Thursday, 19 September 2013

తిరగబడ్డ చీరాల-పేరాల ప్రజలకు బాసటగా నిలచిన

ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌

(1885 -1976)


జాతీయోద్యమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో సాగిన 'చీరాల-పేరాల' పోరాటం చాలా ప్రఖ్యాతిగాంచింది. అద్భుత పోరాటపటిమతో సాగించిన ఈ శాంతియుత ఉద్యమం జాతీయోద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలిచిపోయింది. ఆ పోరాటంలో ప్రధాన భూమిక నిర్వహించిన యోధులలో మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ ఒకరు.
ప్రకాశం జిల్లా చీరాల మండలం గంటాయపాలెంలో 1885 సెప్టెంబరు 12న ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ జన్మించారు. తల్లితండ్రులు హాజీ మోహిద్దీన్‌ బేగ్‌, ఫాతిమా. గౌస్‌బేగ్‌ తాత ముహమ్మద్‌ దిలావర్‌ బేగ్‌ సంపన్న వ్యాపారవేత్త. చీరాలకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న వోడరేవులో ఈయన వోడలు ఉండేవి. పెద్ద ఎత్తున గోడవున్సుకు యజమాని. భారీ ఎత్తున వ్యాపారం చేసిన ఘనాపాటి...గౌస్‌ సాహెబ్‌ తండ్రి హయాములో వోడరేవు వ్యాపారం స్థంభించింది. కాని విస్తృతమైన ఆస్థి, సిరిసంపదలు సంక్రమించాయి. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌.సుందరదావు, 1989, పేజి.60).
ముహమ్మద్‌ గౌస్‌ 1907లో విద్యార్థిగానే వందేమాతరం ఉద్యమం రోజుల్లో జాతీయోద్యమంలో ప్రవేశించారు. బాపట్లకు చెందిన బేగ్‌కు 'చీరాల-పేరాల ఉద్యమం' నిర్మాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పరిచయం ఏర్పడింది. ఆయనతో కలసి 1920లో కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరు కావడంతో గౌస్‌ రాజకీయ జీవితం ఆరంభమైంది. ప్రకాశం జిల్లా చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘం ఏర్పాటు చేసి ప్రజానీకం మీద ప్రభుత్వం అత్యధిక పన్నుల భారం మోపింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య రంగ ప్రవేశం చేశారు. ఆయన అత్యంత సన్నిహిత సహచరుడిగా గౌస్‌ బేగ్‌ కూడా ప్రత్యక్షకార్యాచరణకు దిగారు.1921 ఏప్రిల్‌ 6న, విజయవాడ వచ్చిన మహాత్మా గాంధీని దుగ్గిరాల కలిసి ఉద్యమ కార్యాచరణకు అనుమతి పొందడంతో 'చీరాల-పేరాల' ఉద్యమంలో మహమ్మద్‌ గౌస్‌ పూర్తిగా నిమగ్నమయ్యారు. ఆ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకున్న భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులలో గౌస్‌ బేగ్‌ ఒకరు. ఈ ఉద్యమంలో ప్రజానీకం ఆర్థిక ఇక్కట్లు పడుతున్నందున పూర్వీకులు సంపాదించి పెట్టిన సంపదను ప్రజావసరాలకు వ్యయం చేశారు. ఆ విధంగా ఉద్యమానికి సర్వసంపదను, వెచ్చించి బలాన్ని చేకూర్చిన యోధుడు జనాబు గౌస్‌ బేగ్‌ గా ఆయన ఖ్యాతిగడించారు. (స్వాతంత్య్రోద్యమం దేశ నాయకులు, వి.యల్‌.సుందరరావు, 1989, పేజి.61)
1921 నాటి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో గౌస్‌ బేగ్‌ ప్రధాన పాత్ర నిర్వహించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. జాతీయోద్యమ కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొంటూ వచ్చిన గౌస్‌బేగ్‌ ఒంగోలు కారాగారంలో ఉన్న సందర్భంగా ఐపియస్‌ అధికారి హైదరీ దొర ఆయనను బంగళాకు తీసుకెళ్ళి బ్రాహ్మణ ప్రేరేపిత ఉద్యమంలో ఎందుకు పాల్గొంటున్నారు. మీ సాహెబులందరికి చెడ్డపేరు వస్తుంది. మీరు కోరుకుంటే 100 లేక 200 ఎకరముల భూమిని మంజూరు చేస్తా అని నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశాడు. అందుకు, ఈ రోజు పండగ రోజు (రంజాన్‌) నన్ను జైలుకు పోనివ్వండి. ఈ దేశభక్తి ఉన్మాదునికి