Monday 11 March 2013

గాంధీజీ పిలుపుకు తొలుతగా స్పందించిన ఆంధ్రుడు
మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌
(1882-1973)

        సహాయనిరాకరణ-ఖిలాఫత్‌ ఉద్యమంలో భాగంగా  ఆంగ్ల ప్రభుత్వం ప్రసాదించిన పదవులను, ఉద్యోగాలను, బిరుదులను త్యజించాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు రాష్ట్రం నుండి తొలుతగా స్పందించిన యోధుడు మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌. కృష్ణా జిల్లా విజయవాడలోని సంపన్న జాగీద్దార్‌ కుటుంబంలో ఆయన 1882లో జన్మించారు. చిన్నతనం నుండి సేవాభావాన్ని అలవర్చుకున్న ఆయన అవసరార్ధుల మన్నన పొందారు. నిడారంబర జీవితాన్ని ఇష్టపడినఆయన జాగీద్దారిని కూడా పరిత్యజించారు. 
    గులాం మొహిద్దీన్‌ ఇటు భారత జాతీయ కాంగ్రెస్‌, అటు అఖిల భారత ముస్లింలీగ్‌లో సభ్యత్వం స్వీకరించారు. 1919లో ఆరంభమైన సహాయనిరాకరణ-ఖిలాఫత్‌ ఉద్యమంలో భాగంగా ఆంగ్ల ప్రభుత్వం అందచేసిన పదవులును వదులుకోవాల్సిందిగా మహాత్ముడు కోరారు. గులాం మొహిద్దీన్‌ తక్షణమే ఆ పిలుపుకు స్పందిస్తూ తాను నిర్వహిస్తున్న గౌరవ మేజిస్ట్రేటు పదవికి రాజీనామా చేసి, ఆంగ్ల ప్రభుత్వం ఇచ్చిన పదవిని త్యజించిన తొలి ఆంధ్రుడయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ స్వాతంత్య్రసమరయోదులు అయ్యదేవర కాళేశ్వరరావు పేర్కొంటూ, నా ముఖ్య మిత్రులైన మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ సాహెబుగారు మొదటి తరగతి గౌరవ మేజిస్ట్రేటుగ నుండిరి. నాతోపాటుగా తాను కూడా గౌరవ ఉద్యోగము వదలు కొనెదమని ప్రకటించిరి. అప్పుడు శ్రీమాన్‌ చక్రవర్తి రాజగోపాలచారి గారు కూడా యుండిరి. ఆంధ్ర దేశములో మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ దౌర్జన్యరహిత సహాయ నిరాకరణోద్యమము ననుసరించి శాసనసభ అభ్యర్థిత్వమును, మొదటి తరగతి గౌరవ మెజిస్ట్రేట్‌ పదవిని వదలుకొన్నవారము అప్పటికి మేమిద్దరమే. ఈ సంగతి గాంధీగారు ఆ సభలో గుమికూడిన వేలాది ప్రజల ముందు కరతాళధ్వనుల మధ్య ప్రకటించిరి. తమ 'యంగ్‌ ఇండియా' పత్రికలో కూడా వ్రాసిరి, అని పేర్కొన్నారు. (నా జీవిత కథ (నవ్యాంధ్రము), అయ్యదేవర కాళేశ్వరావు, పేజీ.291)
    మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ విజయవాడ ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమ కమిటికీ అధ్యకక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. సన్నిహిత మిత్రుడు అయ్యదేవరతో కలసి జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.1921లో విజయవాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు సంకల్పించిన ఆయన పట్టుబట్టి, అయ్యదేవరతో కలసి కలకత్తా వెళ్ళి సమావేశాల నిర్వహణకు మహాత్ముడి అనుమతి పొందారు. ఈ సమావేశాలలో మహాత్మాగాంధీ, అబ్బాస్‌ తయాబ్జీ, హాకీం అజ్మల్‌ఖాన్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, మహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ తదితర ప్రముఖులు విజయవాడకు విచ్చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సమావేశాల కోసం మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ సాహెబ్‌ తన ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. 

    ఈ విషయాన్ని అయ్యదేవర గాంధీజీకి తెలుపుతూ గులాం మొహద్దీన్‌ కాంగ్రెస్‌కు ఎంతో ఆర్ధిక సహాయం చేశారనగా, ఆ మాటకు మొహిద్దీన్‌ వెంటనే స్పందిస్తూ, తాను కాంగ్రెస్‌ కోసం ఖర్చు చేయలేదనడంతో అక్కడున్న నాయకులు ఆశ్చర్యపడ్డారట. అంతలోనే, తన సంపదను తాను దేశం కోసం మాత్రమే వ్యయం చేశానని మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ చెప్పడంతో నేతలంతా ఆనందిస్తూ గులాం సాహెబ్‌ను ఆనందించారట. ఆయన వితరణ, ఆతిథ్యాన్ని మరువని గాంధీజీ విజయవాడ నుండి ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా మొహిద్దీన్‌ సాబ్‌ ఏలా ఉన్నారు? అని ఆయన క్షేమసమాచారాలను కనుక్కొనేవారట. (ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, చరిత్రకారుడు యల్‌.వి.రమణ (విజయవాడ) కథనం).
    1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు. స్వయంగా గుర్రం మీద విజయవాడలోని వీధుల్లో తిరుగుతూ శాంతంగా, సామరస్యంగా ఉండమని అన్ని మతాల ప్రజానీకాన్ని కోరుతూ మత సామరస్యానికి విశేష కృషి సల్పారు. విజయవాడ పురపాలక సంఘం కౌన్సిలర్‌గా, ఉపాధ్యకక్షునిగా చాలా కాలం బాధ్యతలు నిర్వహించారు. చివరివరకు చలువ ఖద్దరు ధరించిన ఆయన 1973 మార్చి 13న విజయవాడలో 91వ ఏట కన్నుమూశారు.