Monday 5 September 2011

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (భారత జాతీయ సైన్యం) - ముస్లిం పోరాట యోధులు

పరాయి పాలకులను మాతృదేశం నుండి తరిమికొట్టేందుకు సాగిన సుదీర్ఘ స్వాతంత్య్రపోరాట చరిత్ర చివరిథలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (భారత జాతీయ సైన్యం) సాగించిన సాయుధ పోరాటంలో ఆది నుండి అంతం వరకు ముస్లిం పోరాట యోధులు చాలా ప్రధాన భాగస్వామ్యం వహించారు.
    1941లో జనవరిలో సుభాష్‌ చంద్రబోస్‌ ఆంగ్ల ప్రభుత్వ గూఢాచారి వ్యవస్థ కళ్ళుగప్పి మహమ్మద్‌ జియావుద్దీన్‌ అను మారు పేరుతో కలకత్తా నుండి తప్పుకుని సాగించిన 'గ్రేట్‌ ఎస్కేప్‌' ఏర్పాట్లను మియా అక్బర్‌ షా నిర్వహించగా, ఆ తరువాతి ప్రాణాంతక కాబూల్‌ ప్రయాణంలో అక్బర్‌షా ఏర్పాటు చేసిన సాయుధ పఠాన్‌ యువకులు నేతాజికి అంగరక్షకులుగా నడిచారు. ఆఫ్ఘాన్‌ గుండా పఠాన్‌ వేషంలో నేతాజీ ప్రయాణం సాగించాల్సి వచ్చినప్పుడు, ఆంగ్ల గూఢచారులు, వారి తొత్తులు ఏమాత్రం గుర్తు పట్టకుండా ఆబాద్‌ ఖాన్‌ నేతాజీకి ఆఫ్ఘాన్‌ పఠాన్‌ వ్యవహారసరళి,ఆచార సాంప్రదాయాలలో వారం రోజుల పాటు తన ఇంట రహాస్యంగా ప్రత్యేక శిక్షణ గరిపి ముందుకు పంపారు. 1941 మార్చి 27న  నేతాజీ బెర్లిన్‌ చేరేంతవరకు ప్రమాదకర పరిస్థితులలో ఆయనను కళ్ళల్లో పెట్టుకుని కాపాడి గమ్యం చేర్చడంలో ముస్లిం యోధులు తోడ్పడ్డారు.
    భారతదేశం వెలుపల నుండి వలసపాలకులను తరిమిగొట్టడానికి పోరుకు సిద్దపడిన  రాస్‌ బిహారి బోస్‌ మార్గదర్శకత్వంలో 1942 మార్చిలో జరిగిన సింగపూర్‌ సమావేశంలో పాల్గొన్న మేజర్‌ మహమ్మద్‌ జమాన్‌ ఖైని లాంటి వారు ఆ తరువాత 'భారత జాతీయ సైన్యం' కమాండర్‌ గా నేతాజీ తరువాతి స్థాయి అధికారిగా గణనీయ సేవలు అందించారు. ఆనాడు రాస్‌బిహారి, ప్రీతం సింగ్‌, కెప్టెన్‌ మాన్‌సింగ్‌ లాంటి నేతల నేతృత్వంలోని 'కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌', 'భారత జాతీయ సైన్యం'లలో  కెప్టెన్‌ మహమ్మద్‌ అక్రం, కల్నల్‌ యం.జడ్‌. ఖైని, కల్నల్‌ జి.క్యూ. జిలాని, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ యస్‌.యన్‌.హుసైన్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ ఇక్బాల్‌లు బాధ్యతలు నిర్వహించగా, ప్రముఖ ఉర్దూ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ రాసిన 'సారె జహంఁ సేఁ అచ్ఛా హిందూస్తాన్‌ హమార్‌' గీతాన్ని 'భారత జాతీయ సైన్యం' ప్రతి సందర్భంలో గానం చేస్తూ గౌరవించింది.
    1941 మార్చిలో స్వదేశాన్ని వీడి జర్మనీ చేరుకున్న నేతాజి జర్మనీలో 'స్వేచ్ఛా భారత కేంద్రం' (ఫ్రీ ఇండియా సెంటర్‌)  ప్రారంభించారు. ఆ సందర్భంగా నేతాజీకి పరిచయమైన హైదరాబాది అబిద్‌ హసన్‌ సప్రాని, 1941 నవంబర్‌లో నేతాజీ ఏర్పాటు చేసిన 'భారతీయ కమాండో దళం' శిక్షకుడిగా, ఆ తరువాత 'ఆజాద్‌ హింద్‌ రేడియో'లో నేతాజీ ప్రసంగాల సహాయకుడిగా  బాధ్యతలను నిర్వహించారు. భారత స్వాతంత్య్రోద్యమ సాహిత్య చరిత్రలో నినాదంగా నిలచిన 'జైహింద్‌' సుభాష్‌ పేరును కూడా మర్చిపోయేలా చేసిన 'నేతాజి' నామాన్ని  అబిద్‌ రూపొందించారు. అబిద్‌ హసన్‌ సప్రాని కృషివలన ఉనికిలోకి వచ్చిన 'జైహింద్‌' ఈనాటికి భారత దేశమంతటా ప్రతిధ్వనించడం అబిద్‌ సృజనాత్మకతకు తార్కాణం.
    జర్మనీ నుండి సుభాష్‌ చంద్రబోస్‌  తూర్పు ఆసియాకు  వచ్చేంత వరకు జర్మనీలో సాగిన కార్యక్రమాలన్నిటిలో అబిద్‌ హసన్‌ సప్రాని, ఎం.జడ్‌ కియాని లాంటి ముస్లిం యోధులు, మేధావులు ఆయనకు అమూల్యమైన తోడ్పాటు నిచ్చారు. ఆ తరువాతి కాలంలో అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాల నేపధ్యంలో విప్లవోద్యమాన్ని సాగిస్తున్న సంస్థలు, నాయకులు సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వం ఆకాంక్షిస్తున్నందున యూరప్‌ నుండి  నేతాజీ దృష్టి తూర్పు ఆసియా వైపుకు మళ్లింది.
    ఈ పరిస్థితులు ఇలా ఉండగా జపాన్‌ ప్రభుత్వాధినేతల పట్ల భారతీయ విప్లవోద్యమ నేతలల్లో ఏర్పడిన అభిప్రాయబేధాల కారణంగా తూర్పు అసియా ప్రాంతంలో జనరల్‌ మాన్‌సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన 'భారతీయ జాతీయ సైన్యం', 'కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌'లు 1942 డిసెంబర్‌ 29న రద్దయినట్టు జనరల్‌ మాన్‌సింగ్‌ ప్రకటించగా, విప్లవోద్యమ నేత రాస్‌ బిహరి బోస్‌ నేతృత్వంలో 1943 ఫిబ్రవరి 15న భారత జాతీయ సైన్యాన్ని పునర్‌వ్యవస్ధీకరించారు. ఆ సమయంలో భారత జాతీయ సైన్యం, దాని అనుబంధం సంస్థలను, కార్యకర్తలను, సైనికులకు మార్గదర్శకత్వం వహించేందుకు సుప్రీం మిలటరీ బ్యూరో సంచాలకులుగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ జె.కె.భోన్స్‌లే బాధ్యతలు స్వీకరించగా లెఫ్టినెంట్‌ మీర్జా ఇనాయత్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని, మేజర్‌ మతా-ఉల్‌-ముల్క్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ బుర్హానుద్దీన్‌, మేజర్‌ ఎ.డి జహంగీర్‌, మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌, లెఫ్టినెంట్‌ అల్లాయార్‌ ఖాన్‌, మేజర్‌ మహమ్మద్‌ రజాఖాన్‌, కెప్టెన్‌ ముంతాజ్‌ ఖాన్‌, ఎస్‌.ఓ ఇబ్రహీం, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెంట్‌  మీర్‌ రహమాన్‌ ఖాన్‌, మేజర్‌ రషీద్‌, లెఫ్టినెంట్‌  కల్నల్‌ అర్షద్‌లు ముందుకు వచ్చి ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని జనరల్‌ స్టాఫ్‌ ప్రధానాధికారిగా, సైనికుల శిక్షణాధికారిగా మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌,  రిఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమాండెంట్‌గా మేజర్‌ ముతా-ఉల్‌-ముల్క్‌, చరిత్ర-సంస్కృతి-పౌర సంబంధాల అధికారిగా మేజర్‌ ఏ.జడ్‌ జహంగీర్‌ ప్రధాన భూమికలను చాకచక్యంగా నిర్వర్తించారు.
    ఈ పరిణామాల నేపధ్యంలో యూరప్‌ నుండి తూర్పు ఆసియాకు వెళ్ళేందుకు సుభాష్‌ చంద్రబోస్‌ నిర్ణయించుకున్నారు. రావాల్సిందిగా కోరుతున్న విప్లవోద్యమ నేతల ఒత్తిడి మరింత పెరగడం, అవి ద్వితీయ ప్రపంచ సంగ్రామం జరుగుతున్న రోజులు కనుక జపాన్‌-జర్మనీల సహకారంతో బ్రిటన్‌ దాని మిత్రపక్షాల సైన్యాలతో పోరాడుతున్న సుభాష్‌ చంద్రబోస్‌ ఆసియాకు వెళ్ళడం ప్రాణాంతకం కావడంతో బ్రిటీష్‌ గూఢాచారి వ్యవస్థ డేగకళ్ళ నుండి తప్పించుకుని గమ్యస్థానం చేరడానికి నేతాజి రహస్యంగా జలాంతర్గమి ప్రయాణం తప్పలేదు. ఆ ప్రమాదకర పరిస్థితులలో 1943 ఫిబ్రవరి ఎనిమిదిన ఆరంభమైన చరిత్రాత్మక జలాంతర్గమి ప్రయాణంలో తన వెంట సాగడానికి అత్యంత సమర్ధుడు, విశ్వాసపాత్రుడగా పరగణించబడిన అబిద్‌ హసన్‌ సప్రానిని తన ఏకైక సహచరునిగా నేతాజీ ఎన్నుకున్నారు. శత్రు పక్షాల నిఘానీడల్లో మూడు మాసాలపాటు 25,600 కిలోమీటర్లు సాగిన అత్యంత్య భయానక, సాహసోపేత జలాంతర్గమి ప్రయాణంలో సుభాష్‌్‌కు అబిద్‌ హసన్‌ తోడుగా నిలిచి, భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పనలో ఆయనకు తోడ్పడి చరిత్ర సృష్టించారు.
    1943 మే 16న సుభాష్‌-అబిద్‌లు టోక్యో చేరుకున్నాక 1943 జూలై నాల్గున సింగపూర్‌లో జరిగిన సమావేశంలో తూర్పు ఆసియాలో సాగుతున్న భారత స్వాతంత్య్రోద్యమం నాయకత్వాన్ని సుభాష్‌ చంద్రబోస్‌ చేపట్టిన నేతాజీ 1943 అక్టోబర్‌ 23న 'ఆజాద్‌ హింద్‌' ప్రభుత్వాన్ని ప్రకటించారు. అ మరుక్షణమే మాతృభూమి విముక్తి కోసం, బ్రిటీష్‌ దాని మిత్రపక్షాల మీద యుద్ధం ప్రకటిస్తూ భారత జాతీయ సైన్యానికి 'చలో ఢిల్లీ' నినాదమిచ్చారు. భారత జాతీయ సైన్యం పతాకం మీద ప్రప్రధమ జాతీయవాదిగా ఖ్యాతిగడించిన మైసూరు పులి టిపూసుల్తాన్‌కు గుర్తుగా 'పులి' చిహ్నంను ఏర్పాటు చేశారు. భారత జాతీయ సైన్యంలో చేరమంటూ భారతీయులను కోరుతూ ఆజాద్‌ హింద్‌ రేడియా కేంద్రం ప్రసారం చేసిన ప్రతి కార్యక్రమంలో, మొగల్‌ చక్రవర్తి బహుదూర్‌ షా జఫర్‌ స్వయంగా రాసిన గీతంలోని 'స్వాతంత్య్ర పోరాటం జరుపుతున్న యోధులలో ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం లండన్‌ గుండెల్లో భారతీయుల ఖడ్గం దూసుకపోతూనే ఉంటుంది' అను చరణాలతో ఆలాపించడం అనవాయితయ్యింది.
    భారత జాతీయ సైన్యం సర్వసైన్యాధ్యకక్షులుగా, అజాద్‌ హింద్‌ ప్రభుత్వం అధినేతగా భాధ్యతలు స్వీకరించి సుభాష్‌ చంద్రబోస్‌ పలు ప్రధాన శాఖలకు సైన్యాధికారులుగా లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియానిలకు బాధ్యతలు అప్పగిస్తూ, బషీర్‌ అహమ్మద్‌ను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌ సాయుధ దళాల ప్రతినిధిగా నియక్తులయ్యారు. ఆ తరువాతి క్రమంలో భారత జాతీయ సైన్యానికి సంబంధించిన మూడు డివిజన్లకు గాను రెండిటికి మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ ఖాన్‌, ఎం.జడ్‌ కియానిలు ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టగా, రెజిమెంటల్‌ కమాండర్లుగా ఐ.జె కియాని, ఎస్‌. ఎం. హుసైన్‌, బుర్హానుద్దీన్‌, షౌకత్‌ అలీ మలిక్‌ తదితరులు నియక్తులయ్యారు. ఈ సందర్భంగా  సుభాష్‌ చంద్ర బోస్‌ ప్రత్యేక ఆసక్తితో ఏర్పాటు చేసిన 'ఝాన్సీరాణి రెజిమెంట్‌'లో ఎం.ఫాతిమా బీబి, సయ్యద్‌ ముంతాజ్‌, మెహరాజ్‌ బీబి, బషీరున్‌ బీబీ లాంటి నారీమణులు పలు బాధ్యతలు నిర్వహించారు.
    స్వతంత్ర భారత ప్రభుత్వం, సైన్యం ఏర్పడ్డాక  సాగుతున్న కార్యక్రమాలకు అన్నిరకాల సహాయసహకారాలు అందించాల్సిందిగా సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన విజ్ఞప్తి ప్రతిస్పందిస్తూ రంగూన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి హబీబ్‌ సాహెబ్‌ తన రాజప్రసాదం లాంటి భవంతిని, ఆయనకున్న పొలాలు-స్థలాలు, కోటిన్నర రూపాయల విలువ చేసే ఆభరణాలను ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు ధారాదత్తం చేసి కట్టుబట్టలతో నిల్చోగా ఆయనను 'సేవక్‌-ఏ-హింద్‌' పురస్కారంతో నేతాజీ సత్కరించారు. ఈ క్రమంలో బషీర్‌ సాహెబ్‌, నిజామి సాహెబ్‌ అను మరో ఇరువురు సంపన్నులు విడివిడిగా 50 లక్షల రూపాయలను నేతాజీకి అందించగా, మరో ముస్లిం వ్యాపారి తనకున్న మూడు ప్రింటింగ్‌ ప్రెస్‌లను, యావదాస్తిని 'నేతాజీ నిధి' పరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లా వేపాడు (ప్రస్తుతం) నివాసి షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ అతి కష్టం మీద కూడపెట్టుకున్న 20వేల రూపాయలను స్వయంగా 'నేతాజి నిధి'కి అప్పగించి, రైఫిల్‌మన్‌గా భారత జాతీయ సైన్యంలో చేరి సేవలందచేశారు.
    1944 ఫిబ్రవరిలో భారత దేశాన్ని విముక్తం చేయడానికి బ్రిటన్‌ మీద యుద్ధాన్ని ప్రకటించిన భారత జాతీయ సైన్యాన్ని వివిధ విభాగాలు, బ్రిగేడ్‌లుగా ఏర్పాటు చేశారు. ఆ బ్రిగేడ్‌లకు లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిరి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ బుర్హానుద్దీన్‌ తదితరులను సైన్యాధికారులగా నియమించారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సాయుధ దళాల ప్రధానాధికారిగా మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టగా కల్నల్‌ యం.జడ్‌ కియాని, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిరి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌ ఖాన్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హబీబుర్‌ రెహమాన్‌ తదితరులతో కూడిన 'కౌన్సిల్‌ ఆఫ్‌ వార్‌' ఏర్పాటయ్యింది.
     'చలో ఢిల్లీ' పిలుపును సాకారం చేయడానికి అరకాన్‌ యుద్దరంగంలో తొలిసారిగా  కల్నల్‌ ఎస్‌.యం మలిక్‌ నేతృత్వంలోని భారతీయ జాతీయ సైన్యం బ్రిటీష్‌ సైన్యాలను మట్టికరిపించి మాతృభూమి మీద అడుగు పెట్టి మణిపూర్‌లోని మొయిరాంగ్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ఆ తరువాత భారత జాతీయ సైన్యంలోని రెండు డివిజన్‌లకు విడివిడిగా నేతృత్వం వహిస్తున్న కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ జనరల్‌ ఎం.జడ్‌ కియానిలో ప్రళయకాళరుద్రుల్లా ముందుకు దూసుకు పోతున్న భారత జాతీయ సైనికులను ఉత్సాహపర్చుతూ ఇంఫాలా, కోహిమాల వైపు దృష్టి సారించారు.  ఈ ప్రాంతాల మీద పట్టుకోసం ఇరు పక్షాల మధ్య సుమారు ఐదు మాసాలు భీకర సమరం సాగింది. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోరాటాలలో మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ బాధ్యతలు నిర్వహించగా కల్నల్‌ యం.జడ్‌ కియాని, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిరి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌ ఖాన్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హబీబుర్‌ రెహమాన్‌, కల్నల్‌ ఇనాయత్‌ కియాని, కల్నల్‌ మున్వర్‌ హుసైన్‌, కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, కల్నల్‌ బుర్హానుద్దీన్‌, లెఫ్టినెంట్‌ నజీర్‌ అహమ్మద్‌, కల్నల్‌ మలిక్‌, మేజర్‌ మహబూబ్‌ అద్వితీయమైన ప్రతిభతోపాటుగా ప్రాణాంతక పరిస్థితులలో కూడా శత్రువు మీద దాడులు చేయడంలో దృఢసంకల్పాన్ని ప్రదర్శించారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లోని వివిధ శాఖలలో అధికారులుగా బాధ్యతలను  నిర్వహించిన యోధులలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన నక్కి అహ్మద్‌ చౌదరి, అష్రాఫ్‌ మండల్‌, అమీర్‌ హయత్‌, అబ్దుల్‌ రజాఖ్‌, ఆఖ్తర్‌ అలీ, మహమ్మద్‌ అలీషా, అటా మహమ్మద్‌, అహమ్మద్‌ ఖాన్‌, ఎ.కె. మీర్జా, అబూ ఖాన్‌, యస్‌. అఖ్తర్‌ అలీ, అహమ్మదుల్లా, అబ్దుర్‌ రహమాన్‌ ఖాన్‌ లాంటి వారున్నారు. ఈ క్రమంలో యుద్ధరంగంలో  చిట్టచివరివరకు శత్రువుతో పోరాడిన, తమ ప్రాణాలను అడ్డువేసి శత్రువును నిలువరించిన పలువురు యోధులలో హకీం అలీ, మహమ్మద్‌ హసన్‌, అబ్దులా ఖాన్‌, యాసిన్‌ ఖాన్‌, అబ్దుల్‌ మన్నాన్‌, ఖాన్‌ ముహమ్మద్‌ లాంటి వారు స్వయంగా నేతాజీచే ప్రసంశించబడి 'వీర్‌-యే-హింద్‌' 'సర్దార్‌-యే-జంగ్‌', 'తంగాహ్‌ా-యే-బహదూరి', 'శత్రునాశ్‌' లాంటి గౌరవ పురస్కారాలు పొందారు.   
    చరిత్ర సృష్టించిన ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లింలూ భారీ సంఖ్య భాగస్వాములయ్యారు. మన రాష్ట్రం నుండి అబిద్‌ హసన్‌ సప్రానితోపాటుగా ఖమురుల్‌ ఇస్లాం, తాజుద్దీన్‌ గౌస్‌, హైదరాబాద్‌ చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ (వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీ) యజమాని కుమారుడు అలీ సుల్తాన్‌ కూడా భారత జాతీయ సైన్యంలో పనిచేశారు. హైదరాబాదు సంస్థానానికి చెందిన షరీఫుద్దీన్‌, అబ్దుల్‌ సయీద్‌ ఉస్మాని, అబ్దుల్‌ లతీఫ్‌, ఇమాముద్దీన్‌, ముహమ్మద్‌ ఖాన్‌ లాంటి పలువురు నేతాజీ బాటలో నిర్భయంగా నడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వేపాడు గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌, ప్రకాశం జిల్లా దర్శి తాలూకా చెందిన షేక్‌ బాదుషా, చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన యస్‌.అబ్దుల్‌ అలీ,చిత్తూరు జిల్లాకు చెందిన మహమ్మద్‌ అఫ్జల్‌ సాహెబ్‌, పుంగనూరుకు చెందిన పి.పి.మహమ్మద్‌ ఇబ్రహీం, కడపజిల్లా రాయచోటికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌, పశ్చిమగోదావరి జిల్లా తణుకు చెందిన షేక్‌ అహమ్మద్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పోరాటాలలో భాగస్వాములయ్యారు.