కళంకం ఆపాదించకండి, అని గౌస్‌ సమాధానం చెప్పడంతో, ఆ ఆధికారి ఏడాది జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించాడు. ఆ శిక్షను 1922 మార్చి రెండున నుండి రాజమండ్రి, కడలూరు జైళ్ళలో గౌస్‌ బేగ్‌ అనుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక 'ఆంధ్రరత్న' గోపాలకృష్ణయ్య స్థాపించిన స్వచ్ఛందసేవకుల దళం 'రామదండు'కు ఆయన నాయకత్వం వహించి, జాతీయోద్యమ భావాలను ప్రజలలో ప్రచారం చేసేందుకు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించారు.
ఆనాటి నుండి గౌస్‌ సాహెబ్‌ జాతీయోద్యమ కార్యక్రమాలన్నిటిలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న క్రమంలో ఆస్తి అంతా కరిగిపోయింది. కుటుంబానికి భుక్తినిస్తున్న 23 ఎకరాల భూమిని విక్రయించి మరీ ఉద్యయం కోసం వ్యయం చేశారు. ప్రముఖ నేతలు భోగరాజు పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయమ్మ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి ప్రముఖులు, కార్యకర్తలు గౌస్‌ బేగ్‌ ఇంట ఆతిధ్యం స్వీకరించేవారు. ఆనాటి ఉద్యమకారులకు గౌస్‌ గృహం, తమ స్వంతిల్లు లాగుండేది. నగదు నట్రా, పొలం పుట్రా కరిగిపోతున్న, బేగ్‌ దంపతులు బేఖాతర్‌ అన్నారు. మాతృభూమి కోసం సర్వం త్యాగం చేయగలిగిన వారే అదృష్టవంతులని మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ దంపతులు అభిప్రాయపడ్డారు. ఆ ఆభిప్రాయలకు అనుగుణంగా జాతీయోద్యమం కోసం తమ సర్వసంపదలను, చివరకు గౌస్‌ ఖాతూన్‌ ఆభరణాలను కూడా వ్యయంచేశారు. గౌస్‌ బేగ్‌ జాతీయోద్యమంలో ప్రవేశించాక ఆయనకు పూర్వీకులనుండి సంక్రమించిన మణులు, మాన్యాలు, తోటలు, భవంతులు అన్నీ హారతి కర్పూరంలా కరిగి పోయాయి. ప్రభుత్వ చర్యల కారణంగా ఆయన వ్యాపారాలన్నీ స్థంభించి పోయాయి. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌.సుందరరావు)
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సలహా మీద గౌస్‌ వ్యాపారం ఆరంభించారు. ఆయన వ్యాపార సంస్థకు 'రాం రహీమ్‌' అని నామకరణం చేశారు. ఆర్థికంగా పూర్వవైభవాన్ని సంపాదించేందుకు పలు వ్యాపారాలు చేశారు. వ్యాపారం ద్వారా లాభాలు అర్జించటం కంటె ఆయన దృష్టి అంతా జాతీయోద్యమం మీద లగ్నం కావడంతో వ్యాపారాలు లాభాల మాట అటుంచి పూర్తిగా నష్టాల బాటన సాగాయి.
1930-32 ప్రాంతంలో ఉప్పుసత్యాగ్రహానికి ఆయన నాయకత్వం వహించారు. చీరాలలోని యువకుల ఆహ్వానం మేరకు వెళ్ళి స్వచ్ఛంద సేవకులను అడ్డుకుంటున్న పోలీసులను లెక్కచేయకుండా ఉప్పు గుండాలలోకి ప్రవేశించి ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఆయన చూపిన చొరవతో మిగిలిన నాయకులు, యువకులు గౌస్‌ను అనుసరించారు. (గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం, మాదల వీరభద్రరావు, పేజి.141). ఈ సందర్భంగా దేవరంపాడు శిబిరానికి గౌస్‌ నాయకత్వం వహించి నడిపారు. ఆ శిబిరాన్ని నడిపినందుకు ఆయనకు ఏడాది పాటు జైలు శిక్షను ప్రభుత్వం విధించింది. ఈ సందర్భంగా ఆయన పిడికిటిలోని ఉప్పు తీయటానికి పోలీసు లాఠీలు విఫలమైనాయి. ఆయనను ఎన్నోవిధాల హింసించినారు. ఈ సంఘటనను ఆంధ్రదేశమంతట ఎన్నో కథలుగా చెప్పుకున్నారు. ఈ విధంగా శాసనోల్లంఘన ఉద్యమంలో గుంటూరు జిల్లా ఉద్యమంలో క్రియాశీలక పాత్రను నిర్వహించినందుకు, ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం 1930 ఏప్రిల్‌ 24న ఏడాది జైలు శిక్షను విధించింది. ఆ సమయంలో ఉన్న కొద్దిపాటి చరాస్థిని వేలం వేసి, లభించిన నగదును జరిమానా క్రింద ప్రభుత్వం జమ చేసుకుంది.
శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లా, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో గౌస్‌ బేగ్‌ క్రియాశీలక పాత్రను నిర్వహించారు. ఆ ఉద్యమనేత పర్వతనేని వీరయ్య చౌదరి ప్రధాన సహచరుడిగా ఆయన వ్యవహరించారు. ఆ పన్ను నిరాకరణ ఉద్యమ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ సాగిన ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పాత్రను నిర్వహించినందున పోలీసుల దాష్టీకానికి పలుమార్లు గురయ్యారు. చివరకు 1932 మార్చి 10న ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, పాతిక రూపాయల జరిమానాను ప్రభుత్వం విధించి వెల్లూరు, రాజమండ్రి జైళ్ళలో నిర్బంధించింది. ఆ తరువాత 1933 జూలై 3న ముహమ్మద్‌ గౌస్‌బేగ్‌ విడుదలయ్యారు.
మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ మంచి వక్త. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలు, సమావేశాలకు ప్రముఖ వక్తగా హజరై ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల భారత జాతీయ కాంగ్రెస్‌ అగ్రనాయకులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన మితభాషి, నిశ్చల శాంత స్వభావుడు. ఎటువంటి హంగు-ఆర్భాటం, హడావుడి లేకుండా ఒకచోటన స్థిరంగా ఉంటూ కనుసైగలతో ఎంతటి కార్యాన్ని సన్నిహితులతో విజయవంతంగా పూర్తిచేయించగల కార్యదక్షత కలిగిన నాయకుడిగా పేర్గాంచారు. భారతదేశానికి స్వాతంత్య్ర లభించేంత వరకు భారత జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాలను ఆయన త్రికరణ శుద్ధిగా పాటించారు. ఆనాడు ఆంధ్రదేశంలో గౌస్‌ బేగ్‌ తెలియనివారు లేరు. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌. సుందరరావు) మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ మాత్రమే కాకుండా ఆయన సతీమణి గౌస్‌ ఖాతూన్‌ స్వాతంత్రోద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు. విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను త్యజించిన ఆ దంపతులు జీవితాంతం ఖద్దరు ధరించారు.
స్వాతంత్య్రం సిద్ధించాక కూడా కొంతకాలం గుంటూరు జిల్లా రాజకీయాలలో మహమ్మద్‌ గౌస్‌ పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌ కమిటీ అద్యకక్షునిగా బాధ్యతలను నిర్వహించారు. 1961లో తమ స్వగ్రామం నుండి చీరాలకు వచ్చి గౌస్‌ స్దిరనివాసం ఏర్పరచుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యునిగా ఉంటూ, చీరాల పురపాలక సంఘం సభ్యునిగా విజయం సాధించి పురపాలక సంఘం ఉపాద్యకక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.
చిన్ననాట నుండి మతసామరస్యం కోరుతూ వచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా, మత దురహంకారాన్ని నిరసిస్తూ, విభిన్న మతస్థుల మధ్యన సద్భావన, సదవగాహన కలిగించడం కోసం హిందూ-ముస్లింల మధ్య పటిష్టమైన స్నేహ సంబంధాల కోసం నిరంతరం కృషి సల్పారు. మనుషుల మధ్యన మత భేదభావాన్ని ససేమిరా అన్నారు. మతసామరస్యం కాపాడటం, వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్యన 'శాంతి-స్నేహం' పటిష్టపర్చేందుకు చివరిశ్వాస వరకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు.
జాతీయోద్యమంలో మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ ప్రదర్శించిన సాహసానికి త్యాగనిరతికి గౌరవ సూచకంగా 1972 ఆగస్టు 15న భారతప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. చివరి క్షణం వరకు ప్రజలలో దేశభక్తి, స్నేహభావాలను పరిమళింపచేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ 1976 సెప్టెంబరు 19న కన్నుమూశారు.

No comments:

Post a comment