మహాత్ముడు కోరారు. గులాం మొహిద్దీన్‌ తక్షణమే ఆ పిలుపుకు స్పందిస్తూ తాను నిర్వహిస్తున్న గౌరవ మేజిస్ట్రేటు పదవికి రాజీనామా చేసి, ఆంగ్ల ప్రభుత్వం ఇచ్చిన పదవిని త్యజించిన తొలి ఆంధ్రుడయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ స్వాతంత్య్రసమరయోదులు అయ్యదేవర కాళేశ్వరరావు పేర్కొంటూ, నా ముఖ్య మిత్రులైన మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ సాహెబుగారు మొదటి తరగతి గౌరవ మేజిస్ట్రేటుగ నుండిరి. నాతోపాటుగా తాను కూడా గౌరవ ఉద్యోగము వదలు కొనెదమని ప్రకటించిరి. అప్పుడు శ్రీమాన్‌ చక్రవర్తి రాజగోపాలచారి గారు కూడా యుండిరి. ఆంధ్ర దేశములో మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ దౌర్జన్యరహిత సహాయ నిరాకరణోద్యమము ననుసరించి శాసనసభ అభ్యర్థిత్వమును, మొదటి తరగతి గౌరవ మెజిస్ట్రేట్‌ పదవిని వదలుకొన్నవారము అప్పటికి మేమిద్దరమే. ఈ సంగతి గాంధీగారు ఆ సభలో గుమికూడిన వేలాది ప్రజల ముందు కరతాళధ్వనుల మధ్య ప్రకటించిరి. తమ 'యంగ్‌ ఇండియా' పత్రికలో కూడా వ్రాసిరి, అని పేర్కొన్నారు. (నా జీవిత కథ (నవ్యాంధ్రము), అయ్యదేవర కాళేశ్వరావు, పేజీ.291)
    మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ విజయవాడ ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమ కమిటికీ అధ్యకక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. సన్నిహిత మిత్రుడు అయ్యదేవరతో కలసి జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.1921లో విజయవాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు సంకల్పించిన ఆయన పట్టుబట్టి, అయ్యదేవరతో కలసి కలకత్తా వెళ్ళి సమావేశాల నిర్వహణకు మహాత్ముడి అనుమతి పొందారు. ఈ సమావేశాలలో మహాత్మాగాంధీ, అబ్బాస్‌ తయాబ్జీ, హాకీం అజ్మల్‌ఖాన్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, మహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ తదితర ప్రముఖులు విజయవాడకు విచ్చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సమావేశాల కోసం మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ సాహెబ్‌ తన ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. 

    ఈ విషయాన్ని అయ్యదేవర గాంధీజీకి తెలుపుతూ గులాం మొహద్దీన్‌ కాంగ్రెస్‌కు ఎంతో ఆర్ధిక సహాయం చేశారనగా, ఆ మాటకు మొహిద్దీన్‌ వెంటనే స్పందిస్తూ, తాను కాంగ్రెస్‌ కోసం ఖర్చు చేయలేదనడంతో అక్కడున్న నాయకులు ఆశ్చర్యపడ్డారట. అంతలోనే, తన సంపదను తాను దేశం కోసం మాత్రమే వ్యయం చేశానని మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ చెప్పడంతో నేతలంతా ఆనందిస్తూ గులాం సాహెబ్‌ను ఆనందించారట. ఆయన వితరణ, ఆతిథ్యాన్ని మరువని గాంధీజీ విజయవాడ నుండి ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా మొహిద్దీన్‌ సాబ్‌ ఏలా ఉన్నారు? అని ఆయన క్షేమసమాచారాలను కనుక్కొనేవారట. (ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, చరిత్రకారుడు యల్‌.వి.రమణ (విజయవాడ) కథనం).
    1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు. స్వయంగా గుర్రం మీద విజయవాడలోని వీధుల్లో తిరుగుతూ శాంతంగా, సామరస్యంగా ఉండమని అన్ని మతాల ప్రజానీకాన్ని కోరుతూ మత సామరస్యానికి విశేష కృషి సల్పారు. విజయవాడ పురపాలక సంఘం కౌన్సిలర్‌గా, ఉపాధ్యకక్షునిగా చాలా కాలం బాధ్యతలు నిర్వహించారు. చివరివరకు చలువ ఖద్దరు ధరించిన ఆయన 1973 మార్చి 13న విజయవాడలో 91వ ఏట కన్నుమూశారు.