    ఇంఫాలా-కోహిమాలను ఆక్రమించి అస్సాంలోకి అడుగుపెట్టాలని ముందుకు సాగుతున్న భారత జాతీయ సైన్యానికి ఒకవైపున ప్రకృతి మరోవైపున ఆహారం, ఆయుధాలు, రవాణా తదిరల అవసరాల తీవ్ర కొరత దెబ్బతీసింది. ఈ లోగా భారీ సైనిక బలగాలను సమకూర్చుకున్న బ్రిటన్‌ దాని మిత్ర పక్షాల సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది. బ్రిటీష్‌ వైమానిక దాడుల నుండి భారతీయ జాతీయ సైనికులకు, జపాన్‌ సేనల రక్షణ కరువయ్యింది. పర్వత-అటవీ ప్రాంతాలలో ఎదురవుతున్న పూర&ఇత ఆనారోగ్య పరిస్థితులు భారత జాతీయ సైన్యాన్ని కుంగదీస్తుండగా ఒకవైపున కుండపోతగా వర్షం, మరోవైపున వైమానిక దాడులు, విరామం లేకుండా కురుస్తున్న శత్రువు తుపాకి గుండ్లకు ఎదురొడ్డి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధులు పోరాడసాగారు.
    ఆ తరుణంలో భారత జాతీయ సైన్యానికి అరకొరగా నైనా ఆర్థిక-ఆయుధ మద్దత్తు ఇస్తున్న జపాన్‌ దారుణంగా దెబ్బతిన్నది. మరోవైపున జర్మనీ కుప్పకూలింది. బ్రిటన్‌-ఆమెరికాలు పక్షాలు విజయం సాధించాయి. ఆ కారణంగా 1945 ఆగస్టు 15న జపాన్‌ తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేయగా భారత జాతీయ సైన్యం కూడా యుద్దరంగం నుండి తప్పుకోవాల్సి రావడంతో  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ యుద్దరంగం నుండి తప్పుకుని రష్యాకు బయలుదేరాలనుకున్నారు. ఆ ప్రయాణంలో తొలుత ఇతర అధికారులతోపాటుగా మేజర్‌ అబిద్‌ హసన్‌ సప్రాని, కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ తదితరులు సిద్దంకాగా, చివరకు ఆగస్టు 18న కల్నల్‌ హబీబ్‌తో కలసి నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ బాంబర్‌ విమానంలో బయలుదేరారు. ఆకాశంలోకి ఎగిరిన ఆ విమానం ఫోర్‌మొసా ద్వీపంలో కూలిపోవడంతో తీవ్రంగా గాయపడిన సుభాష్‌ చంద్రబోస్‌ ఆగస్టు 19న కన్నుమూశారు. ఆయనతోపాటు ప్రయాణించిన కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ చికిత్స అనంతరం బతికి బయటపడ్డారు. ఆ దుర్భర క్షణాలలో 'హబీబ్‌, నాకు తుది ఘడియలు సమీపించాయి. జీవితాంతం నేను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాను. నేను నా దేశ స్వాతంత్య్రం కోసం మరణిస్తున్నాను. భారత స్వాతంత్య్ర పోరాటం సాగించమని నా ప్రజలకు తెలియజెయ్యి. త్వరలోనే భారత దేశం విముక్తి చెందుతుంది' అని సుభాష్‌ చంద్రబోస్‌ కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ ద్వారా భారతీయులకు తన చివరి సందేశం పంపారు.
    జపాన్‌, భారత జాతీయ సైన్యం ఆధీనంలో ఉన్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఆంగ్ల ప్రభుత్వం భారత సైనికులను, అధికారులను వివిధ ప్రాంతాల నుండి అరెస్టు చేసి, శిక్షలు విధించింది, కొన్ని చోట్ల కాల్చి చంపింది. అసఖ్యాకులను ఇండియాకు తరలించింది. ఆ క్రమంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధుడు రషీద్‌ అలీకి ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించగా భారత దేశంలో నిరసన వెల్లువెత్తింది. దానికి తోడు మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌, కల్నల్‌  ప్రేమ్‌ కుమార్‌ సహగల్‌, కల్నల్‌ ధిల్లాన్‌ మీద 'దేశద్రోహం' నేరారోపణలు చేసి సైనిక విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్భందించడంతో భారతదేశమంతా అట్టుడికినట్టయ్యింది. భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షలు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తగు చర్యలు తీసుకుని ఆసఫ్‌ అలీ, పండిట్‌ నెహ్రూ లాంటి ప్రముఖులతో 'డిఫెన్స్‌ కౌన్సిల్‌' ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ముస్లిం లీగ్‌ నాయకుడు మహమ్మద్‌ అలీ జిన్నా స్వయంగా వచ్చి మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ను కలసి ఆయన పక్షంగా మాత్రమే న్యాయస్థాంలో వాదిస్తానని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, 'స్వాతంత్య్ర సమరంలో మేం భుజం భుజం కలిపి పోరాడాం. మా నాయకత్వం స్ఫూర్తితో మా కామ్రేడ్స్‌ యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు వదిలారు. నిలబడినా, నేలకూలినా కలిసే ఉంటాం', అని స్పష్టం చేసిన షా నవాజ్‌ ఖాన్‌ మతం పేరుతో మనుషులను వేరేచేసే ప్రయత్నాలను వమ్ముచేశారు.
    భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అద్భుత ఘట్టాన్ని సృష్టించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియా నుండి జర్మనీకి బయలుదేరిన ప్రయాణంలో మియా అక్బర్‌ షా తోడుకాగా, ఆ తరువాత ప్రమాదకరంగా సాగిన జలాంతర్గమి ప్రయాణంలో నేతాజీ వెంట మేజర్‌ అబిద్‌ హసన్‌ సప్రాని ఉన్నారు. బ్రిటన్‌ దాని మిత్రపక్షాల మీద సాగిన యుధ్దంలో అన్నివిధాల మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ జనరల్‌ మమ్మద్‌ జమాన్‌ ఖియాని, కల్నల్‌ మల్లిక్‌ లాంటి యోధులు సుభాష్‌ వెంట సాగారు. చివరకు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతిమ విమాన ప్రయాణంలో కూడా ఆయన వెంటనున్న వ్యక్తి, భారతీయులకు ఆయన చివరి సందేశాన్ని అందించిన కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ వరకు ముస్లిం పోరాట యోధులు మాతృభూమి విముక్తి పోరాటంలో ప్రధాన భాగస్వామ్యం వహించడం ముస్లిం సమాజం గర్వించదగిన చారిత్రక విశేషం.

భారత స్వాతంత్య్రోద్యమం ; ముస్లిం మహిళలు

భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఈ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు శతాబ్దంపైగా సాగిన ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకోన్ముఖంగా ఆత్మార్పణలకు పోటీపడటం అపూర్వం. లక్షలాది మంది ఒకే నినాదం, ఒకే లక్ష్యంతో ఒకే మాటగా ఒకేబాటగా ముందుకు సాగటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన.
ఈ పోరాటానికి భారతదేశపు అతిపెద్ద అల్పసంఖ్యాకవర్గమైన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. ముస్లిమేతర సాంఘిక జనసమూహాలతో మమేకమై స్వాతంత్య్రసమరంలో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన బలిదానాలతో  భారతీయ ముస్లింలు  పునీతులయ్యారు. అయినప్పటికీ ముస్లిం సమాజం త్యాగమయ చరిత్ర పలు కారణాల మూలంగా మరుగున పడిపోయింది.
 బ్రిటీష్‌ పాలకులు తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు  విభజించు-పాలించు  కుటిల నీతిని అమలుపర్చి భారతీయులను  మతం పేరుతో  హిందువులు- ముస్లింలుగా విభజించటంలో కృతకృత్యులయ్యారు.  ఆ తరువాత భారత విభజనకు దారితీసిన పరిస్థితులు, ఆ సందర్భంగా జరిగిన దారుణాలు, పొరుగుదేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌తో జరిగిన కయ్యాలు, యుద్ధాలు, వివాదాలు స్వాతంత్య్రోద్యమ కాలంనాటి హిందూ - ముస్లింల ఐక్యతకు చిచ్చుపెట్టాయి. భారత విభజనానంతర పరిణామాల వలన అపరాధ భావనకు గురిచేయబడిన ముస్లిం సమాజం సుషుప్తావస్థలోకి నిష్క్రమించింది. ఆ తరువాత వివిధ కారణాల మూలంగా తరచుగా సాగిన మత కలహాలు మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య మానసిక విభజనకు కారణమయ్యాయి.
    ప్రజల మత మనోభావాలను రెచ్చగొట్టి మతం పేరుతో మనుషులను చీల్చి, రాజకీయ ప్రయోజనాలను సాధించదలచిన మతోన్మాద రాజకీయశక్తులు, వ్యక్తులు ఈ చీలికను అగాధంగా మార్చాయి. పర్యవసానంగా  బ్రిటీషర్ల బానిసత్వం నుండి మాతృభూమిని విముక్తం చేసేందుకు సాగిన సుదీర్ఘ పోరాటచరిత్రలో ముస్లిం సమాజం త్యాగాలు మరుగున పడిపోయాయి.
ప్రజలకు చేరువకాని సమాచారం
చరిత్ర గ్రంథాలలో ముస్లింలు చాలా వరకు కన్పించరు. ఒకరిద్దరు కన్పించినా అనన్య సామాన్యమైన వారి త్యాగాలు, అతి సాధారణ స్థాయి వివరణలతో వర్ణనలతో సరిపెట్టబడ్డాయి. ప్రాచుర్యంలో ఉన్న చరిత్ర గ్రంథాలలో ముస్లింల వీరోచిత గాధలు సరైన స్థానం పొందలేకపోయాయి.  ఆయా కథనాలు సామాన్య చరిత్ర గ్రంథాలలోగాని, పాఠ్య పుస్తకాలలోగాని చోటు చేసుకోలేదు. ఫలితంగా భవిష్యత్తు తరాలకు అమూల్య సమాచారం అందకుండా పోయింది.
    సామాన్య చరిత్ర  గ్రంథాల ద్వారా  తేలిగ్గా సమాచారం లభించే అవకాశం లేనందున, కళా రూపాలకు, సాహిత్య ప్రక్రియలకు, ప్రచార మాధ్యమాలకు ముస్లింల శ్లాఘనీయ త్యాగ చరితలు కథా వస్తువు కాలేకపోయాయి. ఆ కారణంగా ముస్లింల త్యాగాలు, ఆనాటి వీరోచిత పోరాట ఘట్టాలు జనబాహుళ్యంలోకి  వెళ్ళకపోవటంతో ఆ తరువాతి తరాలకు ఆ విషయాలు అందలేదు. ఈ పరిణామాలే భారతదేశంలోని హిందూ- ముస్లిం జనసమూహాల మధ్య సద్భావనకు, సదవగాహనకు అటంకంగా మారి క్రమక్రమంగా ఆయా జనసముదాయాల మధ్యన మానసిక ఎడం ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యాయి.  ఈ  అగాధాన్ని మరింత పెంచి ఒక సాంఘిక  జనసమూహానికి తామే ఏకైక ప్రతినిధులుగా ప్రకటించుకుని రాజ్యమేలాలని ఆశిస్తున్న శక్తులు-వ్యక్తులు ఈ అవాంఛనీయ వాతావరణాన్ని వినియోగించుకుంటున్నాయి.
పురుషులకు దీటుగా  మహిళలు
    భారత స్వాతంత్య్ర సమరోజ్వల చరిత్రలో ముస్లిం మహిళలు కూడా పురుషులతో దీటుగా తమదైన వీరోచిత పాత్ర నిర్వహించారు. ఆ త్యాగాలు కూడా పలు కారణాల మూలంగా మరుగున పడిపోయాయి. మతపరమైన ఆచార సంప్రదాయాల పట్ల ముస్లిం మహిళలలో ఉన్న కట్టుబాటు,  ముస్లిం మహిళలు అనుసరించే పర్దా పద్దతి వారిని గడప దాటనివ్వవన్న సాధారణ అపోహల మూలంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్ర వైపు అటు చరిత్రకారులు గాని ఇటు సామాన్య ప్రజానీకంగాని  దృష్టి సారించటమే గగనమైపోయింది.  అందువలన చరిత్రకారుల అన్వేషణకు స్వాతంత్య్రోద్యమంలో  ముస్లిం మహిళల పాత్ర చాలా వరకు వస్తువు కాలేకపోయింది. ఈ మేరకు  విముక్తి పోరాటంలో ముస్లిం మహిళల అరుదైన పాత్ర చరిత్ర పుటలలో బందీగా మిగిలిపోయింది.
     కాని మాతృభూమి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ముస్లిం మహిళలు ఆత్మబలిదానానికి సిద్ధపడిన దృష్టాంతరాలున్నాయి. విముక్తి పోరాట మైదానంలో శత్రువును సవాల్‌ చేసిన వీర వనితల చరిత్రలున్నాయి. సాహసోపేత సంఘటనలున్నాయి. ఆ సంఘటనలన్ని చరిత్ర అట్టడుగు పొరల నుండి బయటపడలేక పోయాయి.
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో...
    ప్రథమ స్వాతంత్రసమరంలో ప్రధాన పాత్ర వహించిన ముస్లిం సమాజానికి చెందిన స్త్రీలు తమ అపూర్వ త్యాగాలతో, ఆత్మార్పణలతో చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. అటువంటి వారిలో ప్రముఖులు అవధ్‌రాణి బేగం హజరత్‌ మహాల్‌ అగ్రగామి. బ్రిటీష్‌ పాలకులు కుయుక్తులతో ఆమె భర్త నవాబ్‌ వాజిద్‌ అలీషాను అరెస్టు చేసి అవధ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాతృభూమి పరుల పాలవడంతో ఆగ్రహించిన ఆమె ప్రజల అండదండలతో బ్రిటీష్‌ సైన్యంపై విరుచుకుపడి తిరిగి తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. పదమూడు సంవత్సరాల తన బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకటించి అతని సంరక్షకురాలిగా బాధ్యతలు చేపట్టారు. స్వదేశీ పాలకులను, ప్రముఖులను ప్రజలను ఐక్యపర్చారు. పరిపాలనలో హిందూ-ముస్లింలకు సమాన స్థాయి కల్పించారు. బ్రిటీష్‌ సైనికదళాల పడగ నీడలో కూడా ఎంతో సాహసంతో 14 మాసాల పాటు బ్రిటీష్‌ వలస పాలకుల ఎత్తులను చిత్తుచేస్తూ, సమర్థ్ధవంతమైన పాలన సాగించారు. బేగంపై కత్తి గట్టిన బ్రిటీష్‌ పాలకులు అవధ్‌ను అపార సైనిక బలగాలతో ముట్టడించినా, ఏమాత్రం అధైర్యపడక ఆమె స్వయంగా రణరంగ ప్రవేశం చేసి, తన సైనిక దళాలను ముందుకు నడిపి వీరోచితంగా పోరాడారు. భారీ సంఖ్యతో చుట్టుముట్టిన బ్రిటీష్‌ సైనికమూకలను ఎదుర్కొనటం కష్టతరమైన తరుణంలో, తిరిగి దాడి చేసేందుకు తాత్కాలికంగా యుద్ధరంగం నుండి వైదొలిగి  నేపాల్‌ పర్వతాల్లోకి నిష్క్రమించారు. ఆ అడవుల్లో కాన్పూరు ప్రభువు నానాసాహెబ్‌, మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షా లాంటి యోధులను కలసి ఆంగ్లేయు విూద పోరు సాగించేందుకు తన బలగాలను మళ్ళీ సమీకరిస్తూ, 1879లో నేపాల్‌ అడవుల్లో సామాన్య మహిళగా కన్నుమూశారు.
    ప్రథమ స్వాతంత్య్ర సమరంలో బేగం హజరత్‌ మహాల్‌  బాటన నడిచిన మహిళలు పలువురున్నారు.  ఆనాటి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువును మట్టు పెట్టేందుకు కదనరంగానికి కదలిన వారిలో బేగం అజీజున్‌ ఒకరు. మాతృభూమి పట్ల అపార ప్రేమాభిమానాలు గల ఆమె ప్రభుభక్తి పరాయణురాలు. కాన్పూరు అధినేత నానాసాహెబ్‌ తిరుగుబాటు శంఖారావాన్ని పూరించగానే నానాసాహెబ్‌ పక్షాన ఆమె కూడా యుద్ధరంగ ప్రవేశం చేశారు. స్వయంగా శత్రుసైన్యాలను ఎదుర్కొన్నారు. సైనిక పటాలాలను, గూఢచారి దళాలను, ఆయుధాలు, ఆహారం అందించే బృందాలను నేర్పుతో ఏర్పాటుచేసి నానాసాహెబ్‌ పోరుకు ఎంతగానో తోడ్పడ్డారు. చివరి వరకు పోరాడుతూ యుద్ధభూమిలో గాయపడి శత్రువు చేత చిక్కారు. శత్రువు క్షమాభిక్ష ప్రకటించినా, తనకు ప్రాణం కంటే మాతృభూమి విముక్తికై సాగుతున్న పోరాటం ప్రధానమని ప్రకటిస్తూ, బ్రిటీష్‌ తుపాకి గుండ్లకు ఎదురు నిలిచి వీరమరణం పొందారు.
    అజీజున్‌ మార్గాన సాగిన మరొకరు 60 సంవత్సరాల అనామిక. ఆమె పేరేమిటో తెలియదు. ఆమె ఎల్లవేళల ధరించే పచ్చరంగు దుస్తుల వలన ఆమె పచ్చరంగు దుస్తుల మహిళగా ఖ్యాతిగాంచారు. గెరిల్లా పోరాటం సాగించిన ఆమె బ్రిటీష్‌ సైనికదళాలలో భయోత్పాతం సృష్టించారు. గాయపడిన తరువాత గాని పట్టుబడని ఆమెను అంబాలాలో గల బ్రిటీషు సైనిక స్థావరానికి పంపారు. ఆమెను అంబాల పంపుతూ, ఈ వృద్ధురాలు బహు ప్రమాదకారి...జాగ్రత్త, అంటూ అక్కడి అధికారులను హెచ్చరిస్తూ ప్రత్యేకంగా లేఖ రాసి, ముందు జాగ్రత్తల గురించి  ఆంబాలలోని సైనికాధికారులను హెచ్చరించారంటే ఆ పచ్చదుస్తుల మహిళ ఎంతటి ఘటికురాలో మనం ఊహించవచ్చు.
    ఈ విధంగా శత్రువును సాయుధంగా ఎదుర్కొన్న మహిళలు, సాయుధ తిరుగుబాటు దళాలను ప్రోత్సహించిన వారు, ఆశ్రయం కల్పించి ఆదుకున్న మహిళలు ఎందరో ఉన్నారు.  ఈ కోవలో మాతృదేశ విముక్తి కోసం ఉరిని కూడా  లెక్కచేయని సాహసి హబీబా బేగం,  ఝూన్సీ రాణి వెన్నంటి నిలచి పోరాడి ప్రాణాలర్పించిన ముందర్‌, బ్రిటీషు సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న ధైర్యశాలి బేగం రహిమా, తిరుగుబాటు యోధుల క్ష్షేమం కోరుతూ సజీవదహనమైన అస్గరి బేగం, సాయుధంగా ఆంగ్ల సైన్యాలను  నిలువరించిన బేగం జవిూలా, కత్తిపట్టి కదనరంగాన శతృవును సవాల్‌ చేసిన సాహసి బేగం ఉమ్‌ద్దా తదితరులు ఎందరో ఉన్నారు.
    చరిత్ర నమోదు ప్రకారం ఆనాడు ఇతర సాంఘిక జనసముదాల తోపాటుగా వందలాది ముస్లిం మహిళలు కాల్చి వేయబడ్డారు. సజీవ దహనమాయ్యారు. ఉరితీయబడ్డారు. అవమానాలకు, అత్యాచారాలకు గురయ్యారు. ఈ మేరకు ఆ సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే, ఆ వీరనారీమణుల త్యాగాలు ఎంతటి మహత్తరమైనవో మనం అర్థ్ధం చేసుకోవచ్చు.
జాతీయోద్యమంలో....
    ప్రథమ స్వాతంత్య్రసమరం రగిల్చిన స్వాతంత్య్ర కాంక్ష లక్షలాది మహిళలను స్వాతంత్య్రోద్యమం వైపు నడిపింది. పూర్వీకుల అసమాన పోరాటాలను వారసత్వంగా స్వీకరించిన ముస్లిం మహిళలు 1906 నాటి స్వదేశీ ఉద్యమంతో ఆరంభమై  ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా పెద్ద సంఖ్యలో జాతీయోద్యమంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఖిలాఫత్‌ కమిటీ, జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, విదేశీవస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం లాంటి పలు కార్యక్రమాలలో బృహత్తర పాత్ర నిర్వహించారు.
