Thursday 19 September 2013

 ' ప్రమాదంలో ఇస్లాం '  నినాదం ప్రమాదాన్ని పసిగట్టి తిరస్కరించిన
 మౌలానా హబీబుర్రెహమాన్‌ లుధియాని
   

    భారత దేశ విభజన జరగటానికి దోహదం చేసిన పలు కారణాలలో '|ఐఉజుఖ |శ్రీ ఈజుశ్రీస్త్రజూష్ట్ర' అను నినాదం ఒకటి.   ద్విజాతి సిద్దాంతం  పేరిట దేశాన్ని ముక్కలు చేసి తమ పబ్బం గడుపుకోవాలని ఆశించిన స్వార్ధపరులు హిందూ-ముస్లింల మత మనోభావాలను రెచ్చగొట్టి విజయం సాధించారు. విభజన ద్వారా లబ్ది పొందాలనుకున్న రాజకీయ నాయకులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్‌ తదితర వ్యక్తులు, శక్తులు తమ లక్ష్యాన్ని సాధించుకోవటానికి వివిధ మార్గాలను అన్వేషించాయి. ఈ మేరకు సాగిన అన్వేషణలో 'ప్రమాదంలో ఇస్లాం' అను నినాదం బలమైన ఆయిధంగా చిక్కింది. ఆ నినాదం ఆసరాతో ముస్లిం జనావళిని ఉద్వేగాల తుఫానుకు గురిచేశారు. ఆ ప్రమాదాన్ని ఆనాడే పసిగట్టిన పలువురు ముస్లిం నాయకులు, ఆ నినాదం వెనుక గల దురుద్దేశాలను ప్రజలకు వివరించారు. ఆ స్వార్ధపర శక్తుల కుయుక్తులను ఎండగట్టారు. ఆ విధంగా 'ఇస్లాం ఇన్‌ డేంజర్‌'  నినాదాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటమేకాక, ఆవాంఛనీయ వాతావరణంలో కూడా ఎమాత్రం వెనుకంజవేయకుండా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవిశ్రాంత కృషి జరిపిన వారిలో మౌలానా హబీబుర్రెహమాన్‌ లుధియాని ప్రముఖులు.
    1929 జనవరి ఒకటిన మీరట్‌లో జరిగిన 'అహరర్‌' సంస్ధ ప్రాంతీయ సమావేశంలో మౌలానా మాట్లాడుతూ ఇస్లాం ప్రమాదంలో ఉందంటూ సాగుతున్న ప్రచారం వెనుక గల కుట్రను హేతుబద్దంగానూ, సాహసోపేతంగానూ వివరించారు.' ముస్లింలకు ప్రత్యేక దేశం' అను డిమాండ్‌ సరికాదన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, '...the cry for Islam in Danger is baseless and it could not be protected by Pakistan...Islam cannot be protected by any community but by our own strength and sacrifice...'' అన్నారు. పాకిస్ధాన్‌ ఏర్పడినంత మాత్రాన ఇస్లాం మతానికి ఒరిగేది ఏమీ ఉండదని ప్రకటించారు. అమాయక జనావళిని మభ్య పెట్టేందుకు ఇస్లాం ప్రమాదంలో ఉందని స్వార్దపర శక్తులు ప్రచారం చేస్తున్నాయంటూ, ఆయా శక్తుల ప్రభావానికి లోను కావద్దని ప్రజలు పిలుపునిచ్చారు.
    నమ్మిన విషయాలను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా, ఎటువంటి సదురుబెదురు లేకుండా ప్రకటించే మౌలానా హబీబుర్రెహమాన్‌ 1892 జూలై 3వ తేదీన పంజాబ్‌ రాష్ట్రం లూధియానాలో జన్మించారు. మౌలానా వంశీకులకు 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న చరిత్ర ఉంది.  తండ్రి పేరు మౌలానా మహమ్మద్‌ జక్రియా. లూధియానా, జలంధర్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న హబీబుర్రెహమాన్‌ చివరకు దేవ్‌బంద్‌ వెళ్ళి ఉన్నత విద్యను పూర్తి చేశారు.
