Thursday 10 May 2012

సంపూర్ణ స్వరాజ్యం కై తొలి కేక వేసిన పోరాట యోధుడు మౌలానా హస్రత్‌ మోహాని

సంపూర్ణ స్వరాజ్యం కై తొలి కేక వేసిన పోరాట యోధుడు
మౌలానా హస్రత్‌ మోహాని
    భారత జాతీయ కాంగ్రెస్‌ 14న సమావేశం డిసెంబరు 1921న అహ్మదాబాద్‌ లో జరుగుతుంది.  ఆ సమావేశంలో ఓ వ్యక్తి గంభీరంగా ఉపన్యసిస్తున్నాడు. అతని ప్రసంగం యువకుల్నే కాదు, పెద్దల్ని కూడా పెను తుఫానులా చుట్టేస్తుంది. ఆ ప్రసంగంలో వ్యక్తమవుతున్న పట్టుదల, లక్ష్యం పట్ల గల నిభద్దతకు సభికులు ఆనంద పరవశులవుతున్నారు. ఆ ప్రసంగానికి సభాస్దలి యావత్తు కదలిపోతుంది. ప్రతిపాదిత ' స్వరాజ్యం ' డిమాండ్‌ను  ఆ వక్త  కోరుతున్నటుగా ' సంపూర్ణ స్వరాజ్యం ' గా సవరించబడి ఏకగ్రీవంగా తీర్మానించాలని ప్రతి ఒక్కరూ భావించారు. చివరకు అది తీర్మానం కాలేదు.
    భారత రాజకీయ రంగాన తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న మహాత్మా గాంధీ ఆ సవరణను వ్యతిరేకించటం వలన అది అప్పటికి వీగిపోయింది.' .. this proposition of Mr.Hasarth Mohani leads you into depths unfathomable.. ' అంటూ సవరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సమావేశం సానుకూలత సాధించేందుకు గాంధీజీ సుదీర్ఘ ప్రసంగం చేయాల్సి వచ్చింది.  జాతీయోద్యమంలో ఈ డిమాండ్‌ ను ప్రప్రధమంగా ఒక రాజకీయ వేదిక మీద ప్రకటించిన తొలి  ఉద్యమకారుడిగా  ఖ్యాతిగాంచాడా వక్త.  ఆ వక్త మరెవరో కాదు, భారత స్వాతంత్య్రోమ చరిత్రలో ' చిచ్చర పిడుగు ' గా ఖ్యాతి గాంచిన మౌలానా హస్రత్‌ మోహాని. స్వాతంత్య్ర పోరాటంలో తనదైన విప్లవాత్మక శైలితో బ్రిటీషర్లను ఎదుర్కొంటూ భారతీయుల హృదయాల్లో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యోధుడాయన.
    స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మౌలానా మోహాని 1878 లో ఉత్తర ప్రదేశ్‌ లోని ' మోహన్‌ ' అను  పట్టణంలో జన్మించాడు. ఆయన అసలు పేరు సయ్యద్‌ ఫజులుల్‌ హసన్‌. హాస్రత్‌ ఆయన కలం పేరు. మోహన్‌ అను పట్టణం నుండి వచ్చినందున  జన్మస్థానం పేరును  కలుపుకుని  ' హాస్రత్‌  మోహాని ' ఆయ్యాడు.  అలీఘర్‌ డిగ్రీ కళాశాలలో బి.ఎ చేసాడు. చిన్నతనం నుండే సాహిత్యాభిలాషి.    పదిహేడవ ఏటనే మోహాని గజల్స్‌ రాయటం ప్రారంభించాడు. ' ఉర్దూ-యే-ముల్లా '   పత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు. అరవింద ఘోష్‌ , బాల గంగాధర తిలక్‌ల  విప్లవాత్మక భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. చదువు పూర్తి కాగానే పరులచెంత నౌకరుగా చాకిరి చేయటం ఇష్టంలేని మోహాని జర్నలిస్టుగా జీవితం ప్రారంభించాడు.         బానిసత్వాన్ని ఏ రూపంలోనూ సహించని  మోహాని బ్రిటీషర్ల పై పోరు సలిపేందుకు, 1903లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. 1907 లో అతివాదులు, మితవాదులుగా కాంగ్రెస్‌ చీలిప్పుడు  ఆయన తిలక్‌ బాటను అనుసరించాడు.
    విప్లవాత్మక భావాలతో బ్రిటీష్‌ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ ఆయన పత్రికలో వ్యాసాలు రాసి, ప్రచురించిన కారణంగా 1909 లో ప్రభుత్వం  రాజద్రోహం నేరం మోపి, రెండు  సంవత్సరాల జైలు, ఐదు వందల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోవటం వలన ఆయన సమకూర్చుకున్న అమూల్య గ్రంధాలను జప్తుచేసి పోలీసులు పట్టుకెళ్ళారు. జైలు నుండి విడుదల కాగానే, ఒక మిత్రుని ఆర్ధిక సహకారంతో భారత దేశం లోని ప్రధమ ' స్వదేశీ స్టోర్స్‌ ' ను భార్య శ్రీమతి నిషాతున్నిసా బేగం సహాయంతో ప్రారంభించారు. బేగం హస్రత్‌ మోహాని గా విఖ్యాతురాలైనా ఆమె స్వాతంత్య్ర సమరంలో అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించటమే కాక, అన్ని వేళల్లో భర్తకు తోడూ-నీడగా నిలిచిన యోధురాలు. విదేశీ వస్తువుల బహిష్కరణను ప్రోత్సహించటమే కాక స్వదేశీ వస్తువుల తయారీదారులకు కూడా అన్ని విథాల సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. బానిసత్వం నుండి విముక్తికై పోరాట స్పూర్తి కలుగజేసేందుకు దేశభక్తి భావనల ప్రచారానికౖెె ' తజకర-యే- షురా ' (ఊబిచిదిబిజీబి-రి-ఐనీతిజీబి)  అను త్త్రెమాసిక పత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక లో తనదైన శైలిలో ఎక్కడా రాజీ పడకుండా తెల్లదొరల పాలనను విమర్శించటమేకాక విదేశీ పాలకులను ఎందుకు తరిమి కొట్టాలో విశ్లేషించి  ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యాడు ' British people in Egypt ' అను వ్యాసాన్ని ప్రచురించినందుకు ఆయన పై మళ్ళీ రాజద్రోహం నేరం మోపిన ప్రభుత్వం విచారణ జరిపించి నాలుగు సంవత్సరాల జైలు శిక్షను విధింపజేసింది.
    కాబూల్‌ కేంద్రంగా ఏర్పడిన ప్రవాస భారత ప్రభుత్వం పిలుపు మేరకు , మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తో కలసి కాబూల్‌ కు వెడుతున్నాడన్న నెపం మీద 1916లో ఆయనను ప్రభుత్వం గృహ నిర్భంధ శిక్షను విధించగా,  ఆయన  ఉల్లంఘించాడు.  అందుకు గాను ఆయన  మరోసారి 2 సంవత్సరాల జైలు శక్షకు గురయ్యాడు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని,  '..మోహాని కృషికి తగిన బహుమతి అందింది...మోహాని ఎందుకు అరెస్టు అయ్యాడో 50 సంవత్సరాల తరువాత ఈ దేశం సరిగ్గా అర్థం చేసుకుంటుంది..' అని మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ప్రశంసించారు. ఆయనను అతి ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించిన ప్రభుత్వం జైలులో అనేక రకాలైన ఇబ్బందుల పాల్జేసింది. కష్టనష్టాలకు గురిచేసింది. విలువైన పుస్తకాలను తగులపెట్టించింది  మౌలానా స్వయంగా ఆ సంఘటనలను ఈ విధంగా పేర్కొన్నారు. .' .' ..The superintendent of jail came to my cell. He burnt to ashes all of my newspapers, magazines and books, including Diwan-e-Hafiz and ordered me indignantly to present myself in his office.. '  ప్రభుత్వం ఎతం పీడించినా, మౌలానా మాత్రం మొక్కవోని ధైర్యంతో అన్నిటిని సహించాడు, ఎదుర్కొన్నాడు.
    ఖిలాఫత్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. ముస్లింలీగ్‌ నేతగా తనదైన భావాల వైపుగా లీగ్‌ను నడిపించేందుకు ప్రయత్నించాడు. లీగ్‌ ప్రతినిధుల బృందలో సభ్యుడిగా లండన్‌ వెళ్ళాడు. లీగ్‌ సమావేశాలలో '..the attainment of swaraj or complete independence, free from all foreign control, by the people of India by all legitimate and peaceful means..'  అంటూ ప్రతిపాదించి చర్చించాడు. భారత రిపబ్లిక్‌, అమెరికా తరహా ఐక్య సమాఖ్యగా ఉండాలని ఆయన వాంఛించాడు. సహాయనిరాకరణ కొంత వరకు మాత్రమే సత్పలితానిస్తూందని అభిప్రాయపడుతూ, సాయుధ  గెరిల్లా పోరాటాలను ఆరంభించాలన్నాడు. ముస్లింల అభ్యున్నతి కోసం సాంకేతిక విద్యాసంస్థలను, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించాలన్నాడు. ప్రత్యేక నియోజకవర్గాలు వద్దన్నాడు.  బ్రిటీషర్లను తరిమివేసేందుకు హిందూ-ముస్లిం మధ్య ఐక్యత చాలా అత్యవసరమన్నాడు. హిందూ-ముస్ల్లిలు తమ తమ ప్రత్యేక డిమాండ్లను ప్రక్కన పెట్టి ఉమ్మడి శతృవుపై పోరాడాలని పిలుపునిచ్చాడు. ఆ ప్రయత్నంలో మహ్మద్‌ ఆలీ జిన్నా భావాలను తీవ్రంగా వ్యతిరేకించాడు.
    1921లో అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగాన్ని పురస్కరిచుకొని రాజద్రోహం నేరం మొపుతూ, ప్రభుత్వం ఆయనకు మళ్ళీ రెండేళ్ళు జైలుశిక్ష విధించింది. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పక్షం ముందుకొచ్చినా మౌలానా మద్దతు నిచ్చేవాడు. ఆయన కమ్యూనిస్టు పార్టీకి సన్నిహితుడయ్యాడు. 1925లో కాన్పూరులో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశాల నిర్వహణకై ఏర్పడిన ఆహ్వాన సంఘానికి ఆయన అధ్యక్షత వహించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ' communism is a movement of the peasants and workers. Some may think that communism synonyms with chaos and Killings... our independence should be based on the model of the soviet Govt. Where Communism shall be ruling political creed..' అభివర్ణించాడు.
    ' సంపూర్ణ స్వరాజ్యం' సాధించేందుకు హిందూ-ముస్లిం ఐక్యత ఎంతో అవసరమని నమ్మిన ఆయన, 1927-28లో కలకత్తాలో జరిగిన ఐక్యతా సమావేశంలోని నిర్ణయాలను  హిందూ సోదరులు నిరాకరించటంతో తీవ్ర వ్యధకు గురయ్యాడు. గాంధీజీ సిద్దాంతాలకు అన్ని సమయాలలో అనుసరించదగినవి కావన్న అభిప్రాయం గల మౌలానా తన వాదనను విన్పించటంలో ఏ మాత్రం వెనుకాడేవాడు కాదు. నిర్భయంగా, నిక్కచ్చిగా తన భావాలను తెలపటంలో, ఎదుటి వ్యక్తి వాదనను, ఎదుర్కొనటంలో ఏ మాత్రం మొహమాట పడేవాడు కాదు. మౌలానా వాదనా పటిమ  గురించి టర్కీకి చెందిన రచయిత్రి Halide Eidb  1937లో మహాత్మాగాంధీ మాట్లాడుతూ ' when I have a talk with Mohani, I can not sleep in peace..' అన్నాడంటే మౌలానా వాదన ఏ స్థాయిలో ఉండేదో ఊహించవచ్చు. 1921 నుండి పోరాడుతున్నా  ' సంపూర్ణ స్వరాజ్యం ' ప్రతిపాదనను గాంధీజీ ఒత్తిడి వలన తీర్మానంగా కాంగ్రెస్‌ ఆమెదించక పోవటం, తన విప్లవాత్మక భావాల పట్ల తరచుగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత వలన విసిగిన ఆయన 1928లో కాంగ్రెస్‌ నుండి  బయటకు వచ్చేసాడు.  ఆయన బయటకు వచ్చాక, 1929 అక్టోబరు 31 నాటి లాహోర్‌ సమావేశంలో ఆయన కల పూర్తిగా నిజమైంది.  1921 నుండి ఆయన చేస్తూ వచ్చిన ' సంపూర్ణ స్వరాజ్యం ' డిమాండ్‌ కాస్తా పూర్తి స్ధాయిలో తీర్మానమైంది. వ్యక్తి సత్యాగ్రహోద్యమంలో చురుగ్గా పాల్గొని ఆయన, లక్నోలోని అమానుల్లా పార్క్‌లో బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూ ప్రసంగించాడు. ఆ సందర్భంగా  పోలీసులు ఆయనను అరెస్టు చేయ ప్రయత్నించారు. అరెస్టును హస్రత్‌ తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆయనను బలవంతంగా  వాహనం మీదకు విసిరి పోలీసులు తీసుకెళ్ళాల్సి వచ్చింది. 1937లో ఆయన సహ్మధర్మచారిణి నిశౄతున్నిసా బేగం కన్నుమూసారు. అన్ని విధాల తోడ్పాటునిచ్చి, కష్టకాలంలో అండగా నిలచిన  అర్థాంగి మృతి ఆయనను తీవ్రంగా కలచివేసింది. ' సంపూర్ణ స్వరాజ్య' సాధనకు అంకితమైన వ్యక్తిగా రాజకీయాల నుండి ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు.     బ్రిటీష్‌ పాలకులతో ఏ మాత్రం రాజీపడని ఆయన బానిస బంధనాల నుండి విముక్తిని సదా కాంక్షించాడు. ఆ దిశగా ఏ వ్యక్తి  మరే శక్తి పోరాటం సాగిస్తున్నా ఆయన అండదండలు అందించాడు. 1931లో ' లీగ్‌ '  ఐలిజితీ స్త్రళిఖీశి. డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసింది.  ఆ సమయంలో  ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ 'al hamdolilla Muyslium League council in its meetings of 1914 accepted Self Government  as its Goal, Which I declared in 1907.' అన్నాడు.
    ఆ తరువాత మౌలానా హస్రత్‌ 1915లో ముస్లింలీగ్‌లో చేరాడు. చివరి వరకు ముస్లిం లీగ్‌తో సంబంధాలను కొనసాగించినా, ఆయన ఏక్కడా రాజీపడలేదు. 1916లో లీగ్‌ కోరిన ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించాడు. ఇంగ్లాండ్‌ వెళ్ళిన లీగ్‌ ప్రతినిధివర్గ సభ్యుడై ఉండి ఖిలాఫత్‌ ఉద్యమాన్ని బలపర్చుతూ, భారతీయుల పోరాటం న్యాయమైనదని వాదించాడు. జీవిత పర్యంతం స్వేచ్చా, స్వాతంత్య్రాల విషయంలో ఏ విధమైన రాజీ ధోరణిని ఆయన అంగీకరించలేదు. 1937 సంవత్సరంలో లక్నోలో జరిగిన లీగ్‌ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ '.. Establishment of India of full independence in the form of a federation of free democratic states in which rights and interests of the Muslamans and other minorities are adequately and effectively very safe of safe guarded in the constitution....'. అన్నాడు. అల్ప సంఖ్యాక వర్గాల ప్రజానీకం సమాన హక్కులు రాజ్యాంగ పరంగా పొందగలరని వాంఛించాడు.
