Friday 27 April 2012

మైసూరు పులి టిపూ సుల్తాన్‌


                                                            మైసూరు పులి టిపూ సుల్తాన్‌
            భారతదేశ రాజకీయ చరిత్రలో పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరార్ధ భాగం ఎంతో కీలకమైన సమయం. బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలాను పరాజితుడ్ని చేసి, బెంగాల్‌ దివానిని హస్తగతం చేసుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, దక్షణాదిని ఆక్రమించు కోవటానికి యుక్తులు, కుయుక్తులు పన్నుతున్నారు. ఈ సామ్రాజ్యవాద శక్తుల రాజ్యవిస్తరణ కాంక్షను అర్ధం చేసుకొలేని స్వదేశీపాలకులు పరస్పరం కలహించు కుంటున్నారు.  ఆ సమయంలో '' నేనున్నా నేనున్నా నంటూ.. '' భారత రాజకీయ చిత్రపటం మీద ఉదయించాడు   మైసూరు పులిగా ఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌.
              ఈ గడ్డ మీద నిలదొక్కుకుంటున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులను తొడగొట్టి సవాల్‌ చేసిన టిపూ సుల్తాన్‌ 1750 నవంబర్‌ 10వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా దేవనహళ్ళి గ్రామంలో జన్మించాడు. అసమాన ధైర్యసాహసాలతో '' దక్షిణ బారత దేశపు నెపోలిన్‌ ''గా ఖ్యాతిగాంచిన, అరివీర భయంకరుడు హైదర్‌ అలీ, శ్రీమతి ఫాతిమా ఫక్రున్నిసాలు టిపూ తల్లి తండ్రులు.
            విద్యాగంధం లేని హైదర్‌, తన బిడ్డ మంచి విద్యాబుద్దులు చెప్పించాడు. తండ్రి ప్రత్యేక పర్యవేక్షణలో యుద్ధ కళను టిపూ ఔపోసన పట్టాడు.  ఆనాటి ప్రముఖ యోధులలో అగ్రగామిగా  గుర్తింపు పొందిన టిపూ  చిన్నతనం నుండి తండ్రి నాయకత్వంలో సాగిన అన్ని యుద్ధాలలో పాల్గొన్నాడు. ఏ ఆంశానికి సంబంధించినదైనా, ఎటువంటి విశిష్ట, సాంకేతిక సమాచారమైనా అధ్యయనం చేసిన ఆకళింపు చేసుకోవటం నూతనత్వాన్ని అనునిత్యం ఆమ్వానించే  టిపూ, భారతీయ, పాశ్చాత్యా తత్వవేత్తల, రాజనీతిజ్ఞుల గ్రంధాలను సేకరించి అధ్యయనం చేసాడు.
            పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చేసరికి రాజ్యపాలన వ్యవహారాలలో, తండ్రితోపాటుగా యుద్ధాలలో పాల్గొన గలిగిన స్థాయినీ, సామర్ధ్యాన్నీ సంపాదించుకున్న టిపూ 1763లో జరిగిన మలబార్‌ పోరాటంలో పాల్గొన్నాడు. 1769-72 వరకు మారాఠాలతో సాగిన యుద్ధాలలో పాల్గొని, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు.  ప్రధమ మైసూరు యద్ధంలో బ్రిటీషర్ల కూటమి నుండి నిజాం నవాబును దూరం చేసేందుకు సాగిన ప్రయత్నాలలో  భాగంగా చిన్న వయస్సులోనే  చాకచక్యంగా దౌత్యం నడిపి, విజయం సాధించి  రాజనీత్ఞడన్పించుకున్నాడు. తండ్రి బాటలో యుద్ధ కళలలో ప్రావీణ్యత సంపాదించిన, టిపూ పురాతన సాంప్రదాయ యుద్దరీతులను అనుసరిస్తూనే, సాశ్చాత్య యుద్ధ వ్యూహాలను అనుగుణంగా సైన్యాన్ని అధునీకరించి మంచి తర్ఫీదు నిప్పించాడు. సరికొత్త ఆయుధాలను యుద్ధవ్యూహాలను రూపొందించిన విజయాలను రాచబాట వేసాడు. 1780లో కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ని తరిమి కొట్టిన చారిత్రక సంఘటనలో ప్రముఖ పాత్ర వహించాడు.
