Saturday 19 October 2013

అష్ఫాఖుల్లా ఖాన్‌
(1900-1927)

మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్‌ వలస పాలకులపై విప్లవించి అమరులైన యోధాగ్రేసులలో ఒకరు అష్ఫాఖుల్లాఖాన్‌ .
1900 అక్టోబర్‌ 22న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని సంపన్న జవిూందారి కుటుంబంలో అష్ఫాఖ్‌ జన్మించారు. తండ్రి షఫీఖుల్లాఖాన్‌. తల్లి మజహరున్నీసా బేగం. చిన్ననాటి నుండే స్వతంత్ర భావాలను సంతరించుకున్న ఆయన ప్రజల జీవన పరిస్థితుల విూద దృష్టి సారించటంతో చదువు విూద పెద్దగా శ్రద్ధచూపలేదు. తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్
న ఆయన మంచి ఉర్దూ కవిగా రూపొందారు.
అష్ఫాఖుల్లా Abbie Rich Mission High School 8వ తరగతి విద్యార్థిగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ కవితలు రాస్తూ పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను చిన్నతనంలోనే వ్యక్తంచేశారు. ఆ క్రమంలో 'హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీ' నాయకులు రాం ప్రసాద్‌ బిస్మిల్‌తో ఏర్పడిన పరిచయం ద్వారా విప్లవోద్యమంలో భాగస్వామి అయ్యారు. మతం కారణంగా ఆర్యసమాజానికి చెందిన బిస్మిల్‌ హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీలో అష్ఫాక్‌కు సభ్యత్వం ఇవ్వడానికి సంశయించినా చివరకు అంగీకరించక తప్పలేదు. ఆర్మీ సభ్యునిగా బిస్మిల్‌ నేతృత్వంలో జరిగిన పలు యాక్షన్‌లలో చురుగ్గా అష్ఫాఖ్‌ పాల్గొన్నారు. బలమైన శత్రువును మాతృభూమి నుండి తరిమి కొట్టేందుకు ఆయుధాల సమీకరణకు ధనం అవసరం కాగా విప్లవకారుల కన్ను ప్రభుత్వపు ఖజానా విూద పడింది. ప్రభుత్వ ఖజానాను తెస్తున్న రైలు నుండి ధనాన్ని కొల్లగొట్టేందుకు పథకం తయారయ్యింది. ఈ పథకం పట్ల తొలుత అష్ఫాఖ్‌ అయిష్టత వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ఖజనాను అపహరిస్తే ప్రభుత్వం విప్లవోద్యమం విూద విరుచుకపడగలదని, ఆ కారణంగా బాల్యావస్థలో నున్న విప్లవోద్యమం కోలుకోలేనంత దెబ్బ తింటుందని హెచ్చరించారు. అయినా ప్రజాస్వామిక సిద్ధాంతం పట్ల గౌరవంగల ఆయన సహచరుల మెజారిటీ నిర్ణయానికి సమ్మతి తెలిపారు.
ఆ పథకం ప్రకారంగా 1925 ఆగష్టు 9న కాకోరి గ్రామం విూదుగా వెళ్ళే మెయిల్‌లో తరలిస్తున్న ప్రభుత్వ ఖజానాను పది మంది సభ్యుల గల విప్లవకారుల దళం సాహసోపేతంగా కైవసం చేసుకుంది. ఈ పథకాన్ని అమలుపర్చటంలో క్రమశిక్షణ గల విప్లవకారునిగా అష్ఫాఖ్‌ తనదైన పాత్రను నిర్వహించారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న బ్రిటీష్‌ ప్రభుత్వం అష్ఫాఖ్‌ ఊహించినట్టే విప్లవకారుల విూద విరుచుకపడటంతో అష్ఫాఖుల్లాతో పాటుగా ఆర్మీ సభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
అష్ఫాఖుల్లా మాత్రం ఏడాదిపాటు అజ్ఞాత జీవితం గడిపిన పిదప స్వగ్రామానికి చెందిన ఒక మిత్రద్రోహి కారణంగా ఢిల్లీలో అరెస్టయ్యారు. ఆయనకు పలు ఆశలు చూపి, మత మనోభావాలను కూడా రెచ్చగొట్టి లొంగదీసుకోటానికి ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేసింది. చివరకు కాకోరి రైలు సంఘటన విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆర్మీ నాయకుడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ను శిక్ష నుండి తప్పించేందుకు కాకోరి రైలు సంఘటనకు తాను మాత్రమే పూర్తి బాధ్యుడనంటూ తన న్యాయవాది సలహాకు భిన్నంగా ఉన్నత న్యాయస్థానానికి అష్ఫాఖ్‌ రాతపూర్వకంగా తెలుపుకున్నారు. చివరకు ఆయనతోపాటు సహచర మిత్రులకు కూడా కోర్టు ఉరిశిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది.