    1903లో లూధియానాకు చెందిన ప్రముఖ ఇస్లామిక్‌ తత్వవేత్త మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ కుమార్తె బీబి షఫాతున్నీసాను వివాహమాడారు. ఆమె  భర్తతో పాటుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మౌలానా తన జీవితంలో మొత్తం మీద 10 సంవత్సరాలకు పైగా జైళ్ళల్లోనే గడిపారు. ఆయన ఆస్తిపాస్తులను అనేక సార్లు ప్రభుత్వం జప్తు చేసింది. పోలీసులు తనిఖీ పేరుతో మౌలానా గృహంపై పలు మార్లు దాడులు జరిపారు. ఆయన ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీల పట్ల కూడా అతి దారుణంగా వ్యవహరించారు. అయినా ఆ తల్లులు అన్నింటినీ సహించారు. చివరకు పసిపిల్లల చెవులలోని దుద్దులను కూడా అపహరించుకు పోయారు. ఎంత నష్టం జరిగినా శ్రీమతి షఫాతున్నీసా కష్టనష్టాలను కడుపులోనే దాచుకున్నారు. ఉత్తమ లక్ష్యం కోసం సాగుతున్న స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్న భర్త, బిడ్డలను ఆమె చివరివరకు ప్రోత్సహించారు. జప్తుల మూలంగా మౌలానా సర్వం కోల్పోయారు. చివరకు రోజుగడవటం కూడా లేని పరిస్ధితులలో శధిలావస్ధలో ఉన్న ఇంటిలోనే తలదాచుకుంటూ, మౌలానా దంపతులు తమ ఇరువురు కుమార్తెలతో పలు కడగండ్లను అనుభవించారు. ఎన్ని ఇక్కట్లు ఎదురైనా ఆ కుటుంబం పోరాట మార్గాన్ని, లక్ష్యాన్ని వీడలేదు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన యోధుల వంశానికి చెందిన మౌలానా రెహమాన్‌ తుదిశ్వాస వరకు ఆ ప్రతిష్టాత్మక వారసత్వాన్ని కొనసాగించారు. బ్రిటిషర్ల రాజకీయాలను, దేశ ప్రజలను దోచుకుంటున్న తీరుతెన్నులను అవగతం చేసుకుంటూ పాలకుల చర్యలను వ్యతిరేకించారు. చక్కని శరీరాకృతి, వేషభాషలలో నవాబు దర్జాను ప్రతిబింబించే మౌలానా ఉదార హృదయులు. ఆదాయం పెద్దగా లేకున్నా, ఆదుకోమని వచ్చిన వారెవ్వరినీ కూడా వట్టి చేతులతో పోనివ్వని పెద్దమనస్సు అయనది.
    1919నాటి ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొనటం, భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించిన మౌలానా రెహమాన్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఖిలాఫత్‌ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్‌ ప్రారంభించిన సహాయనిరాకరణ ఉద్యమంలో  పలు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగాలు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. 1921 డిసెంబరు 1న ఆయన చేసిన ప్రసంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడమని ప్రజలను ప్రేరేపించేదిగా ఉందంటూ బ్రిటిష్‌ పోలీసులు వారెంటు జారీ చేశారు.  ఆ వారెంటు ఫలితంగా 1922 డిసెంబరు 22న  తొలిసారిగా అరెస్టయ్యారు.  ఆరు మాసాల జైలు శిక్ష పడింది. ఈ విధంగా ప్రారంభమైన జైలు జీవితం మౌలానా జీవిత కాలాన్ని 15 శాతానికి పైగా హరించి వేసింది. పలు సార్లు శిక్షలు అనుభవించిన ఆయన మొత్తం మీద పది ఏండ్లకు పైగా దేశంలోని వివిధ జైళ్ళల్లో గడిపారు. ఆయన జైలు జీవితం గడపటమే కాక, విప్లవకర కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మీద ఆయనతనోపాటుగా ఆయన కుమారులను కూడా పలుమార్లు అరెస్టు చేసి బ్రిటిష్‌ ప్రభుత్వం కారాగారంలో నిర్భందించింది.