             దక్షణాదిలో మైసూరును బలిష్టమైన రాజ్యంగా రూపొందించాలని కలలుగన్న హైదర్‌ అలీ శత్రువు దాడుల నుండి తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు అత్యధిక కాలం రణాభూమిలోనే గడిపి 1782 నవంబరు 6, రణరంగంలో చివరి వ్వాస వదిలాడు. ఈ విషాద వార్త టిపూకి అందేనాటికి ఆయన మలబార్‌ తీరాన కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ను తరిమి తరిమి కొడుతున్నాడు. తండ్రి కన్నుమూసిన వార్త విన్న టిపూ సత్వరమే శ్రీరంగపట్నం చేరుకుని, తన 31వ ఏట 1781డిసెంబర్‌ మాసంలో మైసూరు రాజ్యలక్ష్మిని చేబట్టాడు. చిన్న వయస్సులోనే శౌర్యపత్రాపాలతో వీరుడిగా ప్రజలను ఆకట్టుకున్న టిపూ, '' మైసూర్‌ సుల్తాన్‌ '' అయ్యాడు. టిపూ ప్రజల సంక్షేమంలో రాజ్యక్షేమం, రాజు సంక్షేమం దాగుందన్న సత్యాన్ని, అర్ధం చేసుకున్న టిపూ రాజ్యభిషేకం రోజుననే, ' మిమ్ముల్ని వ్యతిరేకించినట్టయితే నేను నాస్వర్గాన్ని, నాజీవితాన్ని, నాసంతోషాన్ని కోల్పోవచ్చు. నా ప్రజల సంతోషంలోనే నా సంతోషం. నా ప్రజల సంక్షేమంలోనే నా సంక్షేమం ఇమిడి ఉంది. నాకిష్టమైందల్లా మంచిదని నేను భావించను. నా ప్రజలకు ఏది ఇష్టమో దానిని నా అభిష్టంగా భావిస్తానని ' టిపూ ప్రకటించాడు.
            ఒకవైపు టిపూను దెబ్బతీయడానికి అదను కోసం ఎదురు చూస్తున్న  స్వదేశీ శత్రువులు, మరొకవైపు పరాజయాల పరంపరతో రగిలిపోతున్న విదేశీ శత్రువతో మైసూరు రాజ్యం చుట్టుముట్టబడి ఉండటంతో, శ్వాస పీల్చుకోవటానికి కూడా తీరిక లేనప్పటికీ, టిపూ ప్రజారంజకమైన పాలనను అందిస్తూ, ప్రజల ఆర్ధిక వ్యవమారాలలో ఆయన చూపిన శ్రద్ధను గమనించిన ఆంగ్లేయాధికారి గ్రాంట్‌, టిపూ చర్యలను ప్రశంసిస్తూ టిపూ తన రాజ్యం యొక్క ఆర్ధిక వ్యవహారాలను నిర్వహించిన తీరు ఉదాహరణగా నిలచిపోతుందని అనటం విశేషం. పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాలకు వర్తింపచేసాడు. ప్రభుత్వ విభాగాలలో ప్రజలకు సంబంధించిన అన్ని రంగాలలో పలు విప్లవాత్మక మార్పులు చేసాడు. స్వదేశంలోనే కాకుండా, విదేశాలలో కూడా పరిశ్రమలను స్థాపించి అభివృద్దిపర్చాడు. పలు ప్రాంతాలనుండి చేతి వృత్తి కళాకారులను, నిపుణలను రప్పించి ప్రజలకు శిక్షణ ఇప్పించాడు. అబివృద్ది పధకాలను ఆవిష్కరింపచేసి సమర్ధవంతంగా అమలుజరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నూతన తరహా సహకార బ్యాంకులను ఏర్పాటు చేసాడు. సంపన్న వర్గాల పెత్తనం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాడు. పేద వర్గాలను పొదుపు వైపుకు ఆకర్షించేందుకు తక్కువ మొత్తాలను లాభాలను ప్రకటించాడు. పొదుపును, మదుపును ప్రోత్సహించాడు. తూనికలు - కొలతల వ్యవస్థను ఆధునీకరించాడు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి ఎగుమతులను చేపట్టాడు. నానికా వ్యాపారాన్ని వృద్ధిచేసాడు.   విదేశాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకొని ఎగుమతులు - దిగుమతుల వాణిజ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాడు. విదేశీ వర్తకాన్ని  ప్రోత్సహించాడు. వర్తక, వాణిజ్య పారిశ్రామిక రంగాలలో ప్రభుత్వ పాత్రను అధికం చేస్తూ , ప్రభుత్వ వ్యాపార సంస్ధను (State Trading Corporation.) ఏర్పాటు చేసాడు. వ్యవసాయ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు. నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు అధిక శ్రద్ధ వహించాడు. నాడు కావేరి నది మీద ఎక్కడయితే ప్రాజెక్టు కట్టాలని ఆయన ఉద్దేశించాడోఈనాడు  కృష్ణరాయనగర్‌ ఆక్కడే నిర్మాణమైంది.   పంట సిరులు అందించే రైతుకు భూమి విూద హక్కును కల్పించాడు.  బంజరు భూములను మాగాణులుగా మార్చే రైతు, మూడు సంవత్సరాల పాటు  పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదన్నాడు. పన్నుల వసూలుకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించాడు. వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం రైతులకు రుణ సౌకర్యం కల్పించాడు. టిపూ జనరంజక పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ తన History of British India లో,  'భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలందరి కంటే టిపూ రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారు. పంటలు బాగా పండాయి'అని పేర్కోన్నాడు.