మాతృభూమి కోసం ప్రాణాలర్పించటం మహాద్భాగ్యమని ప్రకటించిన అష్ఫాఖ్‌ను 1927 డిసెంబరు 19న ఫైజాబాదు జైలులో ఉరితీశారు. ఈ సందర్భంగా 'నా మాతృభూమి సర్వదా భోగభాగ్యాలతో విలసిల్లాలి. నా హిందూస్థాన్‌కు స్వేచ్ఛ లభిస్తుంది చూడండి. చాలా త్వరగా బానిసత్వపు సంకెళ్లు తెగిపోతాయి' అని ఎంతో ఆత్మవిశ్వాసంతో దేశ భవిష్యత్తును ప్రకటించిన అష్ఫాఖుల్లా ఖాన్‌ ఉరితాడును సంతోషంగా స్వీకరిస్తూ, తన వందేళ్ళ జీవితాన్ని 27 ఏళ్ళకే ముగించుకుని తరలి వెళ్ళిపోయారు. (Taken from Syed Naseer Ahamed book CHIRASMARANEEYULU)

Monday 7 October 2013

దళిత జన హితైషి, పోలియో వ్యతిరేక పోరాటయోధురాలు
'పద్మశ్రీ' ఫాతిమా ఇస్మాయిల్‌
(1903-1987)

జాతీయోద్యమం భారతీయులలో మహత్తర సేవాతత్పరతకు  ప్రేరణయ్యింది.  ఆ స్ఫూర్తితో కుటుంబాలకు కుటుంబాలు ఉద్యమంలో పాలుపంచుకున్నాయి.  బ్రిటీష్‌ వలస పాలకుల కిరాతకాలను లెక్కచేయక పోరుబాటన నడిచాయి.  అటువంటి కుటుంబంలో సభ్యురాలిగా తల్లి-తండ్రి,అన్నా-తమ్ముళ్ళ బాటలోసాగి అటు జాతీయోద్యమంలో ఇటు సేవారంగంలో అద్వితీయమైన పాత్ర నిర్వహించిన మహిళ శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌.
నాటి గుజరాత్‌ రాష్ట్రం బొంబాయికి చెందిన ప్రసిద్ధ స్వాతంత్య్రోద్యమ నాయకులు హజీ ముహమ్మద్‌ యూసుఫ్‌ సోహాని కుమార్తె బేగం ఫాతిమా. ఆమె కుటుంబం సంపన్న మోమిన్‌ వంశానికి చెందినది. ఆమె అన్నయ్య ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని. చిన్నన్నయ్య ముహమ్మద్‌ ఉస్మాన్‌ సోహాని. ఉమర్‌ సోహాని బొంబాయిలో ప్రముఖ వ్యాపారవేత్త. ఆ ఇరువురు సోదరులు కూడా తండ్రి మార్గంలో విముక్తిపోరాట బాటలో ముందుకు సాగారు. జాతీయోద్యమ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమగు ఆర్థిక పుష్టిని అందించటంలో ఆ సోదరులు  ముందున్నారు. ఆనాడు భూరిగా విరాళాలు అందచేతలో ప్రధానంగా  ఉమర్‌ సోహాని ప్రఖ్యాతి గడించారు.
