Thursday 10 May 2012

సంపూర్ణ స్వరాజ్యం కై తొలి కేక వేసిన పోరాట యోధుడు మౌలానా హస్రత్‌ మోహాని

సంపూర్ణ స్వరాజ్యం కై తొలి కేక వేసిన పోరాట యోధుడు
మౌలానా హస్రత్‌ మోహాని
    భారత జాతీయ కాంగ్రెస్‌ 14న సమావేశం డిసెంబరు 1921న అహ్మదాబాద్‌ లో జరుగుతుంది.  ఆ సమావేశంలో ఓ వ్యక్తి గంభీరంగా ఉపన్యసిస్తున్నాడు. అతని ప్రసంగం యువకుల్నే కాదు, పెద్దల్ని కూడా పెను తుఫానులా చుట్టేస్తుంది. ఆ ప్రసంగంలో వ్యక్తమవుతున్న పట్టుదల, లక్ష్యం పట్ల గల నిభద్దతకు సభికులు ఆనంద పరవశులవుతున్నారు. ఆ ప్రసంగానికి సభాస్దలి యావత్తు కదలిపోతుంది. ప్రతిపాదిత ' స్వరాజ్యం ' డిమాండ్‌ను  ఆ వక్త  కోరుతున్నటుగా ' సంపూర్ణ స్వరాజ్యం ' గా సవరించబడి ఏకగ్రీవంగా తీర్మానించాలని ప్రతి ఒక్కరూ భావించారు. చివరకు అది తీర్మానం కాలేదు.
    భారత రాజకీయ రంగాన తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న మహాత్మా గాంధీ ఆ సవరణను వ్యతిరేకించటం వలన అది అప్పటికి వీగిపోయింది.' .. this proposition of Mr.Hasarth Mohani leads you into depths unfathomable.. ' అంటూ సవరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సమావేశం సానుకూలత సాధించేందుకు గాంధీజీ సుదీర్ఘ ప్రసంగం చేయాల్సి వచ్చింది.  జాతీయోద్యమంలో ఈ డిమాండ్‌ ను ప్రప్రధమంగా ఒక రాజకీయ వేదిక మీద ప్రకటించిన తొలి  ఉద్యమకారుడిగా  ఖ్యాతిగాంచాడా వక్త.  ఆ వక్త మరెవరో కాదు, భారత స్వాతంత్య్రోమ చరిత్రలో ' చిచ్చర పిడుగు ' గా ఖ్యాతి గాంచిన మౌలానా హస్రత్‌ మోహాని. స్వాతంత్య్ర పోరాటంలో తనదైన విప్లవాత్మక శైలితో బ్రిటీషర్లను ఎదుర్కొంటూ భారతీయుల హృదయాల్లో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యోధుడాయన.
    స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మౌలానా మోహాని 1878 లో ఉత్తర ప్రదేశ్‌ లోని ' మోహన్‌ ' అను  పట్టణంలో జన్మించాడు. ఆయన అసలు పేరు సయ్యద్‌ ఫజులుల్‌ హసన్‌. హాస్రత్‌ ఆయన కలం పేరు. మోహన్‌ అను పట్టణం నుండి వచ్చినందున  జన్మస్థానం పేరును  కలుపుకుని  ' హాస్రత్‌  మోహాని ' ఆయ్యాడు.  అలీఘర్‌ డిగ్రీ కళాశాలలో బి.ఎ చేసాడు. చిన్నతనం నుండే సాహిత్యాభిలాషి.    పదిహేడవ ఏటనే మోహాని గజల్స్‌ రాయటం ప్రారంభించాడు. ' ఉర్దూ-యే-ముల్లా '   పత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు. అరవింద ఘోష్‌ , బాల గంగాధర తిలక్‌ల  విప్లవాత్మక భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. చదువు పూర్తి కాగానే పరులచెంత నౌకరుగా చాకిరి చేయటం ఇష్టంలేని మోహాని జర్నలిస్టుగా జీవితం ప్రారంభించాడు.         బానిసత్వాన్ని ఏ రూపంలోనూ సహించని  మోహాని బ్రిటీషర్ల పై పోరు సలిపేందుకు, 1903లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. 1907 లో అతివాదులు, మితవాదులుగా కాంగ్రెస్‌ చీలిప్పుడు  ఆయన తిలక్‌ బాటను అనుసరించాడు.