    బ్రిటీష్‌ పాలకుల దమననీతి, నిర్బంధాలకు భీతిల్లకుండా జాతీయోద్యమబాటలో నడిచిన స్త్రీలలో బీబీ అమ్మకు తొలి స్థానం లభించింది. ఆమె అసలు పేరు ఆబాదీ బానో బేగం కాగా బీబీ అమ్మగా ఆమె చిరస్మరణీయ ఖ్యాతి గడించారు. అనితర సాధ్యమైన సాహసంతో, అద్భుతమైన ప్రసంగాలతో, ఆదర్శవంతమైన నేతృత్వంతో ఖిలాఫత్‌ ఉద్యమం కోసం దేశమంతా తిరిగి ఆమె నిధులను సమకూర్చారు. ఈ నిధులే భారత పర్యటన గావించిన గాంధీజీకి ఉపయోగపడ్డాయి. ఈ దేశపు కుక్కలు పిల్లులు కూడ బ్రిటీష్‌ బానిస బంధనాలలో ఉండడానికి వీలులేదని గర్జించిన ఆమె హిందూ-ముస్లింల ఐక్యతకు చివరి వరకు కృషి సల్పారు. జాతీయోద్యమకారులంతా తనను అమ్మ అని పిలుస్తున్నందున, బిడ్డల ఎదుట తనకు పర్దా అక్కరలేదని ప్రకటించి, పర్దాలేకుండా బహిరంగ సభలలో ప్రసంగించిన సాహసి ఆబాది బానో బేగం.
    ఆబాది బానో బేగం బాటలో నడిచిన మరొక చిచ్చర పిడుగు నిషాతున్నీసా బేగం. ఆమె ఫైర్‌ బ్రాండ్‌గా పిలువబడిన మౌలానా హస్రత్‌ మొహాని భార్య. భర్త పలుమార్లు జైలుకు వెళ్ళినా అధైర్యపడకుండా ఉద్యమబాటన చివరికంటా నడిచిన మహనీయురాలు. జాతీయోద్యమ ప్రధాన ఘట్టాలన్నిటిలో ఆమె ప్రముఖ పాత్ర వహించి సాహస మహిళగా ఖ్యాతిగాంచిన  నిర్మొహమాటి. భర్త మౌలానా హస్రత్‌ మొహాని సంపూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ప్రతిపాదించగా దానిని గాంధీజీ తిరస్కరించినందుకు ఆగ్రహించిన ఆమె గాంధీజీ వైఖరిని నిశితంగా విమర్శించి, చివరకు గాంధీజీచే శభాష్‌ అన్పించుకున్న ప్రతిభాశీలి. మంచి రచయిత్రి.
    ఈ వరుసలో అలీ సోదరులలోని షౌకత్‌ అలీ భార్య  అంజాదీ బేగం, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు స్ఫూర్తిగా నిల్చిన జులేఖా బేగం, స్వాతంత్రేచ్ఛను రగిల్చే సాహిత్యాన్ని సృష్టించిన కవయిత్రి జాహిదా ఖాతూన్‌, ఆలోచనాత్మక ప్రసంగాలకు పెట్టింది పేరైన అక్బరీ బేగంలను పేర్కొనవచ్చును. బ్రిటీష్‌ పోలీసులు గుర్రాలచేత తొక్కించినా, లాఠీలతో రక్తసిక్తం చేసినా పోరుబాట వీడని  హవిూదా తయ్యాబ్జీ, గాంధీజీచే మధ్యపాన నిషేధ ఉద్యమనేతగా నియుక్తురాలైన అవిూనా తయ్యాబ్జీ, బ్రిటీష్‌ పోలీసు మూకల దాష్టీకాన్ని ఎదుర్కొన్న  షఫాతున్నిసా బేగం, ఆదర్శ జాతీయవాదిగా ఖ్యాతిగాంచిన మజీదా బాను, జలియన్‌వాలా బాగ్‌లో జనరల్‌ డయ్యర్‌ ఘాతుకానికి బలైన 55 సంవత్సరాల వీరమాత  ఉమర్‌ బీబీ గౌరవప్రదమైన మరణం బానిస బతుకుకంటే మేలైనదని చాటిన బేగం మహమ్మద్‌ ఆలంలు జాతీయోద్యమంలో ప్రముఖపాత్ర వహించారు.
    జాతీయ కాంగ్రెస్‌ జనచైతన్య కార్యక్రమాలలో ప్రముఖపాత్ర నిర్వహించారు ఫాతిమా బేగం. జాతి ప్రయోజనాలకు తమ సంపద ఉపయోగపడకపోతే అది ఎంత ఉన్నా వ్యర్థమంటూ షంషున్నీసా అన్సారీ తమ యావదాస్తిని జాతీయోద్యమానికి ధారపోశారు.  భర్త పాలకుల కిరాతకానికి గురైనప్పటికీి ఆయన బాధ్యతలను స్వీకరించి ఉత్తేజపర్చే ఉత్తరాలతో స్వాతంత్య్ర సమరయోధులలో ఉత్సాహాన్ని నింపారు బేగం జాఫర్‌ అలీఖాన్‌. గాంధీజీ కోరిక మేరకు  క్రమం తప్పక ఆయనకు లేఖలు రాస్తూ, ఆయన ఉర్దూభాషను బేగం జోహరా అన్సారి తీర్చిదిద్దారు.  జలియన్‌వాలాబాగ్‌ ఘోర దురంతరంలో బలైన ఉమర్‌ బీబి ఎంతో సాహసంగా భారతావని విూద ఆంగ్లేయుల ఉనికిని నిరశించిన  ధీమంతురాలు. ఈ మహిళలంతా తాము కలలుగన్న ' స్వతంత్ర భారతాన్ని ' కళ్ళారా చూడకుండానే పరలోకగతులయ్యారు.
సాయుధపోరాట మార్గంలో...
    అహింసా మార్గాన్నే కాకుండా ప్రమాదభరితమైన సాయుధపోరాట మార్గాన కూడా పలువురు ముస్లిం మహిళలు ఉద్యమించారు. ఖుదీరాం కి దీదిగా ఖ్యాతిగాంచిన విప్లవ వీరుడు మౌల్వీ అబ్దుల్‌ హదీమ్‌ సోదరి వీరిలో ఒకరు. ఆమె అసలు పేరు తెలియదు. విప్లవకారుల విూద, వారి సన్నిహితుల విూద, సానుభూతిపరుల విూద బ్రిటీష్‌ ప్రభుత్వం విరుచుకు పడుతున్న భయానక వాతావరణంలో విప్లవ వీరుడు ఖుదీరాంను రక్షించుకునేందుకు విఫల ప్రయత్నం చేశారామె. బ్రిటీష్‌ గూఢచారి వర్గాల కళ్ళుగప్పి జాతీయ ఉద్యమకారులకు సమాచారాన్ని చేరవేసే కొరియర్‌గా సఫియా వాజిద్‌ చురుకైన పాత్ర నిర్వహించారు. ఈ వరుసలో కంటక ప్రాయమైన విప్లవబాటను ఎంచుకుని ఆత్మార్పణకు సిద్ధపడిన రజియా ఖాతూన్‌ లాంటి మహిళలు ఎందరో ఉన్నారు.                     జాతీయోద్యమంలో పాల్గొనటమేకాక, జవిూందార్ల జులుంను సాయుధంగా ఎదుర్కొన్న వారిలో కూడా ముస్లిం మహిళలున్నారు. సింధ్‌ ప్రాంతానికి చెందిన మాయి భక్తావర్‌ ఆ కోవకు చెందినవారు. తన గ్రామానికి చెందిన రైతుల కష్టార్జితాన్ని దోచుకో చూసిన జవిూందారు గూండాలను, జవిూందారుకు వత్తాసుగా వచ్చిన పోలీసులను సాయుధంగా ఎదుర్కొని ఆ పోరులో వీరమరణం పొందిందామె. ఈ విధంగా పోరాడిన వీరవనితలు ఎందరో ఉన్నా ప్రచారం లభించినవారు చాలా తక్కువ.
స్వతంత్ర భారతంలో కూడా స్వాతంత్రోద్యమం నాటి త్యాగమయ స్ఫూర్తి ...
    స్వాతంత్య్రోద్యమం వేగం అందుకుని లక్ష్యసాధన దిశగా పరుగులిడుతున్న థలో ఉద్యమంలో భాగస్వాములైన ఆనాటి మహిళలంతా అదృష్టవంతులు. ఆ తల్లులంతా తాము కలలుగన్న స్వతంత్ర భారతావనిని కళ్ళారాగాంచటమేగాక, కొందరు నవభారత నిర్మాణంలో బృహత్తరమైన బాధ్యతలు నిర్వహించారు.
    ఈ తరంలోని ముఖ్యలలో ఒకరు జుబేదా బేగం. చిన్ననాటనే ఉద్యమబాటన నడక ప్రారంభించిన ఆమె అద్భుత వక్త. సుసంపన్న కుటుంబంలో జన్మించిన ఆమె తన సర్వస్వం జాతీయోద్యమానికి సమర్పించారు. చివరి థలో కటిక పేదరికం అనుభవిస్తూ కూడా ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్‌ స్వీకరించ నిరాకరించారు. పెన్షన్‌ స్వీకరించటమంటే తన మాతృదేశ సేవకు ఖరీదు కట్టడమేనంటూ, ఎటువంటి ఆర్థిక సహాయం స్వీకరించకుండా గడిపారు. ఈ రకంగా భారత ప్రభుత్వం ఇవ్వజూపిన అనేక రకాల ఆర్థిక సహాయాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించిన వారెందరో ఉన్నారు.
        ఈ మేరకు ఉద్యమంలో భాగంగా గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ప్రముఖుల్లో శ్రీమతి అముతుస్సలాం ఒకరు. నౌఖాళి మతకలహాల నివారణకు గాంధీజీ ఆమెను పంపారు. కలహాల నివారణకు గ్రావిూణులు సహకరించకుండా మంకుపట్టు పట్టడంతో 22 రోజులపాటు నిరాహారదీక్ష పూని ఆ ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పిన ఆమె గాంధీజీ ప్రశంసలందుకున్నారు. బేగం రెహనా తయ్యబ్జీ గాంధీజీకి ఉర్దూ భాషను నేర్పిన గురువయ్యారు. పండు వయస్సులో కూడా  బేగం లుక్మాని పోరాట పటిమ చూపారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో  బేగం ఫాతిమా ఇస్మాయిల్‌ చురుగ్గా వ్యవహరించారు. బొంబాయి నగరంలో 30 సంవత్సరాలపాటు  అవిశ్రాంతంగా శ్రమించి ఐదు లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దటంలో అనితర సాధ్యమైన విజయాన్ని బేగం కుల్సుం సయాని సొంతం  చేసుకున్నారు. ఆమె వయోజన విద్యావ్యాప్తి కోసం ప్రత్యేకంగా పలు భాషలలో రహబర్‌  అను పత్రికను కూడా నడిపారు. జాతీయోద్యమంలోని ప్రతి ఘట్టంలోనూ పాల్గొన్నారు.
    స్వాతంత్య్ర ఉద్యమకారులచే హాజఁరా ఆపాగా (హాజఁరా అక్కయ్య) హాజఁరా అహమ్మద్‌ పిలిపించుకున్నారు. రష్యాను సందర్శించిన తొలి భారతీయ మహిళగా ఆమె ఖ్యాతిగాంచారు. ఆంధ్ర రాష్ట్రంలోని మంతెనవారి పాలెంలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతులలో ఆమె బర్త జడ్‌.ఎ. అహమ్మద్‌తో కలసి పాల్గొన్నారు. ఈవిధంగా అంకిత భావంతో విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిలో ఆదర్శవంతమైన సేవలకు అంకితమైన బేగం సుఫియా సోం, ఆత్మరక్షణకు ఆయుధం ధరించిన బేగం సుల్తానా హయాత్‌, గాంధీజీ నేతృత్వంలో ఆదర్శ వివాహం చేసుకున్న బేగం ఆమనా ఖురేషి, పోరుబాటలో నడిచినందుకు అరెస్టయిన ఢిల్లీలోని తొలి మహిళా కార్యకర్తగా ఖ్యాతి గడించిన బేగం మహబూబ్‌ ఫాతిమా లాంటి వారెందరో ఉన్నారు.
తెలుగింటి ఆడపడుచులు
    ఈ కోవకు చెందిన వారిలో తెలుగింటి ఆడపడుచులూ ఉన్నారు. అటువంటివారిలో  మహమ్మద్‌ గౌస్‌ ఖాతూన్‌,  హజఁరా బీబీ ఇస్మాయిల్‌,  నఫీస్‌ ఆయేషా బేగం, రబియాబీ, ఫక్రుల్‌ హాజియా తదితరులను పేర్కినవచ్చు. ఉన్నారు. చీరాల-పేరాల ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గౌస్‌ మెహిద్దీన్‌ భార్య  ఖాతూన్‌, భర్తతోపాటుగా జైలుకు వెళ్ళకపోయినా, ఉద్యమకారులకు ఆశ్రయం కల్పిస్తూ, ఆతిథ్యమిస్తూ, తన కుటుంబానికి చెందిన సర్వం ఉద్యమం కోసం వ్యయం చేసిన త్యాగశీలి. గాంధీజీ అనుచరుడుగా రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన ఖద్దర్‌ ఇస్మాయిల్‌ భార్య హాజఁరా బీబీ గాంధీజీ బాటన నడిచినందుకు ఆమె కుటుంబాన్ని వెలివేసినా వెరవని ధీమంతురాలు. భారత జాతీయ సైన్యంలో చేరి నేతాజి వెంట నడిచిన అబిద్‌ హసన్‌ సఫ్రాని, నిజాం సంస్థానంలో తొలుతగా ఖద్దరు ప్రచారం ఆరంభించిన బద్రుల్‌ హసన్‌ లాంటి బిడ్డలను కన్న ఫక్రుల్‌ హాజియా విదేశీ వస్త్రాలను  నిజాం గడ్డ విూద తగులబెట్టి అందరికి ఆదర్శమయ్యారు. పలు భాషలను నేర్చుకుని  ప్రజల పక్షంగా  జాతీయోద్యమంలో బహుముఖ పాత్ర నిర్వహించారు.
    అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామానికి చెందిన  రబియాబీ భర్త మొహిద్దీన్‌ సాహెబ్‌తో కలసి సత్యాగ్రహంలో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఆంధ్రావనిలో ఒక ముస్లిం మహిళ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో బహిరంగంగా పాల్గొనటం ఇదే ప్రథమమని ఆనాడు పలువురు శ్లాఘించారు. జాతీయోద్యమకారుడైన భర్త, ఆమెను పర్దాపద్ధతి నుండి విముక్తి చేయడంతో, రబియాబీ మరింత ఉత్సాహంతో స్వాతంత్య్రోద్యమంలోని ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు సాగిన యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలో స్వయంగా పాల్గొనటమేకాక యుద్ధ వ్యతిరేక నినాదాలిచ్చి పలువుర్ని ఆశ్చర్యచకితులను చేశారు. ఆనాడు మహిళలకు జైళ్ళల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేనందున అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. స్వజనుల చేత పలు విమర్శలకు గురైనప్పటికీ  ఖాతరు చేయకుండా, చివరి శ్వాస వరకు జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం ఆమె మానలేదు.
    జాతీయోద్యమంలో ప్రేరణపోంది విముక్తిపోరాటంలో తమదైన భాగస్వామ్యం అందించటమేకాకుండా, స్వాతంత్య్రం సిద్ధించాక కూడా అదే స్ఫూర్తితో సాగిన పలు పోరాటాలలో తమదైన పాత్ర వహించిన వారిలో బేగం రజియా, జమాలున్నీసా బాజి అను సోరదరీమణుల పాత్ర ఎంతో త్యాగపూరితమైంది. చిన్ననాటనే భారత స్వాతంత్య్రోమంలో పాల్గొనటం మాత్రమే కాకుండా ఆ తరువాత సాగిన కమ్యూనిస్టు ఉద్యమంలో, తెలంగాణా రైతాంగ పోరాటంలో ఈ ఇరువురు పాల్గొన్నారు.
నైజాం విలీనోద్యమంలో...
    స్వాతంత్య్రం సాధించాక, ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనమవ్వాలన్న డిమాండ్‌తో సాగిన పోరులో కూడా రాష్ట్రానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్న దాఖలాలున్నాయి. ముస్లిం మహిళలకు ఉన్న మత, సామాజిక బంధనాల మూలంగా పెద్ద సంఖ్యలో ఉద్యమ బాటన నడవలేకపోయినప్పటికీ, ఉద్యమకారులైన తమ బిడ్డలను, భర్తలను ఎంతగానో ప్రోత్సహించారు. పరోక్షంగా సహకరించారు. ఈ విధంగా పరోక్ష సహాయం అందచేసిన వారెందరో ఉన్నప్పటికీ అందరి వివరాలు తెలియరాలేదు.
    రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వాతంత్య్ర సమరయోధుల గ్రంథంలో ఒకే ఒక ముస్లిం మహిళ పేరుంది. ఆ అదృష్టవంతురాలు  నఫీస్‌ ఆయేషా బేగం. ఆమె హైదరాబాద్‌ నివాసి. ఆమె తండ్రి పేరు హామీద్‌ ఆలీఖాన్‌. ఆమె 16-9-1948 నుండి 17-9-1948 వరకు రెండురోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు. నైజాం విలీనం కోరుతూ ఉద్యమించినందున ఆమె నిర్బంధానికి గురయ్యారు. ఆమె పేరు తప్ప మరే ముస్లిం మహిళ పేరు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన గ్రంథాలలో కన్పించపోవటం ఆశ్చర్యం కల్గించే అంశం.
తెలంగాణ పోరాటంలో....
    ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ముస్లింలు తమ భాగస్వామ్యాన్ని అందించారు. స్త్రీ, పురుష భేదం లేకుండా ఆ పోరులో పాల్గొన్నారు. అటువంటి వారిలో రాజారాం గ్రామానికి చెందిన జైనాబి ఒకరు. పేద రైతు కుటుంబానికి చెందిన ఆమె పోరాట నాయకులకు తన ఇంట రక్షణ కల్పించారు. పోలీసుల నుండి కాపాడారు. చివరివరకు ఆమె ఉద్యమకారులకు చేయూత నిచ్చారు. వయస్సుతో నిమిత్తం లేకుండా, శరీరం సహకరించని వృద్ధ్దాప్యంలో కూడా పోరాటయోధులను అటు రజకార్ల నుండి, భూస్వాముల స్వంత సాయుధ బలగాల నుండి, ఇటు మిలటరీ దాడులు, సోదాల నుండి రక్షించుకునేందుకు ప్రాణాంతక సహసాన్ని ప్రదర్శించిన మహిళలు మనకు తారసపడతారు.  ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనం కోసం సాగిన పోరు, ఆ తరువాత అటు తెలంగాణా రైతాంగ పోరాటంలో కూడా తమ త్యాగపూరిత భాగస్వామ్యాన్ని అందించిన మహిళలలో బేగం రజియా, జమాలున్నీసా బాజీ లాంటి వారున్నారు.
    నైజాం వ్యతిరేకపోరాటం నుండి తెలంగాణా రైతాంగ పోరాటం వరకు ముస్లిం కుటుంబాలు ఉద్యమకారులను తమ కడుపులో పెట్టుకుని కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయుధాలు చేతపూని రణం చేసిన సాహసులైన వీరవనితలూ ఉన్నారు. వడిసెల గిరగిరా తిప్పుతూ శత్రువు విూద దాడి జరిపిన సమరశీల మహిళలు ఉన్నారు. ఆనాడు సామాజిక జీవన బంధనాలలో ఉంటూ కూడా బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న మహిళలు చరిత్ర గ్రంథాలలో తమదైన స్థానాన్ని సంపాదించుకోలేక పోయారు. అందువలన ఆ తల్లుల గురించి ప్రజలకు అతి తక్కువ మాత్రమే తెలిసింది. ప్రభుత్వం ప్రచురించిన గ్రంథాలలో కూడా  మహిళామణులకు స్థానం లభించకపోవడం విచారకరం.
    ఈ విధంగా పేర్కొంటూ పోతే అనేక మంది మణిపూసల్లాంటి మహిళలను  ప్రస్తావించవచ్చు. ఈ మహిళల చరిత్రలు అక్కడక్కడా ఆయా ప్రాంతాలలో స్థానిక భాషలలో, స్థానిక చరిత్ర గ్రంథాలలో మాత్రమే ఉన్నాయి. ఆనాటి వారి త్యాగాల గురించి అందరికి తెలియాలంటే జాతీయ స్థాయి ప్రామాణిక చరిత్ర గ్రంధాలలో అన్ని సాంఘిక జనసముదాయాలకు చెందిన స్వాతంత్య్రసమరయోధులందరికి తగిన స్థానం కల్పించాలి. ఆ లక్ష్యంగా చరిత్ర గర్భంలో దాగిన మరెందరి చరిత్రలనో పరిశోధకులు వెలికి తీయాలి. ఆ చరిత్రలను ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రచురించాలి. ఆ చరిత్రలను విద్యార్థులకు పాఠ్యగ్రంథాలలో పొందుపర్చాలి. ఆచరిత్రలకు కళారూపాల సుగంధాన్ని అద్దాలి.ఈ మేరకు అన్ని సాహిత్య ప్రక్రియల ద్వారా ఆ చరితలు ప్రజలకు అందుబాటులోరావాలి. ఆనాటి మన పూర్వీకుల త్యాగాల పరంపరకు భవిష్యత్తరాలను వారసులను చేయాలి.