మహాత్మాగాంధీ తిలక్‌ ఫండ్‌ కోసం ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని  వద్దకు రాగా తన చెక్కుబుక్‌ను ఆయకిచ్చి ఇష్టమొచ్చినంత రాసుకోమన్నారు. గాంధీజీ లక్ష రూపాయలను రాయగా అందుకు ఆయన సంతోషంగా అంగీకరించారు. ఆ తరువాత ఖిలాఫత్‌ ఫండ్‌ కోసం ఖిలాఫత్‌ నేతలు ఉమర్‌ సోహానిని  కలువగా వారికి కూడా ఆయన లక్షరూపాయాల విరాళం ఇవ్వటమే కాకుండా ఖిలాఫత్‌ కార్యాలయం ఏర్పాటుకు తన స్వంత భవంతిని అప్పగించారు. ఆ తరువాతి కాలంలో ఆ భవంతి ఖిలాఫత్‌ హౌస్‌ గా పిలువబడింది.(Muslims In India, Volume -II, Naresh Kumar Jain, Manohar, New Delhi, 1979, Page : 162).
ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని చాలా ఉదార స్వభావులు. జాతీయోద్యమ కార్యక్రమాల నిర్వహణకు అవసరమగు నిధుల అందచేతలో తానెప్పుడూ ప్రథమ స్థానంలో ఉండాలన్నది ఆయన అభిమతం. ఆ కారణంగా ఉద్యమనాయకులు ఆయన సహాయం కోరివస్తే అందరి కంటె అధిక మొత్తాన్ని అందించి ఆనందించటం ఆయన అలవాటు. ఆ అలవాటుకు తగ్గట్టుగా వ్యాపారంలో ఆయన అపారంగా ఆర్జించారు. ఆ క్రమంలో ఓ మాసంలో ఆయన సంపద ద్విగుణీకృతమైంది. ఆ తరువాత దురదృష్టవశాత్తు మరుసటి నెలలో అనూహ్యంగా కోట్లాది రూపాయలను ఆయన నష్టపోయారు. ఆ నష్టంతో ఆయన బాగా క్రుంగిపోయారు. ప్రజోపకర కార్యకలాపాలకు, ప్రధానంగా జాతీయోద్యమానికి ఆర్థిక సహాయం అందించటంలో ముందు ఉండలేకపోయినందున ఆయన ప్రజా జీవితం నుండి దూరం కావాలనుకున్నారు. (ఖతిరీజిరిళీరీ |దీ |దీఖిరిబి, ఆబివీలి : 162).
ఆ విధంగా  ప్రజా జీవితం నుండి రాజకీయాల నుండి దూరమైన సోహానిని వ్యాపారంలో వచ్చిన అపారనష్టం కల్గించిన వేదన కంటే  ప్రజలకు,  ఉద్యమకారులకు, జాతీయోద్యమానికి తాను ఏవిధంగానూ ఉపయోగపడలేక పోయాన్న దిగులు ఆయనలో అధికమయ్యింది. ఆ బాధతో సతమతమౌతూ 36 సంవత్సరాల వయస్సులో 1926 జూలై 6న ఆయన కన్నుమూశారు. ఆ సందర్భంగా, His untimely and sudden death has removed a patriot from the country అని  వ్యాఖానిస్తూ మహాత్మాగాంధీ యంగ్‌ ఇండియాలో ఆయనకు నివాళులర్పించారు.