    ఆధ్మాత్మిక విషయాలలో ముస్లింలకు మార్గదర్శకత్వం వహించే లక్ష్యంతో ఏర్పడిన JAMIAT-UL-ULEMA-HIND సంస్ధలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఈ సంస్థ జాతీయభావాలను ప్రచారం చేస్తూ, వేర్పాటు భావనలను నిరశిస్తూ, భారత జాతీయ కాంగ్రెస్‌కు బాసటగా నిలిచింది. జాతీయ భావాల ప్రచారం కోసం తన మిత్రులను ప్రోత్సహించి ANEES   అను ఉర్దూ పత్రికను లూధియానాలో మౌలానా ప్రారంభింపజేశారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సలహా మీద ఆయన 1920 లో MAJLIS-E-AHARAR ( The Society of Freemen) అను సంస్ధను ప్రారంభించారు. సంపూర్ణ స్వరాజ్య సాధనకు కృషి చేయటం, దేశ విభజన డిమాండ్‌ను వ్యతిరేకించటం, ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ప్రధాన లక్ష్యాలుగా అహరర్‌ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ కార్యకర్తలు జాతీయోద్యమంలో అసమాన త్యాగాలను, పోరాట పటిమను ప్రదర్శించారు. శాసనోల్లంఘనోద్యమంలో అరహర్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలను చైతన్యపర్చటం, ఉద్యమంలో భాగస్వాములు చేయడం,  ముందుకు నడిపించటంలో మౌలానా ఎంతో నేర్పుతో వ్యవహరించేవారు. అహరర్‌కు బలమైన కేంద్రాలుగా నున్న కాశ్మీర్‌, కపుర్తలా, బదవాల్‌ పూర్‌, ఖదియాన్‌లలో శాసనోల్లంఘన ఉద్యమం ఉదృతంగా సాగించారు.
    ప్రముఖ విప్లవకారుడు భగత్‌ సింగ్‌ అసెంబ్లీలో బాంబులు విసిరాక,  ప్రభుత్వ దమనకాండకు భయపడి ఆయన కుటుంబీకులకు ఆశ్రయం కల్పించేందుకు పంజాబ్‌ ప్రజలు ఎవ్వరూ కూడా ముందుకు రాని భయానక వాతావరణంలో భగత్‌ సింగ్‌ కుటుంబీకులకు నెల రోజులపాటు మౌలానా తన ఇంట ఆశ్రయం కల్పించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్‌ జారీచేయగా, ఆ అరెస్టును తప్పించుకోడానికి అజ్ఞాతంలోకి వెళ్ళిన సుభాష్‌ చంద్రబోస్‌కు కూడా ఆనాడు మౌలానా తన ఇంట ఆశ్రయం కల్పించారు. పంజాబ్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వ దాష్టికాలకు అంతూపొంతూ లేకున్న వాతావరణంలో బోస్‌కు ఎక్కడా తలదాచుకోడానికి అవకాశం లభించలేదు. ఆజ్ఞాతంలో ఉన్న ఆయన పంజాబ్‌లోని లుధియానాకు వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న మౌలానా లుధియాని స్వయంగా సుభాష్‌ ను ఆహ్వానించి బ్రిటిష్‌ పోలీసుల కళ్ళుగప్పి ఆశ్రయమిచ్చారు. మౌలానా ఇంట వారం రోజులు గడిపిన బోస్‌ తిరిగి బెంగాల్‌ వెళ్పిపోయారు.(The Milli Gazette, Fortnightly Feb.16-28, 2013, Page No.23). ఈ విధంగా ఇతరులెవ్వరూ విప్లవకారులకు, జాతీయోద్యమకారులకు ఆశ్రయం, రక్షణ కల్పించడానికి ముందుకు రాని రోజుల్లో మౌలానా హబీబుర్రెహమాన్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఏమాత్రం భయపడకుండా సహచరులైన స్వాతంత్య్రసమరయోధులను ఆదుకున్నారు.