    ప్రస్తుతం భారతీయ ప్రధాన జన సముదాయాల మధ్య మానసిక అంతరాలు, అపోహలు, అనుమానాలకు ప్రధాన కారణం ఆయా సాంఘిక జన సముదాయాల త్యాగమయ చరిత్రలను విస్మరించటమే. ఈ అవకాశాన్ని  మతోన్మాద స్వార్ధపర రాజకీయ శక్తులు, వ్యక్తులు ఉపయోగించుకుంటున్నారు.
    ఈ ప్రమాదకర పరిస్థితికి ప్రతిగా, ఆ త్యాగాల స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ భారతదేశ బంగారు భవితకై నడుం కట్టేలా ప్రోత్సహించాలి. అందుకు ప్రజలు, ప్రభుత్వాలు సహకరించాలి. అప్పుడు మాత్రమే త్యాగసంపన్నులైన మన పూర్వీకులకు మనం ఘనమైన నివాళి అర్పించినవారం కాగలుగుతాం.
త్యాగాల చరిత్ర అందరికీ తెలియాలి
    ప్రజలకు అన్ని సాంఘిక జనసముదాయాల త్యాగాలు తెలియాల్సి ఉంది. పలు సాంఘిక జనసముదాయాలు కలసిమెలసి సహజీవం సాగిస్తున్న గడ్డ అయినటువంటి భరతభూమిలో ఆయా జనసముదాయాల మధ్యన సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి ఒకరి  త్యాగపూరిత చరిత్రలు మరొకరికి తెలియాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. మాతృభూమి సేవలో పునీతమైన ప్రజలందరి చరిత్ర  ఆన్ని సాంఘిక జనసముదాయాలకు తెలిసినప్పుడు మాత్రమే ఆయా జనసముదాయాల మధ్యన పరస్పర గౌరవం ఏర్పడుతుంది. ఆ గౌరవం సదవగాహనకు కారణమౌతుంది. ఆ సదవగాహన నుండి సధ్బావన, సహిష్ణుత ఉత్పన్నమౌతాయి. ఆ సహిష్ణుత, సామరస్యం, శాంతి-స్నేహాలకు బలమైన పునాది అవుతాయి.
    చరిత్ర మంచి చెడుల సమాహారం. చెడు సంఘటనలను గుర్తుచేస్తూ జనసముహాల మధ్య వైషమ్యాలకు కారణమయ్యేకంటే, మంచి సంఘటనలను మళ్ళీ మళ్ళీ పునస్మరిచుకుంటూ భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం సంఘ జీవనానికి  భూమికగా బహుళ సంస్కతిృ-సభ్యతలతో సహజీవనం సాగిస్తున్న ప్రజల మధ్య స్నేహాన్ని, సోదరభావాన్ని, సామరస్యవాతావరణాన్ని మరింతగా పటిష్టం చేయయటం మంచిది.
    ఈ వాతావరణంలో భారతీయ లౌకిక వ్యవస్థ పరిఢవిల్లుతుంది. రగిలించబడుతున్న మత విద్వేషాలు మట్టిలో కలసిపోయి మతసామరస్యం మరింతగా సుధృఢమౌవుతుంది. మతోన్మాద రాజకీయ శక్తుల కుట్రలు, కుయుక్తులకు అడ్డుకట్ట పడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా సామాన్య ప్రజలకు చేరువకాని ముస్లింల, ప్రధానంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్రను ప్రజల చెంతకు చేర్చేందుకు సాగుతున్న కృషిలో అతి చిన్న ప్రయత్నమిది.

Sunday 4 September 2011

భారత స్వాతంత్ర్యసంగ్రామం-ఆంధ్రప్రదేశ్ ముస్లిములు

    బ్రిటీష్‌ బానిస బంధనాల నుండి విముక్తిని కోరుకుంటూ సాగిన స్వాతంత్య్రోద్యమంలో  భిన్నత్వంలో ఏకత్వం-ఏకత్వంలో భిన్నత్వం, అంతర్గత మార్గదర్శక సూత్రంగా సాగుతున్న భారతీయ సాంఘిక జనసముదాయాలలో ఒకటైన ముస్లిం జనసముదాయం మాతృభూమి పట్లగల అవ్యాజ ప్రేమాభిమానాల ఫలితంగా ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి సోదర సమానులతో కలసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించింది స్వదేశీయుల పాలన సాధించుకోవడంలో మహత్తర పాత్ర నిర్వహించారు. ఈ మేరకు ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన మహత్తర పాత్రకు అంతర్గత, బహిర్గత కారణాలు, జాతీయ స్థాయి పరిణామాల మూలంగా చరిత్రలో లభించాల్సినంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రచారం లభించలేదు. ఆ కారణంగా ఆనాటి అపూర్వ ఆత్మార్పణలు, త్యాగాలు చరిత్ర గర్భాన మరుగున పడిపోయాయి.
    ఆంధ్ర ప్రదేశ్‌లో తొలిసారిగా 1780లో విశాఖపట్నంలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలో జరిగినకంపెనీ సైన్యంలో సుబేదార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్‌ అహమ్మద్‌ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా స్వదేశీసైనికుల కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి తట్టుకోలేక కంపెనీ సైన్యాధికారులు కాళ్ళకు బుద్ధి చెప్పగా, స్థావరంలోని  కోశాగారంలోని ధన సంపదను, ఆయుధాగారంలోని ఆయుధాలను సుబేదార్‌ అహమ్మద్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత అంగ్లేయుల తొత్తులుగా మారిన జమీందార్ల కారణంగా, షేక్‌ సుబేదార్‌ అహమ్మద్‌తోపాటుగా తిరుగుబాటు యోధుల మరణశిక్షలకు ఎరయ్యారు.
    స్వజనుల విూద బ్రిటీషర్ల పెత్తనాన్ని సహించలేక, ఆంగ్లేయాధికారుల చర్యలను వ్యతిరేకించిన తొలినాటి ప్రముఖులలో నూరుల్‌ ఉమ్రా బహుదూర్‌ నైజాం దర్బార్‌లో అతి ముఖ్యులు. ఈస్ట్‌ ఇండియా కంపెనీలోని స్వదేశీ సైనికులను బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా వ్యవహరించమంటూ 1806 ప్రాంతంలో నూరుల్‌ ఉమ్రా ప్రోత్సహించిన కారణంగా దర్బారు నుండి బహిష్కరణకు గురైన ఆయన  ఉస్మానాబాద్‌ జిల్లాలోని ఔసా కోటలో 1818లో కన్నుమూశారు.
    నూరుల్‌ ఉమ్రా తరువాత నిజాం నవాబు సికిందర్‌ ఝూ బహుదూర్‌ కుమారుడు, అప్పటి నైజాం నవాబు నాసిరుద్దౌలా సోదరుడు అయినటువంటి ముబారిజుద్దౌలా ఆంగ్లేయుల పెత్తనాన్ని వ్యతిరేకించి ఆత్మాభిమానంగల స్వదేశీ సంస్థానాధీశులు, నవాబులతో కలసి పోరాటానికి సిద్దమైనందున ఆంగ్లేయుల ఆగ్రహానికి గురై   గోల్కొండ కోటలో శిక్షను అనుభవిస్తూ 1854 జూన్‌ 25న కన్నుమూశారు.  ఈ పోరాటం కోసం భారీ ఎత్తున ఆయుధాలను తయారు చేస్తూ పట్టుబడిన కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌ జీవితం తిరుచునాపల్లి జైలులో 1840 జూలై 12న ముగిసింది.
    ఉత్తరాదిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఆరంభం  కాకముందే ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలలో ఆత్మాభిమానం గల యోధులు, బ్రిటీష్‌ అధికారుల ఆజ్ఞలను ఖాతరు చేయకుండా తిరుగుబాటు పతాకాలను ఎగుర వేసిన యోధుల ప్రభావం  నిజాం సంస్థానంలో కూడ ఆ ప్రభావం స్పష్టంగా బలపడసాగింది. ఈ పోకడలు ఎంతవరకు విస్తరించాయంటే పోరుబాట నడవండి మేం విూ వెంట ఉంటా అంటూ సంస్థానాధీశుడికి ప్రజానీకం నేరుగా సలహా ఇచ్చేంత స్థాయిలో బ్రిటీష్‌ వ్యతిరేకత నైజాం సంస్థానంలో ఉనికిని సంతరించుకుని ఊపందుకుంది. ఈ వాతావరణం మరింతగా ప్రబలి తెల్లవార్ని తరిమి కొట్టమని, మట్టుబెట్టమని నినాదాలు ఉద్భవించాయి. చివరకు 1857 జూలై 17న నగరంలోని ప్రజలు, ప్రముఖులు మక్కా మసీదు వద్ద సమావేశమై మౌల్వీ అల్లావుద్దీన్‌, పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ల నేతృత్వంలో బ్రిటీష్‌ రెసిడెన్సీ మీద సాహసోపేత దాడి జరిపారు. ఆ సందర్భంగా  కడపజిల్లా ఎల్లంపేట నివాసి షేక్‌ పీర్‌ సాహెబ్‌ 1857 ఆగస్టు 28న తిరుగుబాటుకు సిద్దం కమ్మని పిలుపునిచ్చి, ప్రయత్నాలు ఆరంభించగా ఆ రహస్యం కాస్త పొక్కడంతో ఆంగ్లేయుల దాష్టికానికి ఆయన బలయ్యారు. ఈ పోరాటాల స్ఫూర్తితో కృష్ణా-గోదావరి మండలాలలో గుంటూరులలో తిరుగుబాటు ఛాయలు కప్పించాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 1857 ఆగస్టు 22న రాజమండ్రిలోని ఆంగ్ల అధికారి మద్రాసులోని కంపెనీ ప్రధానకార్యదర్శికి రాసిన లేఖలో భారీ కుట్రను మొగ్గలోనే తుంచగలిగాం... ముసల్మాన్లు ఇందులో ప్రధాన పాత్ర వహించారని అని పేర్కొన్నాడు. ఈ విధంగా 1857 నాటి పోరాటంలో బ్రిటీషర్ల విూద తిరగబడిన జనులు, జవానులు చాలా మంది ఉన్నారు. ఆ సాహసుల చరిత్రలు పూర్తిగా నమోదుకు నోచుకోకపోవడంతో ఆ వివరాలు ప్రలకు అందకుండా పోయాయి. చరిత్ర పుటలలో మరుగున పడిపోయాయి.
    ఆ సమయంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పలు సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంస్థలు, ప్రజా సంఘాలు, పత్రికలు రంగం విూదకు వచ్చి చేసిన కృషి కారణంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. ఆ తరువాత 1887 సంవత్సరంలో మద్రాసు నగరంలో జస్టిస్‌ బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి తెలుగునాట నుండి హుస్సేన్‌ బేగ్‌, విూర్జా హుస్సేన్‌ బేగ్‌, సయ్యద్‌ సాహెబ్‌, ఖాదర్‌ ఖాన్‌, ఖాశిం మియ్యా సాహెబ్‌, ఆ తరువాత 1889లో బొంబాయి నగరంలో జరిగిన సమావేశానికి షేక్‌ బురానుద్దీన్‌ సాహెబ్‌, ఖలీల్‌ ఖాన్‌, నవాబ్‌ అలీ ఖాన్‌, అహమ్మద్‌ సాహెబ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నవాబు ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం కాంగ్రెస్‌లో సభ్యత్వం స్వీకరించడమే కాకుండా ముస్లిములంతా భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాలని, కార్యక్రమాలలో పాల్గొనాలని బహిరంగంగా పిలుపు నిస్తూ, ప్రముఖ ముస్లిం మేధావి సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ చేసిన వాదనలు పూర్వపక్షం చేస్తే సాహిత్యాన్ని సృజియించి పంపిణీ చేసిన కారణంగా నిజాం నవాబు ఆగ్రహానికి గురయ్యారు. ఈ నాయకుల కృషి వలన ఆనాడు ముస్లిం జనసమూహాలలో భారత జాతీయ కాంగ్రెస్‌ పట్ల సానుకూలత వ్యక్తంకావడమే కాకుండా, జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన ప్రతి జాతీయ స్థాయి సాంవత్సరిక సమావేశానికి ముస్లింల హాజరు గణనీయంగా పెరిగింది. ఈ పరిణామాల ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో ఉధృతంగా కాకపోయినా  ప్రతిస్పందన మాత్రం ఆరంభమైంది.
    భారత జాతీయ కాంగ్రెస్‌ లాంటి ప్రధాన సంస్థలు తగిన విధంగా కృషి జరుపుతున్నప్పటికి 1900 తరువాత మాత్రమే  జాతీయోద్యమం బాగా ఊపందుకుంది.     1906లో జరిగిన బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనోద్యమానికి తెలుగు ప్రజల మద్దతు బాగా లభించింది. 1907లో బిపిన్‌ చంద్ర పాల్‌ పర్యటనతో ఆంధ్రదేశాన్ని పూర్తిగా చుట్టేసింది. జాతి, మత, ప్రాంతాల విభేదాలు మరచి వందేమాతరం గీతాన్ని ఆలాపిస్తూ ప్రజలు ముందుకురికారు. వందేమాతరం ఉద్యమంతో రగులుకున్న సహాయనిరాకరణ ఉద్యమం రాష్ట్రంలో పలు చారిత్రక సంఘటనలకు కారణమైంది. ఈ సహాయనిరాకరణ మరింత పరిణితి చెంది కొంతకాలానికి శాసనోల్లంఘనగా రూపు దిద్దుకుంది. ఈ సందర్భంగా స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు అవసరమగు నిధుల సేకరణకు రాష్ట్రంలో ప్రయత్నాలు జరిగాయి. మద్రాసులో స్వదేశీ ఉద్యమ వ్యాప్తికోసం దీపావళి జాతీయ నిధి  ఏర్పాటు చేశారు. ఆ నిధికి సయ్యద్‌ మహమూద్‌, న్యాయపతి సుబ్బారావులు ధర్మకర్తలుగా  వ్యవహరించారు.
    బెంగాల్‌ విభజన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో పెనుగాలులకు కారణం కాకపోయినా ఉద్యమదిశగా అనుకూల కదలికలకు కారణమైంది. ఆ కదలికల ఫలితంగా ఆ తరువాత ఆరంభమైన హోంరూల్‌ ఉద్యమంలో ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములయ్యారు. ఈ ఉద్యమంలో భాగంగా జరిగిన పలు సభలు, సమావేశాలలో ముస్లిం ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారు. 1916 నవంబరు మాసంలో కడపజిల్లా రాజంపేటలో జరిగిన బహిరంగ సభకు బనగానపల్లి సంస్థానానికి చెందిన ప్రముఖులు విూర్‌ ఆసఫ్‌ అలీ బహుదూర్‌ అధ్యక్షత వహించారు. స్వయంపాలనాధికారాన్ని సాధించేవరకు ప్రజలు సంతృప్తి చెందరాదని, స్వయం పాలనాధికారాన్ని ఎట్టి పరిస్థితులలోనైనా సాధించి తీరాలని ఈ సందర్భంగా ఆయన ఉద్బోధించారు.
     బ్రిటీష్‌ పాలకులు 1919 మార్చిలో రౌలత్‌ చట్టాన్ని తెచ్చి ప్రజల స్వేచ్ఛను పూర్తిగా హరించివేసేందుకు ప్రయత్నించారు. రౌలత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ 1919 మార్చి 20న మద్రాసులో సభ జరింది. పెద్దసంఖ్యలో ప్రజలు హజరైన ఈ సభలో విూర్‌ సుల్తాన్‌ మొహిద్దీన్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ రౌలత్‌కు వ్యతిరేకంగా కృషి సాగించిన వారిలో ఖాన్‌ బహుదర్‌ ఖుద్దుస్‌ బాదుషా సాహెబ్‌, అబ్దుల్‌ హకీంలు ఉన్నారు. చెన్నపురిలో జరిగిన హర్తాల్‌ సందర్భంగా మహమ్మదీయులంతా తమ దుకాణాను మూసి వేసి హర్తాల్‌ను సంపూర్ణంగా పాటించారు. బెజవాడలో మహ్మదీయులు ప్రార్థనలు తరువాత పెద్ద సభ ఏర్పాటు చేసి రౌలత్‌ శాససం రద్దు కావాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన సభలో ప్రముఖ కవి మౌల్వీ ఉమర్‌ అలీషా రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా గంభీరోపన్యాసాలు చేశారు.
    ఈ విధంగా మహాత్ముని పిలుపుమేరకు మద్రాసు రాష్ట్రంలో భాగంగా గల తెలుగు గడ్డ విూద జరిగిన రౌలత్‌ వ్యతిరేక ఉద్యమంలో ముస్లింలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. భౌతికంగా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా ఆర్థికంగా చాలా మంది సంపన్నులు ఆదుకోవడం జరిగింది.     ఈ మేరకు తమదైన రీతిలో బ్రిటీష్‌ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రతిస్పందిస్తుండగా స్వాతంత్య్రోద్యమంలో అతి ప్రధాన పోరాట రూపంగా భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో స్థానం సంపాదించుకుని, మహోద్రుతంగా సాగిన  ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమం దూసుకొని వచ్చింది.
    భారతీయులలో పెరుగుతున్న స్వేచ్ఛా స్వతంత్ర భావాలను, ప్రజా ఉద్యమాలను అదుపుచేయడానికి, అణిచి వేయడానికి బ్రిటీషర్లు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రారంభించారు. ప్రధమ ప్రపంచ యుద్దం సంద్భంగా  ప్రపంచ ముస్లింల పవిత్ర స్థలాలకు తగిన రక్షణ కల్పిస్తామని చెప్పిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కివేస్తూ ప్రపంచ ముస్లింలంతా ఎంతగానో గౌరవించే ఖిలాఫత్‌ వ్యవస్థను రద్దు చేసింది. బ్రిటీషర్ల చర్యలకు వ్యతిరేకంగా టర్కీ దేశాధినేత కమల్‌ పాషా ప్రారంభించిన ఖిలాఫత్‌ పోరాటానికి భారతీయ ముస్లింలు మద్దతు పలికారు. ఖిలాఫత్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రారంభమైన ఖిలాఫత్‌ ఉద్యమానికి గాంధీజీ మద్దతునిచ్చారు. ఆ కారణంగా  సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్‌ ఉద్యమం జమిలిగా భారత రాజకీయ చిత్రపటం విూద ఆవిష్కరించబడ్డాయి. 1920 ఏప్రిల్‌ 17న గాంధీజీ, ఆలీ సోదరులుగా ఖ్యాతిగాంచిన మహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీలతో కలిసి సహాయనిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు.
    ఉత్తర భారతదేశాన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకున్న ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమ ప్రకంపనాలు అతి త్వరగా ఆంధ్రావనిని అందుకున్నాయి. తొలిసారిగా 1920 మార్చిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఖిలాఫత్‌ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ప్రఖ్యాత తెలుగు కవి, పిఠాపురానికి చెందిన డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా అధ్యక్షత వహించారు. సభలో ముస్లిమేతర ప్రముఖులతో పాటుగా ముస్లిం ప్రముఖులు షుకూర్‌ సాహెబ్‌, నాజియా హుస్సేన్‌లు పాల్గొని బ్రిటీషర్ల విధానాలను విమర్శిస్తూ ప్రసంగించారు.
    1920 ఆగస్టులో మద్రాసులో మహాత్మా గాంధీ సమక్షంలో జరిగిన సభలో ప్రముఖ ముస్లిం నాయకులు యాకూబ్‌ హుస్సేన్‌, డాక్టర్‌ లతీఫ్‌, సయ్యద్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొనగా ఖాన్‌ బహుదూర్‌ ఖుద్దూస్‌ సాహెబ్‌ సభకు అధ్యక్షత వహించారు. ఆ తరువాత 1921లో తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన మరొక సభలో అలీఘర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు మహమ్మద్‌ అబ్దుల్‌ హకీం, మహమ్మద్‌ అబ్దుల్‌ ఖయూమ్‌లు ప్రసంగించారు. ఈ సభలో భారతీయ ముస్లింల కోర్కెలను తీర్మానాలుగా రూపొందించారు. ఆ తరువాత ఉద్యమంలో పాల్గొన్నందుకు కేరళ నాయకుడు యాకూబ్‌ హసన్‌ తదితర నేతలను అరెస్టు చేసిన సంఘటనకు నిరసనగా ఏలూరులో సంపూర్ణ హర్తాల్‌ను నిర్వహించారు.