            ప్రాక్‌-పశ్చిమ దేశాల సామాజిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకున్న టిపూ సాంద్రాయక ప్రభుత్వ పాలనకు భిన్నంగా, ప్రజలకు ఉత్తమ సేవలను అందచేసే ఆధునిక పద్ధతులను ప్రవేశ పెట్టినతొలి స్వదేశీ పాకుడిగా ఖ్యాతి గడించాడు. ప్రభుత్వ యంత్రాగాన్ని పలు మార్పులకు గురిచేసాడు. టిపూపాలన ఆశ్చర్యంగా అత్యంత ఆధునిక సూత్రాలకు అనుగుణంగా సాగిందంటూ ప్రముఖ ఆంగ్లేయ రచయిత ఫెర్నాండజ్‌ తన 'Storm Over Srirangapatnam' లో ప్రశంసించాడు. ప్రజలకు నష్టం కలిగించే శక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. ప్రజలకు ఎవరు శత్రువులో వారు తనకూ శత్రువులన్నాడు.  నా ప్రజలతో ఎవరు కలహిస్తారో, వారో నాతో యుద్దం ప్రకటించినట్టు, అని టిపూ విస్పష్టంగా ప్రకటించాడు.
            పూర్వీకుల సాంప్రదాయలను గౌరవిస్తూనే పలు ప్రజోపయోగకర సంస్కరణలకు టిపూ అంకురార్పణ చేశాడు. సంస్కరణల అమలు విషయంలో వ్యక్తిగత కష్ట నష్టాలను కూడా ఖాతరు చేయలేదు.  వ్యభిచారం, బానిసత్వం, బహు భర్తృత్వం, మధ్యపానాన్ని నిషేధించాడు. మలబారు మహిళలు నడుం పైభాగాన ఎటువంటి ఆఛ్చాదన లేకుండా అర్దనగ్నంగా తిరగటం గమనించి, మహిళలంతా రవికలు ధరించాలని ఆజ్ఞలు జారీ చేశాడు. మహిళలకు అవసరమగు బట్టను కూడా ఉచితంగా అందజేశాడు. ఈ అజ్ఞలను ధిక్కరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాడు. నరబలులను నిషేధించాడు. ఫకీర్లు - సన్యాసులు మాదక ద్రవ్యాలను తీసుకోవటం తీవ్రమైన నేరంగా పరిగణించాడు. ఆనాధలైన బాలికల క్రయవిక్రయాలు శిక్షారమైన తీవ్ర నేరాలుగా ప్రకటించి, పొగాకు సేవనం అనారోగ్యకరమని నిషేదించాడు. దుబారాను తగ్గించాలని, వ్యక్తి తన సంపాదనలో ఒకశాతం కంటే ఎక్కువ విలాసాలకు ఖర్చుచేయరాదని అధికారులకు ఆజ్ఞలు జారీచేసాడు. అంగ వికలాంగులకు, అంధులకు ఆత్మస్థైర్యం కలుగ చేసేందుకు పలురకాల సహయక చర్యలు అమలుచేశాడు. చిన్న, చిన్న నేరాలకు పాల్పడిన రైతులకు విధంచే  సమాజానికి ఉపయోగపడాలని భావించిన టిపూ శిక్షా విధానాన్ని సంస్కరించాడు. గతంలోలా జరిమానా విధించడాన్ని తొలగించి, జరిమానా సొమ్ముకు బదులుగా, గ్రామ పొలిమేరల్లో మొక్కలను నాటాలని, ఆ మొక్కలకు సక్రమంగా నీళ్ళు పోస్తూ, బాగా పెరిగేంత వరకు సంరక్షణ బాధ్యతలను నిర్వహించాలని 1792లో శాసనం చేశాడు.
            టిపూ 17 సంవత్సరాల పాటు సాగించిన పరిపాలనలో అత్యధిక సమయం తన రాజ్యాన్ని కబళించాలననుకుంటున్న బ్రిటీషర్లను, నిజాం నవాబు, మరాఠాలను ఎదుర్కొంటూ గడిపినప్పటికీ, స్వదేశీ వ్యవహారాలను చక్కదిద్దుకుంటూనే, అంతర్జాతీయ వ్యవహారాలను కూడా దక్షతతో నిర్వహించి చరిత్రకారుల ప్రసంశలను అందుకున్నాడు.  ఈస్ట్‌ ఇండియా కంపేనీ పాలకులను తరిమి కొట్టేందుకు పొరుగున ఉన్న నిజాం నవాబు, మరాఠా నాయకులు ఏకమై ఐక్యసంఘటనగా ఏర్పడేందుకు కలసి రావాల్సిందిగా కోరాడు. బలమైన శక్తిగా ఎదుగుతున్న మైసూరు రాజ్య ప్రాభవ వైభవాన్ని సహించలేని స్వదేశీపాలకులు, ఆయనకు తోడ్పాటు, ఇవ్వకపోవటంతో విదేశీయుల వైపు దృషి సారించాడు. 'శత్రువు శత్రువు, మిత్రుడు', అనే రాజకీయ సూత్రీకరణను అనుసరిస్తూ, తొలుత ఫ్రెంచ్‌వారిని, ఆ తరువాత టర్కీ, అఫ్ఘనిస్తాన్‌ ఇరాన్‌, దేశాధినేతల స్నేహహస్తం కోరాడు. టిపూ వ్యవహార దక్షత వలన ఈ దేశాధి నేతలనుండి అనుకూల స్పందన లభించింది. ఆ నాడు అంతర్జాతీయ రంగాన బ్రిటీషర్ల ప్రభ వెలిగిపోతున్నందున, కీలకమైన  థలో టిపూకు సహాయం లభించలేదు.
            బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇతర దేశాల స్నేహహస్తం కాంక్షించినట్టుగానే, దేశీయ వర్తక, వాణిజ్యాలు, ఎగుమతులు, దిగుమతులు, స్వదేశీ పరిశ్రమలు, ఆధునిక ఆయుధాల తయారికి అవసరమగు సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు విదేశాలతో వాణిజ్య సంబంధాలను పటిష్ట పర్చేందుకు, టిపూ బుద్ది కుశలతతో వ్యవహరించి విజయం సాధించాడు. కచ్‌, మస్కట్‌, పెరూ, ఒర్మాజ్‌, జిద్దా, బసరా, ఎడెన్‌, దేశాలలో వర్తక - వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయటమేకాక, చైనా, ప్రాన్స్‌, టర్కీ, ఇరాన్‌ లాంటి దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పాడు. అమెరికా వర్తకులను ఆహ్వానించాడు. స్వదేశీవస్తువుల ఎగుమతులను ప్రోత్సహించాడు. విదేశీ వర్తకం ఏమేరకు చేసినా బ్రిటీషర్ల వస్తువుల వాడకాన్ని ఆయన అంగీకరించ లేదు. వలస పాలకుల వస్తులన్నిటినీ టిపూ నిషేదించాడు. మైసూరు రాజ్యంలోకి ఇంగ్లాడ్‌ వస్తువులను రానివ్వలేదు. ఇగ్లాండు వర్తకుల నుండి ఎటువంటి వస్తువులను కొనరాదంటూ, ప్రభుత్వ వ్యాపార ప్రతినిధులకు ప్రత్యేక ఆదేశాలను జారీచేశాడు. ఈ మేరకు ఆనాడే టిపూ విదేశీవస్తువుల బహిష్కరణకు శ్రీకారం చుట్టాడు.వర్తక వాణిజ్యాభివృద్ధితో పాటు విదేశాలలో కర్మాగారాలను స్థాపించేందుకు విదేశీనేతలను అంగీకరింప చేయటంలో టిపూ విజయం సాధించాడు. స్వదేశంలో పరిశ్రమల స్ధాపనకు  ప్రోత్సాహకాలు ప్రకటించాడు. స్వదేశీ పరిజ్ఞానానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానం జోడించి రాకెట్ల నిర్మాణానికి ప్రయత్నాలు చేశాడు.
             టిపూ విద్యాధికుడు కావటమే కాకుండా, సాహిత్యాభిలాషిగా కూడా పేర్గాంచాడు. కన్నడ, తెలుగు, మరాఠి, అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ, ఫ్రెంచ్‌, భాషలను నేర్చుకున్నాడు. పండితులను గౌరవించటం, సాహిత్య సభలను నిర్వహించటం, గ్రంధాలను రాయించటం పట్ల టిపూ ఎంతో ఆసక్తి చూపాడు. ఆయన స్వయంగా 45 గ్రంధాలు రాశాడు. ఆయన స్వతం గ్రంధాలయం విలువైన 2వేల పుస్తకాలతో నిండి ఉండేది. టిపూ గ్రంధాలలో మొగల్‌చక్రవర్తి జౌరంగజేబు స్వదస్పూర్తితో రాసిన ఖురాన్‌ కూడా ఉంది. నిరంతరం రాజకీయాలు, పోరాటాలు, యుద్ధాలలో మునిగి తేలుతూ కూడా ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకాన్ని కొంతసేపన్నా చదవనిదే టిపూ విశ్రమించేవాడు కాడట.
టిపూ స్వయంగా  ' Fauji Akhbar' అను ఉర్దు వారపత్రికను 1793లో ప్రారంభించినుండి  జీవిత చరమాంకం వరకు నడిపాడు. ఈ పుత్రిక టిపూ సైన్యానికి సంబంధించిన సమాచారం మాత్రమే అందించేది కావటంతో సామాన్య ప్రజల వరకు అది చేరలేదు.  టిపూ స్వయంగా 'జాకోబియన్‌ క్లబ్‌' అను సంస్ధను ప్రారంభించిఆ సంస్ధ ప్రారంభోత్సవం సందర్భంగా  మొక్క నాటుతూఆ మొక్కకు ' స్వేచ్ఛావృక్షం (Tree of Liberty) అని నామకరణం చేయటమే కాకుండా తనను తాను మైసూరు  మైసూరు పౌరుడుగా (Tipu citizen of mysore) పిలుచుకున్నాడు. ఒక రాజరిక వ్యవస్ధకు చెందిన పాలకుడు ఈ విధంగా ప్రజాస్వామిక భావన ప్రకటించడం విశేషం.
            ప్రజలను విద్యావంతులు చేయటానికి టిపూ ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు. విద్యను నిర్బంధం చేసి, ఉచిత విద్యను ప్రవేశ పెట్టాడు. పలు విద్యాలయాలను ఏర్పాటు చేయించాడు. రాజధాని శ్రీరంగపట్నంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని టిపూ సంకల్పించాడు. ఈ విశ్వవిద్యాలయానికి JAMIAL UMUR అని నామకరణం చేయాలని ఉవ్విళ్ళూరాడు. ఈ విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞానంతో పాటుగా, పాశ్చాత్య విజ్ఞానాన్ని బోధించాలని, మానవీయ, సాంకేతిక విద్యాభ్యాసానికి అగ్రస్ధానం కల్పించాలని ఆశించాడు. ఆ మైసూరు సూర్యుడు ఆకస్మికంగా అస్తమించటంతో విశ్వవిద్యాలయం ఏర్పాటు కలగానే మిగిలి పోయింది.