    గాంధీజీ, జిన్నాలతో రాజకీయ సిద్దాంత పోరాటాలు జరపటంలో రాజీపడని నిర్భయుడైన యోధుడాయాన. గాంధీజిని సంపూర్ణ స్వరాజ్య తీర్మానం విషయంలో  ఏ విధంగా ఎదుర్కొన్నాడో అదే విధంగా 1942లో అలహాబాద్‌లో జరిగిన లీగ్‌ సమావేశంలో అత్యంత బలమైన నాయకుడైన మహమ్మద్‌ అలీ జిన్నాను ఎదుర్కొన్నాడు.  నమ్మిన విషయంలో  ఏ మాత్రం సదలింపు కన్పించేంది కాదు. క్రిప్స్‌ ప్రతిపాదనల విషయంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు జిన్నాను 'డిక్టేటర్‌'గా అంగీకరించేందుకు  లీగ్‌ చేసిన నిర్ణయాన్ని, ఆయన ససేమిరా అంగీకరించలేదు. ఆ సమయంలో లీగ్‌లో తిరుగులేని నాయకుడి వెలుగొందుతున్న జిన్నాను వ్యతిరేకించటం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యం కాగల వ్యతిరేక పరిస్థితులైనప్పటికీ, ప్రజాస్వామ్యబద్దంగా పోరాడిన ఏకైక వ్యక్తిగా ఖ్యాతి గాంచాడు.      సామ్రాజ్యవాదానికి వ్యతిరేకి, సామ్యవాద వ్యవస్థ అనుకూలుడైన హస్రత్‌ మోహాని బ్రిటీష్‌ సామ్రాజ్య విస్తరణ కాంక్షను తీవ్రంగా విమర్శించాడు. సామ్రాజ్యవాదుల కుయుక్తులకు బలవుతున్న ముస్లిం దేశాల ప్రజల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటమే కాక, కార్యాచరణకు పూనుకున్నాడు. పాలస్తీనాలో బ్రిటీషర్లు అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ' లీగ్‌ 'లో 1938 తీర్మానం చేయించటమే కాక 1938 ఆగష్టు 26ను పాలస్తీనా దినోత్సవంగా ప్రకటింపజేసాడు.
    1946లో జరిగిన ఎన్నికలలో ముస్లింలీగ్‌ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. భారత విభజన ప్రతిపాదనను విరమించుకోవాల్సిందిగా లీగ్‌ను కోరాడు. ఈ విషయమై  కౌన్సిల్‌ సమావేశంలో గట్టిగా డిమాండ్‌ చేశాడు. ఇస్లాం బోధనల ప్రకారంగా  జీవితం గడుపుతూ తనదైన శైలితో సాగుతున్నప్పటికీ, మతం పేరుతో దేశవిభజనను ఆయన పూర్తిగా  వ్యతిరేకించాడు. భారతదేశం చీలిపోవటంతో ఆయన  తీవ్రంగా వ్యధకు గురయ్యాడు. భారత విభజన జరిగాక ఆయన తన జన్మభూమిని విడిచివెళ్ళటానికి ఇష్టపడలేదు. మిత్రులు ఒత్తిడి తెచ్చినా ఆయన వినలేదు. అనంతరం స్వతంత్య్ర భారతావనిలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆయన ఉత్తరప్రదేశ్‌ నుండి ఎన్నికయ్యాడు. జీవితపు ఆఖరి ఘడియ వరకు ఆయన రాజకీయ రంగాన్ని వీడలేదు. ప్రజా జీవితానికి దూరం కాలేదు.  బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రజా సంఘాల ఆవశ్యకతను గుర్తించిన మౌలానా అనేక సంస్థలను స్థాపించి, నిర్వహించాడు. వాటిలో ' అంజుమన్‌-ఎ-కాబా ', ' మజ్లిసే అహరార్‌ ', ' ఖయామతుల్‌ ఉల్‌మా-ఎ-హింద్‌ ', ' అంజుమన్‌-ఎ-ఖుద్దాములహరమైన ్‌, అజాద్‌ పార్టీ లాంటివి ప్రధామైనవి.
    భారత విభజన తరువాత రాజ్యాంగాన్ని రూపొందించే కార్యక్రమంలో భాగంగా, ఆయన రాజ్యాంగ పరిషత్తు సభ్యుడయ్యాడు. రాజ్యాంగ నిర్మాణంలో తరదైన పాత్రను నిర్వహించాడు. అయితే పూర్తయిన రాజ్యాంగముసాయిదా మీద సంతకం చేయ నిరాకరించాడు. భారత విభజనను, కామన్‌వెల్త్‌లో భారతదేశం సభ్యత్వం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, నిరసనగా మౌలానా మోహాని సంతకం చేయలేదు.
    ఒకవైపు స్వాతంత్య్ర సమరాంగణాన వీరోచిత పోరాటాలు సాగిస్తూనే, మరోవైపున బ్రిటీష్‌ ప్రభుత్వపు కిరాతకత్వాన్ని అనునిత్యం రుచి చూస్తూ కూడా తనలోని కవిని విస్మరించలేదు.  ఉర్దూ, అరబిక్‌, పర్షియన్‌ భాషలో పాండిత్యం సంపాదించాడు.  మృధు మధురమైన కవిత్వాన్ని సాహిత్య జగత్తుకు సమర్పించుకున్నాడు.  పలు మార్లు కారాగారవాసం అనుభవించినా ఆ కాఠిన్యం మాత్రం ఆయనను సమీపించలేదు. ఉర్దూ కవితా ప్రియులు ఎంతో ప్రీతితో గానం చేసే ' చుప్‌కే చుప్‌కే రాత్‌ దిన్‌ ఆంసూ బహానా యాద్‌హై ' గజల్‌ హస్రత్‌ మోహాని కలం నుండి జాలువారింది. ఉర్దూ గజల్‌కు క్రొంగొత్త ద్వారాలను తెరచిన ఆయన అనేక వందల అద్భుతమైన గజల్స్‌ అందించాడు.
    ఆయన ఏ రాజకీయ పక్షంలోనున్నా, మరే సంస్థలో నున్నా, ఆయా సంస్థల, రాజకీయ పక్షాల ఉద్దేశాల లక్ష్యాలకు అతీతంగా,  ప్రజా సంక్షేమం మాత్రమే ఆయనకు ప్రధానమైన కర్తవ్యమయ్యేది.  మౌలానా హస్రత్‌ మోహాని గురించి డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ... ' అందరూ స్వార్థం కోసం, పార్టీ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు. అయితే మోహాని ప్రజల కోసం ఆంతరాత్మ ప్రబోధం మేరకు ఏమైనా చేయటానికి సిద్దపడతారు...' అన్నారంటే ప్రజాప్రతినిధిగా ప్రజల క్షేమమే పరమావధిగా మంచి పార్లమెంటేరియన్‌గా ఆయన ఎలా రాణించాడో అవగతం చేసుకోవచ్చు.
    సంపూర్ణ స్వరాజ్యం, సహాయ నిరాకరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, శాసనోల్లంఘన లాంటి కార్యక్రమాల ద్వారా ప్రచారాన్ని మహోధృతంగా నిర్వహించిన నాయకునిగానే కాకుండా, చిత్తశుద్దితో ఆయన కార్యక్రమాలను అమలుపరచి అందరికి ఆదర్శప్రాయుడు అయ్యాడాయన. కవి, రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, వక్త, బహుభాషా కోవిదుడు, కార్యకర్త, కార్యదకక్షుడు, ప్రజా నాయకుడు, విప్లవకారుడు అన్నింటికి మించి మానవతావాది, అకంళంక దేశభక్తుడు, అవిశ్రాంత ప్రజాసేవకుడైన మౌలానా హస్రత్‌ మోహాని లక్నోలో 1951లో మే 13వ తేదీన కన్నుమూసారు.

Friday 27 April 2012

మైసూరు పులి టిపూ సుల్తాన్‌


                                                            మైసూరు పులి టిపూ సుల్తాన్‌
            భారతదేశ రాజకీయ చరిత్రలో పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరార్ధ భాగం ఎంతో కీలకమైన సమయం. బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలాను పరాజితుడ్ని చేసి, బెంగాల్‌ దివానిని హస్తగతం చేసుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, దక్షణాదిని ఆక్రమించు కోవటానికి యుక్తులు, కుయుక్తులు పన్నుతున్నారు. ఈ సామ్రాజ్యవాద శక్తుల రాజ్యవిస్తరణ కాంక్షను అర్ధం చేసుకొలేని స్వదేశీపాలకులు పరస్పరం కలహించు కుంటున్నారు.  ఆ సమయంలో '' నేనున్నా నేనున్నా నంటూ.. '' భారత రాజకీయ చిత్రపటం మీద ఉదయించాడు   మైసూరు పులిగా ఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌.
              ఈ గడ్డ మీద నిలదొక్కుకుంటున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులను తొడగొట్టి సవాల్‌ చేసిన టిపూ సుల్తాన్‌ 1750 నవంబర్‌ 10వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా దేవనహళ్ళి గ్రామంలో జన్మించాడు. అసమాన ధైర్యసాహసాలతో '' దక్షిణ బారత దేశపు నెపోలిన్‌ ''గా ఖ్యాతిగాంచిన, అరివీర భయంకరుడు హైదర్‌ అలీ, శ్రీమతి ఫాతిమా ఫక్రున్నిసాలు టిపూ తల్లి తండ్రులు.
            విద్యాగంధం లేని హైదర్‌, తన బిడ్డ మంచి విద్యాబుద్దులు చెప్పించాడు. తండ్రి ప్రత్యేక పర్యవేక్షణలో యుద్ధ కళను టిపూ ఔపోసన పట్టాడు.  ఆనాటి ప్రముఖ యోధులలో అగ్రగామిగా  గుర్తింపు పొందిన టిపూ  చిన్నతనం నుండి తండ్రి నాయకత్వంలో సాగిన అన్ని యుద్ధాలలో పాల్గొన్నాడు. ఏ ఆంశానికి సంబంధించినదైనా, ఎటువంటి విశిష్ట, సాంకేతిక సమాచారమైనా అధ్యయనం చేసిన ఆకళింపు చేసుకోవటం నూతనత్వాన్ని అనునిత్యం ఆమ్వానించే  టిపూ, భారతీయ, పాశ్చాత్యా తత్వవేత్తల, రాజనీతిజ్ఞుల గ్రంధాలను సేకరించి అధ్యయనం చేసాడు.
            పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చేసరికి రాజ్యపాలన వ్యవహారాలలో, తండ్రితోపాటుగా యుద్ధాలలో పాల్గొన గలిగిన స్థాయినీ, సామర్ధ్యాన్నీ సంపాదించుకున్న టిపూ 1763లో జరిగిన మలబార్‌ పోరాటంలో పాల్గొన్నాడు. 1769-72 వరకు మారాఠాలతో సాగిన యుద్ధాలలో పాల్గొని, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు.  ప్రధమ మైసూరు యద్ధంలో బ్రిటీషర్ల కూటమి నుండి నిజాం నవాబును దూరం చేసేందుకు సాగిన ప్రయత్నాలలో  భాగంగా చిన్న వయస్సులోనే  చాకచక్యంగా దౌత్యం నడిపి, విజయం సాధించి  రాజనీత్ఞడన్పించుకున్నాడు. తండ్రి బాటలో యుద్ధ కళలలో ప్రావీణ్యత సంపాదించిన, టిపూ పురాతన సాంప్రదాయ యుద్దరీతులను అనుసరిస్తూనే, సాశ్చాత్య యుద్ధ వ్యూహాలను అనుగుణంగా సైన్యాన్ని అధునీకరించి మంచి తర్ఫీదు నిప్పించాడు. సరికొత్త ఆయుధాలను యుద్ధవ్యూహాలను రూపొందించిన విజయాలను రాచబాట వేసాడు. 1780లో కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ని తరిమి కొట్టిన చారిత్రక సంఘటనలో ప్రముఖ పాత్ర వహించాడు.
             దక్షణాదిలో మైసూరును బలిష్టమైన రాజ్యంగా రూపొందించాలని కలలుగన్న హైదర్‌ అలీ శత్రువు దాడుల నుండి తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు అత్యధిక కాలం రణాభూమిలోనే గడిపి 1782 నవంబరు 6, రణరంగంలో చివరి వ్వాస వదిలాడు. ఈ విషాద వార్త టిపూకి అందేనాటికి ఆయన మలబార్‌ తీరాన కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ను తరిమి తరిమి కొడుతున్నాడు. తండ్రి కన్నుమూసిన వార్త విన్న టిపూ సత్వరమే శ్రీరంగపట్నం చేరుకుని, తన 31వ ఏట 1781డిసెంబర్‌ మాసంలో మైసూరు రాజ్యలక్ష్మిని చేబట్టాడు. చిన్న వయస్సులోనే శౌర్యపత్రాపాలతో వీరుడిగా ప్రజలను ఆకట్టుకున్న టిపూ, '' మైసూర్‌ సుల్తాన్‌ '' అయ్యాడు. టిపూ ప్రజల సంక్షేమంలో రాజ్యక్షేమం, రాజు సంక్షేమం దాగుందన్న సత్యాన్ని, అర్ధం చేసుకున్న టిపూ రాజ్యభిషేకం రోజుననే, ' మిమ్ముల్ని వ్యతిరేకించినట్టయితే నేను నాస్వర్గాన్ని, నాజీవితాన్ని, నాసంతోషాన్ని కోల్పోవచ్చు. నా ప్రజల సంతోషంలోనే నా సంతోషం. నా ప్రజల సంక్షేమంలోనే నా సంక్షేమం ఇమిడి ఉంది. నాకిష్టమైందల్లా మంచిదని నేను భావించను. నా ప్రజలకు ఏది ఇష్టమో దానిని నా అభిష్టంగా భావిస్తానని ' టిపూ ప్రకటించాడు.
            ఒకవైపు టిపూను దెబ్బతీయడానికి అదను కోసం ఎదురు చూస్తున్న  స్వదేశీ శత్రువులు, మరొకవైపు పరాజయాల పరంపరతో రగిలిపోతున్న విదేశీ శత్రువతో మైసూరు రాజ్యం చుట్టుముట్టబడి ఉండటంతో, శ్వాస పీల్చుకోవటానికి కూడా తీరిక లేనప్పటికీ, టిపూ ప్రజారంజకమైన పాలనను అందిస్తూ, ప్రజల ఆర్ధిక వ్యవమారాలలో ఆయన చూపిన శ్రద్ధను గమనించిన ఆంగ్లేయాధికారి గ్రాంట్‌, టిపూ చర్యలను ప్రశంసిస్తూ టిపూ తన రాజ్యం యొక్క ఆర్ధిక వ్యవహారాలను నిర్వహించిన తీరు ఉదాహరణగా నిలచిపోతుందని అనటం విశేషం. పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాలకు వర్తింపచేసాడు. ప్రభుత్వ విభాగాలలో ప్రజలకు సంబంధించిన అన్ని రంగాలలో పలు విప్లవాత్మక మార్పులు చేసాడు. స్వదేశంలోనే కాకుండా, విదేశాలలో కూడా పరిశ్రమలను స్థాపించి అభివృద్దిపర్చాడు. పలు ప్రాంతాలనుండి చేతి వృత్తి కళాకారులను, నిపుణలను రప్పించి ప్రజలకు శిక్షణ ఇప్పించాడు. అబివృద్ది పధకాలను ఆవిష్కరింపచేసి సమర్ధవంతంగా అమలుజరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నూతన తరహా సహకార బ్యాంకులను ఏర్పాటు చేసాడు. సంపన్న వర్గాల పెత్తనం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాడు. పేద వర్గాలను పొదుపు వైపుకు ఆకర్షించేందుకు తక్కువ మొత్తాలను లాభాలను ప్రకటించాడు. పొదుపును, మదుపును ప్రోత్సహించాడు. తూనికలు - కొలతల వ్యవస్థను ఆధునీకరించాడు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి ఎగుమతులను చేపట్టాడు. నానికా వ్యాపారాన్ని వృద్ధిచేసాడు.   విదేశాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకొని ఎగుమతులు - దిగుమతుల వాణిజ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాడు. విదేశీ వర్తకాన్ని  ప్రోత్సహించాడు. వర్తక, వాణిజ్య పారిశ్రామిక రంగాలలో ప్రభుత్వ పాత్రను అధికం చేస్తూ , ప్రభుత్వ వ్యాపార సంస్ధను (State Trading Corporation.) ఏర్పాటు చేసాడు. వ్యవసాయ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు. నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు అధిక శ్రద్ధ వహించాడు. నాడు కావేరి నది మీద ఎక్కడయితే ప్రాజెక్టు కట్టాలని ఆయన ఉద్దేశించాడోఈనాడు  కృష్ణరాయనగర్‌ ఆక్కడే నిర్మాణమైంది.   పంట సిరులు అందించే రైతుకు భూమి విూద హక్కును కల్పించాడు.  బంజరు భూములను మాగాణులుగా మార్చే రైతు, మూడు సంవత్సరాల పాటు  పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదన్నాడు. పన్నుల వసూలుకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించాడు. వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం రైతులకు రుణ సౌకర్యం కల్పించాడు. టిపూ జనరంజక పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ తన History of British India లో,  'భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలందరి కంటే టిపూ రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారు. పంటలు బాగా పండాయి'అని పేర్కోన్నాడు.