    విప్లవాత్మక భావాలతో బ్రిటీష్‌ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ ఆయన పత్రికలో వ్యాసాలు రాసి, ప్రచురించిన కారణంగా 1909 లో ప్రభుత్వం  రాజద్రోహం నేరం మోపి, రెండు  సంవత్సరాల జైలు, ఐదు వందల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోవటం వలన ఆయన సమకూర్చుకున్న అమూల్య గ్రంధాలను జప్తుచేసి పోలీసులు పట్టుకెళ్ళారు. జైలు నుండి విడుదల కాగానే, ఒక మిత్రుని ఆర్ధిక సహకారంతో భారత దేశం లోని ప్రధమ ' స్వదేశీ స్టోర్స్‌ ' ను భార్య శ్రీమతి నిషాతున్నిసా బేగం సహాయంతో ప్రారంభించారు. బేగం హస్రత్‌ మోహాని గా విఖ్యాతురాలైనా ఆమె స్వాతంత్య్ర సమరంలో అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించటమే కాక, అన్ని వేళల్లో భర్తకు తోడూ-నీడగా నిలిచిన యోధురాలు. విదేశీ వస్తువుల బహిష్కరణను ప్రోత్సహించటమే కాక స్వదేశీ వస్తువుల తయారీదారులకు కూడా అన్ని విథాల సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. బానిసత్వం నుండి విముక్తికై పోరాట స్పూర్తి కలుగజేసేందుకు దేశభక్తి భావనల ప్రచారానికౖెె ' తజకర-యే- షురా ' (ఊబిచిదిబిజీబి-రి-ఐనీతిజీబి)  అను త్త్రెమాసిక పత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక లో తనదైన శైలిలో ఎక్కడా రాజీ పడకుండా తెల్లదొరల పాలనను విమర్శించటమేకాక విదేశీ పాలకులను ఎందుకు తరిమి కొట్టాలో విశ్లేషించి  ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యాడు ' British people in Egypt ' అను వ్యాసాన్ని ప్రచురించినందుకు ఆయన పై మళ్ళీ రాజద్రోహం నేరం మోపిన ప్రభుత్వం విచారణ జరిపించి నాలుగు సంవత్సరాల జైలు శిక్షను విధింపజేసింది.
    కాబూల్‌ కేంద్రంగా ఏర్పడిన ప్రవాస భారత ప్రభుత్వం పిలుపు మేరకు , మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తో కలసి కాబూల్‌ కు వెడుతున్నాడన్న నెపం మీద 1916లో ఆయనను ప్రభుత్వం గృహ నిర్భంధ శిక్షను విధించగా,  ఆయన  ఉల్లంఘించాడు.  అందుకు గాను ఆయన  మరోసారి 2 సంవత్సరాల జైలు శక్షకు గురయ్యాడు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని,  '..మోహాని కృషికి తగిన బహుమతి అందింది...మోహాని ఎందుకు అరెస్టు అయ్యాడో 50 సంవత్సరాల తరువాత ఈ దేశం సరిగ్గా అర్థం చేసుకుంటుంది..' అని మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ప్రశంసించారు. ఆయనను అతి ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించిన ప్రభుత్వం జైలులో అనేక రకాలైన ఇబ్బందుల పాల్జేసింది. కష్టనష్టాలకు గురిచేసింది. విలువైన పుస్తకాలను తగులపెట్టించింది  మౌలానా స్వయంగా ఆ సంఘటనలను ఈ విధంగా పేర్కొన్నారు. .' .' ..The superintendent of jail came to my cell. He burnt to ashes all of my newspapers, magazines and books, including Diwan-e-Hafiz and ordered me indignantly to present myself in his office.. '  ప్రభుత్వం ఎతం పీడించినా, మౌలానా మాత్రం మొక్కవోని ధైర్యంతో అన్నిటిని సహించాడు, ఎదుర్కొన్నాడు.