     1931లో మూడు వందల మంది ఆంగ్ల ప్రభుత్వ పోలీసు అధికారులు, పోలీసుల సమక్షంలో నిర్భయంగా లుధియానలోని ఐనీబినీరి అబిళీబి ఖబిరీశీరిఖి వద్ద భారత జాతీయ కాంగ్రెస్‌ పతాకావిష్కరణ గావించి మౌలానా ఆర్టెయ్యారు. భారత విభనన లక్ష్యంగా ప్రజలలో మతం పేరిట మానశిక విభనను తీసుకరావడం ప్రధాన బ్రిటిష్‌ ప్రభుత్వాధికారులు, విభజనకారులు లుధియానా రైల్వే స్టేషన్‌లో 'హిందూ వాటర్‌' 'ముస్లిం వాటర్‌' అంటూ రెండు వేర్వేరుగా మంచినీటి కుండలు ఏర్పాటుచేశారు. ఈ  ఏర్పాటు గురించి తెలుసుకున్న మౌలానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చర్యను తీవ్రగా నిరసిస్తూ జాతీయోద్యమకారులు, వేర్పాటువాదాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న తన సహచరులు, అనుచరులైన హిందూ-ముస్లిం-సిక్కు సోదరులను కలుపుకుని తాను స్వయంగా రైల్వేస్టేషన్‌ వెళ్ళి అక్కడ ప్రభుత్వాధికారులు ఏర్పాటు చేసిన ఆ వేర్వేరు మంచి నీటి కుండలను పగులగొట్టి ఆరెస్టుకు గురయ్యారు.
    భారత జాతీయ కాంగ్రెస్‌ బాటన నడిచినంత మాత్రాన కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలన్నింటినీ మౌలానా సమర్థించ లేదు.  ఆయా నిర్ణయాలను విశ్లేషించుకుని సమర్దించటం లేదా నిశితంగా విమర్శించటం అయన ప్రత్యేకత. విమర్శించటంలో ఆయన  ఎంతటివారైనా ఖాతరు చేసేవారు కారు. 1937లో జాతీయ కాంగ్రెస్‌ పంజాబ్‌లో అనుసరించిన విధానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహత్మా గాంధీని కూడా ఆయన ఎమాత్రం ఉపేక్షించలేదు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ తారాచంద్‌ ప్రస్తావిస్తూ ,  'Even loyalty to the Congress, unswerving faith in the leadership of Ganghiji and deep attachment to  Jawaharlal Nehru could not deter him from differing from them, speaking to them firmly and warning them of the evil consequences of what he consider to be wrong decisions.' అన్నారు. పంజాబ్‌లో సిక్కులను సంతృప్తి పర్చేందుకు  నెహ్రూ నివేదికను పరిగణలోనికి తీసుకోలేదని గాంధీజీని ఆయన చాలా నిశితంగా విమర్శించారు.  హిందూ-ముస్లిం ప్రజానీకం మధ్యన శాంతి-సామరస్యాలకు, ఐక్యతకు తగినంత వాతావరణం సృష్టించకుండానే, గాంధీజీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వెళ్ళారని మౌలానా విమర్శించారు.   