            ప్రాక్‌-పశ్చిమ దేశాల సామాజిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకున్న టిపూ సాంద్రాయక ప్రభుత్వ పాలనకు భిన్నంగా, ప్రజలకు ఉత్తమ సేవలను అందచేసే ఆధునిక పద్ధతులను ప్రవేశ పెట్టినతొలి స్వదేశీ పాకుడిగా ఖ్యాతి గడించాడు. ప్రభుత్వ యంత్రాగాన్ని పలు మార్పులకు గురిచేసాడు. టిపూపాలన ఆశ్చర్యంగా అత్యంత ఆధునిక సూత్రాలకు అనుగుణంగా సాగిందంటూ ప్రముఖ ఆంగ్లేయ రచయిత ఫెర్నాండజ్‌ తన 'Storm Over Srirangapatnam' లో ప్రశంసించాడు. ప్రజలకు నష్టం కలిగించే శక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. ప్రజలకు ఎవరు శత్రువులో వారు తనకూ శత్రువులన్నాడు.  నా ప్రజలతో ఎవరు కలహిస్తారో, వారో నాతో యుద్దం ప్రకటించినట్టు, అని టిపూ విస్పష్టంగా ప్రకటించాడు.
            పూర్వీకుల సాంప్రదాయలను గౌరవిస్తూనే పలు ప్రజోపయోగకర సంస్కరణలకు టిపూ అంకురార్పణ చేశాడు. సంస్కరణల అమలు విషయంలో వ్యక్తిగత కష్ట నష్టాలను కూడా ఖాతరు చేయలేదు.  వ్యభిచారం, బానిసత్వం, బహు భర్తృత్వం, మధ్యపానాన్ని నిషేధించాడు. మలబారు మహిళలు నడుం పైభాగాన ఎటువంటి ఆఛ్చాదన లేకుండా అర్దనగ్నంగా తిరగటం గమనించి, మహిళలంతా రవికలు ధరించాలని ఆజ్ఞలు జారీ చేశాడు. మహిళలకు అవసరమగు బట్టను కూడా ఉచితంగా అందజేశాడు. ఈ అజ్ఞలను ధిక్కరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాడు. నరబలులను నిషేధించాడు. ఫకీర్లు - సన్యాసులు మాదక ద్రవ్యాలను తీసుకోవటం తీవ్రమైన నేరంగా పరిగణించాడు. ఆనాధలైన బాలికల క్రయవిక్రయాలు శిక్షారమైన తీవ్ర నేరాలుగా ప్రకటించి, పొగాకు సేవనం అనారోగ్యకరమని నిషేదించాడు. దుబారాను తగ్గించాలని, వ్యక్తి తన సంపాదనలో ఒకశాతం కంటే ఎక్కువ విలాసాలకు ఖర్చుచేయరాదని అధికారులకు ఆజ్ఞలు జారీచేసాడు. అంగ వికలాంగులకు, అంధులకు ఆత్మస్థైర్యం కలుగ చేసేందుకు పలురకాల సహయక చర్యలు అమలుచేశాడు. చిన్న, చిన్న నేరాలకు పాల్పడిన రైతులకు విధంచే  సమాజానికి ఉపయోగపడాలని భావించిన టిపూ శిక్షా విధానాన్ని సంస్కరించాడు. గతంలోలా జరిమానా విధించడాన్ని తొలగించి, జరిమానా సొమ్ముకు బదులుగా, గ్రామ పొలిమేరల్లో మొక్కలను నాటాలని, ఆ మొక్కలకు సక్రమంగా నీళ్ళు పోస్తూ, బాగా పెరిగేంత వరకు సంరక్షణ బాధ్యతలను నిర్వహించాలని 1792లో శాసనం చేశాడు.
            టిపూ 17 సంవత్సరాల పాటు సాగించిన పరిపాలనలో అత్యధిక సమయం తన రాజ్యాన్ని కబళించాలననుకుంటున్న బ్రిటీషర్లను, నిజాం నవాబు, మరాఠాలను ఎదుర్కొంటూ గడిపినప్పటికీ, స్వదేశీ వ్యవహారాలను చక్కదిద్దుకుంటూనే, అంతర్జాతీయ వ్యవహారాలను కూడా దక్షతతో నిర్వహించి చరిత్రకారుల ప్రసంశలను అందుకున్నాడు.  ఈస్ట్‌ ఇండియా కంపేనీ పాలకులను తరిమి కొట్టేందుకు పొరుగున ఉన్న నిజాం నవాబు, మరాఠా నాయకులు ఏకమై ఐక్యసంఘటనగా ఏర్పడేందుకు కలసి రావాల్సిందిగా కోరాడు. బలమైన శక్తిగా ఎదుగుతున్న మైసూరు రాజ్య ప్రాభవ వైభవాన్ని సహించలేని స్వదేశీపాలకులు, ఆయనకు తోడ్పాటు, ఇవ్వకపోవటంతో విదేశీయుల వైపు దృషి సారించాడు. 'శత్రువు శత్రువు, మిత్రుడు', అనే రాజకీయ సూత్రీకరణను అనుసరిస్తూ, తొలుత ఫ్రెంచ్‌వారిని, ఆ తరువాత టర్కీ, అఫ్ఘనిస్తాన్‌ ఇరాన్‌, దేశాధినేతల స్నేహహస్తం కోరాడు. టిపూ వ్యవహార దక్షత వలన ఈ దేశాధి నేతలనుండి అనుకూల స్పందన లభించింది. ఆ నాడు అంతర్జాతీయ రంగాన బ్రిటీషర్ల ప్రభ వెలిగిపోతున్నందున, కీలకమైన  థలో టిపూకు సహాయం లభించలేదు.
            బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇతర దేశాల స్నేహహస్తం కాంక్షించినట్టుగానే, దేశీయ వర్తక, వాణిజ్యాలు, ఎగుమతులు, దిగుమతులు, స్వదేశీ పరిశ్రమలు, ఆధునిక ఆయుధాల తయారికి అవసరమగు సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు విదేశాలతో వాణిజ్య సంబంధాలను పటిష్ట పర్చేందుకు, టిపూ బుద్ది కుశలతతో వ్యవహరించి విజయం సాధించాడు. కచ్‌, మస్కట్‌, పెరూ, ఒర్మాజ్‌, జిద్దా, బసరా, ఎడెన్‌, దేశాలలో వర్తక - వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయటమేకాక, చైనా, ప్రాన్స్‌, టర్కీ, ఇరాన్‌ లాంటి దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పాడు. అమెరికా వర్తకులను ఆహ్వానించాడు. స్వదేశీవస్తువుల ఎగుమతులను ప్రోత్సహించాడు. విదేశీ వర్తకం ఏమేరకు చేసినా బ్రిటీషర్ల వస్తువుల వాడకాన్ని ఆయన అంగీకరించ లేదు. వలస పాలకుల వస్తులన్నిటినీ టిపూ నిషేదించాడు. మైసూరు రాజ్యంలోకి ఇంగ్లాడ్‌ వస్తువులను రానివ్వలేదు. ఇగ్లాండు వర్తకుల నుండి ఎటువంటి వస్తువులను కొనరాదంటూ, ప్రభుత్వ వ్యాపార ప్రతినిధులకు ప్రత్యేక ఆదేశాలను జారీచేశాడు. ఈ మేరకు ఆనాడే టిపూ విదేశీవస్తువుల బహిష్కరణకు శ్రీకారం చుట్టాడు.వర్తక వాణిజ్యాభివృద్ధితో పాటు విదేశాలలో కర్మాగారాలను స్థాపించేందుకు విదేశీనేతలను అంగీకరింప చేయటంలో టిపూ విజయం సాధించాడు. స్వదేశంలో పరిశ్రమల స్ధాపనకు  ప్రోత్సాహకాలు ప్రకటించాడు. స్వదేశీ పరిజ్ఞానానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానం జోడించి రాకెట్ల నిర్మాణానికి ప్రయత్నాలు చేశాడు.
             టిపూ విద్యాధికుడు కావటమే కాకుండా, సాహిత్యాభిలాషిగా కూడా పేర్గాంచాడు. కన్నడ, తెలుగు, మరాఠి, అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ, ఫ్రెంచ్‌, భాషలను నేర్చుకున్నాడు. పండితులను గౌరవించటం, సాహిత్య సభలను నిర్వహించటం, గ్రంధాలను రాయించటం పట్ల టిపూ ఎంతో ఆసక్తి చూపాడు. ఆయన స్వయంగా 45 గ్రంధాలు రాశాడు. ఆయన స్వతం గ్రంధాలయం విలువైన 2వేల పుస్తకాలతో నిండి ఉండేది. టిపూ గ్రంధాలలో మొగల్‌చక్రవర్తి జౌరంగజేబు స్వదస్పూర్తితో రాసిన ఖురాన్‌ కూడా ఉంది. నిరంతరం రాజకీయాలు, పోరాటాలు, యుద్ధాలలో మునిగి తేలుతూ కూడా ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకాన్ని కొంతసేపన్నా చదవనిదే టిపూ విశ్రమించేవాడు కాడట.
టిపూ స్వయంగా  ' Fauji Akhbar' అను ఉర్దు వారపత్రికను 1793లో ప్రారంభించినుండి  జీవిత చరమాంకం వరకు నడిపాడు. ఈ పుత్రిక టిపూ సైన్యానికి సంబంధించిన సమాచారం మాత్రమే అందించేది కావటంతో సామాన్య ప్రజల వరకు అది చేరలేదు.  టిపూ స్వయంగా 'జాకోబియన్‌ క్లబ్‌' అను సంస్ధను ప్రారంభించిఆ సంస్ధ ప్రారంభోత్సవం సందర్భంగా  మొక్క నాటుతూఆ మొక్కకు ' స్వేచ్ఛావృక్షం (Tree of Liberty) అని నామకరణం చేయటమే కాకుండా తనను తాను మైసూరు  మైసూరు పౌరుడుగా (Tipu citizen of mysore) పిలుచుకున్నాడు. ఒక రాజరిక వ్యవస్ధకు చెందిన పాలకుడు ఈ విధంగా ప్రజాస్వామిక భావన ప్రకటించడం విశేషం.
            ప్రజలను విద్యావంతులు చేయటానికి టిపూ ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు. విద్యను నిర్బంధం చేసి, ఉచిత విద్యను ప్రవేశ పెట్టాడు. పలు విద్యాలయాలను ఏర్పాటు చేయించాడు. రాజధాని శ్రీరంగపట్నంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని టిపూ సంకల్పించాడు. ఈ విశ్వవిద్యాలయానికి JAMIAL UMUR అని నామకరణం చేయాలని ఉవ్విళ్ళూరాడు. ఈ విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞానంతో పాటుగా, పాశ్చాత్య విజ్ఞానాన్ని బోధించాలని, మానవీయ, సాంకేతిక విద్యాభ్యాసానికి అగ్రస్ధానం కల్పించాలని ఆశించాడు. ఆ మైసూరు సూర్యుడు ఆకస్మికంగా అస్తమించటంతో విశ్వవిద్యాలయం ఏర్పాటు కలగానే మిగిలి పోయింది.
            టిపూ సుల్తాన్‌ ఇస్లాం ధర్మానురక్తుడు. టిపూ ఖురాన్‌ గ్రంధంను చాలా కక్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. నిత్య జీవితంలోని సమస్యలకు ఖురాన్‌ గ్రంధం నుండి ప్రవచనాలను అతి సునాయసంగా ఉల్లేఖిస్తూ, పరిష్కార మార్గాలు సూచించటంలో టిపూ ఆసక్తి చూపాడు.    స్వమతం పట్ల అభిమానం గల ప్రభువు తప్ప, ఆయన మత దురభిమానికాదు.  టిపూ మతాతీతంగా వ్యవహరించాడు. ప్రజల మత విశ్వాసాలలో కలుగజేసుకోవద్దని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలను జారీచేశాడు.  బహుళమతాలు, జాతుల ప్రజలు సహజీవనం సాగిస్తున్న రాజ్యంలో అన్ని మతాల ప్రజలపట్ల సమభావన చూపడం టిపూ ప్రత్యేకత.  ప్రతి ఒక్కరి మత సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. నైతిక విలువలకు భంగకరం కానంతవరకు ఏ మత సాంప్రదాయాలను ఆయన పట్టించుకోలేదు.  ప్రజలకు సరైన న్యాయం ప్రసాదించేందుకు, న్యాయ స్థానాలలో అన్ని మతాలకు చెందిన న్యాయాధికారులను నియమించాడు. ఫిర్యాదులను, సమస్యలను వ్యక్తిగత చట్టాలను అనుసరించి విచారించమన్నాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో పోరాడుతున్నా క్రైస్తవ మతాచారులపట్ల ఎంతో గౌరవం, ఆదరణ చూపాడు. మసీదు-మందిరాల మధ్యన టిపూ తేడా చూపించ లేదు. 1791-92లో మైసూరు రాజ్యం మీద దాడి జరిపిన మరాఠాలు శృంగేరి పీఠానికి చెందిన విలువైన వస్తువులను, ఆస్తిపాస్తులను దోచుకున్నారు. ఆలయంలోని శారదామాత విత్రహాన్ని కూడా పెకిలించి బయటకు విసిరివేశారు.  ఈ సంఘటనను శృంగేరి పీఠాధిపతి టిపూకు తెలుపగాజరిగిన సంఘటనకు బాధపడుతూ, పీఠాధిపతి  ఒక లేఖ రాస్తూ, ' పవిత్ర స్థలం పట్ల పాపం చేసిన వ్యక్తులు అందుకు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని ' ఆగ్రహం వ్యక్తం చేశాడు. టిపూ అంతటిలో సరిపెట్టుకోకుండా, ఆలయ పునరుద్ధరణకు  సహాయం చేశాడు. ఈ ఆలయమేకాదు, మైసూరు రాజ్యంలో గల పలు ఆలయాలకు గ్రాంటులను, ప్రత్యేక నిధులను సమర్పించాడు. ఈ మేరకు ఆయన 156 ఫర్మానాలు జారీచేశాడు. ప్రముఖ శృంగేరిమఠం స్వామీజీతో పలు ధార్మిక, సామాజిక విషయాలను ప్రస్తావిస్తూ, కన్నడంలో టిపూ 30 లేఖలు వ్రాశాడు. ప్రసిద్ధిచెందిన లక్ష్మినాధస్వామిలయం (కలాల), నారాయణస్వామి ఆలయం (మేల్కోట్‌), శ్రీ కంఠేశ్వర ఆలయం, నజుండేశ్వరి ఆలయం (నంజూగూడ్‌) తదితర ఆలయాలకు అవసరమగు వెండి, బంగారు పాత్రలు, ఆభరణాలు, ఖరీదైన దుస్తులను టిపూ అందచేశాడు. తన తండ్రి హైదర్‌ అలీచేత శంఖుస్థాపన చేయబడిన కంజీకరం గోపురాలయం నిర్మాణాన్ని ఎంతో శ్రద్ధతో టిపూ  పూర్తి చేశాడు. టిపూ దిండిగల్‌ కోటమీద దాడి చేసినప్పుడు కోటలోని ఆలయానికి నష్టవాటిల్లకుండా ఫిరంగిదళం దాడులు జరపాలని, తన సైనికులకు, సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. టిపూ నివాసగృహానికి సమీపాన ఒకవైపు మసీదు, మరొకవైపున శ్రీరంగనాధస్వామీ ఆలయం ఉన్నాయి. నమాజుకు రమ్మని మసీదునుండి వినపడే పిలుపుకు ఆయన ఎంతటి ప్రాధాన్యం యిచ్చేవాడో శ్రీరంగనాధస్వామీ  ఆలయం నుండి వినవచ్చే జేగంటలకు అంతే ప్రాముఖ్యం ఇచ్చాడు. సమాజంలోని కొందరు వ్యక్తులు సాగించే కిరాతక చర్యలను ఆ వ్యక్తికి చెందిన సాంఘిక జనసముదాయానికి  అంటగట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించాడు. ఎవరు తప్పుచేసిన వ్యక్తిని మాత్రమే నిందించాలి తప్ప, ఆ వ్యక్తికి సంబంధించిన యావత్తు సమాజాన్ని తప్పు పట్టడం అహేతుకం అన్నాడు. టిపూ సైన్యంలోని 19మంది సేనాధిపతులలో 10 మంది, 13మంది మంత్రులలో ఏడుగురు హిందువులని శ్రీ బి.యన్‌. పాండే తన గ్రంధంలో వెల్లడించారు.