    ఖిలాఫత్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. ముస్లింలీగ్‌ నేతగా తనదైన భావాల వైపుగా లీగ్‌ను నడిపించేందుకు ప్రయత్నించాడు. లీగ్‌ ప్రతినిధుల బృందలో సభ్యుడిగా లండన్‌ వెళ్ళాడు. లీగ్‌ సమావేశాలలో '..the attainment of swaraj or complete independence, free from all foreign control, by the people of India by all legitimate and peaceful means..'  అంటూ ప్రతిపాదించి చర్చించాడు. భారత రిపబ్లిక్‌, అమెరికా తరహా ఐక్య సమాఖ్యగా ఉండాలని ఆయన వాంఛించాడు. సహాయనిరాకరణ కొంత వరకు మాత్రమే సత్పలితానిస్తూందని అభిప్రాయపడుతూ, సాయుధ  గెరిల్లా పోరాటాలను ఆరంభించాలన్నాడు. ముస్లింల అభ్యున్నతి కోసం సాంకేతిక విద్యాసంస్థలను, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించాలన్నాడు. ప్రత్యేక నియోజకవర్గాలు వద్దన్నాడు.  బ్రిటీషర్లను తరిమివేసేందుకు హిందూ-ముస్లిం మధ్య ఐక్యత చాలా అత్యవసరమన్నాడు. హిందూ-ముస్ల్లిలు తమ తమ ప్రత్యేక డిమాండ్లను ప్రక్కన పెట్టి ఉమ్మడి శతృవుపై పోరాడాలని పిలుపునిచ్చాడు. ఆ ప్రయత్నంలో మహ్మద్‌ ఆలీ జిన్నా భావాలను తీవ్రంగా వ్యతిరేకించాడు.
    1921లో అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగాన్ని పురస్కరిచుకొని రాజద్రోహం నేరం మొపుతూ, ప్రభుత్వం ఆయనకు మళ్ళీ రెండేళ్ళు జైలుశిక్ష విధించింది. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పక్షం ముందుకొచ్చినా మౌలానా మద్దతు నిచ్చేవాడు. ఆయన కమ్యూనిస్టు పార్టీకి సన్నిహితుడయ్యాడు. 1925లో కాన్పూరులో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశాల నిర్వహణకై ఏర్పడిన ఆహ్వాన సంఘానికి ఆయన అధ్యక్షత వహించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ' communism is a movement of the peasants and workers. Some may think that communism synonyms with chaos and Killings... our independence should be based on the model of the soviet Govt. Where Communism shall be ruling political creed..' అభివర్ణించాడు.