            టిపూ సుల్తాన్‌ ఇస్లాం ధర్మానురక్తుడు. టిపూ ఖురాన్‌ గ్రంధంను చాలా కక్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. నిత్య జీవితంలోని సమస్యలకు ఖురాన్‌ గ్రంధం నుండి ప్రవచనాలను అతి సునాయసంగా ఉల్లేఖిస్తూ, పరిష్కార మార్గాలు సూచించటంలో టిపూ ఆసక్తి చూపాడు.    స్వమతం పట్ల అభిమానం గల ప్రభువు తప్ప, ఆయన మత దురభిమానికాదు.  టిపూ మతాతీతంగా వ్యవహరించాడు. ప్రజల మత విశ్వాసాలలో కలుగజేసుకోవద్దని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలను జారీచేశాడు.  బహుళమతాలు, జాతుల ప్రజలు సహజీవనం సాగిస్తున్న రాజ్యంలో అన్ని మతాల ప్రజలపట్ల సమభావన చూపడం టిపూ ప్రత్యేకత.  ప్రతి ఒక్కరి మత సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. నైతిక విలువలకు భంగకరం కానంతవరకు ఏ మత సాంప్రదాయాలను ఆయన పట్టించుకోలేదు.  ప్రజలకు సరైన న్యాయం ప్రసాదించేందుకు, న్యాయ స్థానాలలో అన్ని మతాలకు చెందిన న్యాయాధికారులను నియమించాడు. ఫిర్యాదులను, సమస్యలను వ్యక్తిగత చట్టాలను అనుసరించి విచారించమన్నాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో పోరాడుతున్నా క్రైస్తవ మతాచారులపట్ల ఎంతో గౌరవం, ఆదరణ చూపాడు. మసీదు-మందిరాల మధ్యన టిపూ తేడా చూపించ లేదు. 1791-92లో మైసూరు రాజ్యం మీద దాడి జరిపిన మరాఠాలు శృంగేరి పీఠానికి చెందిన విలువైన వస్తువులను, ఆస్తిపాస్తులను దోచుకున్నారు. ఆలయంలోని శారదామాత విత్రహాన్ని కూడా పెకిలించి బయటకు విసిరివేశారు.  ఈ సంఘటనను శృంగేరి పీఠాధిపతి టిపూకు తెలుపగాజరిగిన సంఘటనకు బాధపడుతూ, పీఠాధిపతి  ఒక లేఖ రాస్తూ, ' పవిత్ర స్థలం పట్ల పాపం చేసిన వ్యక్తులు అందుకు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని ' ఆగ్రహం వ్యక్తం చేశాడు. టిపూ అంతటిలో సరిపెట్టుకోకుండా, ఆలయ పునరుద్ధరణకు  సహాయం చేశాడు. ఈ ఆలయమేకాదు, మైసూరు రాజ్యంలో గల పలు ఆలయాలకు గ్రాంటులను, ప్రత్యేక నిధులను సమర్పించాడు. ఈ మేరకు ఆయన 156 ఫర్మానాలు జారీచేశాడు. ప్రముఖ శృంగేరిమఠం స్వామీజీతో పలు ధార్మిక, సామాజిక విషయాలను ప్రస్తావిస్తూ, కన్నడంలో టిపూ 30 లేఖలు వ్రాశాడు. ప్రసిద్ధిచెందిన లక్ష్మినాధస్వామిలయం (కలాల), నారాయణస్వామి ఆలయం (మేల్కోట్‌), శ్రీ కంఠేశ్వర ఆలయం, నజుండేశ్వరి ఆలయం (నంజూగూడ్‌) తదితర ఆలయాలకు అవసరమగు వెండి, బంగారు పాత్రలు, ఆభరణాలు, ఖరీదైన దుస్తులను టిపూ అందచేశాడు. తన తండ్రి హైదర్‌ అలీచేత శంఖుస్థాపన చేయబడిన కంజీకరం గోపురాలయం నిర్మాణాన్ని ఎంతో శ్రద్ధతో టిపూ  పూర్తి చేశాడు. టిపూ దిండిగల్‌ కోటమీద దాడి చేసినప్పుడు కోటలోని ఆలయానికి నష్టవాటిల్లకుండా ఫిరంగిదళం దాడులు జరపాలని, తన సైనికులకు, సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. టిపూ నివాసగృహానికి సమీపాన ఒకవైపు మసీదు, మరొకవైపున శ్రీరంగనాధస్వామీ ఆలయం ఉన్నాయి. నమాజుకు రమ్మని మసీదునుండి వినపడే పిలుపుకు ఆయన ఎంతటి ప్రాధాన్యం యిచ్చేవాడో శ్రీరంగనాధస్వామీ  ఆలయం నుండి వినవచ్చే జేగంటలకు అంతే ప్రాముఖ్యం ఇచ్చాడు. సమాజంలోని కొందరు వ్యక్తులు సాగించే కిరాతక చర్యలను ఆ వ్యక్తికి చెందిన సాంఘిక జనసముదాయానికి  అంటగట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించాడు. ఎవరు తప్పుచేసిన వ్యక్తిని మాత్రమే నిందించాలి తప్ప, ఆ వ్యక్తికి సంబంధించిన యావత్తు సమాజాన్ని తప్పు పట్టడం అహేతుకం అన్నాడు. టిపూ సైన్యంలోని 19మంది సేనాధిపతులలో 10 మంది, 13మంది మంత్రులలో ఏడుగురు హిందువులని శ్రీ బి.యన్‌. పాండే తన గ్రంధంలో వెల్లడించారు.