            టిపూ సుల్తాన్‌ మత సామరస్యాన్ని ఎంతగా పాటించినా, ఈ గడ్డను ఆక్రమించుకున్న బ్రిటీషర్లు, ముస్లిం వ్యతిరేకతను నింపుకున్న స్వదేశీ చరిత్రకారులు, టిపూను  మతోన్మాదిగా చిత్రించారు. టిపూ బలవంత మత మార్పిడికి పాల్పడి, తీవ్ర వత్తిడిని తీసుకొచ్చినందున మతాంతీకరణ యిష్టంలేని 3 వేలమంది బ్రాహ్మణులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని  అరోపిస్తూకలకత్తా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అధిపతి డా||హరిప్రసాద్‌  శాస్త్రి తాను రాసిన మెట్రిక్యులేషన్‌ స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం బెంగాల్‌, అస్సాం, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలోని ఉన్నత పాఠశాల విద్యార్ధుల చరిత్ర పాఠ్య గ్రంధంగా చలామణీ అయ్యింది. ఈ విషయం చాలకాలం తర్వాత ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు డా|| బి.యన్‌. పాండే దృష్టికి 1928-29లో రాగా ఆయన విశ్త్రుత పరిశోధన జరిపారు. అరోనణలు చేసిన           డా||హరిప్రసాద్‌ తన అభియోగాలకు అధారాలు చూసకుండా, కనీసం డాక్టర్‌ పాండే ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ముఖం చాటేయడంతో, ఈ విషయాన్ని ఆయన కలకత్తా విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ దృష్టికి తీసుకురాగా, విశ్వవిద్యాలయం సూచించిన పాఠ్య గ్రంధాల జాబితా నుండి శ్రీ శాస్త్రి గ్రంధాన్ని తొలగించారు.
            చిన్ననాటనే అసమాన ధైర్యసాహసాలతో తండ్రికి తగిన తనయుడన్పించుకున్న టిపూ, పలు విజయాలను సాధించాడు. మలబారు ఆక్రమణతో ప్రారంభమైన ఆ యుద్ధవీరుని జీవితం అటు ఈస్ట్‌ ఇండియా కంపెనీతో ఇటు స్వదేశీపాలకులైన నిజాం, మరాఠాలతో పోరుచేస్తూ ముందుకుసాగింది. చివరి శ్వాస వరకు ఈస్ట్‌ ఇండియా పాలకులను మాతృదేశం నుండి తరిమి వేయటానికి అవిశ్రాంతంగా పోరాడిన ఏకైక స్వదేశీ పాలకుడిగా టిపూ సుల్తాన్‌ చిరస్మరణీయమైన ఖ్యాతిగాంచాడు. తండ్రి నుండి రాజ్యాధికారం పొందిన తరువాత టిపూ తన రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది నుంచి, దక్షిణాన దిండిగల్‌ వరకు అంటే సుమారు 400మైళ్ళు పొడవున, పశ్చిమాన మలబారు నుంచి, తూర్పున తూర్పు కనుమల వరకు సుమారు 300మైళ్ళు విస్తరించగలిగాడు. అసూయా ద్వేషాలతో రగిలి పోతున్న నిజాం నవాబు, మరాఠాలు ఏకం కావటమే కాక ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో చేతులు కలిపారు. చివరకు శ్రీరంగపట్నం ముట్టడి ప్రారంభమైంది. కర్నాటక వైపు నుండి జనరల్‌ హరిస్‌, కూర్గ్‌ నుండి జనరల్‌ స్టూవర్ట్‌, హైదరాబాదు నుండి లార్డ్‌ వెల్లస్లీ, దక్షిణం వైపునుండి కల్నల్‌ రోడ్‌, కల్నల్‌  బ్రౌన్‌ చుట్టు ముట్టారు. నిజాం, మరాఠా పాలకులు, పాలెగాళ్ళు, వెల్లస్లీ కలలను నిజం చేయడానికి కంపెనీ సైన్యాలకు తోడుగా నిలిచారు.
            1799 మే మాసం 4వ తేదిన, భయంకరమైన యుద్ధం జరిగింది. టిపూ ఎంతటి నిర్ధుష్ట చర్యలు తీసుకున్నా, అంతర్గత శత్రువులను కనిపెట్టలేక పోయాడు. టిపూ దివాన్‌ మీర్‌ సాధిక్‌, రాజ్యకాంక్షతో బ్రిటీషర్లతో చేతులు కలిపాడు. టిపూ రాజ్యంలోని మరికొందరు పాలెగాళ్ళు బ్రిటీషర్లకు మిత్రులయ్యారు.  విూర్‌ సాధిక్‌ స్వామి ద్రోహం వలన, శత్రు సైన్యం కోటలోకి సునాయాశంగా ప్రవేశించింది. శతృవు కోటలోకి ప్రవేశించటంతో టిపూ సైన్యాలను కలకలం ప్రారంభమైంది.  బ్రిటీష్‌ సైన్యం అన్నివైపుల నుండి చుట్టుముట్టింది. స్వదేశీ పాలకులల కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, ఎత్తుగడలతో సాగుతున్న వలసపాలకులు సాగిస్తూన్న యుద్ధాన్ని,    స్వామిద్రోహులు చేసిన విద్రోహల వలన  శత్రుదుర్బేధ్యమైన కోటలోకి శతృసైన్యాలు భారీ సంఖ్యలో జొరబడిన విషయాన్ని ఆయన గ్రహించేలోగా   పరిస్థితులు చేతులు దాటిపోయాయి.  ఆ సమయంలో కోట నుండి తప్పించుకోమని మంత్రులు నచ్చచెప్పినా వినకుండా, విజయమో లేక వీరస్వర్గమో తేల్చుకోవాలని టిపూ నిర్ణయించుకున్నాడు. ' నక్కలాగా వంద సంవత్సరాలు బ్రతికే కంటే సింహంలా ఒక్క రోజు బ్రతికినా చాలు ' అంటూ టిపూ శత్రు సైన్యాల విూద విరుచుకుపడ్డాడు. శతృసైన్యాలు, ఆంగ్లేయాధికారుల టిపూను సమీపించడానికి భయపడేంతగా రణభూమి అంతటా తానై కన్పిస్తూ, శతృసైన్యాలలో భయోత్పాతం కల్గించాడు. శత్రు సంహారం చేస్తూ సాగుతున్న టిపూకు  అనూహ్యమైన రీతిలో తుపాకి గుండొకటి దూసుకు వచ్చి తాకటంతో ఆయన నేలమీదకు వొరిగిపోయాడు. బాధను పళ్ళ బిగువున భరిస్తూలేచి నిల్చోడానికి శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పటికే టిపూ సైన్యం భారీ సంఖ్యలో హతమైంది. సూల్తాన్‌ను  రక్షించుకునేందుకు కనీస సహాయం కూడా అందని పరిస్ధితి.  ఆ సమయంలో కూడా, ఒక వైపు శరీరంలో రక్తమంతా భూమిని తడిపేస్తున్నా నీరసం ఆవహిస్తున్నా క్రమంగా ప్రాణం పోతున్నా టిపూ తన చేతిలోని ఖడ్గాన్ని వదల లేదు. ఆ సమయంలో యుద్ధ వాతావరణం కొంత తగ్గు ముఖం పట్టంది. బ్రిటీష్‌ సైనికులకు అడ్డులేకపోయింది. అందినంత పుచ్చుకునే అవకాశం లభించింది. టిపూ నేలకొరిగిన ప్రాంతంలో తన చేతిలోని ఖడ్గాన్ని వదల లేదు. ఆ సమయంలో యుద్ధ వాతావరణం కొంత తగ్గు ముఖం పట్టింది. బ్రిటీష్‌ పైనికులకు అడ్డు లేకపోయింది. అందినంత పుచ్చుకునే అవకాశం లభించింది. టిపూ నేలకొరిగిన ప్రాంతంలో ఆయన ఖడ్గం, ఆయన ధరించిన బెల్ట్‌ మీద పొదిగిన బంగారాన్ని, వజ్రాలను గమనించిన ఓ సైనికుడు  వాటిని ఊడబెరుక్కోడానికి  టిపూను సమీపించాడు.  శతృసైనికుడు సమీపిస్తున్నాడని గమనించి టిపూ చరివరి థలో కూడా శరీరంలో ఉన్న బలాన్నంతా కూడదీసుకొని ఆ సైనికుడ్ని తన కరవాలానికి ఎరచేసాడు. అస్తమించాడని  భావించిన వ్యక్తి అకస్మాత్తుగా కత్తి దూయటంతో కంగారు పడిన కంపెనీ సైనికుడు టిపూ మీద తుపాకి గుళ్ళను కురిపించాడు. టిపూ సుల్తాన్‌ గాయపడి కూడా విక్రమించటం చూసిన సైనికులు టిపూ మీద విచక్షణా రహితంగా గుండ్ల వర్షం కురిపించారు. ఆ గుండ్ల వర్షంతో అసమాన యోధుడు టిపూ సుల్తాన్‌, 1799 మే మాసం 4న తేది సాయంకాల సమయాన కన్ను మూసాడు.
             టిపూ సుల్తాన్‌ ప్రాణాలు వదలిన ఆరు గంటల వరకు ఆయన  మరణించిన వార్త  శత్రువుకు తెలియరాలేదు.  చివరకు బ్రిటీష్‌  సైనిధికారి జనరల్‌ హరిస్‌, తన సాయుధ బలగాలను, టిపూ బంధువులు, సేవకులకు వెంటబెట్టుకొని మృత వీరుల గుట్టలలో టిపూ కోసం వెతులాట ప్రారంభించాడు. చివరకు విశ్వాసపాత్రులైన సైనికుల మృతదేహల మధ్యన విగత జీవుడైన టిపూ కన్పించాడు. టిపూ భౌతికకాయాన్ని చూసి కూడా మరణాన్ని బ్రిటీష్‌ అధికారులు నిర్ధారించుకోలేక పోయారు. ఆ వీరుడు మరణించటమా అంటూ స్వజనులు నమ్మలేకపోయారు.  టిపూ బ్రతికి ఉండి, ఒక్కదుటున లేచి  లంఘిస్తే అమ్మో అనుకుంటూ భయపడిన  కంపెనీ బలగాలు టిపూ మృతదేహాన్ని సమీపించేందుకు సాహాసించ లేకపోయాయి. టిపూ మృదేహాం  చుట్టూతా సాయుధులైన సైనికులను నిల్చోపెట్టి, ఏక్షణాన్నై తుపాకులు గర్జించేందుకు వీలుగా టిపూకు గురిపెట్టించి మృతదేహాన్ని సమీపం నుండి పరిశీలించి, టిపూ మరణాన్ని దృవపర్చుకున్నాడు. ఆతరువాత  టిపూ మరణించాడని నిర్ధారదించుకుని, ఆనందం పట్టలేక కేరింతులు కొడుతూ,  'ఈ నాటి నుండి ఇండియా మనది ' (Now India is Ours) అని జనరల్‌ హరిస్‌ ప్రకటించాడు. టిపూ విూద విజయం సాధించాక జరిగిన విందులో  ఆంగ్లేయాధికారి Thomas Minro, " We can easily capture all of India but Tipu is the only hurdle.." అన్నాడంటే టిపూ బ్రిటీషర్ల దురాక్రమణను ఎంతగా బలంగా ఎదుర్కొన్నాడో  ఆయన వారి దురాక్రమణకు ఎంతగా అవరోధం అయ్యాడోబ్రిటీషర్ల పురోగతిని టిపూ ఎంతగా నిలువరించాడో ఈ మాటల వలన అవగతం అవుతుంది.
            ఈ విధంగా బ్రిటీషర్లతో కదన రంగాన  పోరాడుతూ, రణ భూమిలోనే చివరి శ్వాస వదలిన స్వదేశీ పాలకులలో టిపూ ప్రధముడని చరిత్ర ఆయనను కీర్తిచింది. (.."Tipu Sultan was the single brave hero of Indian Histroy who fighting the Britishers met his martydom in the battle field..." Prof.Jaya Prakash) ప్రజల మనస్సులలో టిపూ ఎర్పరచుకున్న సుస్ధిర స్ధానాన్ని గమనించిన గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ బ్రిటీష్‌ సైన్యాధికారులకు ఇచ్చి విందులో మాట్లాడుతూ, ' మిత్రులారా మిమ్మల్ని నన్ను ఈ ప్రపంచ మర్చి పోవచ్చు. అయితే టిపూ స్మృతులు కలకాలం నిలచిపోగలవు ' (.."I fear my friends that Tipu's memor will live long after the world has ceased to remember you and me...")  అని ఘనంగా నివాళులు అర్పించటం విశేషం. శత్రువు చేత కూడా ఘనమైన నివాళులు, ప్రశంసలు అందుకున్న టిపూ లాంటి స్వదేశీ పాలకులు భారతదేశ చరిత్రలో అరుదు. చివరి నెత్తూరు బొట్టు నేలరాలే వరకు బ్రిటీషర్లతో పోరాడి, భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డగా ఖ్యాతిగాంచి టిపూ సుల్తాన్‌ చిరిత్రపుటలలో అరుదైన శాశ్వత స్ధానం పొందాడు.
            టిపూ కన్నుమూసాక బ్రిటీష్‌ కూటమిలోని సైన్యాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. టిపూ  రాజ్య రాజధాని నగరమైన  శ్రీరంగపట్నం మీద బ్రిటీష్‌, నిజాం, మరాఠా సైనికలు విజృంభించారు. ఈ విజృంభన మూడు రోజుల పాటు యధేచ్చగా సాగింది. శ్రీరంగపట్నం ప్రజలను సైననికులు అన్ని విధాల దోచుకున్నారు. టిపూ కుటుంబీకులతో సహా, సామాన్య ప్రజలను శారీరంగా, మానసికంగా హింసల పాల్జేసాయి. స్త్రీలు, వృద్ధులు, పిల్లలను బేదం లేకుండా బ్రిటీషర్లు శ్రీరంగపట్నం వాసుల మీద అత్యాచారాలకు, అంతులేని దోపిడికి పాల్పడిముప్పు తిప్పలు పెట్టి, తమను మట్టి కరిపించిన టిపూ సుల్తాన్‌ మీదనున్న కసిని  భయంకరంగా తీర్చుకున్నాయి. శ్రీ రంగపట్నాన్ని స్మశానవాటిక చేసిగాని ఆ సైనికులు అక్కడనుండి నిష్క్రమించలేదు. ఈ అకృత్యాలను, కర్ణాటక ప్రభుత్వం మాజీ మంత్రి, చరిత్రకారుడు జనాబ్‌ మహమ్మద్‌ మొయినుద్దీన్‌ రాసిన ' శ్రీ రంగపట్నం అఫ్‌టర్‌ డాన్‌ ' గ్రంధంలో సవివరంగా పేర్కొన్నారు.
       -సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌.

Wednesday 25 January 2012

కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా

    కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా మాతృభాష తెలుగు కాదు. తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృజియించి మహాకవిగా ఆయన ఖ్యాతిగాంచారు. ఆయన ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ కేవలం ఆధ్యాత్మిక తత్వానికే కట్టుబడకుండా సామాజానికి రుగ్మతల విూద కలాన్ని కొరడాలా  ఝళిపించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారత శాసన సభలో ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. అభ్యుదయ రచయితగా, ప్రగతి నిర్దేశకునిగా, మహోన్నత వక్తగా, మానవతావాద ప్రవక్తగా బహుముఖ ప్రజ్ఞావంతుడిగా  ఖ్యాతి గడించారు. అజ్ఞానం, మూఢనమ్మకాలు, మత మౌడ్యం, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి  సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించేందుకు అనన్యసామాన్య”మైన కృషి సాగించి ధన్యులైన తెలుగు గడ్డకు చెందిన కవులు, రచయితలలో ఉమర్‌ అలీషా గారిది ప్రత్యేక స్థానం. బహుముఖ లక్ష్య సాధన కోసం శరపరంపరగా సాహిత్య సంపద సృష్టించి తెలుగు సాహిత్య చరిత్ర పుటలలో  ప్రత్యేక స్థానం పొందిన తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవులలో  ఆచార్య ఉమర్‌ అలీషా అగ్రగణ్యులు.