    ' సంపూర్ణ స్వరాజ్యం' సాధించేందుకు హిందూ-ముస్లిం ఐక్యత ఎంతో అవసరమని నమ్మిన ఆయన, 1927-28లో కలకత్తాలో జరిగిన ఐక్యతా సమావేశంలోని నిర్ణయాలను  హిందూ సోదరులు నిరాకరించటంతో తీవ్ర వ్యధకు గురయ్యాడు. గాంధీజీ సిద్దాంతాలకు అన్ని సమయాలలో అనుసరించదగినవి కావన్న అభిప్రాయం గల మౌలానా తన వాదనను విన్పించటంలో ఏ మాత్రం వెనుకాడేవాడు కాదు. నిర్భయంగా, నిక్కచ్చిగా తన భావాలను తెలపటంలో, ఎదుటి వ్యక్తి వాదనను, ఎదుర్కొనటంలో ఏ మాత్రం మొహమాట పడేవాడు కాదు. మౌలానా వాదనా పటిమ  గురించి టర్కీకి చెందిన రచయిత్రి Halide Eidb  1937లో మహాత్మాగాంధీ మాట్లాడుతూ ' when I have a talk with Mohani, I can not sleep in peace..' అన్నాడంటే మౌలానా వాదన ఏ స్థాయిలో ఉండేదో ఊహించవచ్చు. 1921 నుండి పోరాడుతున్నా  ' సంపూర్ణ స్వరాజ్యం ' ప్రతిపాదనను గాంధీజీ ఒత్తిడి వలన తీర్మానంగా కాంగ్రెస్‌ ఆమెదించక పోవటం, తన విప్లవాత్మక భావాల పట్ల తరచుగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత వలన విసిగిన ఆయన 1928లో కాంగ్రెస్‌ నుండి  బయటకు వచ్చేసాడు.  ఆయన బయటకు వచ్చాక, 1929 అక్టోబరు 31 నాటి లాహోర్‌ సమావేశంలో ఆయన కల పూర్తిగా నిజమైంది.  1921 నుండి ఆయన చేస్తూ వచ్చిన ' సంపూర్ణ స్వరాజ్యం ' డిమాండ్‌ కాస్తా పూర్తి స్ధాయిలో తీర్మానమైంది. వ్యక్తి సత్యాగ్రహోద్యమంలో చురుగ్గా పాల్గొని ఆయన, లక్నోలోని అమానుల్లా పార్క్‌లో బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూ ప్రసంగించాడు. ఆ సందర్భంగా  పోలీసులు ఆయనను అరెస్టు చేయ ప్రయత్నించారు. అరెస్టును హస్రత్‌ తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆయనను బలవంతంగా  వాహనం మీదకు విసిరి పోలీసులు తీసుకెళ్ళాల్సి వచ్చింది. 1937లో ఆయన సహ్మధర్మచారిణి నిశౄతున్నిసా బేగం కన్నుమూసారు. అన్ని విధాల తోడ్పాటునిచ్చి, కష్టకాలంలో అండగా నిలచిన  అర్థాంగి మృతి ఆయనను తీవ్రంగా కలచివేసింది. ' సంపూర్ణ స్వరాజ్య' సాధనకు అంకితమైన వ్యక్తిగా రాజకీయాల నుండి ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు.     బ్రిటీష్‌ పాలకులతో ఏ మాత్రం రాజీపడని ఆయన బానిస బంధనాల నుండి విముక్తిని సదా కాంక్షించాడు. ఆ దిశగా ఏ వ్యక్తి  మరే శక్తి పోరాటం సాగిస్తున్నా ఆయన అండదండలు అందించాడు. 1931లో ' లీగ్‌ '  ఐలిజితీ స్త్రళిఖీశి. డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసింది.  ఆ సమయంలో  ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ 'al hamdolilla Muyslium League council in its meetings of 1914 accepted Self Government  as its Goal, Which I declared in 1907.' అన్నాడు.
    ఆ తరువాత మౌలానా హస్రత్‌ 1915లో ముస్లింలీగ్‌లో చేరాడు. చివరి వరకు ముస్లిం లీగ్‌తో సంబంధాలను కొనసాగించినా, ఆయన ఏక్కడా రాజీపడలేదు. 1916లో లీగ్‌ కోరిన ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించాడు. ఇంగ్లాండ్‌ వెళ్ళిన లీగ్‌ ప్రతినిధివర్గ సభ్యుడై ఉండి ఖిలాఫత్‌ ఉద్యమాన్ని బలపర్చుతూ, భారతీయుల పోరాటం న్యాయమైనదని వాదించాడు. జీవిత పర్యంతం స్వేచ్చా, స్వాతంత్య్రాల విషయంలో ఏ విధమైన రాజీ ధోరణిని ఆయన అంగీకరించలేదు. 1937 సంవత్సరంలో లక్నోలో జరిగిన లీగ్‌ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ '.. Establishment of India of full independence in the form of a federation of free democratic states in which rights and interests of the Muslamans and other minorities are adequately and effectively very safe of safe guarded in the constitution....'. అన్నాడు. అల్ప సంఖ్యాక వర్గాల ప్రజానీకం సమాన హక్కులు రాజ్యాంగ పరంగా పొందగలరని వాంఛించాడు.