     సమాజంలోని ధనిక-పేద వర్గాల మధ్య నున్న అంతరాల గురించి మౌలానా ఆలోచించేవారు. బ్రిటిష్‌ ప్రభుత్వం సాగించిన జప్తుల వలన సర్వం కొల్పోయినా,  తనకున్న తానితో ఆశ్రితులను సంత్పప్తి పర్చుతూ, ప్రజలు ఈ దుస్థితి నుండి శాశ్వితంగా బయట పడాలని కోరుకున్నారు.  ఆర్దిక సమానత్వం సాధించటం ద్వారా మాత్రమే అన్ని రకాల అసమానతలను సమాప్తం చేయవచ్చన్నారు. సామ్యవాద వ్యవస్ద నిర్మించటం కోసం కృషి సల్పాలని కోరారు. ప్రస్తుత భారతీయ సమాజం ఎదుర్కోంటున్న రుగ్మతలకు సామ్యవాద సిద్ధాతం మాత్రమే ఔషధమని విశ్వసించారు. ఆసమానతలను అంతంచేసే సామ్యవాద వ్యవస్ధ నిర్మాణం కోసం రాజకీయ పార్టీలు పని చేయాలని ఆకాంక్షించారు. ధనికుల పెత్తనం సాగుతున్న ప్రస్తుత ఆంగ్ల ప్రభుత్వాన్ని నిర్మూలించాలన్నది తన ధ్యేయమని మౌలానా ప్రకటించారు. సామ్యవాద వ్యవస్ధ అభిమానించిన ఆయన కమ్యూనిస్టు పార్టీలో మాత్రం చేరలేదు.  ఇస్లాం మతం మూల సూత్రాలను ఎంతో శ్రద్ధతో పాటించే, మతాచారపరాయణుడైన మౌలానా సామాజిక సమస్యల పరిష్కారానికి మతాతీతంగా ఆలోచించారు.  1940లో జరిగిన ఆజాద్‌ ముస్లింల సమావేశంలో భారత విభజన, హిందూ-ముస్లింల ఐక్యతకు సంబంధించి తన అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించారు. భారత విభజనను వ్యతిరేకిస్తూ తయారైన ప్రతిపాదన తీర్మానంగా రూపుధరించేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు.
    జీవితపర్యంతం జాతీయవాదిగా కొనసాగిన మౌలానా నమ్మిన సిద్దాంతాల పట్ల నిబద్దతతో  నిలిచారు.  స్వజనుల నుండి, విమర్శలు వచ్చినా చలించలేదు. ఆయన నిర్మోహమాటి కావటంతో పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.  జయాపజయాలను లెక్కచేయకుండా ఓర్పు, సహనంతో సర్వం కొల్పోయినా ముందుకు సాగారు. భారత విభజన పరిణామాల ఫలితంగా, ఆ మహనీయుని కుటుంబం  శరణార్దుల శిబిరంలో శరణు పొందాల్సి వచ్చింది. పుట్టిపెరిగిన లూధియానాను పదలాల్సి వచ్చింది. చివరకు ఢిల్లీ వెళ్ళి అపరిచితుల గృహంలో తలదాచుకోవాల్పి వచ్చింది.ఈ దుష్పరిణామాలకు కలత చెందిన మౌలానా భార్య షఫాతున్నిసా ఎంతో కృంగిపోయారు.  '..ఇందుకోసమేనా? ..మనం అన్ని కష్టనష్టాలకోర్చింది? ఏమిటిదంతా?...మనం మన ఇంటికి ఎప్పుడు పొందాం? మన లూధియానకు ఎప్పుడు వెళ్ళిపోదాం...' అంటూ పదే పదే ప్రశ్నించే సతీమణిని ఓదార్చలేక ఆయన సతమతమై పోయారు. ఆనాటి చేదు జ్ఞాపకాలు మౌలానా హబీబుర్రెహమాన్‌ను చివరికంటా వెంటాడుతూనే ఉండిపోయాయి. చివరకు  ' His devotion to principle such as martyrs might envy.  He never deviated from his beliefs and stood by them firm as rock. He is a man of amazing courage and endurance.'  అంటూ శ్రీ తారాచంద్‌చే ప్రశంసలు పొందిన మౌలానా హబీబుర్రెహామాన్‌ 1956 సెప్టెంబర్‌ 2న కన్నుమూశారు.
===
From Syed Naseer Ahamed,

No comments:

Post a Comment