     మౌల్వీ ఉమర్‌ అలీషా  పూర్వీకులు శతాబ్దాల క్రితం పర్షియా (ఇరాన్‌) నుండి ఢిల్లీ వచ్చి, అటునుండి హైదరాబాద్‌ చేరి, చివరకు పీఠాపురంలో స్థిరపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఉమర్‌ అలీషా ఈ పద్యంలో వివరించారు.
''... ... ... మహా ప్రభాత
గరిమగాంచిన మా వంశమరయ పార
సీకమును బాసి ఢిల్లీకి చేరి హైద్ర
బాదు నుండి పిఠాపురి వచ్చి నిలచె ''
    ఉమర్‌ అలీషా పూర్వీకులంతా, వేదాంత పండితులుగా, తత్త్వవేత్తలుగా, కవులుగా, గురువులుగా సుప్రసిద్ధులు. గురు-శిష్య సాంప్రదాయ అనురక్తులైన ఉమర్‌ అలీషా పూర్వీకులు, అధ్యాత్మిక జ్ఞాన ప్రచారం కోసం 1472లో '' శ్రీ విజ్ఞాన విద్యాథ్యాత్మిక పీఠం'' స్థాపించారు. ఈ పీఠం ద్వారా ధార్మిక విజ్ఞాన ప్రచారం గావిస్తూ, అధ్యాత్మిక సేవకు తమ జీవితాలను అంకితం చేసారు.
    మౌల్వీ మొహిద్దీన్‌ బాద్షాకు అగ్రనందనుడుగా ఉమర్‌ అలీషా 1885 ఫిబ్రవరి 28న, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. తల్లి పేరు చాంద్‌బీబి. సాహిత్య, సారస్వత, ధార్మిక సేవా కార్యక్రమాలలో తల్లితండ్రులు నిమగ్నమైయున్న ప్రత్యేక వాతావరణం నడుమ జన్మించిన ఉమర్‌ అలీషా, పూర్వీకుల శక్తి సామర్థ్యాలను, ప్రజ్ఞాపాటవాలను చిన్ననాటనే సంతరించుకున్నారు. ఎనిమిదవ ఏటనే అశువుగా కవిత్వం చెప్పి పండితులను,  గురువులను ఆశ్చర్యచకితులను చేశారు. పిఠాపురంలోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత ప్రముఖ సంస్కృతాంధ్ర భాషా పండితుల వద్ద ఆయన శిష్యరికం చేసారు. తండ్రి వెంట ఉంటూ అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ భాషలను నేర్చుకున్నారు.  చిన్నతనంలో పలు భాషలతో పరిచయం సంపాదించిన ఉమర్‌ అలీషా 14 సంవత్సరాల వయస్సులో చంధోబద్ధంగా చక్కని తెలుగులో  పద్యాలు రాయటం, ధారాళంగా కవిత్వం చెప్పటం ప్రారంభించి, తమ వంశ గురువైన శ్రీ అఖైలలీషాను స్తుతిస్తూ, '' బ్రహ్మవిద్యా విలాసం '' అను శతకాన్ని రచించారు.  నూనూగు మీసాల ప్రాయంలోనే ఆయన ప్రజల చేత '' కవిగారు '' అని పిలిపించుకున్నారు.
    చిన్నతనంలోనే మంచి విద్వత్తును సాధించిన ఆయన  పద్యాలను ధారాళంగా అల్లగల నేర్పు సునాయాసంగా అబ్బటంతో 18వ ఏటనే నాటకాలు రాయటం ఆరంభించాడు. 1905 ప్రాంతంలో గద్య, పద్యాత్మకమైన '' మణిమాల '' నాటకాన్ని రాసారు. ఈ నాటకానికి ముందుగానే ఆయన మరో రెండు నాటకాలను రాసారు. ఈ నాటక రచనతో ఆయన పాండితీ ప్రతిభ నలుదిశలా వ్యాపించింది. ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్స్‌స్పియర్‌ నాటకాల స్థాయిలో మణిమాల  నాటకం సాగిందని ఆనాడు పండిత ప్రముఖులు  అభినందించగా,  పత్రికలు బహుదా ప్రశంసించాయట.
    ఉమర్‌ అలీషా విద్యాభ్యాసం ఉన్నత పాఠశాలతో ముగిసింది.   '' డిగ్రీల చదువు '' విూద ఆయన దృష్టి సారించలేదు.  ఆనాటి పండితులు సృజియించిన అపార సాహిత్య సంపద ఆయనకు ఉపాధ్యాయ వర్గమైంది. తండ్రి ఆయన మార్గదర్శకులయ్యారు. తాతలు-తండ్రులు సృష్టించిన సాహిత్యం ఆయనకు పాఠ్యగ్రంథాలయ్యాయి.  ఆ గ్రంథాలు మాత్రమేకాకుండా  ప్రపంచ భాషలలోని  పలు అధ్యాత్మిక, సాహిత్య గ్రంథాలను అథ్యయనం చేశారు.  సాహిత్య ప్రక్రియాల విూద గట్టిపట్టు సంపాదించారు.
     పండితుడిగా ప్రసిద్ధి చెందిన ఉమర్‌ అలీషా సరే అంటే చాలు తమ సంస్థానాలలో ఉన్నత ఉద్యోగాలను కల్పించగలమని పలుప్రాంతాల సంస్థానాల నుండి ఆహ్వానాలు వచ్చినా ఆయన కాదన్నారు. ధనార్జన విూద ఏమాత్రం ఆసక్తిలేని ఉమర్‌ అలీషా తన గడప తొక్కిన ఆహ్వానాలను తిరస్కరించారు. భాషా సేవ, సారస్వత సేవ, వేదాంత సేవలో గడపాలని, సమాజ సేవ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఉపక్రమించిన ఉమర్‌ అలీషా అతికొద్ది కాలంలోనే, అసమాన ప్రతిభను చూపుతూ పలు సాహితీ ప్రక్రియలలో అపూర్వమైన సారస్వత సంపదను సృష్టించారు.
    ఈ విషయాలను ఆయన స్వయంగా ఒక పద్యంలో  సృష్టీకరించారు.
'' రచియించినాడ విభ్రాజితదివ్య ప్ర
బంధముల్‌ పది కావ్య బంధములుగ
వ్రాసినాడను కల్పనాసక్త మతిపది
నాటకంబులను కర్నాటఫక్కి
కూర్పినాడను కళాకోవిదుల్‌ కొనియాడ
నవలలు పది నవ నవలల లనగ
తెలిగించినాడ సుద్ధీపితాఖండ పా
రసికావ్యములు పది రసికులలర
రసము పెంపార నవధానక్రమములందు
ఆశువులయందు పాటలయందు కవిత
చెప్పినాడ నుపన్యాస సీమలెక్కి
యవని ''ఉమ్రాలిషాకవి'' యనగ నేను.''
    ఈ విధంగా రచనా వ్యాసంగంలో నిమగ్నమైన ఉమర్‌ అలీషా మొత్తం విూద 50 పుస్తకాలు రాసారు. 1926-28లలో ఉమర్‌ అలీషా తెలుగులోకి అనువదించిన ప్రముఖ పారశీక కవి '' ఉమర్‌ ఖయ్యాం రుబాయీల అనుశీలన '' అను అంశం మీద 1980లో నాగార్జున విశ్వవిద్యాలయంలో సిద్దాంత వ్యాసం సమర్పించిన డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (కడప)  '' అరవై ఎళ్ళల్లో దాదాపు 50 కృతులు...రచించార '' ని వెల్లడించారు. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయం ఉంది.  డాక్టర్‌ ఉమర్‌ అలీషా మొత్తం 108 గ్రంథాలు రాశారని ఆంధ్ర విశ్వవిద్యాయలం హిందీ విభాగానికి చెందిన ఆచార్య యస్‌.యం ఇక్బాల్‌ ప్రకటించారు. 1970లో డాక్టర్‌ ఉమర్‌ అలీషా విూద పరిశోధనా పత్రం సమర్పించేందుకు, సమాచార సేకరణ జరుపుతున్న సమయంలో,  ఆయన చేతిరాతలో ఉన్న పలు  గ్రంథాలను తాను చూచినట్టు 2005 ఆగష్టు 6న వ్యాసకర్తతో ప్రోఫెసర్‌ ఇక్బాల్‌ స్యయంగా చెప్పారు. ఆయన చాలా గ్రంథాలు రాసారని, కొన్నిటి గురించి మాత్రమే ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయని పిఠాపురం నివాసి ప్రముఖ కవి డాక్టర్‌ అవత్సం సోమసుందర్‌ ఆగష్టు 9, 2005న వ్యాసకర్తతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. వివరించారు.  ప్రస్తుతం ఉమర్‌ అలీషా రాసిన మొత్తం పుస్తకాలలో  23 గ్రంథాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఈ విషయంలో మాత్రం ఏ విధమైన భిన్నాభిప్రాయం లేదు.
    ఉమర్‌ అలీషా ఏ సాహితీ ప్రక్రియలో ఎటువంటి రచన చేసినా, ఆ రచనలతో అటు పండితుల ప్రశంసలతోపాటుగా ఇటు ప్రజల అభిమానాన్ని మెండుగా అందుకున్నారు. ఆయన అందించిన ప్రతి రచన ద్వారా  ఏదోక సామాజిక-ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఆశించి, ఆ లక్ష్యసాధనా దృష్టితో, ఆ దిశగా సాగింది. జాతీయ భావం, సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమభావనలతో పాటుగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా, మహిళాభ్యుదయాన్ని, ప్రజా చైతన్యాన్ని కాంక్షిస్తూ  ఆయన రచనలు చేసారు.
    బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం లాంటి దురాచారాలను తునుమాడాలన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. స్త్రీ విద్యకోసం, స్త్రీ గౌరవం కోసం స్త్రీలు స్వయంగా పాటుపడాలని తన గ్రంథాలలోని పాత్రల చేత, తన అభిమతాన్ని చాలా బలంగా చెప్పించారు. ప్రధానంగా ఆయన ప్రతి రచనలో స్త్రీ పక్షపాత వైఖరి కన్పిస్తుంది. సమాజంలో ఆయన ఆశించిన మార్పులను తన రచనలలోని పాత్రల ద్వారా చాలాబాగా వ్యక్తం చేశారు. ఆయన రాసిన '' కళ '' అను నాటకంలో కుటుంబ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను-నష్టాలను  వివరంగా పేర్కొన్నారు.  గృహ బాధ్యతలను  మోసే ఇల్లాలి కంటె మంచి నెచ్చలి ఎవరుంటారంటూ, భార్యను స్నేహితురాలిగా గౌరవించాలని పురుషులను ఆదేశించారు. ''ఈశ్వర తత్త్వము నామె హృదయంతరబునన్‌ పరిణితమైన ప్రేమయును పాఠము లోపల చేర్చుకొమ్ము! గురువునేల కొల్పెదవు!'' అంటారు. భార్య నుండి ప్రేమ తత్వమును, ఈశ్వర తత్త్వమును నేర్చుకో, భార్య కంటే గురువు మరెవ్వరూ లభించరని హితవు పురుషులకు హితవు చెబుతారు. స్త్రీ స్వాతంత్య్రం గురించి మాట్లాతూ, లింగభేదంతో పని లేకుండా అర్హతలు, యోగ్యతను బట్టి స్వతంత్రం ఇవ్వాలంటారు. సమాజంలోని ప్రతి మహిళ విద్యసభ్యసించాలని వాంఛించారు. ఆనాడు స్త్రీ విద్య మీద విధించబడియన్న ఆంక్షలు ఆయనలో  క్రోధాన్ని పెంచాయి. స్త్రీ విద్యను వ్యతిరేకించేవాళ్ళ విూద అక్షర రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తుం చేస్తూ,  '' తరుణీ వివేకమన్‌ జదవ ధర్మము జ్ఞానముతత్వ దీక్షలన్‌-గురువుల చెంగటన్‌ బడయ గోరిన వారల మాన్పువారునూ-సూకరులై పుట్టు చుంద్రు..'' అని శపించారు. స్త్రీ విద్య మాన్పించేవారు, అమెను చదువుకోనివ్వనివారు సుకరాలై పుడతారని అత్యంత తీవ్ర పదజాలంతో శపించటం ఆనాడు సాహసమే, అయినా ఉమర్‌అలీషా ఏమాత్రం ననెనుకాడలేదు.
    మన వివాహ వ్యవస్థ సంసారిక జీవనంలో పడతులు పడుచున్న బాధల గాథలను గమనించిన ఆయన '' అనసూయ '' అను నాటకంలో  ఆ విషయాలను ప్రస్తావించారు. ఈ నాటకంలో దేవతాలోకం నుండి భూలోకం విచ్చేసిన '' నర్మద '' అను పాత్ర భూలోకంలో స్త్రీలు పడుతున్న వెతలను వివరిస్తాడు. భర్తకు సేవలు చేయడం ద్వారా మాత్రమే భార్యకు స్వర్గం ప్రాప్తిస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, '' యీ.. ప్రపంచక మహా మాయా సంపారమున నొక పురుషవ్యక్తికి దాసియో సేవ సలుపకున్న సతికి స్వర్గము లేదట! ఆహా!..'', అంటూ మహిళల పరిస్థితికి నర్మద పాత్ర ద్వారా  ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్త్రీ అబలకాదు సబలని, యాచన ద్వారా  వచ్చే స్వర్గం తనకు అక్కరలేదని ప్రకటిస్తూ.''... నేను సర్వతంత్ర స్వతంత్రను గానా, నా యంతరాత్మ మహా తపశ్శక్తిచే మార్తాండ మండలమువల తేజో విరాజితమై ప్రదీపించుట లేదా! నేను మహా వీరాధివీరులవలె స్వర్గ ద్వారము బ్రద్దలు చేసికొని వెళ్ళలేనా ? సరే! ఇంక నాకు యాచింపగ వచ్చెడు తుచ్చ స్వర్గము నా కాలి గోరునకైనా వలదు..'', అని ఆత్మవిశ్వాసంతో నర్మద చేత ప్రకటింపచేస్తారు. స్త్రీ పురుషుల మద్యన గల అంతరాల పట్ల ఆగ్రహించిన నర్మద మరింత ముందుకు వెళ్లి, ''.. నా అంతట నేను శుచినై, నాయంతట నేను పరిశుద్ధనై, నాయంతటనేనే స్వర్గము, నా మోక్షము నేనే కట్టుకుని నేనే యానందించెదను...నాకీ యుపాథియక్కరలేదు. నాకీ మృత రూపకమైన స్త్రీత్వమక్కర లేదని ''  విప్లవాత్మక ధోరణిని ప్రదర్శిస్తుంది. భూలోకంలో అయినవాళ్ళు, ఆస్తిపాస్తులు లేకపోతే అటువంటి యువతుల వివాహాలు కావడం గగనమేనంటూ, '' తల్లిదండ్రులు లేని తమ్ములులేని యనాధనయ్యనాకు నాధుడెట్లు వచ్చు, సొమ్ములియ్య వచ్చిన వారికే పెండ్లిగాని నాకు పెండ్లి యగునే '', అంటూ వరకట్న దురాచార పర్యవసానాన్ని ఉమర్‌ అలీషా నర్మద పాత్రచేత చెప్పిస్తారు. దుష్టుడైన పతిదేవుని సేవెంత కష్టమో వివరిస్తూ, ''... తపముసేయుట కంటె నుపవాసములకంటె, ..పేదరికము కంటె, బిక్షమెత్తుటకంటె, బండిలాగుటకంటె బానిస పనికంటే, కూలిసేయుట కంటె నాలగాచుటకంటె-గాంతుని సేవ కరినతరము.. '' అటువంటి భార్యభర్తల సంబంధాన్ని నర్మద ద్వారా ఆయన  వ్యతిరేకిస్తారు. ఆనాడు అత్తింట ఆడపడుచులు పడుతున్న వెతలను గమనించి, అటువంటి అత్తవారింట కాపురం చేయటం పడతులకు ఎంత కష్టమో, నర్మద పాత్ర చేత ఈ విధంగా చెప్పిస్తారు.