    గాంధీజీ, జిన్నాలతో రాజకీయ సిద్దాంత పోరాటాలు జరపటంలో రాజీపడని నిర్భయుడైన యోధుడాయాన. గాంధీజిని సంపూర్ణ స్వరాజ్య తీర్మానం విషయంలో  ఏ విధంగా ఎదుర్కొన్నాడో అదే విధంగా 1942లో అలహాబాద్‌లో జరిగిన లీగ్‌ సమావేశంలో అత్యంత బలమైన నాయకుడైన మహమ్మద్‌ అలీ జిన్నాను ఎదుర్కొన్నాడు.  నమ్మిన విషయంలో  ఏ మాత్రం సదలింపు కన్పించేంది కాదు. క్రిప్స్‌ ప్రతిపాదనల విషయంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు జిన్నాను 'డిక్టేటర్‌'గా అంగీకరించేందుకు  లీగ్‌ చేసిన నిర్ణయాన్ని, ఆయన ససేమిరా అంగీకరించలేదు. ఆ సమయంలో లీగ్‌లో తిరుగులేని నాయకుడి వెలుగొందుతున్న జిన్నాను వ్యతిరేకించటం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యం కాగల వ్యతిరేక పరిస్థితులైనప్పటికీ, ప్రజాస్వామ్యబద్దంగా పోరాడిన ఏకైక వ్యక్తిగా ఖ్యాతి గాంచాడు.      సామ్రాజ్యవాదానికి వ్యతిరేకి, సామ్యవాద వ్యవస్థ అనుకూలుడైన హస్రత్‌ మోహాని బ్రిటీష్‌ సామ్రాజ్య విస్తరణ కాంక్షను తీవ్రంగా విమర్శించాడు. సామ్రాజ్యవాదుల కుయుక్తులకు బలవుతున్న ముస్లిం దేశాల ప్రజల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటమే కాక, కార్యాచరణకు పూనుకున్నాడు. పాలస్తీనాలో బ్రిటీషర్లు అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ' లీగ్‌ 'లో 1938 తీర్మానం చేయించటమే కాక 1938 ఆగష్టు 26ను పాలస్తీనా దినోత్సవంగా ప్రకటింపజేసాడు.
    1946లో జరిగిన ఎన్నికలలో ముస్లింలీగ్‌ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. భారత విభజన ప్రతిపాదనను విరమించుకోవాల్సిందిగా లీగ్‌ను కోరాడు. ఈ విషయమై  కౌన్సిల్‌ సమావేశంలో గట్టిగా డిమాండ్‌ చేశాడు. ఇస్లాం బోధనల ప్రకారంగా  జీవితం గడుపుతూ తనదైన శైలితో సాగుతున్నప్పటికీ, మతం పేరుతో దేశవిభజనను ఆయన పూర్తిగా  వ్యతిరేకించాడు. భారతదేశం చీలిపోవటంతో ఆయన  తీవ్రంగా వ్యధకు గురయ్యాడు. భారత విభజన జరిగాక ఆయన తన జన్మభూమిని విడిచివెళ్ళటానికి ఇష్టపడలేదు. మిత్రులు ఒత్తిడి తెచ్చినా ఆయన వినలేదు. అనంతరం స్వతంత్య్ర భారతావనిలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆయన ఉత్తరప్రదేశ్‌ నుండి ఎన్నికయ్యాడు. జీవితపు ఆఖరి ఘడియ వరకు ఆయన రాజకీయ రంగాన్ని వీడలేదు. ప్రజా జీవితానికి దూరం కాలేదు.  బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రజా సంఘాల ఆవశ్యకతను గుర్తించిన మౌలానా అనేక సంస్థలను స్థాపించి, నిర్వహించాడు. వాటిలో ' అంజుమన్‌-ఎ-కాబా ', ' మజ్లిసే అహరార్‌ ', ' ఖయామతుల్‌ ఉల్‌మా-ఎ-హింద్‌ ', ' అంజుమన్‌-ఎ-ఖుద్దాములహరమైన ్‌, అజాద్‌ పార్టీ లాంటివి ప్రధామైనవి.