    ఈ సందర్భంగానే మద్రాసు నుండి ప్రచురితమౌతున్న ఖౌమీ రిపోర్టు పత్రిక సంపాదకులు అబ్దుల్‌ మజీద్‌షా పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చి వివిధ గ్రామాలలో పర్యటించి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమాలను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలను కోరుతూ సభలు సమావేశాలు నిర్వహించారు. ముస్లిం జనసముదాయాలు అధికంగా గల ప్రాంతాలలో ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమాలు ఉధృతమయ్యాయి.     రాయలసీమ కడప జిల్లా తాడిపత్రికి చెందిన సులేమాన్‌ సాహెబ్‌ సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1921 నవంబరు 25న అరెస్టు చేయబడిన ఆయన ఆరు మాసాల పాటు బళ్ళారి సెంట్రల్‌ జైలులో గడిపారు. తాడిపత్రి నివాసి అబ్దుల్లా సాహెబ్‌ ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు  ఐదు మాసాల జైలుశిక్ష పడింది. ఆయనతో పాటుగా తిరుపతి నివాసి మదార్‌ సాహెబ్‌, తాడిపత్రి చెందిన మరొకరు షేక్‌ మాలిక్‌ షక్కర్‌ బరూన్‌ పలు శిక్షలకు గురయ్యారు.  అనంతపురం జిల్లా  హిందూపురంలో స్థానిక ఖిలాఫత్‌ కమిటీ కార్యదర్శిగా హుసేన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కర్నూలులోని మౌంట్‌ రోడ్‌లో గల ఆజం కళాశాల విద్యార్థులు యాకుబ్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ మజీద్‌ షరార్‌, అవిూర్‌ అలీ, బాబుహై మజహర్‌, సయ్యద్‌ మొహిద్దీన్‌ తదితర విద్యార్థులు 1920 అక్టోబరు 21న స్థానిక మసీదు వద్ద ప్రసంగిస్తూ 22నాటి విద్యార్థుల సమావేశానికి హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు.
    ఆ రోజున జుమ్మా ప్రార్థనల తరువాత జరిగిన సమావేశంలో సయ్యద్‌ మొహిద్దీన్‌, అమార్‌ అలీ అబ్దుల్‌, మజహర్‌ అను విద్యార్థినాయకులు సహాయనిరాకరణ అంశం విూద ప్రసంగించారు. ఈ విద్యార్థి నాయకులు కళాశాలల బహిష్కరణకు ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన కన్పించింది.    ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు కూడా కళాశాలలను బహిష్కరించారు. ఆ విధంగా గవర్నమెంటు కాలేజీ చదువులకు స్వస్తి చెప్పిన విద్యార్థులలో కరీంనగర్‌కు చెందిన విూర్‌ మహమ్మద్‌ హుస్సేన్‌, హైదరాబాద్‌కు చెందిన అక్బర్‌ ఆలీఖాన్‌, ఇంకా సయ్యద్‌ మహమ్మద్‌ ఆలీ, మక్బూల్‌ ఆలీ, మహమ్మద్‌ హుస్సేన్‌ యూసువుద్దీన్‌, హమీదుద్దీన్‌ మహమూద్‌, ఫక్రుద్దీన్‌ మసూద్‌, సయ్యద్‌ మహమ్మద్‌ అన్సారీ తదితరులు ఉన్నారు. (నా జీవిత కథ -నవ్యాంధ్రము, అయ్యదేవర కాళేశ్వరరావు, పేజీ 327). అలీఘర్‌ జాతీయ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు  ఖిలాఫత్‌- సహాయ నిరాకరణోద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చారు. మౌలానా ముహమ్మద్‌ అలీ మార్గదర్శకత్వంలో ముహమ్మద్‌ హుస్సేన్‌, షఫిఖ్‌ రహమాన్‌ కిద్వాయ్‌ తదితరులు ఆంధ్ర ప్రాంతంలోని పలు జిల్లాలలో పనిచేసేందుకు వచ్చి అదోని చేరుకున్నారు. అక్కడ కార్యక్రమాలల్లో పాల్గొంటుండగా ఆ విద్యార్థులను గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు స్వయంగా కడపకు పిలిపించారు.
    1921 అక్టోబరు 11న కడప చేరుకున్న ఈ విద్యార్థులు కడప, గుంటూరు తదితర ప్రాంతాల నుండి విచ్చేసిన ఇతర విద్యార్థులతో కలసి పలు ప్రాంతాలలో ప్రజలను సమీకరించి సభలు-సమావేశాలు నిర్వహించారు.  ఖిలాఫత్‌- సహాయనిరాకరణ ఉద్యమ కమిటీలను ఏర్పాటు చేశారు. అక్టోబరు 21న కడపలో ఆరువేల మంది హజరైన సభలో 2,500 రూపాయల  విరాళాలను ఉద్యమం కోసం ప్రజల నుండి సేకరించారు. ప్రజల అభీష్టానికి అనుకూలంగా ప్రజా డిమాండ్‌ను మరింతగా పునరుద్ఘాటిస్తూ 1400 మంది చేత సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ చర్యలతో ఖంగుతిన్న ప్రభుత్వం 1921 అక్టోబరు 21న ఆ విద్యార్థి నాయకులను అరెస్టు చేసి, ఆరు మాసాల జైలు శిక్షను విధించింది. ఆనాటి అలీఘర్‌ విద్యార్థుల చర్యలు ఆంధ్రలోని పలు కళాశాలల అధ్యాపకులను కూడా ఆమితంగా ఆకట్టుకున్నాయి. ఆ విద్యార్థుల చర్యల స్ఫూర్తితో ఆజం కళాశాలకు చెందిన తర్కశాస్త్ర అధ్యాపకులు అబ్దుల్‌ ఖాదర్‌ అలీ తమ కళాశాలను బహిష్కరించాలని నిర్ణయిచుకోవడం మాత్రమే కాకుండా సహచర ఆధ్యాపకులకు సలహా ఇచ్చి ప్రోత్సహించారు. ఈ ఉద్యమంలో అటు మేధావులు ఇటు సామాన్య ప్రజలు కూడా అమితోత్సాహంతో పాల్గొన్నారు. రాయలసీమకు చెందిన బీడి కార్మికుడు కరీం సాహెబ్‌ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆరు మాసాల జైలుశిక్ష 160 రూపాయల జరిమానాను భరించారు. అలీసోదరులు, మహాత్మాగాంధీ ఆదేశాలను తు.చ తప్పకుండా ఆచరిస్తూ ప్రజలు ఏకోన్ముఖంగా ముందుకు సాగారు. ఈ విధంగా వివిధ సామాజిక జనసముదాలు ఏకమై ఉద్యమించడంతో ఉద్యమం జాతీయస్థాయి రూపాన్ని సంతరించుకుంది.
    భారతదేశ పర్యటనలో భాగంగా, ఖిలాఫత్‌ ఉద్యమ ప్రముఖులైన ఆలీ సోదరులతో  కలిసి గాంధీజీ ఆంధ్రకు వచ్చారు. చరిత్ర సృష్టించిన ఈ పర్యటన విజయవాడ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహాత్ముడు 1920 జనవరి 1న జరిగిన సభలో ప్రసంగిస్తూ బ్రిటీష్‌ ప్రభుత్వం అందజేసిన బిరుదులను త్యజించాలని, పదవులను వదులుకోవాలని కోరారు. ఆ పిలుపుకు విజయవాడకు చెందిన జాగీర్దార్‌ మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ సాహెబ్‌ తక్షణమే స్పందించారు. ఆయన నిర్వహిస్తున్న గౌరవ మేజిస్ట్రేటు పదవికి తక్షణమే రాజీనామా చేశారు. ఆ విధంగా గాంధీజీ పిలుపుకు స్పందించి ప్రభుత్వ పదవిని త్యజించిన తొలి ఆంధ్రుడిగా గులాం మొహిద్దీన్‌ ఖ్యాతిగాంచారు.  గాంధీజీ పిలుపు మేరకు, ప్రభుత్వ పదవులు దిగతుడుపుగా భావించిన మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ స్ఫూర్తితో, మద్రాసు అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఖాజీ అహ్మదుల్లా, ఖాన్‌ సాహెబ్‌, అన్వర్‌ జమాఖాన్‌ సాహెబ్‌, అబ్దుల్‌ మజీద్‌ తదితర ప్రముఖులు ఎన్నికలను బహిష్కరిస్తూ తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నారు. రాయలసీమ యోధుడు యం. షంషీర్‌ బేగ్‌ తన చదువుకు స్వస్తి పలికి విశ్వవిద్యాలయాన్ని వదిలి వచ్చేశారు.
    1921లో బెజవాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. అన్నివర్గాల ప్రజలు పాల్గొని పండగలా జరుపుకున్న ఈ సమావేశాలలో మహాత్మాగాంధీ, ఇతర జాతీయ నాయకులతో పాటుగా  అబ్బాస్‌ తయ్యాబ్జీ, హాకీం అజ్మల్‌ఖాన్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, మహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ లాంటి ముస్లిం ప్రముఖులు విచ్చేశారు. ఆంధ్ర నాయకులు క్రియాశీల పాత్ర వహించిన ఈ సమావేశాలలో స్థానిక నాయకుడు షఫీ అహమ్మద్‌ ప్రముఖ పాత్ర వహించారు. ఈ సమావేశాల నిర్వహణకు విజయవాడకు చెందిన జాగీద్దార్‌ మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ సాహెబ్‌ తన ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేశారు.
    బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రసాదించిన పదవులు, బిరుదులు వదులుకోమని, సంపూర్ణ సహాయ నిరాకరణ పాటించమని జాతీయ నాయకులు ఇచ్చిన పిలుపును అందుకుని ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చెందిన మౌల్వీ జహిద్‌ హసన్‌ సాహెబ్‌, జమాల్‌ మొహిద్దీన్‌ సాహెబ్‌, షంషుల్‌ ఉలేమా, ఖాన్‌ సాహెబ్‌ ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించిన పలు గౌరవ బిరుదులను, పదవులను తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. గుంటూరుకు చెందిన మౌల్వీ మహమ్మద్‌ రజాఖాన్‌ బెల్గామి ఖిలాఫత్‌ సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించారు.  ఆయన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మండల ఖిలాఫత్‌ సంఘానికి అధ్యక్షత వహించారు. ఖిలాఫత్‌ కమిటీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా హిందూపురం మేజిస్ట్రేట్‌ ముహమ్మద్‌ హుస్సేన్‌ సాహెబ్‌, నబీ సాహెబ్‌ బహదూర్‌, టిప్పూు ఖాన్‌ తమ ఉద్యోగాలకు రాజీనామాలు సమర్పించారు. ఆదోనికి చెందిన రోషన్‌ ముల్లా 1920 జూన్‌లో ఆదోని మున్సిపాలిటీ కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆనాడు ఇటువంటి త్యాగాలు అసంఖ్యాకంగా సాగాయి. అధికార అనధికార పదవులలో ఉన్నవారంతా తమ హోదాలకు, పదవులకు, ఆంగ్ల ప్రభుత్వ మెహర్బానికి సామూహికంగా రాజీనామాలు సమర్పించారు.
     కర్నూలుకు చెందిన న్యాయవాది సయ్యద్‌ సాబ్‌ మొహిద్దీన్‌ ఖాద్రి బియబాని వేలాది రూపాయల సంపాదనను ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని వదిలేసి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌,  డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌లచే ప్రభావితులైన ఆయన జీవితాంతం జాతీయవాదిగా, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగిన పోరాటంలో సయ్యద్‌ సాబ్‌ మొహిద్దీన్‌ ఖాద్రి బియబాని భాగస్వామ్యం వహించడం మాత్రమే కాదు జాతీయోద్యమానకి తన 500 ఎకరాల భూమిని దానం చేశారు. గాంధీజీ పిలుపునందుకుని న్యాయవాద వృత్తిని వదులుకున్న వారిలో విజయవాడకు చెందిన జనాబ్‌ అలీ బేగ్‌ మరొకరు. అలీబేగ్‌ ఆనాటి రాజకీయాలలో ప్రముఖ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించడమేకాక, పార్లమెంటు సభ్యునిగా ప్రజలకు సేవలందించారు.
    1921 ఏప్రిల్‌లో మద్రాసులో మహాత్మాగాంధీ పాల్గొంటున్న సభలో వలియుల్లా బాద్షా సాహెబ్‌, నాదర్‌ సాహెబ్‌ తదితర ప్రముఖులు పాల్గొని ప్రజలను ఉద్యమించమని ప్రోత్సహిస్తూ  ఉద్వేగంగా ప్రసంగాలు చేశారు.ఈ సందర్భంగా ఖిలాఫత్‌-సత్యాగ్రహోద్యమాల ప్రాముఖ్యతను వివరిస్తూ, హిందూ-ముస్లింల ఐక్యత ఎంత అవసరమో ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో ప్రముఖులుగా ఖ్యాతి గాంచిన అలీ సోదరులలో ఒకరైన మౌలానా ముహమ్మద్‌ అలీతో కలసి మహాత్మాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 1921 సెప్టెంబరు 13న కలకత్తా నుండి రైలులో విశాఖపట్నం వచ్చారు. ఆ ప్రముఖులు విశాఖపట్నం చేరగానే పోలీసులు ముహమ్మద్‌ అలీని అరెస్టు చేశారు. ఈ అరెస్టు ప్రజలలో ఆగ్రహావేశాలను రగిల్చింది.
    ఆ సమయంలో అలీని అరెస్టు చేసినందుకు విశాఖపట్నం యోధుడు రజాక్‌ ఎంతో ఆందోళన చెందారు, ఆగ్రహించారు. పోలీసులు ముందుకు సాగకుండా ఆయన అడ్డుపడ్డారు. అలీని పోలీసుల తీసుకెళ్లకుండా అటంకపర్చి అల్లరి లేవదీశారు. ఆ సమయంలో మౌలాను అరెస్టు చేసినందుకు ...విచారం కలిగితే స్వదేశీ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా సూచిస్తూ, ప్రజలు శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని మహాత్ముడు కోరారు. (దేశ స్వాతంత్య్రోద్యమంలో విశాఖ జిల్లా స్థానం, విశాఖజిల్లా దర్శిని, విశాఖపట్నం, 2002 మరియు ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ ః కొడాలి ఆంజనేయులు)
     ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలలో పెల్లుబికిన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమం స్పూర్తిదాయకంగా నిలచింది. ఈ ఉద్యమ ప్రేరణతో దేశ వ్యాప్తంగా పలు స్థానిక ఉద్యమాలు ఉనికిలోకి వచ్చాయి. బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే ప్రధాన చోదక శక్తిగా ఈ ఉద్యమాలు ఉదృతంగా సాగాయి. ఈవిధంగా చరిత్ర సృష్టించిన పలు ఉద్యమాలకు తెలుగుగడ్డ ఆనాడు పుట్టినిల్లయ్యింది.
    భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల తరువాత ఆంధ్రలో సహాయ నిరాకరణ ఉద్యమం కాస్తా శాసనోల్లంఘన ఉద్యమంగా మారింది. ప్రజలు అన్ని ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించారు, చట్టాలను ఉల్లంఘించారు. పన్నులు కట్ట నిరాకరించారు. అధికారిక కార్యక్రమాలకు సహకారం అందించకుండా సహాయ నిరాకరణ కొనసాగించారు.     ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాతంలో కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో పుల్లరి ఉద్యమం సాగింది. చీరాల ప్రాంతంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో చీరాల- పేరాల ఉద్యమం ఉధృతమైంది. పర్వతనేని వీరయ్య చౌదరి మార్గదర్శకత్వంలో పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం చరిత్ర ప్రసిద్ధికెక్కింది. అల్లూరి సీతారామరాజు సాగించిన మన్యం తిరుగుబాటు ఆంధ్రులకు జాతీయ స్థాయిలో ఎనలేని ఖ్యాతిని తెచ్చి పెట్టింది. ఈ ఉద్యమాలన్నిటిలో కూడా ముస్లిం యోధులు పాల్గొని తమదైన ప్రత్యేక చరిత్రకు కారకులయ్యారు.
    గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో సాగిన పుల్లరి ఉద్యమంలో సాటి ముస్లిమేతర సోదరులతోపాటుగా ముస్లింలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అవసరాలు, అవస్థలు ఒక్కటే అయినప్పుడు కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమిస్తారనడానికి పల్నాటి పుల్లరి ఉద్యమం నిదర్శనంగా నిలచింది.     భారత జాతీయ కాంగ్రెస్‌ గుంటూరు జిల్లా నాయకులు పుల్లరి ఉద్యమం సందర్భంగా కార్యక్రమాలలో పాల్గొని అరెస్టులకు గురికాక ముందుగానే మాచెర్లకు పొరుగు గ్రామమైన కొత్తపల్లికి చెందిన ముగ్గురు ఉద్యమకారులు పుల్లరి చెల్లింపును వ్యతిరేకిస్తూ, సహాయనిరాకరణ ఉద్యమానికి తోడ్పడుతూ, పుల్లరి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలలో భాగంగా ఉద్యమకారులకు అనుకూలంగా  నబీ సాహెబ్‌, చింతపల్లి హుస్సేన్‌ సాహెబ్‌, జానహమ్మద్‌ వ్యవహరించి మొట్టమొదటి సారిగా అరెస్టులకు గురయ్యారని గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం 1920-30 ఉజ్వల ఘట్టాలు గ్రంథంలో ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు మాదల వీరభద్రరావు పేర్కొన్నారు.
    గుంటూరు జిల్లా చీరాల కేందంగా సాగిన చీరాల-పేరాల ఉద్యమంలో బాపట్లకు చెందిన మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ ఎంతగానో కృషి చేశారు. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ప్రధాన సహచరుడిగా ఆయన తన కుటుంబ ఆస్తిపాస్తులను ఉద్యమం కోసం పూర్తిగా వ్యయం చేశారు. చీరాల-పేరాల ప్రజాపోరాటంలోనే కాకుండా ముహమ్మద్‌ గౌస్‌ పెదనందిపాడు పన్ను నిరాకరణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. పన్నుల నిరాకరణ ఉద్యమవ్యాప్తి కోసం గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమం చేపట్టి అవిశ్రాంతంగా శ్రమించారు.ప్రజలలో ప్రధానంగా యువకులలో ఉత్సాహాన్ని రెకెత్తిస్తూ ఆయన ప్రసంగాలు చేయడమే కాకుండా, బ్రిటీష్‌ పోలీసుల దాష్టిక చర్యలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఉద్యమాలలో చురుకుగా పాల్గొని పలుమార్లు ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. (గుంటూరు జిల్లాలో స్వరాజ్య ఉద్యమం ః మాదల వీరభద్రరావు)
    గుంటూరు జిల్లా  పెదనందిపాడు కేంద్రంగా పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో సాగిన పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో  ముహమ్మగ్‌ గౌస్‌ ప్రధాన పాత్రను నిర్వహించారు. పన్నుల నిరాకరణ ఉద్యమం లక్ష్యాలను, విధివిధానాలను ప్రజలకు తెలపడం, గ్రామాలకు వచ్చే ప్రభుత్వాధికారులకు ప్రజల నుండి ఎటువంటి సహకారం అందకుండా చూడటం వరకు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఉద్యమం సందర్భంగా గ్రామాధికారులు తమ పదవులను తృణప్రాయంగా భావించి త్యజించారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా నివాసి షేక్‌ చిన ఆదం సాహెబ్‌ ఉప్పుటూరు గ్రామాధికారి పదవికి రాజీనామా చేశారు.  గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామాధికారి షేక్‌ మొహీద్దిన్‌, మరొక గ్రామాధికారి షేక్‌ ఫకీర్‌ అహమ్మద్‌లు తమ పదవులకు రాజీనామా చేసి సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
    జాతి స్వేచ్ఛ స్వాతంత్య్రాలు కోరుకుంటూ సాగుతున్న జాతీయోద్యమంలో భాగంగా జరుతున్న వివిధ పోరాటాలలో తమదైన పాత్ర నిర్వహిస్తున్న వచ్చినందుకు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన అబ్దుల్‌ సాహెబ్‌ ఐదు మాసాల కఠిన కారాగారవాస శిక్షను అనుభవించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన మదార్‌ సాహెబ్‌ నెల్లూరు, కండలూరు జైళ్లలో 15మాసాలు, 1921లో మద్యనిషేదం ఉద్యమంలో పాల్గొన్నందుకు మరో సంవత్సరం జైలుశిక్షను అనుభవించారు. విశాఖపట్టణానికి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ రజాక్‌ పలుసార్లు జైలు పాలయ్యారు.     కృష్ణాజిల్లా నూజివీడు నివాసి కొత్వాల్‌ అబ్బాస్‌ అలీ సాహెబ్‌ 9 మాసాలు రాజమండ్రి జైలులో గడిపారు. ఆయన ఆంధ్ర కాంగ్రెస్‌ కమిటీ నాయకులుగా, నూజివీడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యకక్షులుగా 1926 నుండి 1940 వరకు పనిచేశారు. విజయవాడకు చెందిన ససీరుల్లా ఖాన్‌ నాలుగు మాసాలు, నూజివీడు నివాసి మొహిద్దీన్‌ బెగ్‌ నాలుగు మాసాలు, గుడివాడ నివాసి ఖాశిం బేగ్‌ రెండు మాసాలు రాజమండ్రి జైలులో గడిపారు. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా వాసి మహమ్మద్‌ అక్బర్‌ సాహెబ్‌ నెల్లూరు, కడలూరు జైళ్ళలో ఏడాది జైలు జీవితం గడిపారు.  నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాకు చెందిన మహమ్మద్‌ అక్బర్‌ సాహెబ్‌ నెల్లూరు, కడలూరు జైళ్ళలో ఏడాది జైలు జీవితం గడిపారు. నెల్లూరుకు చెందిన వ్యాపారి మహమ్మద్‌ గౌస్‌ సాహెబ్‌ ఆరు మాసాలు, జైలు శిక్షకు గురయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన అబ్దుల్‌ హుదా సాహెబ్‌ ఒక సంవత్సరం జైలుశిక్ష అనుభవించారు. రేపల్లెకు చెందిన షేక్‌ దావూద్‌, షేక్‌ గులాబ్‌ హుస్సేన్‌, షేక్‌ ఉస్మాన్‌ నిర్బంధాలకు గురయ్యారు. సత్తెనపల్లి చెందిన రైతు షేక్‌ మీర్జా ఆలీ సాహెబ్‌ పన్ను వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో పాల్గొని ఆరు మాసాలు జైలులో గడిపారు. అదిలాబాద్‌కు చెందిన సయ్యద్‌ ఇబ్రహీం జిల్లాలో ఖిలాఫత్‌ ఉద్యమాన్ని నడిపి జైలు పాలయ్యారు. ఈ విధంగా విజయవాడకు చెందిన మొహమ్మద్‌ నూరుల్లా ఖాన్‌, కృష్ణానగర్‌ నివాసి మహమ్మద్‌ మింటో, నూజివీడుకు చెందిన మొహినుద్దీన్‌ ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుశిక్షను అనుభవించారు.
    ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం నైజాం సంస్థానాన్ని కూడా తాకింది. నిజాం నవాబు బ్రిటీషర్లకు ఎంత అనుకూలంగా ఉన్నాకూడా ముస్లిం జనసముదాయాలు మాత్రం ఏమాత్రం జంకకుండా ఉద్యమబాట నడిచారు. హైదరాబాద్‌కు చెందిన అబ్బాస్‌ సుభాన్‌, మహమ్మద్‌ అబ్దుర్రెహామన్‌ ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమాలకు తొలుతగా నేతృత్వం వహించగా, ఖిలాఫత్‌ కేంద్ర కమిటీకి ముహమ్మద్‌ అస్ఘర్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ ఉద్యమంలో మౌలానా సయ్యద్‌ అబ్దుల్‌ హై, ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం, సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌  ప్రముఖ పాత్రవహిచారు. నైజాం సంస్థానంలో డిప్యూటి కలక్టర్‌ ముహమ్మద్‌ రాజా బిల్‌గ్రామి ఖిలాఫత్‌-సహయ నిరాకరణ ఉద్యమాన్ని పూర్తిగా సమర్థించిన కారణంగా ఆగ్రహించిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయన పెన్షన్‌ను రద్దు చేసింది.
    ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో హిందూ-ముస్లింలు తమ ఆచార సాంప్రదాయాలను, మత మనోభావాలను గమనంలో పెట్టుకుని సాగుతున్నట్టుగానే హైదరాబాదులో కూడా ఖిలాఫత్‌- సహాయనిరాకరణోద్యమం సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా గోవధను నిషేధిస్తూ, గోమాంసం స్వీకరించరాదని నిర్ణయించారు. జాతీయోద్యమ నేత ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం ముంజేతికి హిందూ సోదరులు ప్రేమపూర్వకంగా రాఖీలు కట్టగా, భారీ సంఖ్యలో సమావేశమైన హిందూ-ముస్లింలు పరస్పరం రాఖీలు కట్టుకొని ఐక్యతను ప్రదర్శించిన ఘట్టాల గురించి తెలుసుకున్న బ్రిటీష్‌ రెసిడెంటు మండిపడుతూ నగరంలో సభలు-సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని నిబంధనలు విధింపచేశాడు. ప్రభుత్వం విధించిన నిషేధాన్ని, నిబంధనలను ఉల్గంఘిస్తూ  'జమాయత్‌- యే-నౌజవాన్‌- యే-తుల్పా' సఢ్యులు ముహమ్మద్‌ అబ్దుల్‌ రహమాన్‌ రియాస్‌, అవిూర్‌ అహమ్మద్‌, సయ్యద్‌ ఇబ్రహీం, అబ్దుస్‌ సుభాన్‌, అతా హుస్సేన్‌లు 1920 మే 30న సభను నిర్వహించగా నిజాం ప్రభుత్వం వార్ని అరెస్టు చేసి నగరం నుండి బహిష్కరించారు.
    భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు అన్ని ఉద్యమపోరాట రూపాలలో భాగస్వాములవుతున్న ముస్లింలు సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా సాగిన మద్యపాన నిషేధ పోరాటంలో కూడా తమదైన పాత్రను నిర్వహించారు. గుంటూరు, నెల్లూరు, బళ్ళారి, అనంతపురం, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాలోని ముస్లింలు ప్రజానీకం పెద్ద సంఖ్యలో, ఎంతో ఉత్సాహంతో మద్యపాన నిషేధోద్యమంలో పాల్గొన్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన సయ్యద్‌ మొషిన్‌ సాహెబ్‌,  మహబూబ్‌ హుస్సేన్‌ సాహెబ్‌ మద్యపాన నిషేధ కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర వహించారు. మహబూబ్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనర్ఘళంగా మాట్లాడటమే కాకుండా, ఉద్యమ గీతాలను మధురంగా పాడుతూ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడ్డారు. హైదరాబాదు రాష్ట్రంలోని బారువంచా గ్రామంలోని జాగీరుదార్లు కుహేష్‌ సాహెబ్‌, బుర్హాన్‌ సాహెబ్‌లు కల్లు, సారాలను విక్రయించవద్దంటూ, నిషేధాన్ని ప్రోత్సహించారు.
    భారతావనిని కుదిపివేసిన సహాయ నిరాకరణ-ఖిలాఫత్‌, శాసనోల్లంఘన ఉద్యమాల సమయంలో ఆంధ్రలో మన్యం తిరుగుబాటు రంగం విూదకు వచ్చింది. 1922-24 మధ్యలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమంలో డివిజనల్‌ మేజిస్ట్రేటుగా (డిప్యూటీ కలెక్టరు) పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్‌ రామరాజుకు ప్రేరణ, ప్రోత్సాహకారి మాత్రమే కాకుండా మన్యం విప్లవానికి సారధ్యం వహించేంతగా రాజుకు తోడ్పాటు ఇచ్చారు. 1922 జూలై 27న ఫజులుల్లా ఖాన్‌ ఆకస్మికంగా కన్నుమూయడంతో మన్యం విప్లవంలో ఆయన పాత్ర అసంపూర్ణంగా ముగిసింది. (మన్యంలో విప్లవం, పొన్నలూరి రాధాకృష్టమూర్తి, ప్రజాప్రచురణలు, ఏలూరు, 1975)
    మాతృభూమి విూద నుండి పరాయి పాలకులను పాలద్రోలాలంటే విదేశీ వస్తువుల వ్యామోహం వదలాలని, స్వదేశీ కుటీర పరిశ్రమలను అభివృద్ధిపర్చుకోవాలని మహాత్ముడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖద్దరు ఉద్యమం రూపుదిద్దుకుంది. ఈ ఉద్యంలో భాగంగా గుంటూరు జిల్లా తొలిసారిగా మహమ్మద్‌ ఇస్మాయిల్‌ తెనాలిలో 1926లో ఖద్దరుషాపు ప్రారంభించి చివరకు 'ఖద్దరు ఇస్మాయిల్‌' గా శ్యాశ్విత నామధేయులయ్యారు. ఈ తరహాలోనే నిరంతరం ఖద్దరు ధరించడమే కాకుండా ఖద్దరు విక్రయశాల ఉద్యోగిగా ఖద్దరు ప్రచారాన్ని నిర్వహించిన షేక్‌ ఖాశిం బేగ్‌ ఖద్దరు జుబ్బా ఖాశిం బేగ్‌గా గుర్తింపు పొందారు.
    అటు నైజాంలోని హైదరాబాద్‌ నగరంలో ప్రముఖ జాతీయోద్యమకారిణి  బేగం ఫక్రుల్‌ హాజియా స్వయంగా ఖద్దరు వస్త్రాలను ధరించడమే కాకుండా విదేశీ వస్తువుల బహిష్కరణలో పాల్గొని  ట్రూప్‌ బజారులోని  స్వగృహం అబిద్‌ మంజిల్‌లో విదేశీ వస్త్రాలను అగ్నికి ఆహుతి ఇచ్చారు. ఆమె తనయుడు బద్రుల్‌ హసన్‌ బొంబాయి నుండి రాట్నాలు తెప్పించి, హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. తిలక్‌ స్వరాజ్య నిధికి ఆయన 23 వేల రూపాయలు సేకరించి పంపారు. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాక సందర్భంగా నిరసన తెలియజేస్తూ విదేశీ వస్తువులను తగులబెట్టిన తొలి వ్యక్తిగా బద్రుల్‌ హసన్‌ ఖ్యాతిగాంచారు.     నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముహమ్మద్‌ ఉస్మాన్‌ తన కర్మాగారంలోని విదేశీ బట్టలను పోగేసి తగులబెట్టారు.
    బహుముఖంగా విస్తరిస్తున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు అక్షరయోధులు అధికంగా శ్రమించారు.     నగరంలోని నిజాం కళాశాలకు చెందిన గౌసుద్దీన్‌ అను విద్యార్థి హిందూ-ముస్లింల ఐక్యతకు సంబంధించి  గ్రంథం  ప్రచురించారు. గోషా మహల్‌ నివాసి ముహమ్మద్‌ జహుర్‌ అహమ్మద్‌ ఖాదీ ఉద్యమాన్ని బలపర్చుతూ  రాసిన ఉత్తేజకరమైన వ్యాసాలు హైదరాబాదులోని ముషీర్‌-యే-దక్కన్‌,  మదీనా ఉర్దూ పత్రికలో ప్రచురితమయ్యాయి.
    ఈ క్రమంలో ఉద్యమం సాగుతుండగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని చౌరీచౌరా పోలీస్‌ స్టేషన్‌ విధ్యంసం, పోలీసు ఆధికారుల విూద దాడి సంఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తరువాతి క్రమంలో జాతీయోద్యమ వేదిక మీదకు వచ్చిన సైమన్‌ కమీషన్‌ను బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా మద్రాసులో షఫీ మహమ్మద్‌ ప్రముఖ పాత్ర నిర్వహించారు. జాతీయోద్యమాన్ని మరింత ఉదృతం చేయడానికి యువజన-విధ్యార్థులను రంగం మీదకు తెచ్చేందుకు గుంటూరుకు చెందిన గాలిబ్‌ సాహెబ్‌, రహిమాన్‌లు అవిరళ కృషి సల్పారు. షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌ బ్రాడిపేటలో ఆయన తన సోదరుని పేరిట నిర్వహించిన  లాండ్రి షాపు ఆనాడు జాతీయ ఉద్యమకారులకు రహస్య కూడలి అయ్యింది. ఆ కారణంగా ఆ లాండ్రి విూద పలుమార్లు పోలీసుల దాడి చేశారు.
    ఈ మేరకు సంపూర్ణ స్వరాజ్యం సాధనకు అనుసరించాల్సిన ఉద్యమ వ్యూహాన్ని నిర్ణయించమని కాంగ్రెస్‌ గాంధీజీని కోరింది. సంపూర్ణ స్వరాజ్యం తమ లక్ష్యంగా ప్రకటించి ముందుకు సాగుతున్న ఉద్యమాన్ని అడ్డుకోవడానికి బ్రిటీష్‌ వైశ్రాయి ఇర్విన్‌ నిరంకుశంగా వ్యవహరించ సాగాడు. బ్రిటీష్‌ వైశ్రాయి అప్రజాస్వామిక వ్యవహార సరళికి వ్యతిరేకంగా గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, జాతీయోద్యమంలో చిచ్చరపిడుగుగా ఖ్యాతి గడించిన హస్రత్‌ మెహాని చే ప్రశావితులైన నగరానికి  చెందిన రజియా బేగం, జమాలున్నీసా బాజి, వారి అన్నదమ్ములు అన్వర్‌, జాఫర్‌లు ఉద్యమ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ కుటుంబీకులందరూ స్వేచ్ఛా-స్వాతంత్య్రాలు, అన్నిరకాల అసమానతల నుండి ప్రజల విముక్తి కోరుతూ జాతీయోద్యమంలో పాల్గొనడమే కాకుండా, అటు సామ్రాజ్య విస్తరణకాంక్ష గల బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఎదిరించడంతోపాటు, నిజాం వ్యతిరేక పోరాటాలలో పాల్గ్గొన్నారు.
    బ్రిటీషు ప్రభుత్వ చట్టాల ఉల్లంఘన ద్వారా శాసనోల్లంఘన ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్న మహాత్మా గాంధీ 1930 మార్చి 20న గుజరాత్‌లోని దండి యాత్ర  ఆరంభించగానే మద్రాసులో జరిగిన శాసనోల్లంఘనలో ఒబైదుల్లా సాహెబ్‌ అరెస్టు అయ్యారు. చిత్తూరుజిల్లా మదనపల్లె తాలూకా పెదపాలెం నివాసి షేక్‌ ఇమాం, ప్రకాశం జిల్లా, అమ్మనబ్రోలుకు చెందిన షేక్‌ చెంగీ షా కనపర్తిలోని ఉప్పు కొటారాల విూద జరిగిన దాడిలో పాల్గొన్నారు. బెహాంపూర్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌, పశ్చిమ గోదావరికి చెందిన డాక్టర్‌ నశీర్‌ అహమ్మద్‌ విదేశీ వస్తువుల బహిష్కరణ, మద్యనిషేధం ఉద్యమంలో పాల్గొన్నారు. డాక్టర్‌ నశీర్‌  స్వగృహం వద్దే శాసనోల్లంఘన ఉద్యమ శిబిరం ఏర్పాటు చేశారు. జాతీయ కాంగ్రెస్‌ సభ్యులైన ఆయన ఆరు నెలల జైలు జీవితం గడిపారు. గుంటూరుకు చెందిన షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌, నెల్లూరు జిల్లాలో యల్‌.ఫకీర్‌, యం.షంషీర్‌ బేగ్‌ పలుమార్లు జైలుశిక్షలకు గురయ్యారు. ఈ సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రచురించిన కరపత్రాలను పంచుతున్న నేరానికి అబ్దుల్‌ రజాక్‌, షేక్‌ మూసా సాహెబ్‌, షేక్‌ నబీసాహెబ్‌లు పోలీసులు దాడికి గురయ్యారు. చీరాల యువకుల ఆహ్వానం మేరకు వెళ్ళి ఉప్పుగుడారాలలోకి దూకిన ముహమ్మద్‌ గౌస్‌ దేవరంపాడు శిబిరానికి నాయకత్వం వహించారు.
    1931లో గాంధీజీ-ఇర్విన్‌ల మధ్యన కుదిరిన ఒప్పందం తెచ్చిన ఉపశమనం అతి త్వరలో ముగిసింది. బ్రిటీషు ప్రభుత్వం జాతీయోద్యమాన్ని తీవ్రంగా అణిచివేయాలని నిర్ణయించుకుని కిరాతక చట్టాలు రూపొందించగా  మహాత్ముడు  వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని రూపొందించారు. ఈ పరిణామంతో రెచ్చిపోయిన అధికారగణం విజయవాడలోని ప్రతిష్టాకరమైన భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యాలయం విూద కూడా పోలీసులు దాడులు నిర్వహించి కార్యాలయానికి తాళాలు వేశారు. ఈ చర్యను అవమానకరంగా భావించిన యువనాయకుడు సయ్యద్‌ హబీబుల్లా ముందుకు వచ్చి తన సహచరులతో కలసి 1932 జులై 31న కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు  విఫల ప్రయత్నం చేశారు. ఈ సంఘటన పురస్కరించుకుని యువ నాయకుడు సయ్యద్‌ హబీబుల్లాతోపాటుగా  70మంది యువకులు అరెస్టయ్యారు. (భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర, కృష్ణాజిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం, విజయవాడ, 1984, పేజి.92) ఈ సందర్బంగా ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు తెనాలి ఉన్నత పాఠశాల విద్యార్థి షేక్‌ మహబూబ్‌ ఆదం, ఆయన గురువు మంత్రవాది వెంకటరత్నంలు పోలీసుల కన్నుగప్పి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు.
    1932 ఆగస్టు 17న ప్రభుత్వం కమ్యూనల్‌ అవార్డును ప్రకటించింది. హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.  ఈ సందర్భంగా గాంధీజీ జరిపిన హరిజన యాత్రలో భాగంగా 1933 డిసెంబరు 31న తిరుపతికి రాగా అక్కడ సి.ఎ.రహీం అను ఉత్సాహవంతుడైన యువకుడు అక్కడికక్కడ కాగితం విూద చేతి గోటితో మహాత్ముని చిత్రాన్ని చిత్రించిన ఆయనకు బహుకరించారు.
    ఆ తరువాత సంభవించిన వివిధ పరిణామాల వలన, సంపూర్ణ స్వరాజ్య సాధనా లక్ష్యంగా ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం బలహీనపడి 1934లో పూర్తిగా ముగిసింది. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమించుకోవడం పట్ల యువకులు కినుక వహించిన మున్షీ మహమ్మద్‌ మస్తాన్‌ (తెనాలి) రహమతుల్లా (ఒంగోలు) విప్లవకర చర్యలకు పాల్పడ్డారు. విప్లవ కరపత్రాలను పంచడమే కాక, మంతెనవారి పాలెంలో రహస్యంగా నిర్వహించిన రాజకీయ తరగతులకు హాజరౖెెన  మున్షీ మస్తాన్‌ పోలీసుల చేత చావుదెబ్బలు తిన్నారు.   
     1939లో ఏర్పడిన హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్‌ స్థాపనకు తోడ్పడిన పలు సంస్థలలో నిజాం సబ్జెక్ట్సు లీగ్‌ కార్యకలాపాల్లో  అబుల్‌ హసన్‌ సయ్యద్‌ అలీ, బద్రుల్‌ హసన్‌, ఫజులుర్రెహమాన్‌, సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌ ప్రధాన పాత్ర నిర్వహించగా,  ప్రముఖ జాతీయవాది బద్రుల్‌ హసన్‌ విదర్‌ హైదరాబాద్‌ (ఇనీరిశినీలిజీ కగిఖిలిజీబిలీబిఖి) అను గ్రంథాన్ని రాసి నిజాం సబ్జెక్ట్సు లీగ్‌ భావాలను ప్రచారం చేయగా, నిజాం ప్రభుత్వం ఆ గ్రంథాన్ని నిషేధించింది. ఆ తరువాత ఏర్పడిన 'స్వదేశీ లీగ్‌'కు నిజాం ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు ఫజులుల్‌ ర్రెహమాన్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. (హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర ః వెల్దుర్తి మాణిక్యరావు). ఆ తరువాత ఏర్పడిన హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్‌కు వ్యవస్థాపకులలో  మౌల్వి సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌ ఒకరుగా ఖ్యాతిగాంచారు. ఆయనతోపాటుగా  షేక్‌ నబీ సాహెబ్‌, షేక్‌ మొయినుద్దీన్‌ తదితరులను ప్రచార కార్యక్రమాలలో పాల్గొని  చాలా కాలం నిజాం ప్రభుత్వం నిర్బంధంలో గడిపారు.
    1939లో ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.  సంపూర్ణ స్వరాజ్యం కోరుతుండగా బ్రిటీష్‌ పాలకులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, నాయకులతో ఏమాత్రం సంప్రదించకుండా ఎకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ద్వితీయ ప్రపంచ యుద్ధంలో తమల్ని భాగస్వాములను చేయడాన్ని  సహించలేకపోయారు. ఆ నేపధ్యంలో 1940 అక్టోబరు 17న ఆచార్య వినోబా భావేను తొలి సత్యాగ్రహిగా అనుమతిస్తూ  మహాత్ముడు చారిత్రక వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా     అనంతపురం జిల్లా రాయదుర్గం చెందిన స్వర్ణకారుడు గుంతకల్‌ బాబా సాహెబ్‌ నెల్లూరు, అలీపూర్‌ జైలులో ఏడు మాసాల శిక్షను అనుభవించారు. గుంతకల్‌ బాబా సాహెబ్‌గా ఖ్యాతి గాంచిన బాబా సాహెబ్‌ అనంతపురం జిల్లా కణేకల్లు నివాసి. ఆయన ఆనాటి ప్రముఖ నాయకులతో కలసి వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. హిందూపూర్‌ నివాసి, టైలర్‌ పీర్‌ సాహెబ్‌, డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రూల్స్‌ క్రింద మూడు మాసాలు, ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకు చెందిన టాంగా డ్రెవర్‌ షేక్‌ చెంగీ షా మూడు మాసాల కఠిన జైలుశిక్ష అనుభవించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వ్యాపారి షేక్‌ అలీ సాహెబ్‌ తీవ్రమైన లాఠీచార్జీకి గురి కావడమే కాకుండా నాలుగు మాసాల జైలు శిక్షకు గురయ్యారు. తణుకు తాలూకాకు చెందిన మహమ్మద్‌ హుస్సేన్‌ వ్యక్తి సత్యాగ్రహం కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఆకివీడు పరిసర గ్రామాలకు చెందిన ఉద్యమకారులు మహమ్మద్‌ గౌస్‌, మహమ్మద్‌ హుస్సేన్‌ తదితరులు ఆకివీడులో నివాసముంటున్న స్ధానిక ప్రభుత్వ ప్రతినిధులైన కరణం, మునసబుల గృహాలకు వెళ్లి ప్రభుత్వ రికార్డులను బయటకు తెచ్చి కుప్పగా పోసి తగులబెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అబ్దుల్‌ మజీద్‌ ఖాన్‌ తదితరులను అరెస్టులు చేసి స్పృహ కోల్పోయేంత వరకు పోలీసులు క్రూరంగా చితకబాదారు. ఆ తరువాత వీరందరికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రెండు వందల రూపాయల జరిమానా విధించటం జరిగింది. నరసాపురం నాయకులు షేక్‌ మీరా టెలిఫోన్‌ తీగలను తెంపి, రిజిష్ట్రారు ఆఫీసు వద్ద ప్రభుత్వ రికార్డులు దగ్ధం చేసిన సందర్భంగా లాఠీచార్జీకి గురయ్యారు. తాడేపల్లి గూడెంకు చెందిన షేక్‌ పెద మస్తాన్‌ రెండు సంవత్సరాలు జైలుశిక్షకు గురయ్యారు. షేక్‌ రహీం ఖాన్‌కు ఒక మాసం జైలు, 12 లాఠీ దెబ్బల శిక్ష విధించారు. కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన కొత్వాల్‌ అబ్బాస్‌ అలీ కుమారుడు మహమ్మద్‌ హుస్సేన్‌ లాఠీఛార్జీలో తీవ్రంగా గాయపడ్డారు. కొనకంచి నివాసి షేక్‌ సర్దార్‌ సాహెబ్‌కు కోర్టు ముగిసేవరకు శిక్ష పడింది. అయినా ఆయన మళ్ళీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ విధంగా అనేక సంఘటనల్లో పలువురికి కఠినశిక్షలు పడ్డాయి.