      ఈ విధంగా 80 సంవత్సరాల క్రితం అప్పటి సమాజ రీతి-రివాజులకు, ఆలోచనలకు వ్యతిరేకంగా స్త్రీజన పక్షం వహిస్తు ఉదాత్త భావాలను ఉమర్‌ అలీషా ప్రకటించటం విశేషం. స్త్రీ జన సముదాయాల కడగండ్లను వివరించి, విమర్శించిన ఉమర్‌ అలీషా అంతటితో ఊరు కోలేదు. ఆయన రాసిన '' విచిత్ర బిల్హణీయం '' నాటకంలో బాల్య వివాహాలను, కన్యాశుల్కం లాంటి దురాచారాలను ఖండిస్తూ, ఆనాటి విపత్కర పరిస్థితుల నుండి ప్రీలె విముక్తి పొందడానికి తీసుకోవాల్సిన చర్యలకు ఈ నాటకంలోని, యామిని పూర్ణ తిలక, బిల్హణీయుడు అను పాత్రల చేత సూచించారు. కన్యాశుల్కానికి బలైన సత్యవతి అను పాత్ర తన వృత్తాంతాన్ని సహాధ్యాయిని యామిని పూర్ణ తిలకతో చెబుతూ, ''..నడువన్‌ బాదములైన లేని మగనిన్‌ నాల్గేండ్ల ప్రాయంబున ముడివైచెన్‌ జనకుండు నకటకటా...ననీ బడుగన్‌ చేరి సుఖించుటెట్లు? ...కాసుల కాసజేసి కనుగానని వృద్ధుని నాకు తండ్రియే చేసెను పెండ్లి, బంధువులు చెప్పరొవద్దని పెండ్లి పెద్దలీ మోసం మెఱుంగరో, జనని పోరదో నా కురివెట్టి గొంతుకన్‌ గోసిరి..'' అంటూ ఈ పరిస్థితులలో తాను భూమిలో కలసి పోవటం కంటే, ఈ సమస్యకు పరిష్కారం లేదని సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ వృత్తాంతం విన్న యామినీ పూర్ణతిలక, ఈ సమస్యలకు పరిష్కారం స్త్రీలు చైతన్యవంతులు కావటమే మార్గం తప్ప భూమి తల్లి వడిలో చేరటం ఎంత మాత్రం కాదంటుంది. స్త్రీ లోకాన్ని చైతన్య వంతులను చేయాలంటే, స్త్రీలలో అక్షరాస్యత పెంచాలని, ఆ తరువాత లోకజ్ఞానం కోసం గ్రంథాలు, వార్తా పత్రికలు, చదవాలని సూచిస్తుంది. సామాన్య స్త్రీలకు కూడా చదువుకునే అవకాశాలను కల్పించాలని ఆమె ప్రయత్నిస్తుంది. ''.. మననారీ లోకం బున విద్య యొక్కటి కడు కొఱంతగానున్నది. అందేచేతనే యిన్ని దురాగతములు తటస్థించినవి ...'' అని ఆమె ప్రకటిస్తుంది. ఈ నాటకంలోని మరో పాత్ర బిల్హణుడు పలు స్త్రీ జనసంక్షేమ కార్యక్రమాలను చేపడతాడు. ''... స్త్రీ విద్యలేని దేశమునకు క్షేమము రానేరాడు..'' అంటూ ి స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. స్త్రీ విద్యావ్యాప్తి కోసం మహిళా విద్యాలయాలు, అనాథ శరణాలయాలు ప్రారంభించి మహిళాభ్యుదయానికి కృషి యామిని పూర్ణతిలక, బిల్హణీయుడు చేపడతారు. ఈ దిశగా  ఆ  స్త్రీ జన బాంధవులు తమ కాలం కంటే చాలా ముందుగా ఆలోచిస్తారు. ఆరాధనాలయాల కంటే బాలికా పాఠశాలలు అవసరమంటారు. సత్రముల కంటే అనాథ శరణాలయాలు కావాలంటారు. వనాలు తటకాల కంటె మహిళలకు సర్వ విద్యలు గరిపె కళాశాలను స్థాపించాలని ఆ పాత్రల ద్వారా ఉమర్‌ అలీషా ఆనాటి సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచిస్తారు.
    బాల్య వివాహాల వలన స్త్రీ జాతికి కలుగుతున్న కడగండ్లను వివరిస్తూ, ''.. కడు దరిద్రతచేత నిడుములు బడయవచ్చు బాలవైధవ్యంబు బడయరాదు - హాలాహలము ద్రావియగ్ని గూలగవచ్చు బాలుధ్యంబు పడయరాదు - దాస్య సజీవనము దగుల మొందగవచ్చు బాల వైధవ్యంబు పడయరాదు...'' అని అంటారు. అంతే కాదు ''..సహగమనమైన గావించి చావవచ్చు బాల వైధవ్య దుఖంబు పడయరాదు...'',  అని ఈ రుగ్మతను నివారించ కదలి రావల్సిందిగా మాన్యులను ఆయన ప్రజలను వేడుకుంటారు. ఈ రకంగా సాగే బాల్య వివాహాల వలన చిన్న వయస్సులోనే వైధవ్యం పొందిన బాలికలలో ఆత్మస్థైర్యం కలుగ చేసేందుకు వారిని సమావేశ పర్చి సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని యామిని పూర్ణ తిలక, బిల్హణుడు పాత్రల ద్వారా నిర్మాణాత్మక ఆలోచనలు చేస్తారు కవి ఉమర్‌ అలీషా.
    స్త్రీ విద్య, బాల వైధవ్య బాధలు, కుటుంబ సమస్యల వరకు మాత్రమే ఆయన పరిమితం కాకుండా ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం, అగ్రహారాలను నిచ్చేకంటే పదిమందికి ఉపాధిని కలిగించే యంత్ర కర్మాగారాలను స్థాపించాలని అంటారు. ఈ విషయాన్ని ఉమర్‌ అలీషా ఓ పద్యంలో ఈ విధంగా ప్రస్తావించారు. ''.. ప్రథిత సత్రంబుల బదులనాథ శరనాలయంబులు నల్పి జాలికొల్పి, మహిని దేవళముల మాఱుగా బాలికా పాఠశాలలు కట్టి వన్నె బెట్టి, వన తటాకం బుల బదులుగా సర్వ కళాళాలలుంచి లీలల రచించి, బహుళాగ్రహరాళి బదులుగా యంత్ర కర్మాగారములు పెంచి ఖ్యాతి గాంచి, నతపురాణ కధావిధానముల బదులుతొంటి నిర్భంవైధవ్య దు:ఖ జలధి సమయజేయనుపన్యాస సభలు దీర్చి యామిని పూర్ణతిలక  బిల్హణునియట్లే...'', అంటూ నాటకంలోని పాత్రలు చేసిన కృషి వివరిస్తూ, ఆ ప్రయత్నాలను మరొక పాత్ర చేత ప్రశంసింప చేస్తారు. ఈ మేరకు సమాజ అనుమతిని తన గ్రంథాలలో పరోక్షంగా సాధిస్తారు డాక్టర్‌ ఉమర్‌ అలీషా.
    మనం నిష్పాక్షికంగా ఆలోచిస్తే, స్త్రీలు పురుషులకంటే యోగ్యులని ఉమర్‌ అలీషా తీర్మానిస్తూ, తనను స్త్రీజన పక్షపాతిగా ఏమాత్రం సంశయం ప్రకటించుకుంటారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ , ''  నిష్పాక్షిక బుద్ధితో నూహించినచో పురుషులకన్న స్త్రీలత్యంత యోగ్యులని చెప్పవలెనని  '' తీర్మానిస్తారు. ఈ నాటకంలోని ఒక పాత్ర మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆ పాత్ర ద్వారా ఆనాడు సమాజంలో మహిళలకు వ్యతిరేకంగా ప్రజలి ఉన్న అహేతుక అభిప్రాయాలను వివరిస్తూ, ఆ వాదనలను ఉమర్‌ అలీషా చాలా బలంగా పూర్వపక్షం చేస్తారు. ఈ నాటకంలో ఒక పాత్ర మహిళలు అవినీతి పరులంటూ, శాస్త్రజ్ఞులు చెప్పారు కదా?..శాస్త్రజ్ఞులు పొరపడ్డారా? అంటూ ప్రశ్నించగా,  ఆ ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ, మరొక పాత్ర చేత సమాధానంగా, ''.. సతుల వినీతలంచు దమశాస్త్రము లందుకు లిఖించవరలా సతులకు బుట్టరోసతుల-సంగతి గూడి సుఖింపరో సమున్నతి! తమ సోదరీసుతలు నారులు గారో! ప్రసన్న బుద్ధిలే కితరుల నింద సేయదమకే యదిలజ్జా యటంచెఱంగరో..'' అంటూ ఆ అహేతుక  అభిప్రాయాల విూద విరుచుకు పడతారు.
    ఈ నాటకంలో స్త్రీ విద్యను, మహిళలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను సదా విమర్శించే ఓ పాత్ర ద్వారా, ''..ఓహో! ఇదియా! భరత ఖండము నుద్దరించుటకు యనగా మావంటి బ్రహ్మణోత్తములకు నన్నదాన భూదాన కన్యాదానములు సమర్పించి ఆగ్రహారములిచ్చి లెస్సగా బిండివంటలతో భోజనము పెట్టించడమను కున్నాము. అట్లు గాదట! స్త్రీ విద్యట! భరత ఖండబునకు కొరతంట!.. తగినట్లు బుద్ధి చెప్పి గోబ్రాహ్మణ సమారాధనము మోక్షదాయకమని యొప్పించవలయును..'' అని చెప్పించి, ఆనాటి ప్రతీపశక్తుల కుయుక్తులను, పరాన్నభుక్కుల కుళ్ళు బుద్ధులను ఉమర్‌ అలీషా బట్ట బయలు చేస్తారు. చదువుకున్న స్త్రీ మగని నెత్తికెక్కి పెత్తనం చేస్తుందని వచ్చిన వాదనలను దృష్టిలో వుంచుకుని, ఒక పాత్ర, విద్యా బుద్ధులు నేర్చిన స్త్రీలు అధిపత్యం కోసం పాకులాడుతారని, పెనిమిటిని గౌరవించరని, మాట వినరని ఆరోపించగా ''...విద్యచే వివేకము వచ్చును గావున వివేకవంతు దాధిపత్యమునకు నర్హుడైయ్యే యుండును..'' అంటూ ఆ వాదనను ఆయన పూర్వపక్షం చేస్తారు. కులం కాదు ప్రధానం గుణం ప్రధానమంటూ, బ్రహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన ఎవ్వరూ బ్రహ్మగారని, ''.. బ్రహ్మణుండైన గడజాతి - శ్వపచుడైనా విద్యయున్న మహాబ్రహ్మ...'' యగునని  సాధికారంగా ప్రకటిస్తారు. ఉమర్‌ అలీషా కాలం నాటి సమాజ స్థితి, అభిప్రాయాలు, అభిమతాలతో బేరీజు వేసుకుని, ఆయన రచనలను పరిశీలిస్తే ఆయన విప్లవాత్మక దృష్టి విదితమౌతుంది.
     సమాజంలో నెలకొనియున్న సామాజిక అంతరాల పట్ల ఉమర్‌ అలీషా తన అభ్యంతరాలను చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. అంటరానితనం, అసృశ్యత, సామాజిక వెలివేతల మీద ఆయన అక్షరాయుధంతో దండయాత్ర సాగించారు. మానవులలో జన్మతా: ఉచ్ఛనిచాలను నిర్ణయించడాన్ని విమర్శించారు. 1921 మార్చి మాసం 18వ తేదీన ఏలూరులో '' అదిమాంద్ర అంటుదోష నివారణ సభ '' జరిగింది. ఆ సభలో ఉమర్‌ అలీషా ప్రసంగిస్తూ, అంటరానితనం నిర్మూలనకు తగు సూచనలు చేశారు. కులాధిపత్యాన్ని  విమర్శించారు. ఏకులం వారైనా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా, విద్యా బుద్ధుల ద్వారా అగ్ర స్థానాలను అలంకరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా మేధా సంపత్తిని సంతరించుకోవాలని సూచించారు. ''..పందిని, కుక్కను, నక్కను, పిల్లిని గూడా ముట్టుకొను వారలకు మనిషిని ముట్టుకొనుట దోషములోనిది కాదు కావున, యీ యీషద్భేదములను సరకుచేయక వెంటనే దానిని (అంటరానితనం) సంస్కరించుటకు అందరు తోడుపడవలెను..'', అని డాక్టర్‌ ఉమర్‌ అలీషా అంటారు.
    అధ్యాత్మిక-సాహిత్య రంగాలలో నిమగ్నమైన ఉమర్‌ అలీషా, తన చుట్టూ గిరి గీసుకుని కూర్చోలేదు. సమకాలీన రాజకీయ పరిణామాలకు ఆయన వ్యక్తిగా, పీఠాధిపతిగా, దేశభక్తునిగా ఆయన స్పందించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా  విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే పరాయిపాలన సృష్టిస్తున్న ఇక్కట్లను గ్రహించారు. బ్రిటీష్‌ పాలకుల చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న స్వేచ్ఛా- స్వాతంత్య్రకాంక్షకు కవిగా స్పందించి తోడ్పాటునందించారు. 1916లో జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. ప్రముఖ కవిగా అప్పటికే బహుళ ఖ్యాతి గడించిన ఉమర్‌ అలీషాకు ప్రముఖ జాతీయ నాయకులు శ్రీ బిబిన్‌ చంద్ర, శ్రీ చిత్తరంజన్‌ దాస్‌, శ్రీ అరవింద ఘోష్‌లతో మంచి స్నేహం ఏర్పడింది. ఈ నాయకుల ప్రభావంతో ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మాతృభూమి పట్ల అపారమైన ప్రేమ, అభిమానాలు గల ఆయన మాతృదేశ ఘనతను తన '' చంద్రగుప్త '' నాటకంలో అలెగ్జాండర్‌ పాత్రచే ఈ విధంగా ప్రస్తుతింపచేశారు.
'' ఏ మహారాజ్ఞికి హిమవన్నగంబులు
కులగిరుల్‌ పెట్టని కోటలొక్కొ
ఏ లతాతన్వికి హిందు గంగానదుల్‌
దరిలేని మంచి ముత్యాల సరులొ
ఏ సరఓజాస్యకు నా సింహళ ద్వీప
మత్యంత రత్న సింహాసనంబొ
ఏ రమారమణికి భారత యోధుల
గాళిదాసాదుల గన్న కడుపొ
అట్టి సుగుణ రత్నాకరమైన జగాన
నసదృశ విలాసినిగ నలరారుచుండ
భారత వర్ష వధూటిని బడయవలయు
... ... ... ... ... ''

    జాతీయ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి పార్టీ పిలుపు మేరకు సాగిన ఉద్యమ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, అలీ సోదరులు, మహమ్మద్‌ అన్సారి లాంటి ప్రముఖులు విజయవాడ వచ్చినప్పుడు వారిని కలసి సమకాలీన పరిస్థితుల మీద చర్చించారు.  '' పశ్చిమగోదావరి జిల్లాలో స్వాతంత్య్ర సంగ్రామం '' మీద పరిశోధన జరిపిన చరిత్రోపన్యాసకులు డాక్టర్‌ జి.గోపాలస్వామి (అత్తిలి) వ్యాసకర్తతో మాట్లాడుతూ గోదావరి జిల్లాలలో అలీషా సుడిగాలి పర్యటనలు చేసారని, ప్రజలలో దేశ భక్తిని, త్యాగాన్ని ప్రోదిచేస్తూ ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను చాలా బాగా ప్రభావితం చేసాయన్నారు. ఉమర్‌ అలీషా ప్రసంగం ఉందంటే సభికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. జాతీయోద్యమంలో భాగంగా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటించి తన అనర్ఘళ ప్రసంగాలతో ప్రజలను కార్యోన్ముఖులను చేశారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా అలీపూర్‌ జైలులో అరవిందుడిని కలసి జాతీయోద్యమం గురించి చర్చించారని, ఆ తరువాత అరవిందుడితో మంచి స్నేహం నెరపారని ప్రొఫెసర్‌ యస్‌. యం. ఇక్బాల్‌ వివరించారు. అనాడు అరవిందునితో కలిగిన ఈ పరిచయం వలన కాబోలు ఉమర్‌ అలీషా తాత్విక ఆలోచనలు మీద అరవిందుడి ఛాయలు తారాడుతూ కన్పిస్తాయి.