అటువంటి ఉదార హృదయులు, త్యాగశీలుర కుటుంబంలో  బేగం ఫాతిమా 1903 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు. ఆమె  తండ్రి యూసుఫ్‌ సోహాని, సోదరులు  ఉమర్‌ సోహాని, ఉస్మాన్‌ సోహానిలు కూడా జాతీయోద్యమకారులు. ఆ జాతీయోద్యమ నేతల గారాల పట్టిగా పెరిగిన కుమారి ఫాతిమా చిన్నతనం నుండే బ్రిటీష్‌ వ్యతిరేక భావాలను పుణికి పుచ్చుకున్నారు. అన్యాయాన్ని, అధర్మాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా ధైర్యంగా ఎదుర్కోవటం  గుణంగా ఆమె ఎదిగారు. స్వేచ్ఛా-స్వాతంత్య్రాల పట్ల మక్కువ ఎక్కువ. అహేతుక ఆచార, సంప్రదాయాలకు ఆమె వ్యతిరేకి. సకారాత్మకమైనా నకారాత్మకమైనా తన అభిప్రాయాన్ని నిర్భీతిగా ప్రకటించటం ఆమె అలవాటు. 
1919లో ఆమె సీనియర్‌ కేంబ్రిడ్జి పూర్తిచేసి 1920లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ఉర్దూ, ఆంగ్ల భాషలలో మంచి విద్వత్తును సాధించారు. 1921-1923లో వియన్నాలో వైద్యవిద్య చదవడానికి వెళ్ళిన ఆమె అనివార్య కారణాల వలన వైద్యవిద్యను అసంపూర్ణంగా వదిలేశారు.
ప్రభుత్వ ఉన్నతోద్యోగి హసన్‌ ఇస్మాయిల్‌ను ఆమె వివాహమాడారు. ఆయన కూడా స్వాతంత్య్రోద్యమాభిమాని. భర్త ప్రోత్సాహంతో స్వాతంత్య్రోద్యమంలో భాగంగా సాగిన స్వదేశీ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా ఫాతిమా ఇస్మాయిల్‌ జాతీయోద్యమ రంగప్రవేశం చేశారు. స్వదేశీ వస్తువులను విక్రయిం చేందుకు, వినూత్న ఏర్పాట్లు చేసి ప్రజల, ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. విదేశీ వస్తువులను బహిష్కరించమని కోరటం మాత్రమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలనుకున్నారు. ఆ ఆలోచన రావటమే తరువాయి రైలులోని ఓ ప్రత్యేక బోగిలో స్వదేశీ వస్తుసామగ్రిని నింపుకుని  ఆ సామగ్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తూ, స్వదేశీ ఉద్యమ సందేశాన్ని వ్యాప్తి చేశారు. స్వదేశీ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనటమే కాకుండా, స్వదేశీయులచే పలు కుటీర పరిశ్రమల స్థాపనకు ఆమె కృషి సల్పారు.
 1934లో సమాజోద్ధరణలో భాగంగా మహిళలను చైతన్యవంతుల్ని చేసి సంఘటిత పర్చేందుకు సంఘాలు, సంస్థలు స్థాపించారు. అంజుమన్‌ ఇస్లాహే నిశ్వా మహిళా సుధార్‌ సమితి అను సంస్థను స్వయంగా ఆరంభించారు. 1935లో ఆమె అఖిల భారత మహిళా సమావేశానికి కార్యదర్శిగా నియుక్తులయ్యారు. బొంబాయి ముస్లిం మహిళలలో వయోజన విద్యా వ్యాప్తికిఎంతో కృషిచేశారు. పలు సంఘాలను, సేవా సంస్థలను స్థాపించి, ఆయా సంస్థల అభివృద్ధికి శ్రమించారు. ఈ మేరకు మహిళలలో జాగృతికోసం  చేస్తున్న  కృషి ఫలితంగా 1937-1940ల మధ్యలో ఆమె అఖిల భారత మహిళా కాన్ఫెరెన్స్‌ హస్టల్‌ కార్యదర్శి బాధ్యతలు లభించాయి.