    భారత విభజన తరువాత రాజ్యాంగాన్ని రూపొందించే కార్యక్రమంలో భాగంగా, ఆయన రాజ్యాంగ పరిషత్తు సభ్యుడయ్యాడు. రాజ్యాంగ నిర్మాణంలో తరదైన పాత్రను నిర్వహించాడు. అయితే పూర్తయిన రాజ్యాంగముసాయిదా మీద సంతకం చేయ నిరాకరించాడు. భారత విభజనను, కామన్‌వెల్త్‌లో భారతదేశం సభ్యత్వం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, నిరసనగా మౌలానా మోహాని సంతకం చేయలేదు.
    ఒకవైపు స్వాతంత్య్ర సమరాంగణాన వీరోచిత పోరాటాలు సాగిస్తూనే, మరోవైపున బ్రిటీష్‌ ప్రభుత్వపు కిరాతకత్వాన్ని అనునిత్యం రుచి చూస్తూ కూడా తనలోని కవిని విస్మరించలేదు.  ఉర్దూ, అరబిక్‌, పర్షియన్‌ భాషలో పాండిత్యం సంపాదించాడు.  మృధు మధురమైన కవిత్వాన్ని సాహిత్య జగత్తుకు సమర్పించుకున్నాడు.  పలు మార్లు కారాగారవాసం అనుభవించినా ఆ కాఠిన్యం మాత్రం ఆయనను సమీపించలేదు. ఉర్దూ కవితా ప్రియులు ఎంతో ప్రీతితో గానం చేసే ' చుప్‌కే చుప్‌కే రాత్‌ దిన్‌ ఆంసూ బహానా యాద్‌హై ' గజల్‌ హస్రత్‌ మోహాని కలం నుండి జాలువారింది. ఉర్దూ గజల్‌కు క్రొంగొత్త ద్వారాలను తెరచిన ఆయన అనేక వందల అద్భుతమైన గజల్స్‌ అందించాడు.
    ఆయన ఏ రాజకీయ పక్షంలోనున్నా, మరే సంస్థలో నున్నా, ఆయా సంస్థల, రాజకీయ పక్షాల ఉద్దేశాల లక్ష్యాలకు అతీతంగా,  ప్రజా సంక్షేమం మాత్రమే ఆయనకు ప్రధానమైన కర్తవ్యమయ్యేది.  మౌలానా హస్రత్‌ మోహాని గురించి డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ... ' అందరూ స్వార్థం కోసం, పార్టీ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు. అయితే మోహాని ప్రజల కోసం ఆంతరాత్మ ప్రబోధం మేరకు ఏమైనా చేయటానికి సిద్దపడతారు...' అన్నారంటే ప్రజాప్రతినిధిగా ప్రజల క్షేమమే పరమావధిగా మంచి పార్లమెంటేరియన్‌గా ఆయన ఎలా రాణించాడో అవగతం చేసుకోవచ్చు.
    సంపూర్ణ స్వరాజ్యం, సహాయ నిరాకరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, శాసనోల్లంఘన లాంటి కార్యక్రమాల ద్వారా ప్రచారాన్ని మహోధృతంగా నిర్వహించిన నాయకునిగానే కాకుండా, చిత్తశుద్దితో ఆయన కార్యక్రమాలను అమలుపరచి అందరికి ఆదర్శప్రాయుడు అయ్యాడాయన. కవి, రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, వక్త, బహుభాషా కోవిదుడు, కార్యకర్త, కార్యదకక్షుడు, ప్రజా నాయకుడు, విప్లవకారుడు అన్నింటికి మించి మానవతావాది, అకంళంక దేశభక్తుడు, అవిశ్రాంత ప్రజాసేవకుడైన మౌలానా హస్రత్‌ మోహాని లక్నోలో 1951లో మే 13వ తేదీన కన్నుమూసారు.