    1924లో అఖిల భారత ఖిలాఫత్‌ కమిటి ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్‌ మద్రాసు శాఖకు ఉపాధ్యకక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం వహించారు. జాతీయోద్యమ కాలం నాటి ప్రజా పోరాటాలకు స్పందిస్తూ, దేశభక్తి ప్రపూరితమైన పలు పద్యాలను రాసారు. అటువంటి పద్య రత్నాలలో ఒకటి ఈ విధంగా సాగింది. ''.. యూరపు దేశ మట్టిటు నూనగ శౌర్య పరాక్రమంబున్‌ భారత వీరకోటి రణపొండితి వైరుల జీల్చి రక్త సిక్తారుణ మూర్తులైన ప్రజ జయ్‌జయ ద్వానముల్‌ నెలకొల్పినప్పుడే ధారుణి మెచ్చె దయ్ర థిరథారలు భోరును పొర్లిపారగన్‌..''.
    1928వ సంవత్సరంలో ఉమర్‌ అలీషా తండ్రి శ్రీ మొహిద్దీన్‌ బాద్షా కన్నుమూయటంతో ఆయన నిర్వహిస్తున్న అథ్యాత్మిక పీఠం బాధ్యతలు భారం వలన, ఖిలాఫత్‌ ఉద్యమం తరువాత జాతీయోద్యమ కార్యక్రమాలలో ఆయన అంత చురుగ్గా పాల్గోనప్పటికీ, క్రియాశీల రాజకీయాలకు మాత్రం  దూరం కాలేదు.  1935లో అఖిల భారత శాసనసభకు ఉత్తర మద్రాస్‌ నియోజకవర్గం రిజర్వుడ్‌ స్థానం నుండి  సభ్యునిగా ఎన్నికయ్యాడు. భారత శాసనసభలో పది సంవత్సరాల పాటు అనగా 1945లో కన్నుమూసే వరకు ఆయన ప్రజా ప్రతినిధిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రజాప్రతినిధిగా ఆయన శాసనసభలో ప్రజల సంక్షేమం కోరుతూ, అవసరాన్ని బట్టి ప్రభుత్వాన్ని వాదనా పటిమతో విమర్శిస్తూ ఆచరణాత్మక సూచనలతో, అనర్ఘళంగా ప్రసంగాలు చేసి  సభికులను అకట్టుకున్నాడు. ప్రజల పక్షాన ప్రభుత్వం లోటు-పాట్లను ఆయన విడమర్చి విమర్శించే తీరు సభాసదుల ప్రశంలనే కాకుండా ప్రభుత్వాధినేతలనే ప్రశంసలను అందుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా, చూపించితి రాజ్య లోపంబు లాంగ్ల ప్ర- భుత్వంబు ముంగర మోపి మోపి '' అని ఉమర్‌ అలీషా చెప్పుకున్నారు. భారత శాసనసభలో '' హిందూ లా సంబంధించి ధార్మిక అంశాల మీద ఉత్పన్నమైన సందేహాల నివృత్తి కోసం డాక్టర్‌ భగవాన్‌ దాస్‌ లాంటి ప్రముఖులు స్వయంగా ఉమర్‌ అలీషాను పలుమార్లు సంప్రదించటాన్ని బట్టి, సంస్కృత భాష మీదనే కాకుండా హిందూ మతానికి చెందిన అధ్యాత్మిక-వేదాంత గ్రంధాల మీద ఆయనకు ఉన్న పట్టు ఏపాటిదో తెలియజేస్తుంది.
    ఉమర్‌ అలీషా భారత దేశమంతటా పర్యటించి పలు పండిత సభలలో పాల్గొని పాహిత్య-అధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చి, అద్భుతమైన ధారణతో ప్రతిభను ప్రదర్శించి పలు సన్మానాలు, సత్కారాలను పొందారు. '' భారతభూమి నేనుప న్యాసము లిచ్చుచున్‌ దిరిగి నాడను ఉమ్రాలిషా కవీంద్రుడన్‌ '' అంటూ, '' ...నవరించితిని పెద్ద సారస్వతంబును-శబ్ద శాస్త్రంబులు జదివి చదివి... '' అని ఆయన  ప్రకటించుకున్నారు.
    ఉమర్‌ అలీషాను సత్కరించటమే మహా భాగ్యంగా ఆనాటి సంస్థానాధీశులు, సంపన్న కుటుంబీకులు భావించారు. విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ బిరుదులను ఇవ్వడానికి ఉత్సాహ పడ్డాయి. 1924 లో జుజిజి |దీఖిరిబి ంజీరిలిదీశిబిజి ్పుళిదీతీలిజీలిదీబీలి లో '' పండిట్‌  '' బిరుదుతో ఆయనను సత్కరించింది. ఈ సందర్భంగావ ఓరిజీరీశి ఖతిరీజిరిళీ ఊలిజితివీతి ఆళిలిశి రిదీ జుదీఖినీజీబి ఆజీబిఖిలిరీనీ శిళి నీబిఖీలి జిలిబిజీదీశి ఐబిదీరీదిజీరిశి, ఆలిజీరీరిబిదీ, జుజీబిలీరిబీ బిదీఖి జూదీవీజిరిరీనీవ అని ఆ సంస్థ ప్రకటించింది.(జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ళితీ  ఖతిరీజిరిళీ ఔరిళివీజీబిచీనీగి జూఖి. ఖజీ. శ్రీబివీలిదీఖిజీబి చజీ. ఐరిదీవీనీ, జు.ఆ. కఆ్పు, 2001) అలీఘర్‌ విశ్వ విద్యాలయం ఆయనకు '' మౌల్వీ '' బిరుదునిచ్చి గౌరవించింది. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆర్యన్‌ విశ్వ విద్యాలయం(జుజీగిబిదీ ఏదీరిఖీలిజీరీరిశిగి ళితీ ఓజీబిదీబీలి) ఆజీళితీలిరీరీళిజీ రిదీ కరిదీఖితి-ఖతిరీజిరిళీ ్పుతిజిశితిజీలి అను అవార్డును ప్రసాదించి గౌరవించింది. 1933లో ఖతిరీజిరిళీ ఔళిబిజీఖి ళితీ ఐశితిఖిరిలిరీ తీళిజీ ఊలిజితివీతి లో సభ్యుడిగా కార్యక్రమాలకు మార్గదర్శకత్వం నెరపమని ఆయనను ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆహ్వానించింది. కాశీలోని హిందూ విశ్వ విద్యాలయం కూడా ఆయనను విద్యాభివృద్ధి కమిటీలో సభ్యునిగా నియమించుకుంది. ఉమర్‌ అలీషా విద్వత్తును గుర్తించి 1936లో జుబీబిఖిలిళీరిబి |దీశిలిజీదీబిశిరిళిదీబిజి జుళీలిజీరిబీబిదీబి లో ఆయనను ఖిళిబీశిళిజీ జిరిశిరిలిజీబిజీతిళీ (ఖిళిబీశిళిజీ ళితీ జిరిశిలిజీబిశితిజీలి) తో గౌరవించింది. ఏ విశ్వ విద్యాలయం నుండి ఎటువంటి కనీస డిగ్రీ లేని వ్యక్తికి, అంతర్జాతీయ స్థాయి విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించడం చాలా అరుదైన సంఘటన. ఉమర్‌ అలీషా తన సాహిత్య సంపదతో,  ఆంగ్లేయులకు షేక్‌ స్పియర్‌, ఇటాలియన్‌లకు డాంటే, ఉర్దూ మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఇక్బాల్‌ ఎలాగో తెలుగు మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా అటువంటి వారని ప్రముఖ పండితుల చేత బహువిధాల కీర్తించబడ్డారు.(వ ఇనీబిశి ఐనీబిదిలిరీచీలిబిజీలి రిరీ శిళి శినీలి జూదీవీజిరిరీనీ. ఇనీబిశి ఈబిదీశిలి రిరీ శిళి శినీలి |శిబిజిరిబిదీరీ. ఇనీబిశి ఈజీ.|విలీబిజి రిరీ శిళి ఏజీఖితి రీచీలిబిదిరిదీవీ ఖతిరీజిరిళీరీ, ఈజీ. ఏళీబిజీ జుజిరిరీనీబి రిరీ శిళి శినీలి కరిదీఖితిరీ (ఊలిజితివీతి రీచీలిబిదిరిదీవీ చీలిళిచీజిలి) ళితీ బిదీఖినీజీబి వ ఖ.శ్రీ.కతిఖిబి రిదీ నీరిరీ ఔజీబినీళీబి ష్ట్రరిరీనీరి ఈజీ. ఏళీలిజీ బిజిరిరీనీబి -ఊలిజితివీతి ఆళిలిశి)
    ఉమర్‌ అలీషాకు బహు సత్కారాలు, సన్మానాలు జరిగాయి. మౌల్వీ, బ్రహ్మరుషి, అశుకవి, మహాకవి లాంటి పలు బిరుదులే కాకుండా, పూల కిరీటాలు, సింహతలాటాలు, గజారోహణలు, కనకాభిషేకాలు తదితర గౌరవాలతో ఉమర్‌ అలీషా సాహిత్యవేత్తగా జయభేరిని మ్రోగించారు. పలు గ్రంథాలను రచించి, పండితుల ప్రశంసలు పొంది, పామర జనుల హృదయ పీఠాలను అలంకరించిన ఉమర్‌ అలీషా ఏ రంగాన్ని ఎన్నుకున్నా అద్వితీయమైన ప్రతిభతో ఆ రంగాలలో రాణించారు.
    శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధాత్మిక పీఠాచార్యునిగా అసంఖ్యాకులైన శిష్యుల మనస్సులను చూరగొన్నారు. సర్వమత సమభావనా కేంద్రంగా తమ పీఠాన్ని తీర్చిదిద్దారు. ఆయన బోధించిన వేదాంత తత్వం అసంఖ్యాక శిష్యగణాన్ని సమకూర్చి పెట్టింది. ఆయన మతపరంగా ముస్లిం అయినప్పటికి, అయనలో మతాభిమానం ఉన్నా మత దురహంకారం మాత్రం తగదన్నారు. సర్వ మత సామరస్యం బోధించారు. ''..ఆదర్శ గురువుగా అంతేవాసుల ఆరాధ్యదైవంగా... ఆయన గౌరవ మర్యాదలందుకున్నారు ''. మతాల ప్రసక్తి లేకుండా, మతాచారాలతో సంబంధం లేకుండా ఉమర్‌ అలీషా పీఠాధిపత్యం లోని ' జ్ఞానసభ ' అందర్ని ఆహ్వానించింది. ఈ జ్ఞాన సభలో కులమత జాతి భేదాలు లేవు. జ్ఞానార్జనే ఇక్కడ ప్రధానం. ఈ విషయాన్ని '' సభామందిర ద్వారమెపుడు తెఱిచి యుండు పూత చరిత్రులై యుండు వారు వచ్చి జ్ఞానంబు నేర్చుకోవచ్చు సతము మంచి నీళ్ళను కలశాల ముంచినట్లు '' అని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ఆచరించిన చూపారు. ఆ కారణంగా ఆయనకు అన్ని మతాలకు చెందిన ప్రజలు ఆయనను గురువుగా స్వీకరించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా  ప్రతీ ఏడాది శిష్యులకు వేదాంతబోద చేసేందుకు పర్యటనలు చేయటం అనవాయితీ. శిష్యగణమే ఆయన సర్వస్వమని భావించి, ప్రేమించే వేదాంతి మనసులోని తన మాటకు ఆయనలోని కవి ఈ విధంగా అక్షర రూపం కల్పించాడు.
'' అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో
    గ్రాలెడు వీరె చుట్టాలు మాకు
ప్రాణార్థములనైన ప్రాభవంబులనైన
    నిచ్చెడు వీరె స్నేహితులు మాకు
జ్ఞాన సాధనచేత ధ్యాన నిష్టలచేత
    దనరెడు వీరె సోదరులు మాకు
వీరె చేదోడు వాదోడు వీరె మాకు
    వీరె భక్తులు బిడ్డలు వీరె మాకు
మా మహాజ్ఞానసభ జగన్మందిరముగ ''
     బ్రహ్మరుషి ఉమర్‌ అలీషా  మిధ్యా భావనకు బహుదూరం. ప్రాంపంచిక జీవిత చర్యలు పరలోక జీవితానికి పునాది కాగలుగుతాయని ఆయన ప్రభోధం. ఇహలోక జీవనాన్ని ఏమాత్రం విస్మరించరాదన్నారు. భక్త జనుల ఆరాధనా మార్గాలు వేరైనప్పటికీ, అన్ని మతాలు భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకునేందుకు మార్గం చూపుతాయన్నారు. సర్వజనుల సర్వేశ్వరుడు ఒక్కడేనన్న భావన ద్వారా వసుదైక కుటుంబం ఏర్పడుతుందని ఆయన ప్రవచించారు. ఈ విషయాన్ని '' మానవుని మానవునిగా మార్చుటయే యీ ధర్మము యొక్క లక్ష్యమ '' ని  ఆ మానవతా వాది ప్రకటించారు. ఆ లక్ష్య సాధనకై, సూఫీ సాధువుల వేదాంత బాటలో నడిచిన ఉమర్‌ అలీషా చుట్టూ అసంఖ్యాకంగా శిష్య గణం చేరింది. ఆయన సర్వమత సమభావన ఆధ్యాత్మి-వేదాంత భావాలు ప్రముఖ పండితుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను కూడా ప్రభావితం చేసాయి. ఉమర్‌ అలీషా ధార్మిక చింతనా ధోరణులను శ్రీ రాధాకృష్ణన్‌ బహుదా కొనియాడారు. (ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధం 03-04-1994)
    ఈ రకమైన ధార్మిక తత్వ చింతన కారణంగానే ఈనాటికి పిఠాపురంలోని '' శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం '' ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. డాక్టర్‌ ఉమర్‌ అలీషా పూర్వీకులు స్థాపించిన పీఠం ప్రధానంగా ధార్మిక విషయలకు పరిమితం కావడం వలన ఉమర్‌ అలీషాలోని కవికి సాహిత్య చరిత్రలో, ప్రజలలో లభించాల్సినంత ప్రాచుర్యం లభించలేదు.   విద్యాధ్యాత్మిక పీఠంగాని, ఆయన తరువాత వచ్చిన పీఠాధిపతులు గాని ఆ దిశగా తగిన స్థాయిలో కృషి సల్పలేదు. ఉమర్‌ అలీషా తెలుగు సాహితీ ప్రక్రియలన్నిటిలోనూ అత్యంత ప్రతిభను చూసేందుకు  డాక్టర్‌ ఉమర్‌ అలీషా మునిమనుమడు,  నవమ పీఠాధిపతి, యువకుడు డాక్టర్‌ ఉమర్‌ అలీషా ఈ లోటును గ్రహించి  ' డాక్టర్‌ ఉమర్‌ అలీషా సాహితీ సమితి ' , ' శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి '  అను సంస్థలను ఏర్పాటుచేసి ఆనాడు ఉమర్‌ అలీషా పోషించిన బహుముఖ పాత్రలను సమాజం అవసరాలను గమనిస్తూ, ప్రజల ఆకాంక్షలను విస్మరించకుండా, సమాజహితం కోరుతూ, మహాకవి ఉమర్‌ అలీషా బాటన వినూత్న కార్యక్రమాలకు రూపొందించి నిర్వహిస్తున్నారు.