ఆ క్రమంలో 1940లో బొంబాయి ఉమెన్స్‌ కౌన్సిల్‌కు చెందిన లేబర్‌ సమితికి ఉపాధ్యకక్షురాలయ్యారు. ఆ పదవిలో ఆమె కార్మికుల కుటుంబాలలో మహిళల పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రయత్నించారు. ఆమె స్వయంగా కర్మాగారాలకు చుట్టుపక్కల ఉంటున్న కార్మికవాడలకు వెళ్ళి కార్మిక కుటుంబాల మహిళలతో వారి సమస్యల విూద చర్చించారు. ఆ మహిళల సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఆ సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక మార్గాలను సూచిస్తూ మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత గ్రావిూణోద్యోగ సంఘం ఏర్పాటుకు పునాదులు వేశారు. సమస్యలతో సతమతమవుతున్న మహిళలు తమ సమస్యలను తాము పరిష్కరించుకుంటూ, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కుటీర పరిశ్రమలను, చేతి వృత్తులను ప్రోత్సహించారు. ఆ కృషిలో భాగంగా పలు మహిళా సంక్షేమసంఘాలను ఏర్పాటు చేశారు.
  1942లో ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమంలో  ఫాతిమా ఇస్మాయిల్‌ క్రియాశీలపాత్ర వహించారు. ఈ ఉద్యమంలో పోలీసుల అరెస్టులను తప్పించుకుంటూ  ఆమె పనిచేశారు. ఒకథలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళారు. 1940లో రాంఘర్‌, 1943లో బొంబాయిలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు పాతిమా ఇస్మాయిల్‌ హజరయ్యారు. ఖద్దరు, స్వదేశీ ఉద్యమ ప్రచారం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం, హిందూ- ముస్లింల ఐక్యత ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకుని ఆమె ముందుకు సాగారు. ఈ లక్ష్యాల సాధన కోసం సాగించిన ప్రయత్నాలలో భాగంగా  ఆమె పలు ప్రాంతాలను సందర్శించారు. 
క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఫాతిమా ఇస్మాయిల్‌  చురుకైన భాగస్వామ్యం వహిస్తుండగా 1944 ప్రాంతంలో ఆమె కుమార్తె పోలియో బారిన పడింది. ఆ కారణంగా కుమర్తె అవిటితనానికి గురైంది. బిడ్డ అవిటిగా మారటంతో  ఫాతిమా ఇస్మాయిల్‌  తీవ్రంగా కలత చెందారు. పోలియో పరిణామాల నుండి ఆమెను కాపాడుకునే ప్రయత్నాలలో లక్షలాది పిల్లలు పోలియో రక్కసి బారిన పడి వికలాంగులుగా మారుతున్న దుస్థితిని గమనించారు.  సరైన చికిత్స లేని ఆ వ్యాధి నుండి పిల్లలను కాపాడుకునేందుకు వ్యాయామం ఒక్కటే కారణమని తెలుసుకున్న ఆమె ఆ దిశగా తన బిడ్డ విూద ప్రయోగాలు చేశారు. ఆమె ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయి. దానితో పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమని ఆమెకు విశ్వాసం కలిగింది. కష్టసాధ్యమైన ఆ మహాత్తర లక్ష్యసాధనకు పూర్తికాలపు సేవలు అవసరమని ఆమె భావించారు. ఆ క్షణం నుండి  ఆమె సాగిస్తున్న బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పి పోలియో నుండి బిడ్డలను కాపాడేందుకు పోలియో విూద ఆవిశ్రాంత పోరాటం సల్పేందుకు నడుంకట్టారు.
  ఆమె గతంలో  వైద్యశాస్త్ర విద్యార్థి కావటంతో పోలియో నివారణ, నియంత్రణ కార్యక్రమాల విూద ప్రత్యేకంగా శిక్షణ పొందారు. బొంబాయికి చెందిన డాక్టర్‌ బాలిగాతో కలిసి పోలియో రోగగ్రస్తులైన పసిబిడ్డలకు వ్యాయామం ద్వారా పోలియోను నయం చేసేందుకు  1947లో ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ కోసం పోలియో రోగగ్రస్త బిడ్డల ఆరోగ్యం కోసం ఫాతిమా ఇస్మాయిల్‌ పూర్తి కాలాన్ని వినియోగించటం ప్రారంభించారు. పండిత నెహ్రూ కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ కుటుంబం సహాయ సహకారాలతో పోలియో నివారణ సంస్థను, ఆ సంస్థ కార్యక్రమాలను మరింతగా విస్తరింపచేశారు. 