            టిపూ సుల్తాన్‌ మత సామరస్యాన్ని ఎంతగా పాటించినా, ఈ గడ్డను ఆక్రమించుకున్న బ్రిటీషర్లు, ముస్లిం వ్యతిరేకతను నింపుకున్న స్వదేశీ చరిత్రకారులు, టిపూను  మతోన్మాదిగా చిత్రించారు. టిపూ బలవంత మత మార్పిడికి పాల్పడి, తీవ్ర వత్తిడిని తీసుకొచ్చినందున మతాంతీకరణ యిష్టంలేని 3 వేలమంది బ్రాహ్మణులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని  అరోపిస్తూకలకత్తా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అధిపతి డా||హరిప్రసాద్‌  శాస్త్రి తాను రాసిన మెట్రిక్యులేషన్‌ స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం బెంగాల్‌, అస్సాం, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలోని ఉన్నత పాఠశాల విద్యార్ధుల చరిత్ర పాఠ్య గ్రంధంగా చలామణీ అయ్యింది. ఈ విషయం చాలకాలం తర్వాత ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు డా|| బి.యన్‌. పాండే దృష్టికి 1928-29లో రాగా ఆయన విశ్త్రుత పరిశోధన జరిపారు. అరోనణలు చేసిన           డా||హరిప్రసాద్‌ తన అభియోగాలకు అధారాలు చూసకుండా, కనీసం డాక్టర్‌ పాండే ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ముఖం చాటేయడంతో, ఈ విషయాన్ని ఆయన కలకత్తా విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ దృష్టికి తీసుకురాగా, విశ్వవిద్యాలయం సూచించిన పాఠ్య గ్రంధాల జాబితా నుండి శ్రీ శాస్త్రి గ్రంధాన్ని తొలగించారు.
            చిన్ననాటనే అసమాన ధైర్యసాహసాలతో తండ్రికి తగిన తనయుడన్పించుకున్న టిపూ, పలు విజయాలను సాధించాడు. మలబారు ఆక్రమణతో ప్రారంభమైన ఆ యుద్ధవీరుని జీవితం అటు ఈస్ట్‌ ఇండియా కంపెనీతో ఇటు స్వదేశీపాలకులైన నిజాం, మరాఠాలతో పోరుచేస్తూ ముందుకుసాగింది. చివరి శ్వాస వరకు ఈస్ట్‌ ఇండియా పాలకులను మాతృదేశం నుండి తరిమి వేయటానికి అవిశ్రాంతంగా పోరాడిన ఏకైక స్వదేశీ పాలకుడిగా టిపూ సుల్తాన్‌ చిరస్మరణీయమైన ఖ్యాతిగాంచాడు. తండ్రి నుండి రాజ్యాధికారం పొందిన తరువాత టిపూ తన రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది నుంచి, దక్షిణాన దిండిగల్‌ వరకు అంటే సుమారు 400మైళ్ళు పొడవున, పశ్చిమాన మలబారు నుంచి, తూర్పున తూర్పు కనుమల వరకు సుమారు 300మైళ్ళు విస్తరించగలిగాడు. అసూయా ద్వేషాలతో రగిలి పోతున్న నిజాం నవాబు, మరాఠాలు ఏకం కావటమే కాక ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో చేతులు కలిపారు. చివరకు శ్రీరంగపట్నం ముట్టడి ప్రారంభమైంది. కర్నాటక వైపు నుండి జనరల్‌ హరిస్‌, కూర్గ్‌ నుండి జనరల్‌ స్టూవర్ట్‌, హైదరాబాదు నుండి లార్డ్‌ వెల్లస్లీ, దక్షిణం వైపునుండి కల్నల్‌ రోడ్‌, కల్నల్‌  బ్రౌన్‌ చుట్టు ముట్టారు. నిజాం, మరాఠా పాలకులు, పాలెగాళ్ళు, వెల్లస్లీ కలలను నిజం చేయడానికి కంపెనీ సైన్యాలకు తోడుగా నిలిచారు.