     '' మహా కవిగా, విద్యా వేత్తగా, రాజనీతి జ్ఞుడిగా, జాతీయవాదిగా, బహుభాషా విశారదుడుగా, బహుముఖ ప్రజ్ఞాదురీణుడుగా, దయార్ధ్ర హృదయుడుగా, ఆధ్యాత్మక విద్యా పీఠాధిపతిగా సమత-మమత-మానవతలకు ప్రతీక...'' గా వెలుగొందిన డాక్టర్‌ ఉమర్‌ అలీషా తన జీవితకాలంలో పలు గ్రంథాలను రాశారు. అందులో 1.అనసూయాదేవి, 2.కళ, 3.చంద్రగుప్త 4.ప్రహ్లాద లేక దానవవధ, 5. మణిమాల, 6,మహాభారత కౌరవరంగము, 7.విచిత్ర బిల్హణీయము, 8.విషాద సౌందర్యము అను నాటకాలున్నాయి.1. నరకుని కాంతాపహరణ, 2. బాగ్దాదు మధువీధి, 3. విశ్వామిత్ర (అసంపూర్ణము) అను ఏకాంకిలు, 1.వరాన్వేషన్‌ అను ప్రహసనం, 1. ఖండకావ్యములు, 2.తత్త్వ సందేశము, 3.బర్హిణి దేవి, 4. బ్రహ్మ విద్యావిలాసము, 5.మహమ్మద్‌ రసూల్‌ వారి చరిత్ర, 6.సూఫీ వేదాంత దర్శనము, 7. స్వర్గమాత, 8.హాలీలాంటి పద్య గ్రంధాలు రచించారు. 1.ఈశ్వరుడు, 2. మహమ్మద్‌ వారి చరిత్ర, 3. సాధన పథము అను గద్యములు, 1.తారామతి, 2. పద్మావతి, 3. శాంత అనునవలలు, 1. ప్రభాత కథావళి అను కథల సంగ్రహము 1. ఉమర్‌ఖయ్యమ్‌, 2.ఖురాన్‌ - ఏ - షరీఫ్‌, 3.గులిస్తా అను అనువాదాలు 1. ఇలాజుల్‌ గుర్‌భా అను వైద్య గ్రంధాలను ఆయన సృజించారు. ఈ గ్రంథాలలో అన్ని ప్రస్తుతం లభ్యం కావటంలేదు.
    ఈ రచనలే కాకుండా వందకు పైగా వ్యాసాలు గల సంపుటి, హిందీ ఉపన్యాసాల సంగ్రహం, ఆం గ్ల ఉపవ్యాసాల సంగ్రహం వేర్వేరుగా ఉన్నాయని, ఇవికాక మదాల, మనద్ధాస్‌ అలీ, ఉరుమత్తూరు చక్రవర్తి, శ్రీ మద్వాల్మీకి రామాయణము కూడా ఆయన రచించినట్టు డాక్టర్‌ మహమ్మద్‌ ముస్తఫా, డాక్టర్‌ యస్‌.యం ఇక్బాల్‌ లాంటి పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆయన సృష్టించిన సాహిత్య సంపదలో 34 గ్రంథాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉండగా 23 రచనలు ముద్రితమయ్యాయి. ప్రఖ్యాతి చెందిన ఆయన రచనలు విశ్వ విద్యాలయాల్లోని విద్యార్థుల పాఠ్య గ్రంథాల స్థానాన్ని పొందాయి. ఆనాడు అలీషా రచనల గురించి చర్చించని సాహితీ సభగానీ, ఆయన రచనలేని గ్రంథాలయం గాని ఉండేది కాదట. మాతృభాష తెలుగు కానప్పటికీ, '' తెలుగులో ఛందోబద్ధమైన సాంప్రదాయ కవిత్వం చెప్పి ఆంధ్ర భారతిని ఆరాధించిన తొలి, తుది కవి ఈయనే కావచ్చు,'' నని పండిత ప్రముఖులు ఆయనకు కితాబునిచ్చారు.
    ఆయన తెలుగు భాషకు మాత్రమే పరిమితం కాకుండా బహుభాషలలో కవిత్వం రచించగల ప్రతిభావంతుడిగా, తత్త్వవేత్తగా, వేదాంతిగా, విజ్ఞాన గనిగా ప్రజలు-పండితులు గౌరవించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా రాసిన గ్రంధాలన్నీ ప్రస్తుతం లభ్యం కావడం లేదు. ఆయన సాహిత్యం మీద ఇప్పటికే పలువురు పరిశోధనలు జరిపి డాక్ట రేట్లు తీసుకున్నారు. పలువురు ప్రస్తుతం పరిశోధనలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో  ఉంచుకుని,  డాక్టర్‌ ఉమర్‌ అలీషా ముని మనుమడు, నవమ పిఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, తమ తాతగారి సాహిత్య సంపదను సేకరించి పుస్తకాలను ప్రచురించి ప్రజలకు, పరిశోధకులు, పాఠకులకు అందుబాటులో ఉంచాలని ప్రయత్నిస్తున్నారు.
    ఈ విధంగానే ఉమర్‌ అలీషా సాహిత్య-ఆధ్యాత్మిక సంభాషణలు, రచనలను మాత్రమే కాకుండా, ఆయన రాజకీయ అభిప్రాయాలు, స్వాతంత్య్ర సమరయోధునిగా పలు ప్రాంతాలలో ఆయన చేసిన ప్రసంగాలు, సమాజ సంస్కరణలకు ఆయన అనుసరించి విధానాలు, చేసిన సూచనలు ఆయన అభిప్రాయాలు, భారత శాసనసభలో ప్రజా ప్రతినిధిగా పది సంవత్సరాల పాటు పనిచేసినప్పుడు చర్చకు వచ్చిన వివిధాంశాల మీద ఆయన చేసిన ఉపన్యాసాలను సేకరించి ఉమర్‌ అలీషా వ్యక్తిత్వాన్ని, మేథో సంపత్తిని సమగ్రంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు '' శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథ మండలి '' అను సంస్థను ప్రారంభించారు. ఈ  సంస్థ కృషి ఫలించి, డాక్టర్‌ ఉమర్‌ అలీషా రాసిన రచనలన్నీ ప్రజలకు, సాహిత్యాభిలాషులకు,  పరిశోధకులకు అందుబాటులోకి వచ్చినట్టుయితే, మహాకవి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని దర్శించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం లభిస్తుంది. చరిత్ర పుటలలో నిక్షిప్తమైయున్న ఆ మేధావి అసమాన ప్రతిభ వెల్లడికాగలదు.
    జీవితాంతం వరకు భారత శాసన సభలో ప్రజా ప్రతినిధిగా రాజకీయగా బాధ్యతలను నిర్వహిస్తూ స్వజనుల స్వేచ్ఛా-స్వాతంత్య్రాలు కోరుకుంటున్న స్వాతంత్ర సమరయోధుడుగానూ, ఆధ్యాత్మిక రంగాన శిష్యకోటికి ధార్మిక జ్ఞానబోధ చేయు పీఠాధిపతిగాను, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్తగా, వేదాంతిగా చిరస్మరణీయమైన ఖ్యాతి గడించిన డాక్టర్‌ అలీషా జీవిత పరిసమాప్తి వరకు  పర్యటనలు చేసారు. సమకాలీన సాహిత్య సౌరభాలను అఘ్రాణించుటకు, శిష్యపరంపరకు అధ్యాత్మిక మార్గదర్శకం చేయుటకు ప్రతి క్షణాన్ని వినియోగించిన ఆయన అవిశ్రాంతంగా భారతదేశమంతా పర్యటించినా అలసిపోవడం ఎరుగరు. పండిత ప్రముఖులు ఆహ్వానం మేరకు పలు పర్యటనలు చివరి వరకు సాగించారు. మహా మహోపాధ్యాయులు ఉమర్‌ అలీషా ఎక్కడకు వెళ్ళినా తండోపతండాలుగా శిష్యులు ఆయన ఆధ్యాత్మిక బోధలు వినడానికి విచ్చేస్తుంటే, ఆయన సాహితీ ప్రసంగాలను వినడానికి, ఆయనతో సాహిత్య చర్చలు జరిపేందుకు సాహితీ ప్రియులు, పండిత ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా హాజరయ్యేవారు. మౌల్వీ ఉమర్‌ అలీషా రాక కోసం పండితులతో పాటుగా శిష్యులు ఎంతో ఆశగా ఎదురు చూసేవారు.
    1945 జనవరి మాసంలో ఢిల్లీ నుండి స్వస్థలానికి విచ్చేస్తూ, శిష్యుల ఆహ్వానం మేరకు ఆచార్య ఉమర్‌ అలీషా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెళ్ళారు. అక్కడ కొంతకాలం గడిపాక  తిరిగి పిఠాపురం చేరుకో సంకల్పించి, ఆ ప్రయత్నంలో వుండగా జనవరి 23వ తేది సాయం సమయం 5 గంటల ప్రాంతంలో మహాకవి కన్నుమూసారు.

ఆధార గ్రంథాలు ః
01. డాక్టర్‌ ఉమర్‌ అలీషా గారి ఉమర్‌ ఖయ్యాం రుబాయాల అనుశీలన, షేక్‌ ముహమ్మద్‌ ముస్తఫా, నవ్యసాహితి సమితి, ప్రొద్దుటూరు, 1987.
02. సూఫి వేదాంత దర్శము, ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురం, 1987. 
03. మహమ్మద్‌ రసూల్‌వారి చరిత్ర, ఉమర్‌ అలీషా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠము, పిఠాపురము, 1955.
04. బర్హిణీ దేవి, శ్రీ ఉమ్రాలీషా కవిసంహిత, రాజమండ్రి, 1970, 
05. మా పిఠాపురం, శ్రీ కురుమెళ్ళ వేంకట రావు,పిఠానురం, 1978
06. మణిమాల (నాటకము) బ్రహర్షి ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము, 1978,
07. ఉమర్‌ ఖయ్యూమ్‌, డాక్టర్‌ ఉమర్‌ అలీషా చే అనువాదం, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము, 1987.
08. ఆంధ్ర రచయితలు, సంకలన కర్త ః  శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, శీర్షిక ' ఉమర్‌ అలీషా (1885-1945) ' .
09. అనసూయ (నాటకము), డాక్టర్‌ ఉమర్‌ అలీషా  శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం, 2001.
10. విచిత్ర బిల్హణీయము, డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం.2002.
11. ఆంధ్ర సచిత్రవార పత్రిక వజ్రోత్సవ సంచిక,  16-9-1983.
12. చంద్రగుప్త, నాటకం, ఉమర్‌ అలీషా,
13. తెలుగు వైతాళికులు, మహాకవి ఉమర్‌ అలీషాగారి జీవిత సంగ్రహము, వ్యాసకర్త ః షేక్‌ దావూద్‌, సంపుటం-3, ఆంథ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడవిూ, హైదరాబాదు, 1979.
14. శ్రీ ఉమర్‌ అలీషా జీవిత చరిత్ర, రచన ః మౌల్వి హూస్సేన్‌ షా, అ ముద్రిత రచన, సమర్పణ ః శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము.
15. ఖండకావ్యములు, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా కవి కృతసంహిత,  శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠము, పిఠాపురము, 1998.
16. మహాభారత కౌరవరంగము (నాటకము) డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము, 1988.
17. విషాద సౌందర్యము, ఉమర్‌ అలీషా, తృతీయ ముద్రణ, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం, 2004
18. జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ళితీ  ఖతిరీజిరిళీ ఔరిళివీజీబిచీనీగి జూఖిరిశిలిఖి లీగి  ఖజీ. శ్రీబివీలిదీఖిజీబి చజీ. ఐరిదీవీనీ, జు.ఆ. కఆ్పు, శ్రీలిగీ ఈలిజినీరి, 2001,
19.  వ ఔజీబినీళీబి ష్ట్రరిరీనీరి ఈజీ. ఏళీలిజీ బిజిరిరీనీబి - ఊలిజితివీతి ఆళిలిశి వ,  ఖ.శ్రీ.కతిఖిబి  జుజీశిరిబీజిలి చీతిలీజిరిరీనీలిఖి రిదీ  ' ఏళీబిజీ గగిబిగిగితిళీ ',  ఏళీబిజీ జుజిరి ఐనీబి, ఐజీలిలి ఙరివీదీబిదీబి ఙరిఖిగిబి ఆలిలిశినీబిళీ, ఆరిశినీబిచీతిజీబిళీ, 1987. 
20. సూఫి వేదాంత దర్శనము, ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము, 1987.
21. ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధం, 20-03-1994, సాహితీలత, వ్యాసకర్త ః పి.వి.యస్‌ పాత్రో.
22. పద్మావతి, డాక్టర్‌ ఉమర్‌ అలీషా కవి కృతసంహిత, పిఠాపురం, 1945.
23. నూరు శరత్తులు, డాక్టర్‌ ఆవత్స సోమసుందర్‌, కళాకేళి నికేతన్‌, పిఠాపురం, 1996
24. తెలుగు కే ఆధునిక్‌ కవి ః డాక్టర్‌ ఉమర్‌ అలీషాకా వ్యక్తిత్వ వ కృతిత్వ (హింది), డాక్టర్‌ యస్‌.యం. ఇక్బాల్‌, ఆంధ్రవిశ్వవిద్యాలయం, అముద్రితం, విశాఖపట్నం, 1970.
25. ఆంధ్ర కే ముసల్మాన్‌ సంత్‌ కవి ః డాక్టర్‌ ఉమర్‌ అలీషా (వ్యాసం), డాక్టర్‌ యస్‌.యం. ఇక్బాల్‌, ' ఆధ్యేయ్‌ ' హింది మాససత్రిక, ఫిబ్రవరి 1971,హింది ప్రచార సభ, సికింద్రాబాద్‌.
26. ఆంథ్రాభ్యుదయం, చారిత్రక పద్యకావ్యం (పూర్వభాగం), శ్రీ పాదకిష్ణమూర్తి శాస్త్రి, 1951.
27. ఉమర్‌ అలీషా కవి రచనల్లో స్త్రీజనాభ్యుదయం, డాక్టర్‌ ఉమర్‌ అలీషా (విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం, ప్రస్తుత పీఠాధిపతి), చతుర్ధ     ప్రపంచ తెలుగు మహాసభలు, సావనీర్‌, 2000.
28. డాక్టర్‌ ఉమర్‌ అలీషా-ఏక్‌ పరిచయ్‌ (వ్యాసం), డాక్టర్‌ యస్‌. యం. ఇక్బాల్‌, ' యుగప్రభాత్‌ ', హింది మాసపత్రిక, 1971, కేరళ.
29. తెలుగు సాహిత్య కోశం ః ఆధునిక సాహిత్యం,  పేజీలు 124-126 మరియు 622.
30. తొలి వెలుగు ముస్లిం కవిరాజు ః డాక్టర్‌ ఉమర్‌ అలీషా, న్రజాపత్రిక 77వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, వ్యాసకర్త ః సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌,
31. ఉభయ మత సజాతీయత, బుర్రా శేషగిరిరావు, శ్రీ వేదవ్యాస ముద్రాక్షరశాల, విజయనగరం, 1933.
32. బ్రహ్మర్షి ఉమర్‌ అలీషా వ్యాసాలు-ఉపన్యాసాలు, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం,2005.
33. తత్వ సందేశము, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం,2001.
34. ప్రభాత కధావళి, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యాపీఠము, పిఠాపురము, 1988.
35. స్వర్గమాత, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురము, 2001.
36. శాంత (నవల), డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురం, 1988.
37. సమగ్ర ఆంధ్రసాహిత్యం, అరుద్ర, 12వ సంపుట,ప్రజాశక్తి బుక్‌హౌస్‌, విజయవాడ,1991.
38. భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, అజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, ఉండవల్లి సెంటర్‌,     2001
39. ఆంధ్ర ప్రదేశ్‌లో గాంధీజీ, సం|| శ్రీ కొడాలి ఆంజనేయులు, తెలుగు అకాడవిూ, హైదరాబాదు, 1978.
40. పశ్చిమగోదావరి జిల్లా స్వాతంత్య్రోద్యమ చరిత్ర, మంగళంపల్లి చంథ్రేఖర్‌, రమ్యసాహితి, పెనుగొండ, 1992.
41. ఖతిరీజిరిళీరీ రిదీ |దీఖిరిబి, ఙళిజి. 2, శ్రీబిజీలిరీనీ చతిళీబిజీ అబిరిదీ, ఖబిదీళినీబిజీ ఆతిలీజిరిబీబిశిరిళిదీరీ, శ్రీలిగీ ఈలిజినీరి, 1983.
42. ఆంధ్రపత్రిక, 20-12-1917, 26-07-1919, 18-11- 1920, 12-02-1920, 09-02-1921, 23-04-1921, 10-05-1922, 20-05-1922, 22-08-1922, 22- 12-1922, 06-01-1923, 10-12-1934,06-04- 1935, 26-01-1945, 26-01-1945 27-01-1945 తదితర సంచికలు.
43. భారతి మాసపత్రిక, పూర్వ సంచికలు.
44. కృష్ణ పత్రిక, దినపత్రిక పూర్వ సంచికలు.
45. ఆంద్రోద్యమ చరిత్ర, మాదాల వీరభద్రరావు, ఆంధ్ర ప్రభుత్వ ప్రచురణ, హైదరాబాద్‌, 1982.