Saturday 19 October 2013

అష్ఫాఖుల్లా ఖాన్‌
(1900-1927)

మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్‌ వలస పాలకులపై విప్లవించి అమరులైన యోధాగ్రేసులలో ఒకరు అష్ఫాఖుల్లాఖాన్‌ .
1900 అక్టోబర్‌ 22న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని సంపన్న జవిూందారి కుటుంబంలో అష్ఫాఖ్‌ జన్మించారు. తండ్రి షఫీఖుల్లాఖాన్‌. తల్లి మజహరున్నీసా బేగం. చిన్ననాటి నుండే స్వతంత్ర భావాలను సంతరించుకున్న ఆయన ప్రజల జీవన పరిస్థితుల విూద దృష్టి సారించటంతో చదువు విూద పెద్దగా శ్రద్ధచూపలేదు. తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్
న ఆయన మంచి ఉర్దూ కవిగా రూపొందారు.
అష్ఫాఖుల్లా Abbie Rich Mission High School 8వ తరగతి విద్యార్థిగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ కవితలు రాస్తూ పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను చిన్నతనంలోనే వ్యక్తంచేశారు. ఆ క్రమంలో 'హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీ' నాయకులు రాం ప్రసాద్‌ బిస్మిల్‌తో ఏర్పడిన పరిచయం ద్వారా విప్లవోద్యమంలో భాగస్వామి అయ్యారు. మతం కారణంగా ఆర్యసమాజానికి చెందిన బిస్మిల్‌ హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీలో అష్ఫాక్‌కు సభ్యత్వం ఇవ్వడానికి సంశయించినా చివరకు అంగీకరించక తప్పలేదు. ఆర్మీ సభ్యునిగా బిస్మిల్‌ నేతృత్వంలో జరిగిన పలు యాక్షన్‌లలో చురుగ్గా అష్ఫాఖ్‌ పాల్గొన్నారు. బలమైన శత్రువును మాతృభూమి నుండి తరిమి కొట్టేందుకు ఆయుధాల సమీకరణకు ధనం అవసరం కాగా విప్లవకారుల కన్ను ప్రభుత్వపు ఖజానా విూద పడింది. ప్రభుత్వ ఖజానాను తెస్తున్న రైలు నుండి ధనాన్ని కొల్లగొట్టేందుకు పథకం తయారయ్యింది. ఈ పథకం పట్ల తొలుత అష్ఫాఖ్‌ అయిష్టత వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ఖజనాను అపహరిస్తే ప్రభుత్వం విప్లవోద్యమం విూద విరుచుకపడగలదని, ఆ కారణంగా బాల్యావస్థలో నున్న విప్లవోద్యమం కోలుకోలేనంత దెబ్బ తింటుందని హెచ్చరించారు. అయినా ప్రజాస్వామిక సిద్ధాంతం పట్ల గౌరవంగల ఆయన సహచరుల మెజారిటీ నిర్ణయానికి సమ్మతి తెలిపారు.
ఆ పథకం ప్రకారంగా 1925 ఆగష్టు 9న కాకోరి గ్రామం విూదుగా వెళ్ళే మెయిల్‌లో తరలిస్తున్న ప్రభుత్వ ఖజానాను పది మంది సభ్యుల గల విప్లవకారుల దళం సాహసోపేతంగా కైవసం చేసుకుంది. ఈ పథకాన్ని అమలుపర్చటంలో క్రమశిక్షణ గల విప్లవకారునిగా అష్ఫాఖ్‌ తనదైన పాత్రను నిర్వహించారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న బ్రిటీష్‌ ప్రభుత్వం అష్ఫాఖ్‌ ఊహించినట్టే విప్లవకారుల విూద విరుచుకపడటంతో అష్ఫాఖుల్లాతో పాటుగా ఆర్మీ సభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
అష్ఫాఖుల్లా మాత్రం ఏడాదిపాటు అజ్ఞాత జీవితం గడిపిన పిదప స్వగ్రామానికి చెందిన ఒక మిత్రద్రోహి కారణంగా ఢిల్లీలో అరెస్టయ్యారు. ఆయనకు పలు ఆశలు చూపి, మత మనోభావాలను కూడా రెచ్చగొట్టి లొంగదీసుకోటానికి ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేసింది. చివరకు కాకోరి రైలు సంఘటన విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆర్మీ నాయకుడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ను శిక్ష నుండి తప్పించేందుకు కాకోరి రైలు సంఘటనకు తాను మాత్రమే పూర్తి బాధ్యుడనంటూ తన న్యాయవాది సలహాకు భిన్నంగా ఉన్నత న్యాయస్థానానికి అష్ఫాఖ్‌ రాతపూర్వకంగా తెలుపుకున్నారు. చివరకు ఆయనతోపాటు సహచర మిత్రులకు కూడా కోర్టు ఉరిశిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది.
మాతృభూమి కోసం ప్రాణాలర్పించటం మహాద్భాగ్యమని ప్రకటించిన అష్ఫాఖ్‌ను 1927 డిసెంబరు 19న ఫైజాబాదు జైలులో ఉరితీశారు. ఈ సందర్భంగా 'నా మాతృభూమి సర్వదా భోగభాగ్యాలతో విలసిల్లాలి. నా హిందూస్థాన్‌కు స్వేచ్ఛ లభిస్తుంది చూడండి. చాలా త్వరగా బానిసత్వపు సంకెళ్లు తెగిపోతాయి' అని ఎంతో ఆత్మవిశ్వాసంతో దేశ భవిష్యత్తును ప్రకటించిన అష్ఫాఖుల్లా ఖాన్‌ ఉరితాడును సంతోషంగా స్వీకరిస్తూ, తన వందేళ్ళ జీవితాన్ని 27 ఏళ్ళకే ముగించుకుని తరలి వెళ్ళిపోయారు. (Taken from Syed Naseer Ahamed book CHIRASMARANEEYULU)

No comments:

Post a Comment