            1799 మే మాసం 4వ తేదిన, భయంకరమైన యుద్ధం జరిగింది. టిపూ ఎంతటి నిర్ధుష్ట చర్యలు తీసుకున్నా, అంతర్గత శత్రువులను కనిపెట్టలేక పోయాడు. టిపూ దివాన్‌ మీర్‌ సాధిక్‌, రాజ్యకాంక్షతో బ్రిటీషర్లతో చేతులు కలిపాడు. టిపూ రాజ్యంలోని మరికొందరు పాలెగాళ్ళు బ్రిటీషర్లకు మిత్రులయ్యారు.  విూర్‌ సాధిక్‌ స్వామి ద్రోహం వలన, శత్రు సైన్యం కోటలోకి సునాయాశంగా ప్రవేశించింది. శతృవు కోటలోకి ప్రవేశించటంతో టిపూ సైన్యాలను కలకలం ప్రారంభమైంది.  బ్రిటీష్‌ సైన్యం అన్నివైపుల నుండి చుట్టుముట్టింది. స్వదేశీ పాలకులల కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, ఎత్తుగడలతో సాగుతున్న వలసపాలకులు సాగిస్తూన్న యుద్ధాన్ని,    స్వామిద్రోహులు చేసిన విద్రోహల వలన  శత్రుదుర్బేధ్యమైన కోటలోకి శతృసైన్యాలు భారీ సంఖ్యలో జొరబడిన విషయాన్ని ఆయన గ్రహించేలోగా   పరిస్థితులు చేతులు దాటిపోయాయి.  ఆ సమయంలో కోట నుండి తప్పించుకోమని మంత్రులు నచ్చచెప్పినా వినకుండా, విజయమో లేక వీరస్వర్గమో తేల్చుకోవాలని టిపూ నిర్ణయించుకున్నాడు. ' నక్కలాగా వంద సంవత్సరాలు బ్రతికే కంటే సింహంలా ఒక్క రోజు బ్రతికినా చాలు ' అంటూ టిపూ శత్రు సైన్యాల విూద విరుచుకుపడ్డాడు. శతృసైన్యాలు, ఆంగ్లేయాధికారుల టిపూను సమీపించడానికి భయపడేంతగా రణభూమి అంతటా తానై కన్పిస్తూ, శతృసైన్యాలలో భయోత్పాతం కల్గించాడు. శత్రు సంహారం చేస్తూ సాగుతున్న టిపూకు  అనూహ్యమైన రీతిలో తుపాకి గుండొకటి దూసుకు వచ్చి తాకటంతో ఆయన నేలమీదకు వొరిగిపోయాడు. బాధను పళ్ళ బిగువున భరిస్తూలేచి నిల్చోడానికి శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పటికే టిపూ సైన్యం భారీ సంఖ్యలో హతమైంది. సూల్తాన్‌ను  రక్షించుకునేందుకు కనీస సహాయం కూడా అందని పరిస్ధితి.  ఆ సమయంలో కూడా, ఒక వైపు శరీరంలో రక్తమంతా భూమిని తడిపేస్తున్నా నీరసం ఆవహిస్తున్నా క్రమంగా ప్రాణం పోతున్నా టిపూ తన చేతిలోని ఖడ్గాన్ని వదల లేదు. ఆ సమయంలో యుద్ధ వాతావరణం కొంత తగ్గు ముఖం పట్టంది. బ్రిటీష్‌ సైనికులకు అడ్డులేకపోయింది. అందినంత పుచ్చుకునే అవకాశం లభించింది. టిపూ నేలకొరిగిన ప్రాంతంలో తన చేతిలోని ఖడ్గాన్ని వదల లేదు. ఆ సమయంలో యుద్ధ వాతావరణం కొంత తగ్గు ముఖం పట్టింది. బ్రిటీష్‌ పైనికులకు అడ్డు లేకపోయింది. అందినంత పుచ్చుకునే అవకాశం లభించింది. టిపూ నేలకొరిగిన ప్రాంతంలో ఆయన ఖడ్గం, ఆయన ధరించిన బెల్ట్‌ మీద పొదిగిన బంగారాన్ని, వజ్రాలను గమనించిన ఓ సైనికుడు  వాటిని ఊడబెరుక్కోడానికి  టిపూను సమీపించాడు.  శతృసైనికుడు సమీపిస్తున్నాడని గమనించి టిపూ చరివరి థలో కూడా శరీరంలో ఉన్న బలాన్నంతా కూడదీసుకొని ఆ సైనికుడ్ని తన కరవాలానికి ఎరచేసాడు. అస్తమించాడని  భావించిన వ్యక్తి అకస్మాత్తుగా కత్తి దూయటంతో కంగారు పడిన కంపెనీ సైనికుడు టిపూ మీద తుపాకి గుళ్ళను కురిపించాడు. టిపూ సుల్తాన్‌ గాయపడి కూడా విక్రమించటం చూసిన సైనికులు టిపూ మీద విచక్షణా రహితంగా గుండ్ల వర్షం కురిపించారు. ఆ గుండ్ల వర్షంతో అసమాన యోధుడు టిపూ సుల్తాన్‌, 1799 మే మాసం 4న తేది సాయంకాల సమయాన కన్ను మూసాడు.