    కర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన షంషేర్‌ బేగ్‌కు ఆరు మాసాల జైలు, 500 జరిమానా లేక మూడు మాసాల జైలు శిక్ష విధించారు. జరిమానా కట్టడానికి ఆయన నిరాకరించారు. జరిమానా కడితే తాను చేసిన పనిని నేరంగా అంగీకరించటమేనని భావించిన ఆయన జరిమానా కట్టకుండా అదనంగా మూడు మాసాల జైలు జీవితం గడిపారు. నంద్యాల -పాణ్యం మధ్యన రైల్వేలైనుకు ఫిష్‌ ప్లేట్లు తొలగించినందుకు గాను షంషేర్‌ బేగ్‌, ముల్లా, మహబూబ్‌ సాహెబ్‌లు ఏడాది జైలు శిక్షను అనుభవించారు. షంషేర్‌ బేగ్‌ ఆ తరువాత కూడా ఉద్యమంలో నిర్విఘ్నంగా పాల్గొన్నారు. స్వతంత్ర భారతంలో రెండు సార్లు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎంపికయ్యారు. కడపజిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామానికి చెందిన సామాన్య రైతు దూదేకుల హుస్సేన్‌ సాహేబ్‌ రెండు మాసాలు దారుణమైన జైలు జీవితాన్ని రుచి చూశారు. కదిరికి చెందిన యస్‌. ఖాజా మొహిద్దీన్‌ సాహెబ్‌ పలు ప్రదర్శనలు నిర్వహించి, ఆ ప్రదర్శనలలో బ్రిటీష్‌ ప్రభుత్వ దుర్మార్గాలను బహిరంగ పర్చుతూప్రజలను ఉద్యమ బాటన నడవాల్సిందిగా ప్రోత్సహిస్తూ ముందుకుసాగి శిక్షలను అనుభవించారు.
     కడప జిల్లా కొండాపసూర్‌ గ్రామస్థులు షేక్‌ నబీ రసూల్‌ గాంధీజీ ఉపన్యాసాలతో ప్రభావితమై, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆయన మూడు మాసాల జైలు శిక్షను రుచిచూడాల్సి వచ్చింది. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనడాన్ని స్వగ్రామం వద్దంటున్నా ఆయన ధైర్యంగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా కడప కోటిరెడ్డి సహచరుడు డి. హుస్సేన్‌ సాహెబ్‌ రెండు మాసాల శిక్షకు గురి కాగా, షేక్‌ మహమ్మద్‌ సాహెబ్‌ అఖిల భారత ముస్లిం లీగ్‌ రాజకీయాలతో ప్రభావితులైన ముస్లింలను కాదంటూ జాతీయోద్యమ పోరాట కార్యక్రమాలలో పాల్గొని ప్రముఖ పాత్రను నిర్వహించారు.
    జాతీయోద్యమంలో భాగంగా యుద్ధ వ్యతిరేక ప్రచారంలో పాల్గొంటున్న కొండా అప్పాపురం నివాసి టైలర్‌ షేక్‌ నబీ రసూల్‌ సాహెబ్‌ మూడు మాసాలు, గుంటూరుకు చెందిన సయ్యద్‌ జానీ సాహెబ్‌ నరసరావుపేట జైలులో నెల రోజులపాటు శిక్షను అనుభవించారు. షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌, షేక్‌ అలీలు అరెస్టయ్యారు. యుద్ధ వ్యతిరేక నినాదాలు చేసినందుకు వెంకటగిరి నివాసి షేక్‌ చబీ సాహెబ్‌కు కోర్టు ముగిసేవరకు నిలబడాల్సిందిగా న్యాయస్థానం శిక్ష విధించింది. అనంతపురం జిల్లా చియ్యడు గ్రామానికి చెందిన రబియాబి భర్త మొహిద్దీన్‌ సాహెబ్‌తో కలిసి వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని చరిత్ర సృష్టించారు.ఆంధ్రావనిలో ఒక ముస్లిం మహిళ వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమంలో బహిరంగంగా ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే ప్రథమమని పలువురు శ్లాఘించారు. జాతీయోద్యమకారుడైన భర్త మొహిద్దీన్‌ సాహెబ్‌ ఆమెను ప్రోత్సహించడంతో, రబియాబి మరింత ఉత్సాహంతో యుద్ధ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆనాడు సాగిన యుద్ధ వ్యతిరేక బహిరంగ ప్రదర్శనలో రబియాబి స్వయంగా పాల్గొనటమే కాక యుద్ధ వ్యతిరేక నినాదాలిచ్చి పలువుర్ని ఆశ్చర్యచకితులను చేశారు.
     1941 జనవరిలో జర్మనీ, జపాన్‌ల సహకారంతో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించాలని భావించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ భారతదేశం నుండి అదృశ్యమయ్యారు. ఆ ప్రయత్నంలో ఆయనకు మియా అక్బర్‌షా సహకరించారు. బ్రిటీష్‌ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు నేతాజీ  ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ పరిస్థితులతో ఆందోళనకు గురైన ఆంగ్ల ప్రభుత్వం 1940-41లో జాతీయ ఉద్యమకారులను విడుదల చేసి, ప్రజల మీద నిర్బంధాలను, నిషేధాలను కొంతమేరకు సడలించింది.
    జాతీయోద్యమ నాయకులతో రాయబారం జరపడానికి 1942 మార్చిలో సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ భారతదేశం వచ్చాడు. క్రిప్స్‌ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేనందున, భారతీయ నాయకత్వం అంగీకరించలేదు. క్రిప్స్‌ రాయబారం విఫలమైంది. 1942 జులైలో మహాత్ముడు  ఇది బాహాటమైన తిరుగుబాటు అని హెచ్చరిక చేశారు. 1942 ఆగస్టులో బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, క్విట్‌ ఇండియా పోరాటానికి సమర శంఖారావం పూరించింది. బ్రిటీష్‌ వారిని భారతదేశం వదలి పొమ్మంటూ 1942 జూలైలో వార్ధాలో చేసిన తీర్మానాన్ని, బొంబాయి సమావేశం ధృవీకరించింది. ఆ తీర్మానం క్విట్‌ ఇండియా తీర్మానంగా ప్రసిద్ధి పొందింది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి గాంధీజీ మాట్లాడుతూ విజయమో-వీరస్వర్గమో ('ఈళి ళిజీ ఈరిలి') తేల్చుకోవాలన్నారు.
     జాతీయ నాయకుల పిలుపు మేరకు జనసమూహాలు కూడా కదిలాయి. ప్రభుత్వం ప్రజల విూద విరుచుకపడింది. ఈ క్రమంలో, అనంతపూర్‌ జిల్లా కదిరి నివాసి మహబూబ్‌ సాహెబ్‌ కొత్తకోట అటవీ శాఖ కార్యాలయాన్ని తగుల బెట్టినందుకు జైలుకు వెళ్ళారు. అనంతపురం జిల్లాకు చెందిన యం.మొహిద్దీన్‌ సాహెబ్‌, యం.అఫ్సర్‌ ఆలీ, తదితరులు మధ్యం వ్యాపారుల బెదిరింపులకు లొంగకుండా మద్యనిషేధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆనాడు మహమ్మద్‌ ఆలీ జిన్నాతో వ్యక్తిగత పరిచయం ఉన్న వ్యక్తిగా ప్రసిద్ధుడైన మహమ్మద్‌ అలీ ముస్లింలీగ్‌ రాజకీయాలకు దూరమై ఈ పోరాటంలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వ్యవసాయదారుడు అబ్దుల్‌ బజీద్‌ ఖాన్‌ ఒకటిన్నర సంవత్సరం జైలుశిక్షను  అనుభవించారు. ఆ తరువాత అతి చిన్నవయస్సులోనే జిల్లా బోర్డు సభ్యునిగా ఎన్నికైన ఆయన చరిత్ర సృష్టించారు. భీమవరం వ్యాపారి షేక్‌ అలీ సాహెబ్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఆ సందర్భంగా జరిగిన లాఠీ ఛార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత కూడా బ్రిటీష్‌ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న ఆయన పలుమార్లు జైలు శిక్షలకు గురయ్యారు. ఆలీపూర్‌ క్యాంపులో రెండు సంవత్సరాల పాటు పలు కడగండ్లు అనుభవించారు. స్వాతంత్య్రం సిద్ధించాక 1946లో కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గ సభ్యునిగానూ, రాష్ట్ర కార్యవర్గంలోనూ బాధ్యతలను నిర్వహించారు. భీమవరం నివాసి షేక్‌ ఫకీర్‌ మొహిద్దీన్‌ 17-8-1942 నాటి జాతీయోద్యమ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జైలుశిక్ష, ఎనిమిది కొరడా దెబ్బల శిక్షకు గురయ్యారు. ఆయన 1943 డిసెంబరు 9 వరకు అలీపూర్‌ జైలులో గడిపారు. తాడేపల్లిగూడెం తాలూకా నవాబుపాలెం రైల్వే గేట్‌మన్‌ షేక్‌ పెద మస్తాన్‌ సంవత్సరం పాటు అలీపూర్‌ క్యాంపు జైలు బాధలను రుచి చూశారు. తాడేపల్లిగూడెం నివాసి షేక్‌ రహీంఖాన్‌ పెంటపాడు తపాల కార్యాలయం తగులబెట్టిన సంఘటనలో ప్రధాన పాత్ర వహించినందున 12 కొరడా దెబ్బల శిక్షను అనుభవించారు.
    కృష్ణాజిల్లా తిరువూరు తాలూకా గౌరంపాలెం నివాసి సాలార్‌ సాహెబ్‌, స్వాతంత్య్ర సమర యోధుడు కొత్వాల్‌ అబ్బాస్‌ ఆలీ కుమారుడు కొత్వాల్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ పోలీసుల నిర్బంధానికి గురయ్యారు. నూజివీడుకు చెందిన షేక్‌ నూరుల్లా సాహెబ్‌, కొనకంచి నివాసి షేక్‌ సర్దార్‌ సాహెబ్‌ వ్యక్తిసత్యాగ్రహం నుండి క్విట్‌ ఇండియా ఉద్యమం వరకు నిరంతరం కార్యక్రమాలలో పాల్గొన్నారు. నందిగామ తాలూకా కొనకంచి గ్రామాధికారి షేక్‌ బికారీ సాహెబ్‌ ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న కిరాతక వైఖరికి నిరసనగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆలూరు తాలూకా నెమకల్‌కు చెందిన టైలర్‌ యం.అక్బర్‌ ఆలీ ఎనిమిది మాసాల జైలు శిక్షకు గురయ్యారు. అనంతపురం జిల్లా కసాపురం నివాసి మహమ్మద్‌ రసూల్‌ గుంతకల్‌ వద్ద రైల్వేస్టేషన్‌ ధ్వంసం చేసిన సంఘటనలో మిత్రులతో కలసి పాల్గొన్నందున ఆరు మాసాల జైలు శిక్షను అనుభవించారు. మదనపల్లె నివాసి పి. మదార్‌ సాహెబ్‌ పోలీసు లాఠీ దెబ్బలకు గురయ్యారు. నంద్యాల తాలూకా తొగిరిచేడుకు చెందిన రైతుకూలీ ముల్లా మహబూబ్‌ సుభాని అలీపూర్‌జైలులో ఆరు మాసాల జైలుశిక్ష అనుభవించారు.     నెల్లూరు జిల్లా కావలికి చెందిన షేక్‌ మొహద్దీన్‌ సాహెబ్‌ నిర్బంధానికి గురయ్యారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన టైలర్‌ షేక్‌ హటల్‌ సాహెబ్‌ను అరెస్టు చేసి డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రూల్స్‌ క్రింద 18 మాసాల శిక్షను విధించారు. నిడుబ్రోలుకు చెందిన షేక్‌ మస్తాన్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్నారు. ఆయనకు ప్రభుత్వం మూడు సంవత్సరాల ఆరు మాసాల జైలుశిక్ష విధించింది. బస్‌కండక్టర్‌ ముహమ్మద్‌ హనీఫ్‌ అలీపూర్‌, రాజమండ్రి జైళ్లలో సంవత్సరం గడిపారు.తెనాలికి చెందిన మున్షీ సయ్యద్‌ మహమ్మద్‌ మస్తాన్‌ తెనాలి రైల్వే స్టేషన్‌ విూద జరిగిన దాడిలో పాల్గొని, అక్కడ జరిగిన పోలీసు కాల్పుల్లో చావు తప్పి బయటపడ్డారు. ఆ తరువాత కొంతకాలం రహస్య జీవితం గడిపారు. తెనాలికి చెందిన మరోయోధుడు సయ్యద్‌ అబ్దుల్‌ అజీం ఉద్యమ కార్యకలాపాలలో పాల్గొనడమే కాక, మద్రాసులో కొంతకాలం అజ్ఞాతవాసం చేశారు.   
    ముస్లింల సంక్షేమం, రాజ్యాధికారం ప్రధాన లక్ష్యంగా అఖిల భారత ముస్లింలీగ్‌  మద్రాసు నగరవాసుల గుప్పెట నుండి బయట పడి గుంటూరు జిల్లా కేంద్రం బాగా బలపడింది.1944 మే 5న తెనాలిలో సయ్యద్‌ మహబూబ్‌ నాయకత్వంలో ముస్లింలీగ్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ న్యాయవాది ముహమ్మద్‌ అబ్దుల్‌ సలాం అధ్యక్షత వహించగా  సయ్యద్‌ మహబూబ్‌, ముహమ్మద్‌ యాశిన్‌, అబ్దుల్‌ కరీం, అల్లాబక్ష్‌ లాంటి ప్రముఖులు సభ్యులుగా ముస్లింలీగ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కమిటీ ఎన్నికయ్యింది. 1945 జనవరి 21న బాపట్లలో గుంటూరు జిల్లా ప్రైమరి లీగ్‌ అధ్యక్ష కార్యదర్శుల ప్రథమ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కవి ఉమర్‌ అలీషా మాట్లాడుతూ  మన దేశంలో కాంగ్రెసు, ముస్లిం లీగు రెండు పెద్ద రాజకీయ సంస్థలు. రెండు ఏకమైతేనేగాని పరదేశ పాలకవర్గాన్ని తరుమలేము. హిందూ-ముస్లిం తగాదాలు పోరాటాలు విదేశ పాలకులను ఇక్కడే శాశ్వితముగా అట్టి పెట్టగలవు. ఈ సత్యాన్ని ఉభయులు గ్రహించాల,ని ఉద్బోధించారు. అఖిల భారత ముస్లింలీగ్‌ రాజకీయ దృక్పధం ఏలా ఉన్నా ఆంధ్రలోని ముస్లింలలో అత్యధికుల రాజకీయ దృక్కోణం మాత్రం భిన్నంగా వ్యక్తం అయ్యింది. ఆయన  మార్గ నిర్దేశకంలో ముస్లింలీగ్‌ పాకిస్థాన్‌ కొరకే కాకుండా ముస్లిం ప్రజలకు నిత్యం సహాయ సహకారిగా నిరూపించాలి, అని స్పష్టంగా ప్రకటించింది. ఈ కార్యక్రమాలలో  అజీజుల్లా దుర్రాని (ఇంగ్లాండు), అబ్దుల్‌ మన్నాన్‌ దుర్రాని (అలీఘర్‌), డాక్టర్‌ మహమ్మద్‌ బేగ్‌, యం.ఎ. సలాం, షేక్‌ మగ్దూం, యస్‌ మహబూబ్‌లు పాల్గొన్నారు.
     బ్రిటీష్‌ దాస్య శృంఖాలాల నుండి విముక్తం చేయడానికి జర్మనీ వెళ్ళిన సుభాష్‌ చంద్రబోస్‌ అటు నుండి బర్మా చేరుకుని కెప్టన్‌ మాన్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యం (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ )పగ్గాలను సుభాష్‌ చంద్ర బోస్‌ స్వీకరించారు. ఆయన నేతృత్వంలో భారత జాతీయ సైన్యం, స్వతంత్ర భారత ప్రభుత్వం  ఏర్పడింది. ఇటు సైన్యంలో అటు ప్రభుత్వంలో మస్లిం యోధులు, మేధావులు నేతాజికి సన్నిహితంగా ఉంటూ అండదండలు అందించారు. ఈ క్రమంలో హైదరాబాదుకు చెందిన అబిద్‌ హసన్‌ సఫ్రాని లాంటి వారు ఉన్నత స్థానాలలో బాధ్యతలు నిర్వహించగా  ఖమురుల్‌ ఇస్లాం, తాజుద్దీన్‌ గౌస్‌, హైదరాబాద్‌ చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ (వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీ) యజమాని కుమారుడు అలీ సుల్తాన్‌ కూడా నేతాజీతో కలసి పనిచేశారు. ఈ మేరకు హైదరాబాదు సంస్థానానికి చెందిన షరీఫుద్దీన్‌, అబ్దుల్‌ సయీద్‌ ఉస్మాని, అబ్దుల్‌ లతీఫ్‌, ఇమాముద్దీన్‌, ముహమ్మద్‌ ఖాన్‌ లాంటి పలువురు నేతాజీ వెంట నడిచారు.     ఈ యోధులలో ఆబిద్‌ హసన్‌ సఫ్రాని లాంటి వారు స్వాతంత్య్ర పోరాట సాహిత్య చరిత్రలో అపూర్వం అనదగిన జైహింద్‌, నేతాజీ అను పదాలను సృష్టించారు. విజయనగరం జిల్లా వేపాడు గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ చిన్నతనంలోనే పనికోసం బర్మాకు వెళ్ళి అక్కడి తేయాకు తోటల్లో శ్రమిస్తూ దాచుకున్న 20 వేల రూపాయలను అజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు విరాళంగా సమర్పించి తాను కూడా ఆజాద్‌ హింద్‌ పౌజ్‌లో రైఫిల్‌మన్‌గా, రిక్రూటింగ్‌ ఏజెంటు కూడా ఎంతో కృషిచేశారు.
    చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన యస్‌.అబ్దుల్‌ అలీ నేతాజీ పిలుపుకు ప్రభావితుడై ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరారు. వృత్తిరీత్యా వడ్రంగి కావడంతో ఆయనకు క్యాంపు క్వార్టర్లలో చేతినిండా పని ఉండేది. అయినా అలుపు సొలుపు ఎరుగకుండా పనిచేస్తూ ఆయన అధికారుల ప్రశంసలను అందుకున్నారు. అనంతర కాలంలో ఆయన యుద్ధఖైదిగా సంవత్సరం పాటు జైలుశిక్షను అనుభవించారు. అబ్దుల్‌ అలీ లాగే చిత్తూరు జిల్లాకు చెందిన మహమ్మద్‌ అఫ్జల్‌ సాహెబ్‌ నేతాజీ సైన్యంలో చేరారు. ఆయన కూడా ఒక ఏడాది యుద్ధఖైదీగా నిర్బంధానికి, ఇబ్బందులకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన పి.పి.మహమ్మద్‌ ఇబ్రహీం అదే బాటలో నడిచారు. కడపజిల్లా రాయచోటికి చెందిన డ్రైవర్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో భారత జాతీయ సైన్యంలో చేరారు. 1945 దాకా మలయా తదితర ప్రాంతాలలో జైలులో గడిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన షేక్‌ అహమ్మద్‌ అజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో భాగస్వాములయ్యారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొని ఆయన పలు శిక్షలకు గురయ్యారు.
    అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా, జాతీయంగా భారతీయులు నిర్వహిస్తున్న  ఉద్యమాల తీవ్రత ఫలితంగా 1947లో భారతదేశం పాలనాధికారాన్ని భారతీయులకు అప్పగించాల్సిన పరిస్థితి ఆంగ్లేయులకు ఏర్పడింది. 1940 నుండి పాకిస్థాన్‌ ఏర్పాటును కోరుతూ ఆల్‌ ఇండియా ముస్లింలీగ్‌ సాగించిన విభజన రాజకీయాలకు ఆంగ్లేయులు తోడ్పాటు అందించారు. ఈ విభజన ప్రయత్నాలకు తెలుగుగడ్డ విూద  నుండి తెనాలికి చెందిన మున్షీ మస్తాన్‌, నసరావుపేటకు చెందిన షేక్‌ ముహమ్మద్‌ ఆలీ, షేక్‌ మొహిద్దీన్‌ సాహెబ్‌లు లీగ్‌ విభజన రాజకీయాలను నిరసించారు. మహమ్మద్‌ ఆలీ ఎంతో కాలం లీగ్‌ సభ్యునిగా ఉన్నా కూడా, లీగ్‌ విభజన రాజకీయాలను వ్యతిరేకిస్తూ లీగ్‌కు రాజీనామా చేశారు. నరసరావుపేటకు చెందిన సయ్యద్‌ జాన్‌ అహమ్మద్‌ విభజనను వ్యతిరేకిస్తూ పనిచేశారు. భారత విభజన వలన కలిగే నష్టాలను, కష్టాలను వివరిస్తూ సభలు సమావేశాలు నిర్వహించారు, విభజనను పూర్తిగా వ్యతిరేకించారు.  ఈ మేరకు విభజనకు వ్యతిరేకంగా ప్రజలు, నాయకులు ఎంతగా ప్రయత్నించినా చివరకు విభజన తప్పలేదు. 1947 జూలై 15న బ్రిటీష్‌ పార్లమెంట్‌ భారత స్వాతంత్య్ర ప్రదాన బిల్లు ను ఆమోదించింది. 
    ఈ ప్రకటన బ్రిటీష్‌ ప్రెసిడెన్సీ ఏరియాలో ఆంధ్ర ప్రాంతానికి సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను తెచ్చిపెట్టింది కాని, నిజాం నవాబు తన ఆధీనంలోనున్న హైదరాబాద్‌ సంస్థానం  స్వతంత్రంగా ఉంటుందని ఆగస్టు 14న 'ఆజాద్‌ హైదరాబాదు' ను ప్రకటించాడు. ఈ ప్రకటనతో 'విలీనోద్యమం' ఆరంభమైంది. 'జాతీయ ముస్లిం సమితి' కార్యదర్శి అబ్దుల్‌ ఘని నిజాం ప్రకటన మీద స్పందిస్తూ 'ఇది వట్టి అవివేకం. అందరాని ఫలానికై ఆశించడం తప్ప మరొకటి కాదు. బ్రిటీషు పార్లమెంటు సభ్యులకు భారతదేశ వ్యవహారాలలో జోక్యం కలిగించుకునే అధికారం అణుమాత్రమయినా లేదని గ్రహించక పోవడం మిగుల శోచనీయం' అని అన్నారు. (హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, పేజి.478). ఆ క్రమంలో  సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌, డాక్టర్‌ అక్బర్‌ అలీ, జలాలుద్దీన్‌, హసన్‌ ముహమ్మద్‌ పహిల్వాన్‌, విూర్‌ అహమ్మద్‌ అలీ ఖాన్‌, డాక్టర్‌ లతీఫ్‌ సయూద్‌ విలీనోద్యమంలో భాస్వాయులయ్యారు. కమ్యూనిస్టు పార్టీలో భాగస్వాములైన మగ్దూం మొహిద్దీన్‌, అలం ఖుంద్‌ విూర్‌, హసన్‌ నాసిర్‌, జవ్వాద్‌ రజ్వి, ఆఖ్తర్‌ హుస్సేన్‌, జహందర్‌ అస్ఫర్‌, కుతుబ్‌-యే-ఆలం, అహసన్‌ అలీ విూరజ్‌, విూరాజ్‌ హైదర్‌ హుస్సేన్‌, హుస్సేని షాహిద్‌ లాంటి వివిధ రంగాలలో ప్రతిభావంతులైన ప్రముఖులు నైజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలు ఉర్దూ పత్రికలు విలీనోద్యమాన్ని సమర్థిస్తూ ముందుకు వచ్చాయి. ఈ మార్గాన మరింత సాహసంగా ముందుకు సాగిన వ్యక్తి ఇమ్రోజ్‌ ఉర్దూ పత్రిక సంపాదకులు షోయాబుల్లా ఖాన్‌, ప్రముఖ ఉర్దూ పండితులు ఖాజి అబ్దుల్‌ గఫార్‌ పయాం ప్రధాన పాత్ర నిర్వహించాయి.
    ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానాన్ని  విలీనం చేయాల్సిందిగా నిజాం నవాబును కోరుతూ, హైదరాబాద్‌ రాష్ట్రంలో ఏర్పడిన అవాంఛనీయ పరిస్థితులను పూసగుచ్చినట్టు ఏకరువు పెడుతూ, నిజాం ప్రభుత్వంలో సుబేదార్‌గా బాధ్యతలు నిర్వహించిన నవాబు మంజూరు జంగ్‌, నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ సంచాలకులుగా పనిచేస్తున్న ముహమ్మద్‌ హుస్సేన్‌ జాఫరీ, తహసీల్దార్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఫరీద్‌ విూర్జా, బాఖర్‌ అలీ విూర్జా, ముల్లా అబ్దుల్‌ బాసిత్‌, అహమ్మద్‌ విూర్జా, హుస్సేన్‌ అబ్దుల్‌ మునీంలు సంతకాలు చేశారు. ఆ తరువాత దువ్వ డిప్యూటీ కలక్టరుగా నైజాం ప్రభుత్వం నుండి ఉపకారవేతనం పొందుతున్న ఫాయిఖ్‌ హుస్సేన్‌ కూడా అ లేఖలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తూ, తదుపరి సంభవించే తీవ్ర పరిణామాలను కూడా ఆలోచించకుండా లేఖ విూద సంతకం చేశారు. ఈ లేఖ ప్రాంతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా చరిత్ర సృష్టించింది. ఈ లేఖ పూర్తిపాఠం విఖ్యాత జాతీయవాది ఖాజీ అబ్దుల్‌ గఫార్‌ సంపాదకత్వంలోని ఉర్దూ పత్రిక పయాం, 1948 ఆగస్టు 13నాటి సంచికలో ప్రకటితమైంది.
     ఆ వాతావరణంలో ప్రజలు విలీనం కోరుతూ  ప్రముఖ కవి ముఖ్దూం మొహిద్దీన్‌ ప్రముఖ పాత్ర వహించారు. ఈ ఉద్యమాలకు సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌, డాక్టర్‌ అక్బర్‌ అలీ, జలాలుద్దీన్‌, హసన్‌ అహమ్మద్‌ పహిల్వాన్‌, విూర్‌ అహమ్మద్‌ అలీ ఖాన్‌, డాక్టర్‌ లతీఫ్‌ సయూద్‌, నవాబు కమాల్‌ యార్జంగ్‌, నవాబు యూసుఫ్‌ అలీ ఖాన్‌ సాలార్‌ జంగ్‌, సయ్యద్‌ అలం ఖుంద్‌ విూర్‌, ఖాజీ అబ్దుల్‌ గఫ్పార్‌, అక్తర్‌ హుసేన్‌, జవ్వాది రజ్వీ లాంటి ప్రముఖులు విలీనం డిమాండ్‌ను సమర్థించారు. ఈ పోరాటంలో భాగంగా సాగిన ఆందోళనలో విద్యార్థి నాయకులు జకీర్‌ అలీ మీర్జా అరెస్టయ్యారు. ఆయనను చాలాకాలం గృహ నిర్బంధంలో ఉంచారు.
    అటు 'ఆజాద్‌ హైదరాబాద్‌' ను కలగంటున్న నిజాం నవాబు ఇండియన్‌ యూనియన్‌లో నైజాంను విలీనం చేయడానికి ససేమిరా అంటుండగా నైజాం సంస్థానం సరిహద్దుల్లో గల ప్రాంతాలు ఒక్కొక్కటిగా స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకోవడం ఆరంభించాయి. ఆ ప్రయత్నాలలో కృష్ణాజిల్లాలో గల పరిటాల గ్రామం రిపబ్లిక్‌ను ప్రకటించుకుంది.ఆ గ్రామానికి చెందిన యువకుడు షేక్‌ మౌలా సాహెబ్‌ దూర్‌హటో దునియా వాలో...హిందూస్ధాన్‌ హమారా హై, అంటూ జాతీయ పతాకాన్ని పరిటా కచ్చేరి మీద ఎగురవేసి సంచలనం సృష్టించారు. ఈ చర్యకు మూడు సంవత్సరాల కఠిన శిక్ష ఉన్నప్పటికీ మౌలా సాహెబ్‌ ఏమాత్రం భయపడకుండా పరిటాల పోరాటంలో చివరివరకు నిలిచారు.
    ఆనాటి పోరాటంలో పాల్గొన్న పలువురిలో వరంగల్‌కు చెందిన అబ్బాస్‌ అలీ హైదరాబాదులో నాలుగు మాసాలు జైలు శిక్షను అనుభవించారు. గన్నవరం నివాసి నాసిర్‌ మహమ్మద్‌ ఐదు మాసాలు, ఖమ్మం తాలూకా మధిరకు చెందిన ఖాదర్‌బేగ్‌ రెండు మాసాలు, ఖమ్మం జిల్లా ఎడ్లపల్లి రైతు ఇనగాని ఖాశిం రెండు మాసాలు, అదసర్లపాడు నివాసి షేక్‌ బాబు రెండు మాసాలు, జైలు శిక్షను అనుభవించారు. 1946లో నైజాం సేనలు ఖమ్మంకు చెందిన మహ్మద్‌ రజబ్‌ ఆలీని అరెస్టు చేసి మూడు మాసాల పాటు నిర్బంధంలో ఉంచాయి. స్వతంత్ర భారతంలో ఆయన పలుమార్లు శాసనసభ్యునిగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ఆనాడు విలీనం కోరుతూ సాగిన ప్రజాపోరులో కొంత మంది ముస్లిం మహిళలు పాల్గొన్నారు.     రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వాతంత్య్ర సమరయోధుల గ్రంథంలో ఒకే ఒక ముస్లిం మహిళ పేరుంది. ఆమె నఫీస్‌ ఆయేషా బేగం. హైదారాబాదు నివాసి. ఆమె తండ్రి పేరు హమీద్‌ అలీ ఖాన్‌. నైజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలని సాగిన ఉద్యమంలో ఆమె పాల్గొన్నారు.
     నైజాం సంస్థానాధీశుని రాజకీయాలను, రజాకార్లు జరుపుతున్న  చర్యలను వ్యతిరేకిస్తూ ప్రముఖ జర్నలిస్టు షోయాబుల్లాఖాన్‌ తాను సంపాదకత్వం వహిస్తున్న ఉర్దూ పత్రిక ఇమ్రోజ్‌లో వ్యాసాలు రాశారు.ఆ కారణంగా రజాకార్ల ఆగ్రహానిక గురైన ఆయనను  1948 ఆగస్టు 21 రాత్రి హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన సహచరుడు ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ ఈ సందర్బంగా చేతిని కొల్పోయారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మహమ్మద్‌ బాఖర్‌ ఆంగ్ల సైన్యాధికారుల చేతుల్లో చిత్రహింసలకు గురై కాల్చివేయబడ్డారు. స్వాతంత్య్రసమరంలో పాల్గొని పాలకులచే కాల్చివేతకు గురైన ప్రప్రథమ జర్నలిస్టుగా ఆయన ఖ్యాతి గడించారు. భారత స్వాతంత్య్ర పోరాటం చివరి థలో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం రాజీ లేని పోరాటం సాగిస్తూ, హత్యకు గురైన అక్షర యోధునిగా, ఇమ్రోజ్‌ సంపాదకుడు షోయాబుల్లా ఖాన్‌ చిరస్మరణీయమైన ఖ్యాతి పొందారు.
    ఆ తరువాత స్వాతంత్య్రోద్యమం స్ఫూర్తితో సాగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో కూడా ముస్లిం ప్రజానీకం తమ హిందూ సోదరులతో కలసి సాగారు. జనగామ తాలూకా దేవరుప్పల శివారు గ్రామం కామారెడ్డిగూడెంకు చెందిన షేక్‌ బందగి సాహెబ్‌ తన న్యాయమైన హక్కుల కోసం నిజాం సంస్థానంలోని విస్నూరు దేశ్‌ప్రముఖ్‌ రామచంద్రా రెడ్డికి వ్యతిరేకంగా పోరాడి చరిత్ర సృష్టించారు. ఆ ఆవమానాన్ని భరించలేకపోయిన భూస్వామి రామచంద్రారెడ్డి 1940 జూలై 26న బందగీని హత్యచేయించాడు. దామచర్ల మండలానికి చెందిన షేక్‌ నన్నే బచ్చా లాంటి యోధులు తుపాకులు చేతబట్టి నిజాం రజాకార్లను, పోలీసులను సాయుధంగా ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా పలు కష్టనష్టాలను ఎదుర్కొనటమే కాకుండా చిత్రహింసలను, భయానక జైలు జీవితాలను రుచిచూశారు. ఈ పోరాటంలో ముస్లిం స్త్రీలు కూడా ఏమాత్రం వెనుకంజవేయలేదు. నగరాలలో నివశించే రజియా బేగం, జమాలున్నీసా బేగం లాంటి వారితోపాటుగా తెలంగాణలోని రాజారం గ్రామానికి చెందిన జైనా బీ లాంటి మహిళలు కూడా ఏమాత్రం భయపడకుండా, ప్రాణత్యాగాలకు సిద్దపడి పోరుబాటన నడిచి మహత్తర చరిత్రకు కారణమయ్యారు.
    1948 జూన్‌ 21న మౌంట్‌బాటన్‌ పదవీ విరమణ చేసి ఇంగ్లాండు వెళ్లిపోయాడు. మౌంట్‌బాటన్‌ నిష్క్రమణతో నైజాం పాలకుడు బలహీనుడయ్యాడు.     జాతీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు నిజాంకు అనుకూలించలేదు. ఈ ప్రతికూల పరిస్ధితులలో ఉక్రోషం పట్టలేక రజాకార్లు, దేశ్‌ముఖ్‌ల దుండగుల దండు మరింతగా విజృంభించగా 1948 సెప్టెంబర్‌ 13న తెల్లవారు ఝామున నైజాం సంస్ధానం పై భారత సైన్యం ముప్పేట దాడి ఆరంభించింది. ఈ చర్యలో పాల్గొన్నది భారత సైన్యం అయినప్పటికి అది 'పోలీసు చర్య' అని ఆనాటి గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలాచారి వర్ణించడంతో అదికాస్తా 'పోలీసు చర్య' స్థిరపడింది. ఈ పోలీసు చర్యలో హిందూ-ముస్లిం తేడా లేకుండా ప్రజలంతా బాధలకు గురయ్యారు. ప్రధానంగా అమాయక ముస్లింలు చాలా ఇక్కట్లు పడ్డారని భారీ సంఖ్యలో ప్రాణాలు కొల్పోయారని అధికారికంగా నిర్ధారించబడని అలనాటి పండిత సుందర్‌ లాల్‌ కమిటి నివేదికొకటి వెల్లడిస్తోంది. ఈ  కమిటీలో ఉర్దూ పత్రిక పయాం సంపాదకులు ఖాజి ముహమ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌, హైదరాబాదుకు చెందిన ప్రముఖ న్యాయవాది యూనిస్‌ సలీంలు సభ్యులయ్యారు. ఈ నివేదిక వలన పోలీసు చర్య పేరిట అమాకులను మీద సాగిన దుష్క్రృత్యాలన్నీ బయటకు వెల్లడి కావడం ఇష్టంలేని  సర్దార్‌ పటేల్‌ నివేదికను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించాడు. ఆ కారణంగా ఆ నివేదికలోని నిజాలు సూచనప్రాయంగా వెల్లడి అయ్యేంత వరకు చరిత్రలో మరుగునపడిపోయాయి.
    ఆ తరువాత ఆ నివేదిక కాపీని కలిగి ఉన్న కమ్యూనిస్టు నాయకుడు శ్రీనివాస్‌ లాహోటి దానిని నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా (న్యూఢిల్లీ)లో దాఖలు చేసినట్టు 1988లో ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఆ విధంగా ఆయన తన ఇంటర్వూలో పండిత సుందర్‌లాల్‌  కమిటీ నివేదిక గురించి వివరంగా ప్రస్తావించడంతో ఆనాటి నివేదిక లోని అంశాల గురించి అధ్యయనం ఆరంభమైంది. ఉర్దూలో ఉన్న ఆ నివేదికలోని కొన్ని భాగాలను పరిశీలించిన హైదరాబాదుకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్‌ ఒమర్‌ ఖలిద్‌ తాను రాసి, వెలువరించిన హైదరాబాద్‌ ఆఫ్టర్‌ ఫాల్‌  అను గ్రంథంలో పోలీసు చర్య నాటి అకృత్యాలను, అఘాయిత్యాలను కొంత మేరకు ఉటంకించారు. (ముల్కి (కొలుపుల దస్తర్‌) ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక, సంపాదకులు వేముల ఎల్లయ్య, స్కై బాబ, డిసెంబరు 2003-మే 2004, హైదరాబాద్‌). ఆ సమాచారం ప్రకారం చూస్తే ఆనాడు సర్దార్‌ వల్లభాయి పటేల్‌ అన్నట్టుగా సబ్‌ ఠీఖ్‌ హువా అన్నది ఎంత మాత్రం నిజం కాదని, పోలీసు చర్య వలన అన్నివర్గాల ప్రజలు ప్రధానంగా ముస్లింలు అష్టకష్టాలు పడడం, పెద్ద సంఖ్యలో అటు సైన్యం ఇటు పోలీసుల బారినపడి ఆస్తిపాస్తులతోపాటు ప్రాణాలు కూడా కోల్పోవడం పచ్చి వాస్తవమని తెలుస్తుంది.
     చిట్టచివరకు 1948 సెప్టెంబరు17న నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌ లో విలీనం చేయడానికి ఏడవ నిజాం నవాబు విూర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ అంగీకరించాడు. హైదరాబాద్‌ సంస్థానంలోని ఆసఫియా పతాకాన్ని అవనతం చేశారు.  పదిహేడు సాయంత్రం 7 గంటలకు దక్కన్‌ రెడియో ద్వారా విూర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆనాడు విూర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ చేసిన రేడియో ప్రసంగంలో నా ప్రియమైన ప్రజలారా, ... నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. అని ప్రకటించాడు.  ఆ రోజున రజాకార్ల సంస్థను రద్దు చేస్తూ నిజాం సంస్థానాధీశుడు ఉత్తర్వులు జారీ చేశాడు. 
    ఈ విలీనం వలన మద్రాసు రాష్ట్రంలో భాగమైన ఆంధ్ర, నైజాం సంస్థానంలో భాగంగా ఉన్న తెలంగాణలు కలసిపోయాయి. మద్రాసు రాష్ట్రం నుండి వేరుచేసి తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎన్నటి నుండో కోరుతూ వచ్చిన తెలుగు ప్రజల ఆకాంక్షకు తగినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం ఏర్పడలేదు. మద్రాసు రాష్ట్రంలో భాగంగానే తెలుగు ప్రజలు కొనసాగాల్సిన దుస్థితి అలాగే ఉండిపోయింది. ఈ పరిస్థితి నుండి బయట పడడానికి ప్రజలు మరో ప్రజాపోరు సాగించాల్సి వచ్చింది. ఈ ప్రజాస్వామిక శాంతియుత పోరాటానికి నాయకుడు పొట్టి శ్రీరాములు  ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు.ఆనాటి ప్రధాని పండిత జవహర్‌ లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ప్రజా ఉద్యమం పట్ల ఏమాత్రం స్పందించక పోవడంతో ప్రజానీకం తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యింది. ఆమరణ నిరాహారదీక్ష వలన పొట్టి శ్రీరాములు పరిస్ధితి పూర్తిగా ప్రమాదం అంచుకు చేరుకుంది. చివరకు ఆయన ఆమరణ దీక్షను కొనసాగిస్తూనే 53వ రోజున కన్నుమూశారు. చివరకు అమరజీవి దృఢ నిర్ణయం, తెలుగు ప్రజల ఆందోళన ముందు భారత పాలకులు తలవొగ్గి దిగిరాక తప్పలేదు.1956 నవంబరు ఒకటిన ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుండి విడివడి తెలుగు ప్రజల స్వంత రాష్ట్రంగా రాయలసీమ, సర్కారు, కోస్తా ఆంధ్ర, తెంగాణా ప్రాంతాల కలయికతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. భారతదేశ చిత్రపటం విూద నూతన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది.

Saturday 3 September 2011

ముస్లిం స్వాతంత్ర్య సమర యోధులు

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న ముస్లిం యోధుల జీవిత చరిత్రలు వరుసగా వస్తాయి.వేచిచూడండి.