 ఈ క్రమంలో పేదరికం, అనారోగ్యం పట్టిపీడిస్తున్న కార్మికులను, అజ్ఞానం, ఆర్థిక బలహీనతలతో బానిసల కంటే దుర్భరంగా బ్రతుకులీడుస్తున్న మహిళలనూ, సాంఘిక అసమానతలు, సామాజిక దురాచారాలను, అంటరానితనంతో అత్యంత హీనంగా చూడబడుతున్న దళిత జనసముదాయాల స్థితిగతులనూ అతిసవిూపం నుండి గమనించారు. ఆ అవాంఛనీయ పరిస్థితులలో మౌలిక మార్పుకోసం పనిచేయటం ఆరంభించారు.  ఈ దిశగా ఆమె తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. శ్రమ జీవుల పక్షాన పోరాటాలు చేశారు. ఆరోగ్యం, పరిశుభ్రత విషయాలలో చైతన్యం కోసం కృషి సల్పారు.  కర్మాగారాల వాతావరణం, పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు.
జాతీయ అంతర్జాతీయ సంస్థల పిలుపు మేరకు,  పోలియో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను, పసిబిడ్డల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను వివరిస్తూ పలు విదేశీ పర్యటనలు జరిపారు, ఆమె స్వయంగా పలు చోట్ల  శిక్షణ పొందారు. స్వదేశంలో స్థాపించబడిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు చేయూతనిచ్చారు. పోలియో పీడితులకు మాత్రమే కాకుండా అంగవికలాంగుల ఉద్ధరణకు కూడా ఆమె కృషిచేశారు. వికలాంగులకు ప్రభుత్వం నుండి సదుపాయాలు కలుగజేసేందుకు ఆమె నిరంతరం శ్రమించారు. వికలాంగుల సేవా కేంద్రాల స్థాపనను ప్రోత్సహించారు.     
ఈ  మేరకు అటు  పోలియో విూద అవిశ్రాంత పోరాటం చేస్తూ, ఇటు సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా తిరుగులేని యుద్ధం ప్రకటించిన ఫాతిమా ఇస్మాయిల్‌  ఆచరణాత్మక సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ అవార్డుతో  గౌరవించింది. దళిత ప్రజల విూద కొనసాగుతున్న సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ దళిత జనావళి అభ్యున్నతి కోసం ఆమె సాగించిన కృషి గమనించిన దళిత ప్రజలు స్వయంగా 1972లో  దళితమిత్ర  అవార్డుతో ఆమెను సత్కరించుకున్నారు. ఈ విధంగా స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆమెకు  గౌరవసత్కారాలు లభించాయి. పలు అవార్డులు ఆమె సొంతమయ్యాయి. ఆ విధంగా లభించిన పురస్కారాలన్నిటిని ఆమె మార్గదర్శకత్వంలో సాగుతున్న సేవాసంస్థల ఆర్థిక పరిపుష్టికి వినియోగించారు.
 ప్రజాసేవారంగాలలో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొంది, స్వాతంత్య్ర సమరోద్యమకారిణిగా, పోలియో నియంత్రణకు అవిరళ కృషి సల్పిన యోధురాలిగా, భారతీయుల ప్రియతమ సంఘసేవకురాలిగా, ఖ్యాతిగాంచిన ఫాతిమా ఇస్మాయిల్‌ 1979 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ పదవిలో 1985 వరకు పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఆమె సంఘసేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించారు.
ఈ విధంగా జీవిత చరమాంకం వరకు ప్రజాసేవలో గడిపిన శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌ 1987 అక్టోబర్‌ 11న కన్నుమూశారు.