             టిపూ సుల్తాన్‌ ప్రాణాలు వదలిన ఆరు గంటల వరకు ఆయన  మరణించిన వార్త  శత్రువుకు తెలియరాలేదు.  చివరకు బ్రిటీష్‌  సైనిధికారి జనరల్‌ హరిస్‌, తన సాయుధ బలగాలను, టిపూ బంధువులు, సేవకులకు వెంటబెట్టుకొని మృత వీరుల గుట్టలలో టిపూ కోసం వెతులాట ప్రారంభించాడు. చివరకు విశ్వాసపాత్రులైన సైనికుల మృతదేహల మధ్యన విగత జీవుడైన టిపూ కన్పించాడు. టిపూ భౌతికకాయాన్ని చూసి కూడా మరణాన్ని బ్రిటీష్‌ అధికారులు నిర్ధారించుకోలేక పోయారు. ఆ వీరుడు మరణించటమా అంటూ స్వజనులు నమ్మలేకపోయారు.  టిపూ బ్రతికి ఉండి, ఒక్కదుటున లేచి  లంఘిస్తే అమ్మో అనుకుంటూ భయపడిన  కంపెనీ బలగాలు టిపూ మృతదేహాన్ని సమీపించేందుకు సాహాసించ లేకపోయాయి. టిపూ మృదేహాం  చుట్టూతా సాయుధులైన సైనికులను నిల్చోపెట్టి, ఏక్షణాన్నై తుపాకులు గర్జించేందుకు వీలుగా టిపూకు గురిపెట్టించి మృతదేహాన్ని సమీపం నుండి పరిశీలించి, టిపూ మరణాన్ని దృవపర్చుకున్నాడు. ఆతరువాత  టిపూ మరణించాడని నిర్ధారదించుకుని, ఆనందం పట్టలేక కేరింతులు కొడుతూ,  'ఈ నాటి నుండి ఇండియా మనది ' (Now India is Ours) అని జనరల్‌ హరిస్‌ ప్రకటించాడు. టిపూ విూద విజయం సాధించాక జరిగిన విందులో  ఆంగ్లేయాధికారి Thomas Minro, " We can easily capture all of India but Tipu is the only hurdle.." అన్నాడంటే టిపూ బ్రిటీషర్ల దురాక్రమణను ఎంతగా బలంగా ఎదుర్కొన్నాడో  ఆయన వారి దురాక్రమణకు ఎంతగా అవరోధం అయ్యాడోబ్రిటీషర్ల పురోగతిని టిపూ ఎంతగా నిలువరించాడో ఈ మాటల వలన అవగతం అవుతుంది.
            ఈ విధంగా బ్రిటీషర్లతో కదన రంగాన  పోరాడుతూ, రణ భూమిలోనే చివరి శ్వాస వదలిన స్వదేశీ పాలకులలో టిపూ ప్రధముడని చరిత్ర ఆయనను కీర్తిచింది. (.."Tipu Sultan was the single brave hero of Indian Histroy who fighting the Britishers met his martydom in the battle field..." Prof.Jaya Prakash) ప్రజల మనస్సులలో టిపూ ఎర్పరచుకున్న సుస్ధిర స్ధానాన్ని గమనించిన గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ బ్రిటీష్‌ సైన్యాధికారులకు ఇచ్చి విందులో మాట్లాడుతూ, ' మిత్రులారా మిమ్మల్ని నన్ను ఈ ప్రపంచ మర్చి పోవచ్చు. అయితే టిపూ స్మృతులు కలకాలం నిలచిపోగలవు ' (.."I fear my friends that Tipu's memor will live long after the world has ceased to remember you and me...")  అని ఘనంగా నివాళులు అర్పించటం విశేషం. శత్రువు చేత కూడా ఘనమైన నివాళులు, ప్రశంసలు అందుకున్న టిపూ లాంటి స్వదేశీ పాలకులు భారతదేశ చరిత్రలో అరుదు. చివరి నెత్తూరు బొట్టు నేలరాలే వరకు బ్రిటీషర్లతో పోరాడి, భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డగా ఖ్యాతిగాంచి టిపూ సుల్తాన్‌ చిరిత్రపుటలలో అరుదైన శాశ్వత స్ధానం పొందాడు.
            టిపూ కన్నుమూసాక బ్రిటీష్‌ కూటమిలోని సైన్యాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. టిపూ  రాజ్య రాజధాని నగరమైన  శ్రీరంగపట్నం మీద బ్రిటీష్‌, నిజాం, మరాఠా సైనికలు విజృంభించారు. ఈ విజృంభన మూడు రోజుల పాటు యధేచ్చగా సాగింది. శ్రీరంగపట్నం ప్రజలను సైననికులు అన్ని విధాల దోచుకున్నారు. టిపూ కుటుంబీకులతో సహా, సామాన్య ప్రజలను శారీరంగా, మానసికంగా హింసల పాల్జేసాయి. స్త్రీలు, వృద్ధులు, పిల్లలను బేదం లేకుండా బ్రిటీషర్లు శ్రీరంగపట్నం వాసుల మీద అత్యాచారాలకు, అంతులేని దోపిడికి పాల్పడిముప్పు తిప్పలు పెట్టి, తమను మట్టి కరిపించిన టిపూ సుల్తాన్‌ మీదనున్న కసిని  భయంకరంగా తీర్చుకున్నాయి. శ్రీ రంగపట్నాన్ని స్మశానవాటిక చేసిగాని ఆ సైనికులు అక్కడనుండి నిష్క్రమించలేదు. ఈ అకృత్యాలను, కర్ణాటక ప్రభుత్వం మాజీ మంత్రి, చరిత్రకారుడు జనాబ్‌ మహమ్మద్‌ మొయినుద్దీన్‌ రాసిన ' శ్రీ రంగపట్నం అఫ్‌టర్‌ డాన్‌ ' గ్రంధంలో సవివరంగా పేర్కొన్నారు.
       -సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌.